బుధవారం, జులై 26, 2006

రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురూ




ఈ నెల 24న (జులై'06) ఆకాశవాణి కేంద్రానికి, నా ప్రసంగం ' ప్రక్రుతి సమతుల్యం:పక్షులు ' ధ్వని ముద్రణకై (Recording) వెళ్లటం జరిగింది.అక్కడి కార్య నిర్వాహకురాలు Drవిజయతొ మాట్లాడుతుంటే రేడియొ గురించిన మధుర స్మ్రుతులు ఎన్నొ మదిలొ మెదిలాయి.
గతంలో అకాశవాణి కేంద్రానికి శ్రీ దండమూడి మహిధర్ గారినొ(హింది - తెలుగు - హింది అనువాదకులు, రచయిత) లేక శ్రీ డి వెంకట్రామయ్య గారినో కలుసుకొటానికి వెళ్లటం జరిగేది. నా స్కూల్ రోజుల్లో వెంకట్రామయ్య గారు నాకో పెద్ద హీరో లా గోచరించే వారు. ఆ రొజుల్లో అకాశవాణి లో కార్మికుల కార్యక్రమం ప్రసార మవుతుండెది. అందులో పెదబాబు, చిన్నక్క వగైరా పాత్రలుండేవి. పెదబాబుగా వెంకట్రామయ్య గారు చిన్నక్కగా శ్రిమతి రతన ప్రసాద్ గారు ఆ కార్యక్రమాన్ని ఎంతో జనరంజంకంగా నిర్వహించేవారు


కాలక్రమంలో ఉద్యొగరీత్యా నేను హైదరబాదు రావటం, రచయిథ పి.శ్రినివాస శాస్త్రి (కీర్తి శేషులు పురాణం సుబ్రమణ్య శాస్త్రి గారబ్బాయి), నాని (కార్టూనిస్ట్- పురాణం గారి పెద్దబ్బాయి) పరిచయం - ఆ తరువాత ప్రతి ఆదివారం శ్రీ వెంకట్రమయ్య గారింట్లో రచయితల సమావేశానికి, నేను కూడా చాలా ఆదివారాలు వెళ్లటం జరిగింది. అక్కడే నగ్నముని,చిత్రకారుడు చంద్ర,రాజా రామ్మోహనరావు మొదలగు ప్రముఖ రచయితల పరిచయం అయ్యింది.ఆ సమావేశాలలో వారి తాజా రచనలను వినిపించటం జరుగుతుండేది. .

చంద్ర చిత్రకారుడే గాక మంచి విమర్శకుడు కూడా. రచయితలు వారి కథలు వినిపించాక మిత్రుల అభిప్రాయాలు తెలుసుకుని అవసరమైనప్పుడు, కథలో మార్పులు చేసేవారు.

మహీధర్ గారైతే రేడియొ అనువాదాలు మత్రమే కాకుండా హిందీ పాఠాలు కూడా ఆకాశవాణిలో చెప్తుండే వారు. మహీధర్ గారు మొక్కలను ఎంతగానో అభిమానించే వారు. వారింట్లో రకరకాల అందమైన పూలమొక్కలు, రంగు రంగుల ఆకుల మొక్కలు ఉండేవి. చాలా స్నేహశీలి. దాదాపు ప్రతి ఆదివారం మా ఇంటికి వచ్చేవారు. మహీధర్‌గారు దివంగతులై ఐదు ఏళ్లైనా వారి స్మ్రుతులు తాజాగానే ఉన్నాయి.

వెంకట్రామయ్య గారింట్లో ఆదివారాలు సమావేశాలు అవుతున్నరొజుల్లోనే పంతులమ్మ అనే చిత్రం విడుదలైంది. దీనికి మాటలు రాశారు వెంకట్రామయ్య గారు. రంగనాథ్,లక్ష్మి నాయక,నాయికలు ఈ చిత్రం లో . మిత్రులందరం కలిసి ఈ చిత్రం చూసి ఆనందించాం ఆనాడు. ఆ తర్వాత 1997లో ప్రచురితమైన 'డి. వెంకట్రామయ్య కథలు ' పుస్తకానికై వెంకట్రామయ్యగారి ఛాయాచిత్రాన్ని తీసే అవకాశం కలిగినందుకు ఆనందించాను. 33 సంవత్సరములు రేడియొలో పనిచేశాక, వెంకట్రామయ్యగారు పదవీ విరమణ చేశారు.

ఆ రోజుల్లో రేడియొ చాల హాట్. ఎన్నో మంచి నాటికలు, నాటకాలు రేడియోలో వచ్చేవి. చిత్రలహరిలో సినిమా పాటలు వచ్చేవి. రేడియొ సిలోన్లో బినాకా గీతమాల, బుధవారం రాత్రి 8 గంటలకు అమీన్‌సయాని కంచు కంఠంతో వచ్చెది. బినాకా గీతమాల యువ హ్రుదయాలకు పన్నీటి జల్లులా ఉండేది,తాజ హిందీ చిత్రగీతాలతో. అంతేగాకుండా ఆరొజుల్లో వాణీ అనే పక్షపత్రికను ఆకాశవాణివారు ప్రచురించేవారు. వాణిలో ఆకాశవాణి కార్యక్రమ విశేషాలే కాకుండా, ప్రముఖుల ప్రసంగ వ్యాసాలను కూడా ప్రచురించేవారు. ఇదంతా రేడియొ గత వైభవం.

నేడు వాణి పత్రిక లేదు. ఆకాశవాణి కార్యక్రమ వివరాలను దినపత్రికలు రెండు లేక మూడు వాక్యాలలో ముక్తసరిగా ప్రచురిస్తున్నాయి. టెలివిజన్ పుణ్యాన రేడియొ దాదాపు కనుమరుగైంది. అనుకోకుండ ఒకరోజు డాక్టరు విజయగారు ఫోన్ చేసి ఆకాశవాణిలో పర్యవరణం, పక్షులు గురించి మాట్లడమంటే, ఆకాశవాణికి వెళ్లటంతో రేడియోతో పెనవేసుకున్న నా గత స్మ్రుతులన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. నా ఉపన్యసాన్ని గురించి మిత్రులకు ఫోన్ చేసి వారి టేప్ రికార్డర్లో రికార్డ్ చెయ్యమన్న అభ్యర్ధనకు అందరినుంచీ ఒకటే జవాబు, రేడియో పని చెయ్యటం లేదు, రికార్డింగ్ సాధ్యపడదని. గతంలో ఆకాశవాణిలో మన ప్రసంగాలను ఆడియో కాసెట్లో రికార్డ్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు.


నా ప్రసంగాన్ని mp.3 గా రూపాంతరం చెందించి, biosymphony website ద్వారా పాఠకులకు వినిపిద్దామనుకొన్న నా కోరిక తీరలేదు. రేడియోకు ప్రజాభిమానం పోతుందనుకొంటున్న తరుణంలో రైన్‌బో, రేడియొ మిర్చి, రేడియొ సిటి మరలా రేడియోకు కొత్త జీవాన్ని పోశాయి. ఈ F.M రేడియొ ప్రభంజనానికి ఆడియొ కాసెట్ అమ్మకాలు ఆరు శాతం తగ్గాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. రేడియొ మిర్చి, ఇది చాలా హాట్ గురూ!