Click on photo to enlarge.

From left to right: Tulasi, cbrao, Smt. Ramana and Deepti offering cake. Photo: cbrao
ఎవరైనా అమ్మాయి కాని, అబ్బాయి కాని చాక్లేట్ తీసుకు వచ్చి ఇస్తే, నీ హాపి బర్త్ డేనా అని అడుగుతాం. బర్త్ డేలు ఎప్పుడూ హాపీయే కాని మాములు బర్త్ డేలు వుండవు మరి.అసలు ఈ పుట్టిన రోజేమిటి? దానికంత ప్రాముఖ్యతేమిటి?మీరు వివాహితులయితే, మీ భార్య పుట్టిన రోజు మరిచి చూడండి; దాని importance ఏమిటో అర్థమవుతుంది. మీకు ఇంకా పెళ్లి కానట్లైతే, మీ girl friend పుట్టిన రోజు మరిచి చూడండి.
మనం ఎన్నో సినిమాలలో, ఈ పుట్టిన రోజు bash, హంగామా చూస్తాము.. ప్రతి పుట్టిన రోజుకు, మన వయస్సు, ఒక సంవత్సరం తగ్గుతుందని తెలిస్తే, ఇంత హడావుడి చేస్తారా? హిందూ సంప్రదాయం ప్రకారం, ఎదైనా సందర్భాన్ని, దీపం వెలిగించి, శుభారంభం చేస్తాము. పుట్టిన రోజుకు, మన వయస్సు ప్రకారం, కొవ్వొత్తులు వెలిగించి, వాటిని ఆర్పడం అశుభం కదా? తెలిసో, తెలియకో తెల్లవాడు ప్రవేశ పెట్టిన, ఈ వెలిగించిన మైనపువత్తులు ఆర్పివేయటం, ముందు చూపున్న ఆచారమా? మన వయస్సు తగ్గుతుందని,ప్రతీకాత్మకం (symbolic)గా చెప్పటమా? ఎది ఏమైనా, యువతరం, పుట్టిన రోజు జరపటానికే, ప్రాధాన్యం ఇస్తారు.
అబ్బాయి తన girlfriend birthday కు, ఎర్ర గులాబీలు, ప్రత్యేక greeting card, చాక్లేట్ ఇంకా heart shape pendant లను బహుమతులు గా , తన girlfriend కు ఇవ్వక మానడు. అంతే కాదు ఆ సాయంత్రం వారిద్దరూ ఏ కాఫీ డే లేక బరిస్తా లోనో, ఏ కార్నర్ టేబుల్ వద్దనో,కబుర్లు చెప్పుకుంటూ, దాదాపుగా కనిపించటం ఖాయం.ఇక్కడ మిస్ అయితే, నెక్లేస్ రోడ్ లో అయినా కనిపిస్తారు. అలా కనిపించక పోతే, వారిలో ఏదో లోపముందని, వారి మిత్రులు భావిస్తారు.
పుట్టిన రోజులలో, విశిష్టమైనది షష్టిపూర్తి. మన మిత్రులు కొందరు, వారి తండ్రులకు ఈ షష్టి పూర్తి జరిపియున్నారు.ఈ షష్టి పూర్తి ఏమిటి? ఎందుకు జరుపుకోవడం? ఇదివరకటి కాలంలో, పలు కారణాల రీత్యా, భారతీయుల జీవన ప్రమాణం తక్కువగా వుండేది. 60 సంవత్సరాలు జీవిస్తే, అది ఒక ప్రత్యేక విశేషంగా, పరిగణించే వారు. మన కాలమాన ప్రకారం, 60 సంవత్సరాలు వున్నాయి. అవి ప్రభవ,విభవ ల మొదలయి, క్రోధన, అక్షయ ల తో ముగుస్తాయి.ఇందువలన, హిందువులు, షష్టిపూర్తి, తమ పునర్జన్మ గా భావించి, వేడుక జరుపుకుంటారు. బంధు మిత్రులతో సమావేశ మవుతారు. ఇది ఒక రకంగా thanks giving లాంటి వేడుకగా భావించవచ్చు. దీని వెనుక పరమార్థ మేమంటే, మనిషి సంఘ జీవి; తను సుఖంగా బతకటానికి, ఎదగటానికి ఎంతో మంది సహాయం పొందుతాడు. అందరి సహకారం వలనే తనకు ఈ సౌఖ్యమైన జీవితము,ఇన్ని సంవత్సరాలు
జీవించగలిగే శక్తి, స్ఫూర్తి లభించాయనీ, చెపుతూ, అందుకు ధన్యవాదాలు తెలుపుతాడు;షష్టి పూర్తి చేసుకున్న వ్యక్తి.
వెనుకటి కాలంలో, కవులను రాజుగారు గజారోహణం కావించి, గండపెండేరం తొడిగే వారట. రాజులు, జమీందారులు పోయారు. ప్రజా సామ్యం వచ్చింది. త్రిపురనేని రామస్వామి గారిని గుడివాడలో గజారోహణం గావించి ఊరేగించారు. వారు దానికర్హులే. ఈ రోజులలో, కవులను, అలా సత్కరించటం కష్టమే మరి.
నా కాలేజ్ రోజులలో పుట్టిన రోజుకు తల స్నానం చేసి, కొత్త బట్టలు తొడుక్కున్న గుర్తు.ఆ తర్వాత, పుట్టిన రోజులకు నేను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. కాని, బంధు మిత్రులు శుభాకాంషలు చెప్తే, వారికి ధన్యవాదాలు చెప్పే వాడిని. ఈ రోజుతో (6th Feb 2008) నాకు 60 సంవత్సరములు నిండుతాయి.బంధువులు ఫోన్ చేసి హైదరాబాదు వస్తాము, పుట్టిన రోజు celebrate చేస్తాము అంటే, ఏమి సమాధానం చెప్పాలో, తోచకుండా వున్నది. జీవితం లో,ఏమి సాధించామని వేడుక చేసుకోవాలి?
ఇలాంటి తరుణం లో తెలుగు బ్లాగరులు/వికీపీడియన్లపై ఈనాడు లో సచిత్ర, విశేష వ్యాసం, మనందరి కృషి, ఫలించగా, వచ్చిందని తలుస్తాను. నా బ్లాగులు చదవని వారు కూడా, ఈనాడు లో నా చిత్రం చూసి, నాకు ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. ఈ అభినందనలనే నా షష్టిపూర్తి కానుకలుగా భావిస్తాను.
నెల్లూరు గురించిన విశేషాలతో ప్రత్యేక పుస్తకం వెలువరించాలని అభిలాష. దీని కొరకు, ఇంకా, చాలా కృషి, చెయ్యవలసి వున్నది.ఇది ఎప్పటికి నెరవేరేనో? ఇంతవరకు నేను రాసిన టపాలలో (బ్లాగు వ్యాసాలు), ఎంపిక చేసిన వాటి తో, ఒక పుస్తకం వెలువరించాలని కూడా ఆలోచన వుంది. నా వ్యాసాలను పుస్తకం గా, వెలువరించిననాడు,నేను సైతం..................గా భావించి, సంతృప్తుడనౌతాను.పదవీవిరమణ తరువాత, నాకు చేదోడు, వాదోడు గా నిలిచిన బ్లాగు మితృలందరికీ, నా హృదయపూర్వక నమోవాకాలు. నా జీవన యానంలో,ఈ బ్లాగు టపాల, రచనా నిర్మాణంలో, నాకు సహకరించిన, జీవిత సహచరిణి శ్రీమతి రమణకు ప్రేమాంజలి. నా జీవిత పూతోటలో పూచిన పూలు, నా పిల్లలు మానవ్, దీప్తి. మానవ్,కోడలు గాయత్రి ఉత్తర అమెరికా లో Software లో వున్నారు.దీప్తి, గచ్చిబౌలి (Hyderabad) M.N.C. లో, అల్లుడు కృష్ణమోహన్ real estate లోను వున్నారు.మనమడు ఆకాష్ యు.కె.జి చదువుతున్నాడు. వీరందరూ, తమ తమ నెలవులలో వుండి నాకు ఆనంద, స్పూర్తి ప్రదాయనులుగా వున్నారు. నిత్య జీవితంలో, ఇన్ని సంవత్సరాలుగా, నాకు తోడుగా నిలిచిన బంధు మిత్రులందరికీ, నా ధన్యవాదాలు.
కొసమెరుపు: దీప్తిధార లో, ఇది నా నూరవ టపా.