సోమవారం, డిసెంబర్ 21, 2009

పుస్తకాలకై ప్రజావాహిని - నాలుగో రోజు



e తెలుగు స్టాల్ సందర్శకులకు e తెలుగు గురించి వివరిస్తున్న రవిచంద్ర


శ్రీనివాస ఉమాశంకర్ సరస్వతుల (బ్లాగు పేరు: అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!! ), స్వాతి ఉమాశంకర్ - ఉమాశంకర్ ఈ రోజు e తెలుగు సభ్యత్వం తీసుకొన్నారు.



PVSS శ్రీహర్ష (బ్లాగు పేరు: కిన్నెరసాని ) , సుజాత (మనసులో మాట ) స్టాల్ సందర్శకులతో



శ్రీ Y కృష్ణమూర్తి (Vice President & India Center Head Virtusa, Hyderabad) కు e తెలుగు గురించి వివరిస్తున్న చక్రవర్తి ( భవదీయుడు) ఇంకా మురళీధర్ నామాల (మురళీ గానం)



స్టాల్ మూసివేసే సమయంలో వచ్చారు బి.వెంకటరమణ (A tv, script writer). అర్చనలహరి అనే పుస్తకం రచించారు. ఇంద్ర సినిమా కు సహ రచయితగా సంభాషణలు వ్రాశారు. వారి మాటలలో పదునుంది. ఎంతైనా మాటల రచయిత గదా, ఆమాత్రం లేకుంటే ఎట్లా? బ్లాగు (తెలుగులో) తెరవాలని ఉత్సాహంతో ఉన్నారు. సాంకేతిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. e తెలుగు గురించి వివరిస్తున్న సతీష్ కుమార్ (సనాతన భారతి)


పుస్తక ప్రదర్శన శాల లో ప్రతి సాయంత్రం ఉండే కార్యక్రమాలలో భాగంగా ఫాషన్ పరేడ్ లో వయ్యరి భామలు పుస్తకాలతో పుస్తకనడక చేశారు. మోడల్స్ చేతుల్లో మీ అభిమాన రచయితల పుస్తకాలు, ఊహకందని విషయం కదా.


ఫాషన్ పరేడ్,పాటలతో సాయం సమయం పుస్తకాల మధ్య పోటెత్తిన జనంతో ఆహ్లాదంగా గడిచింది.


గొడుగు లోపలి వాన ఎలా వుంటుందో వివరిస్తారు శివశంకర్ (ఆరాధన) - మన e తెలుగు స్టాల్ లో తన బ్లాగు ఉంచిన Free domain గురించి వివరించారు. చిత్రంలో నుంచున్న వారిలో మధ్యన ఉన్నారు.

ఇతర విశేషాలు:

కంప్యూటర్ కు తెలుగు నేర్పటం ఎలా అనే విషయంపై నల్లమోతు శ్రీధర్ గారి వ్యాఖ్యానంతో కూడిన వీడియోను డిజిటల్ ప్రొజెక్టర్ సాయంతో మన స్టాల్ లో ప్రదర్శించాము. మన స్టాల్ నుంచి వినిపించే "తెలుగుభాష తియ్యదనం, మా తెలుగు తల్లికి" పాటలు 5000 పై చిలుకు సందర్శకులను మన వద్దకు తెచ్చాయి. CD లు మొత్తం అయిపోయి అడిగిన అందరికీ CD లు ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వాళ ఆదివారం కావటం ఈ అనూహ్య స్పందనకు కారణం. సందర్శకులతో మహా సందడిగా ఉంది మన స్టాల్. ఈ రోజు కార్యక్రమాలలో భాగంగా వినోద వేదిక పై పాటలు పాడుతున్న చిన్నారులకు e తెలుగు ఒక పోటీ పెట్టింది - మా తెలుగుతల్లికి పాట తప్పులు లేకుండా పాడాలని. చక్కగా పాడిన ముగ్గురు చిన్నారులకు చక్రవర్తి,, సతీష్ ల ద్వారా e తెలుగు CD లు కానుకగా అందచేశాము.

ఈ రోజు మన స్టాల్ కు విచ్చేసిన వారిలో కస్తూరి మురళీక్రిష్ణ , గీతా చార్య , రవికిరణ్ (పూలవాన) , నువ్వుసెట్టి సోదరులలో ఒకరైన కిషోర్ (నువ్వుశెట్టి బ్రదర్స్) ఉన్నారు. ఇంకా పూర్ణిమ , సౌమ్య, లక్ష్మి (నేను -లక్ష్మి), సుజాత, లక్ష్మి వెదురుమూడి (ముద్దబంతి...తెలుగింటి ముంగిట), విజయశ్రీ (నేను సైతం బ్లాగ్లోకంలో) (ఈ బ్లాగు లింక్ తెలిసిన వారు నాకు తెలియపరచకోరుతాను).

ఇంకా చివరగా బ్లాగర్ అనూరాధ (శ్రీనివాస్ భాగి భార్య) (బ్లాగు: మహాగీతా మ్యుజిక్) వచ్చారు. శ్రీమతి అనూరాధ గూగుల్ ఉద్యోగిని. వీరు సంగీతాభిమానులు.

Photos: cbrao Canon Powershot SD1100IS

ఆదివారం, డిసెంబర్ 20, 2009

పుస్తక ప్రియుల కోసం పాదయాత్ర (మూడవ రోజు)



హైదరాబాదులో పుస్తక ప్రియుల కోసం పాద యాత్రలో కుడి నుంచి ఎడమకు శ్రీయుతులు నటుడు,రచయిత జెన్నీ, పరుచూరి వెంకటేశ్వర రావు, తెలకపల్లి రవి


పుస్తకాల కోసం నడకలో పిల్లల విచిత్ర వేషధారణ


శ్రీయుతులు తెలకపల్లి రవి, చుక్కా రామయ్య


శ్రీమతి కాట్రగడ్డ అరుణ, శ్రీ గాలి ఉదయ్ కుమార్ వికాసధాత్రి.ఆర్గ్ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఉచిత e - తెలుగు పుస్తకాలు లభిస్తాయిక్కడ.


పుస్తకాల కోసం నడకలో పరుగులు తీస్తున్న పుస్తకం.నెట్



ఈ సందర్భంలో TV 9 రవిప్రకాష్ మాట్లాడుతూ "అక్షరాస్యతలో మన రాష్ట్రం 23 వ స్థానం లో ఉంది. మనలను పట్టి పీడిస్తున్న సమస్యలకు మూలం అజ్ఞానం. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇస్తాయి. ఆలోచించేవారు,పుస్తకాలు చదివేవారు, ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పాలి" అన్నారు.



ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు పరుచూరి శ్రీనివాస్ (పాత పాటల, సినిమాల విజ్ఞాన ఖని, పుస్తకాభిమాని),శిరీష్ కుమార్,మురళీధర్ నామాల



సందర్శకులతో e తెలుగు స్టాల్. ఈ రోజు సుమారు 3000 సందర్శకులు. e తెలుగురూపొందించిన CD లకు తెలుగు భాషాభిమానుల ఆదరణ లభించింది.



ముగ్గురు బ్లాగర్లు ఎడమ నుండి కుడి: శ్రీ శివ చెరువు (బ్లాగు పేరు: నేను గురివింద గింజ), రవిచంద్ర ( బ్లాగు: అంతర్వాహిని), సురేందర్ (బ్లాగు: పుల్లాయన కబుర్లు)



ఎడమ నుండి కుడి: చిరంజీవి భావన,అక్కిరాజు భట్టిప్రోలు, వీవెన్, కొలిచాల సురెష్, పరుచూరి శ్రీనివాస్, నాగమురళి, కశ్యప్



నటుడు, రచయిత జెన్నీ (పోలాప్రగడ జనార్దనరావు) మన స్టాల్ కి వచ్చి కంప్యూటర్లో తెలుగు రాయటం నేర్చుకున్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగవటం వలన జెన్నీ పేరుతో నాటకాలు, సినిమాలలో నటించానన్నారు. ఆసక్తికరమైన సంగతేమిటంటే వారి తండ్రిగారు ముద్దుగా వీరిని జెన్నీ (కార్ల్ మార్క్స్ భార్య) అని పిలిచేవారు. జెన్నీ అంత క్రితం పుస్తకాలకై నడక కార్యక్రమంలో పాల్గొని, ఉపన్యసిస్తూ "ఒక ప్రముఖుడు ఒక బహుళ అంతస్తులో లిఫ్ట్ లో పయనిస్తుండగా లిఫ్ట్ చెడిపోయి పై అంతస్తుకూ కింది అంతస్తుకూ మధ్య పదిహేను నిమిషాలు ఆగిపోయింది. లిఫ్ట్ బాగయ్యాక కార్యాలయ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి లిఫ్ట్ లో ఇలాంటి అవాంతర సమయాలలో అందులో నిలబడిపోయిన వారి కోసం కొన్ని పుస్తకాలు వుంచాలని సలహా రాసి ఇచ్చి వెళ్లారు. పుస్తకాలంటే ఎంత ప్రేమో ఈ సంఘటన చెప్తుంది" అని చెప్పారు.

ఈ రోజు సందర్శకులు: శ్రీ కె.సురేష్ ( Alchemist నవల తెలుగు లో పరశువేది గా అనువాదించిన రచయిత), రాణి పులొమజా దేవి ( సర్కార్ వగైరా చిత్రాలకు పాటలు వ్రాసారు) మన స్టాల్ ని దర్శించారు.
వరూధిని,పి.ఎస్.లక్ష్మి, అరుణ పప్పు, పూర్ణిమ తమ్మారెడ్డి, చంద్రలత ఇంకా మాలాకుమారి మన e తెలుగు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మన స్టాల్ లో లాప్టాప్ లో వినిపించిన మా తెలుగుతల్లికి అనే పాటకు విశేష స్పందన లభించింది.

Photos: cbrao Canon Powershot SD1100IS

శనివారం, డిసెంబర్ 19, 2009

పుస్తకాల వరదలు -రెండవ రోజు



కంచం ముందు కూర్చున్నాక ఈ రోజు కంచంలో అన్నం బదులు ఎవరైన పుస్తకాలు వడ్డిస్తే ఎంత బాగుండును అని ఎప్పుడైనా అనుకున్నారా? అకస్మాత్తుగా అల్లాఉద్దీన్ వచ్చి మీ గదంతా పుస్తకాలతో నింపిపోతే? మీకు లాటరీలోలక్ష పుస్తకాలు వస్తే? చుట్టూ పుస్తకాలు - ఏ పుస్తకం చదవాలి ? హైదరాబాదు నెక్లేస్ వీధిలో పుస్తక ప్రదర్శన మేళా కువస్తే అదే పరిస్థితి. ఏ స్టాల్ కు వెళ్లాలి? ఏమి కొనాలి? నేను ప్రతిరోజూ జేబు నిండా పైకంతో వెళ్లి, వచ్చేటప్పుడు రెండుచేతుల నిండా పుస్తకాల సంచులతో ఇంటికి వస్తున్నా. ఇంకా చూడవలసిన దుకాణాలు ఎన్నో మిగిలిపోతున్నాయి.



రాజన్, సతీష్, విజయ శర్మ సందర్శకులతో

సరేమన e తెలుగు స్టాల్ బ్లాగర్ వాలంటీర్లతో, వచ్చే పోయే సందర్శకులతో సందడిగా ఉంది. ఎప్పటివలే సహృదయచక్రవర్తి నిన్న స్టాల్ కు వచ్చే తరుణంలో జిలేబీలు, కారం వస్తువులు తెచ్చి ఆకలితో వున్న వాలంటీర్ల మెప్పు పొందాడు.




ఈ పుస్తక మేళాలో ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుందని నిన్న చెప్పా కదా. ఈ రోజు Speed Math -Tutor పుస్తకావిష్కరణ.మంత్రివర్యులు గల్లా అరుణకుమారి (గౌరవనీయ రహదారి మరియు భవనముల శాఖా మంత్రిణి, ఆంధ్ర ప్రదేష్) చేతుల మీదుగా జరిగింది. వారు మాట్లాడుతూ " పుస్తకాలపట్ల ఆదరణ కరువైన ఈరోజులలో ఇలాంటి పుస్తక ప్రదర్శనలు చదువరులకు పుస్తకాలపై ఆసక్తిని మరలా పెంచుతాయి. మా నాన్న గారు మాకు బాల్యమునుంచీ పుస్తకాలపై ఆసక్తి కలిగేలా పెంచారు. వారు పుస్తకాలను ఎంతగానో ప్రేమించే వారు. చిన్నప్పుడు మాకు బొమ్మలకు బదులుగా మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చేవారు. వారు స్వతహాగా రచయిత. మా తండ్రి రాజగోపాలనాయుడుగారు కురుక్షేత్ర, రామానుజ ప్రతిజ్ఞ, వీర శివాజి, బుద్ధం శరణం గచ్ఛామి మొదలగు పుస్తకాలు రచించారు. శివాజికు అతని మామగారు శౌర్యం ఉప్పొందేలా ఉత్తేజకరమైన కథలు చెప్పేవారు. గోర్కీ అమ్మలాంటి కథ ఎంతోహృద్యంగా ఉండి జీవితానికి మంచి ప్రేరణనిస్తుంది. గొప్పవారి ఆత్మ కథలు ఆత్మప్రబోధాన్ని కలుగచేస్తాయి.ప్రకాశంపంతులుగారు బయటకు వెళ్లినప్పుడు ప్రతి రోజు న్యాయవాది తారసపడేవారు. ఆ స్ఫూర్తితో తను కూడా నిత్యజీవితంలో న్యాయవాది కావాలని ఆరాటపడేవారు. కావ్యాలు, పురాణాలు ఎల్లవేళలా ప్రజాదరణ కలిగి ఉంటాయి. మానసిక వికాసానికి దోహదపడే ఈ పుస్తకాల ప్రదర్శన పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న ఊళ్లలోకూడ ఏర్పాటు చెయ్యవలసిన అవసరముంది."



ఎడమవైపు నుండి మనవైపు చూస్తున్న రచయిత గుడిపాటి (తెల్ల చొక్కాలో), కుడి వైపు చివర (తెల్ల చొక్కాలో) రచయిత మురళీ మోహన్ (బ్లాగు: తుర్ఫు ముక్క)

ఈ రోజు నేను సందర్శించిన పుస్తకాల షాపు పాలపిట్ట బుక్స్. ఇక్కడ పలు పుస్తకాలు నన్ను ఆకర్షించాయి. మొదటగా ఆకట్టుకున్నది 2,178 వీక్షణలు, అత్యధిక వ్యాఖ్యలు 57 పొందిన (http://pustakam.net/?p=2432) జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య పేరుతో ఎన్.వేణుగోపాల్ పీఠిక గల అఫ్సర్ తాజా కవితల పుస్తకం ఊరి చివర. ఏలే లక్ష్మణ్ ముఖచిత్రరచనతో ఉన్న ఈ పుస్తకం డిసంబర్ 2009 లో వెలువడింది. నన్నాకర్షించిన మరో పుస్తకం ' వాన కురిసిన పగలు ' -తమ్మినేని యదుకుల భూషణ్ కవితలు. మన తెలుగు బ్లాగరు కస్తూరి మురళీకృష్ణ పుస్తకాలు జీవితం -జాతకం (కథలసంకలనం) ఇంకా మైకేల్ జాక్సన్ పుస్తకాలు తీసుకున్నా. ఆంగ్ల సాహితీ కారులను పరిచయం చేసే గుడిపాటి గారి పుస్తకం కిటికీ (ఏలే లక్ష్మణ్ ముఖచిత్ర రచన) ఇంకా పూడూరి రాజా రెడ్డి వ్రాసిన మధుపం తీసుకున్నాను. ఈమధుపానికి ఉపనామం ఒక మగవాడి ఫీలింగ్స్. పూడూరి రాజా రెడ్డి బ్లాగు చిరునామా http://raji-fukuoka.blogspot.com/ . మధుపం పై సమీక్ష కై చూడండి http://pustakam.net/?p=2544
పాలపిట్ట బుక్స్ దుకాణం లో వార్త లో పనిచేసే గుడిపాటి , వసంత గార్ల పరిచయమయ్యింది. సాయంత్రం ఆరు తర్వాత వీరు అక్కడ కనిపించే అవకాశముంది. తెలుగు బ్లాగరు మురళీమోహన్ ఓడిహళ్ల (బ్లాగు తుర్ఫు ముక్క) పుస్తకాలు కూడా ఇక్కడ కనిపించాయి.



ఎడమ నుండి కుడి వైపు విజయ శర్మ,మురళీమోహన్ ఓడిహళ్లి, రాజన్, సి.బి.రావు,శ్రీనివాస కుమార్, సతీష్ కుమార్, ఇంకా కశ్యప్

కార్యదర్శి కశ్యప్ మన e తెలుగు మిత్రుల సహాయంతో ఒక చక్కటి CD ని రూపకల్పన చేయటం జరిగింది. కంప్యూటర్లో తెలుగు వాడేవారికి, తెలుగు బ్లాగర్లకు సైతం తెలియని softwares ఇందులో పొందుపరచటం జరిగింది. స్టాల్ దర్శించే వారికి నామమాత్రపు విరాళానికే దీన్ని అందచేస్తున్నారు. దీనిలోని విషయాలు గురించి చెప్పటానికి ఒకప్రత్యేక వ్యాసం వ్రాయాల్సుంటుంది. తెలుగు బ్లాగర్లు స్టాల్ లో ఈ CD అడిగి తీసుకోండి. పదో లేక ఇరవైరూపాయలు విరాళంగా ఇచ్చి e తెలుగు కోశాధికారిని సంతోషపెట్టండి. అసలే మనకు రాబడి తక్కువ ఖర్చు ఎక్కువకదా. ఈ CD పెక్కు విశేషాలతో ఉపయుక్తంగా యుండగలదు. Inscript tutorial ఉందన్నారు. పాఠకులు ఈ CD వాడి దానిపై తమ అభిప్రాయం వ్రాయగలరు. మీ సూచనలు అమలుపరచటానికి ప్రయత్నం చేస్తాము.



కూర్చున్న వారు ఎడమనుండి : సి.బి.రావు, శ్రీనివాస కుమార్, ఇంకా కశ్యప్
నుంచున్న వారు ఎడమనుండి : మురళీధర్ నామాల, సతీష్ కుమార్, ఇంకా విజయ శర్మ

ఈ రోజు మన స్టాల్ కు పలువురు విచ్చేసి తమ సందేహాలు తీర్చుకున్నారు. కంప్యూటర్ విజ్ఞానం మాస పత్రికసంపాదకులు N.G. తేజ మన స్టాల్ సందర్శించారు. మన సహాయం కోరారు. జనవరి 2010 సంచికతో బాటుగా తెలుగు బ్లాగులపై ఒక ప్రత్యేక CD ఇస్తున్నారు. అంతే కాకుండా తెలుగు బ్లాగులపై 64 పేజీల ప్రత్యేక అనుబంధాన్నికూడా అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి editor@computervignanam.net Cell: 97040 70000

ఇంతవరకూ ప్రదర్శనశాల దర్శించిన ఇద్దరు మహిళా బ్లాగర్లను గుర్తించాను. వారు శ్రీమతి మాణిక్యాంబ (మనకోశాధికారి చక్రవర్తి తల్లి). బ్లాగు: ఓ సగటు భారత నారి ఆలోచనలు..
http://ratnahamsa.blogspot.com/
మరొకరు శ్రీమతి జ్వలిత (విజయ కుమారి) -ఉపాధ్యాయిని, కవయిత్రి.
బ్లాగు పేరు: జ్వలిత
http://jvalitha.blogspot.com/
వీరు ఖమ్మంలో ఉపాధ్యాయిని. ఇంకా ఆవిష్కరణకాని తమ పుస్తకం "సుదీర్ఘ హత్య " - కవిత్వం ప్రతిని నాకు కానుకగా ఇచ్చారు. ఈ కవితలు పలు పత్రికలలో గతంలో ప్రచురించబడ్డవి. "సుదీర్ఘ హత్య " అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుందిప్పుడు."అసమర్ధులు ఆయుధాలు పట్టుకోరు - మౌన మంత్రాలు మార్గాలు చూపవు - ఊహాగానాలు ఉద్యమాలు నడపలేవు - కాలుతున్నప్పుడు సిద్ధాంతాలుండవు -కడుపైనా...బతుకైనా " - జ్వలిత

పాలపిట్ట పుస్తకాలస్టాల్ లో గుడిపాటి పుస్తకాలపై వారి సంతకమడగటం మరువొద్దు. స్టాల్ నిర్వాహకులనడిగితే అక్కడికి వచ్చే రచయితలను పరిచయం చేస్తారు.రాయాల్సింది చాలా ఉంది. ప్రతి రోజు విశేషాలు చూడండి. నేటికింతే.

Photos: cbrao Canon Powershot SD1100IS

శుక్రవారం, డిసెంబర్ 18, 2009

పుస్తక ప్రదర్శనశాలలో e - తెలుగు



పుస్తక ప్రియులు ఎదురుచూస్తున్న హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ నెల 17వ తారీఖున మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు (గౌరవ ఉన్నత విద్యాశాఖ మరియు ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ), డి.మాణిక్య వరప్రసాద రావు (గౌరవ మాధ్యమిక విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) ప్రారంభించారు. ప్రారంభించే సమయానికి కొన్ని పుస్తకాల దుకాణాలు ప్రదర్శనకు సమాయత్తమవుతున్నాయి. అవి శనివారం కు పూర్తి స్థాయిలో తయారవగలవని అంచనా. ఇప్పటికే ప్రారంభించిన పుస్తకదుకాణాలు అన్నీ చూడటానికి ఒక పర్యాయం వీక్షిస్తే సరిపోదు. రెండు మూడుసార్లు చూస్ర్తే కాని పుస్తక ప్రియులకు తనివి తీరనన్ని పుస్తక దుకాణాలు (200 పై చిలుకు) ఉన్నాయిక్కడ.

పుస్తకాలే కాకుండా ప్రతిరోజు సాయంత్రం వేళ ఇక్కడ పలు కార్యక్రమాలు జరుగగలవు. కొన్ని పుస్తకావిష్కరణలు, ఆసక్తికరమైన ఇష్టాగోష్టు లు మీరు చూడకలరు. వాటివివరాలు మీకు http://hyderabadbookfair.com/ లొ లభించగలవు. ఈ వెబ్సైట్ సృష్టి, నిర్వహణ మన http://etelugu.org/ చేస్తున్నదని చెప్పటానికి సంతసిస్తున్నాను. పోయిన సంవత్సరంవలే ఈ సంవత్సరం కూడా పుస్తక ప్రదర్శనశాలలో మన e -తెలుగు స్టాల్ నిర్వహిస్తున్నది. మన తెలుగు బ్లాగర్లు ఈ స్టాల్ నిర్వహణలో పాల్గొంటున్నారు.



స్టాల్ నిర్వహించిన బ్లాగర్ల పేర్లు, వారి బ్లాగు చిరునామ ప్రముఖంగా కనిపించే విధంగా పెద్ద ప్రకటన పోస్టర్ స్టాల్ లో ఉన్నది. ఇది ప్రతిరోజూ మారుతూ యుండగలదు. ఉదాహరణకు ఈ రోజు స్టాల్ నిర్వహణలో మీరు పాల్గొంటే మీ పేరు, మీ బ్లాగు పేరు అక్కడ ఉంటుంది. మనకు వాలంటీర్లు కావాలి. స్టాల్ నిర్వహణలో ఆసక్తి ఉన్నవారు అధ్యక్షులు పద్మనాభం లేక కార్యదర్శి కశ్యప్ కు తెలుపగలరు. వాలంటీర్లకు పెద్ద పనేమీ ఉండదు. స్టాల్ సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో చెప్పి, వారి వివరాలు సేకరించాలి. మన e -తెలుగు గురించి కూడా చెప్పాలి. ఆసక్తికలవారిని e -తెలుగు సభ్యులుగా చేర్పించాలి. తెలుగు వికిపీడియా ప్రచారం కూడా మన e - తెలుగు కార్యక్రమాలలో ఒక భాగమే.



ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏమంటే తెలుగు బ్లాగులపై ఆసక్తి కలిగినవారికి, వారి తెలుగు బ్లాగు,స్టాల్ లోనే,మనమే సృష్టించి వాటి వివరాలు వారికి అందచేస్తాము ఉచితంగా. ఈ సృజన డిజిటల్ ప్రొజెక్టర్ సాయంతో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాము.

పలు ఆకర్షణీయమైన పుస్తకశాలలున్నవిక్కడ. వాటి విశేషాలు రేపటి నివేదికలో మీరు చూడగలరు.

17 వ తారీకు స్టాల్ నిర్వహణలో ఈ కింది వారు పాల్గొన్నారు.



ఎడమ నుండి కుడి వైపు శ్రీమతి మాణిక్యాంబ (చక్రవర్తి తల్లి) , కశ్యప్, సతీష్ కుమార్, శ్రీనివాస కుమార్, సి.బి.రావు, చదువరి ఇంకా చక్రవర్తి

Photos by cbrao on cell phone Nokia 5800 XpressMusic

మంగళవారం, డిసెంబర్ 08, 2009

e - తెలుగు గురించి ఆదివారం సాక్షి పేపర్లో వ్యాసం



Please click on image to enlarge

విజయవాడలో ఉంటున్న బ్లాగరి, e-తెలుగు అభిమానురాలు అయిన పద్మకళ గారు ఈ వ్యాసం వ్రాసారు.