శుక్రవారం, ఫిబ్రవరి 24, 2012

చిత్రకారుడు శంకర్

Self Portrait of Sankara Narayana Sathiraju

దర్శకుడు  బాపు తమ్ముడైన చిత్రకారుడు సత్తిరాజు శంకర నారాయణ (శంకర్),1936 లో నర్సాపురంలో జన్మించారు. లయోలా కాలేజ్, మద్రాసు లో ఎకానమిక్స్ లో  హానర్స్ చేశాక, అక్కడి ఆకాశవాణి లో 1963 లో చేరారు. రేడియోలో, అనేక విభాగాలలో సేవలందించి 1995 లో చెన్నై స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు ముందు, చిత్రకళపై ఆసక్తి తో ఆకాశవాణి వెలువరించే, పలు ప్రచురణలకు తనే ముఖపత్ర రచన చేసేవారు. పదవీ విరమణ తరువాత తనకు ఆసక్తి ఉన్న చిత్రకళా రంగం లో కృషి చేస్తున్నారు. కట్టెబొగ్గు, ఇండియన్ ఇంక్ మరియు పెన్సిల్ మాధ్యమాల లో ఇప్పటిదాకా సుమారు  1500 చిత్రాలు గీశారు. 1992లో  తిరుపతి లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు నిర్వహించిన సమయంలో శంకర్ తొలిగా చిత్రించిన  స్వర్గీయ పి.వి.నరసింహారావు చిత్రం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధమ పేజీలో  ముద్రితమయ్యింది. తదుపరి పలు రంగాలలో ఉన్న, ప్రఖ్యాత భారతీయ వ్యక్తుల చిత్రాలను గీస్తూ, పలువురి మన్ననలందుకున్నారు.

శంకర్ చిత్రాలు  Samudra, Sruthi, Splendour, Post Noon ఆంగ్ల పత్రికలు, ఆంధ్ర ప్రదేష్, స్వప్న, జగతి మాస పత్రికలు, నవ్య వార పత్రిక, ఈనాడు,వార్త, సూర్య, ఉదయవాణి (కర్నాటక) మొదలగు  దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి.  శంకర్ చిత్రించిన కన్నడ జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీతల చిత్రాల ప్రదర్శన, 2007 లో మైసూరు పట్టణం లో జరిగింది. కర్ణాటక చిత్ర కళాపరిషత్ , బెంగలూరు లో  2011 లో శంకర్ చిత్రాలు (భారతదేశ ప్రముఖులవి)  తొలిసారిగా ప్రదర్శించబడ్డాయి. ఈ సందర్భం లో మైసూర్ టర్బన్ తో శంకర్ ను సత్కరించారు. 


                                                           SriRamana 

2008 లో హాసరేఖలు అనే పుస్తకం, శంకర్ గీసిన 80 మంది ప్రఖ్యాత భారతీయుల చిత్రాలతో, హాసం ప్రచురణలు వారిచే ప్రచురించబడింది.108 చిత్రాల తో కూడిన ధృవతారలు అనే శంకర్ చిత్రాల పుస్తకాన్ని ముఖి మీడియా వారు అక్టొబర్ 2011 లో ప్రచురించారు. ఈ సందర్భం లో శంకర్ బొమ్మల కొలువు అనే పేరుతో, శంకర్ చిత్రాలు, హైదరాబాదు లోని ICCR Art Gallery రవీంద్రభారతి లో ప్రదర్శించబడ్డాయి. శంకర్ గీచిన కర్ణాటక సంగీతకారుల చిత్ర ప్రదర్శన డిసంబర్ 2011 లో చెన్నై సంగీత అకాడెమి లో జరిగింది.

ఉద్యోగ విరమణ తర్వాత తన భార్య కీ.శే. శాంత ప్రోత్సాహంతో తాను చిత్రకళ చేపట్టినట్లు చెప్తారు. అన్న బాపు, వియ్యంకుడు కీ.శే. ముళ్ళపూడి వెంకట రమణ  కళాత్మక రంగంలో కృషి చేయటానికి మంచి ప్రేరణ ఇచ్చారంటారు శంకర్.  శంకర్ చిత్రాలు మరిన్ని చూడాలంటే శంకర్ వెబ్సైట్ www.sankarportraits.com చూడవచ్చు. శంకర్ ప్రస్తుత నివాసం చెన్నై.       

తాజా కలం: ఈ వ్యాసం లో ప్రచురించిన చిత్రాల కాపీరైట్ హక్కులు చిత్రకారుడు శంకర్ గారివి. ఈ చిత్రాలు అనుమతి తో ప్రచురించబడ్డవి.



గురువారం, ఫిబ్రవరి 23, 2012

ఆంధ్రప్రశస్తి: విశ్వనాధ సత్యనారాయణ

ఈ చిన్ని పొత్తములో, పలువురు ఆంధ్రుల గురించిన కీర్తి చంద్రికలు, ఘనకార్యాలు పద్యావళి రూపంలో వివరించబడ్డాయి. ఇందులో శ్రీకాకుళం రాజధానిగా ఆంధ్రదేశమును పాలించిన ఆంధ్ర మహావిష్ణువుగురించిన ప్రధమ పద్యో ప్రశస్తి ఉన్నది. ఈ రాజు పేరుపై ఆంధ్రదేశమునుకు ఆ పేరొచ్చెను. ఇంకా, చక్రవర్తి శాతవాహనుడు, గౌతమి పుత్ర శాతకర్ణి, పల్లవ రాజు మాధవ వర్మ, వేగి క్షేత్రము, గంజాం మండలం (ఒరిస్సా) లోని మహాక్షేత్రమైన ముఖలింగము, కవి నన్నయ భట్టు, క్రీ.శ.1140 వ వాడైన ప్రోలరాజు,  కొండవీడు, పల్నాటి చరిత్రలోని చంద్రవంక యుద్ధము, అళియ రామరాయల కళ్యాణిదుర్గ ముట్టడి గురించి పద్యావళి ఉన్నవి.
గొట్టుపదములు కొన్నింటికి అక్కడక్కడా అధోజ్ఞాపిక (footnote) లో వివరణలు ఇవ్వబడ్డాయి. అయినా సామాన్య పాఠకుడుకి ఈ పద్యాలు సులభ గ్రాహ్యం కావు.

ఆంధ్రప్రశస్తి నుండి  గోదావరీ పావనోదార…  

గోదావరీ పావనోదార వాఃపూర
మఖిల భారతము మాదన్ననాడు
తుంగభద్రా సముత్తుంగరావము తోడ
కవుల గానము శ్రుతిగలుపు నాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్ర గానముతోడ
శిల్పము తొలిపూజ సేయునాడు

అక్షరజ్ఞానమెఱుగదో యాంధ్రజాతి?
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుక గూళ్ళు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు

(పద్యం.నెట్ సౌజన్యంతో  ఈ కవిత ఇవ్వబడినది)

2006 సంవత్సరములో ఈ పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞానకేంద్రం వారు డిజిటైజ్ చేసారు. ఆసక్తికలవారు ఇక్కడనుంచి దిగుమతి చేసుకోవచ్చును.

ప్రచురణ:
ప్రధమ ముద్రణ: చెన్నపురి, కేసరి ముద్రాక్షరశాల - 1928

నవమ ముద్రణము: 2003
ముఖచిత్రం: అడవి బాపిరాజు
వెల: 30 రూపాయలు
Viswanadha Publications.Viswanadhapuram, Marutinagar, Vijayawada -520 004

Further listening: విశ్వనాధవారి గళంలో కిన్నెరసాని పాట ఇక్కడ వినండి. 

Further reading:  నేనెఱిగిన విశ్వనాథ 

బుధవారం, ఫిబ్రవరి 22, 2012

డా. జంపాల చౌదరి గారితో ముఖా ముఖి


డా. జంపాల చౌదరి గారు Snowfall ఇతివృత్తంగా ఒక కధ వ్రాసారనే విషయం మీకు తెలుసా?  వ్యాసాలుగా వ్రాయవలసిన ఇతివృత్తాలను నేటి రచయితలు కధలుగా వ్రాస్తున్నారా? కధకు కధానికకు తేడా ఏమిటి? ఉత్తర అమెరికా లోని రచయితలు, సాహిత్యం తీరుతెన్నులేమిటి?  యునికోడ్ లో లేని, ఆంధ్రభారతి.కాం ప్రత్యేకతేమిటి?   అమెరికా లో నాటా, తానా, ఆటా ఇంకా నాట్స్ అని ఇన్ని సంఘాలు అవసరమా?   

తెలుగు పాఠకులలో పఠనాసక్తి తగ్గిందా? జంపాల గారి అభిమాన రచయితలెవరు?  జంపాల గారితో ముఖా ముఖి చూడండి.




సాక్షి టి.వి. సౌజన్యంతో


మంగళవారం, ఫిబ్రవరి 21, 2012

మహమ్మద్ ఖదీర్‌బాబు కధా సంపుటం - న్యూ బాంబే టైలర్స్-2

ఈ పుస్తక పరిచయం మొదటి భాగం ఇక్కడ చదవవొచ్చును.
http://deeptidhaara.blogspot.in/2012/02/1.html

ఈ పుస్తకం ఎందుకు చదవాలనే విషయంపై వొల్గా గారు మాట్లాడాక జంపాల చౌదరి గారు ఈ పుస్తకం లోని కధలపై తమ అభిప్రాయం వెళ్ళడించారు. వినండి.

Jampala



http://dl.dropbox.com/u/31976678/nbt-3.mp3    


ఒకే ఇతివృత్తం పై ఉన్న ఖదీర్ ' జమీన్ ', వోల్గా 'సారీ జాఫర్ ' కధల మధ్య వ్యత్యాసాన్ని వోల్గా వివరించారు. ఆ తర్వాత Usha S Dani (ఖాన్ యజ్ఞాని)  ఖదీర్ కధలను విశ్లేషించారు. వినండి.

 Usha S Dani


http://dl.dropbox.com/u/31976678/nbt-4.mp3

 Satish Chandar

తర్వాత  పాత్రికేయుడు సతీష్ చందర్  ఖదీర్ కధల పరిచయం చేశారు.  వినండి.


http://dl.dropbox.com/u/31976678/nbt-5.mp3


చివరగా ఖదీర్‌బాబు మాట్లాడుతూ తన కధల సంపుటి రావటానికి పదిహైను సంవత్సరాలు పట్టిందనీ, భావితరం వారు తననొక మంచి కధకుడిగా గుర్తించ కోరుతానన్నారు.  వీడియో చూడగలరు. 

 

ఈ పుస్తకం లోని కధలపై ఇంకొందరి అభిప్రాయం కూడా చదవగలరు.
పాపినేని శివశంకర్  గారి మాటలలో  
"ప్రపంచీకరణ నేపధ్యం లో  ఇవాళ గ్రామలలో చేతి వృత్తుల విధ్వంసం, కార్పొరేట్ వ్యవసాయ పద్ధతులు మొదలైన మార్పులు వేగంగా జరుగుతున్నాయి.   కావలి ప్రాంతంలో వీటి ప్రకంపనలను చక్కగా పసికట్టిన కధకుడు మహమ్మద్ ఖదీర్‌బాబు. 'న్యూ బాంబే టైలర్స్ కధ దర్జీ వృత్తి విధ్వంసం పై అల్లింది. ఖాదర్ లేడు రోడ్డు విస్తరణ సమస్యకు సంబంధించినది. పెండెం సోడా సెంటర్ సామ్రాజ్య వాద  వ్యాపార సంస్కృతి దిగుమతిని ధిక్కరించిన వ్యక్తి కధ."  

దుప్పల రవికుమార్ గారి  మాటలలో
"మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘పెండెం సోడాసెంటర్‘ గ్లోబలైజేషన్ దారుణ విపరిణామాలను చర్చించిన మరో మంచి కథ. నమ్మిన ఆదర్శం కోసం సర్వనాశనానికి సైతం వెరవని చంద్రయ్య, అతడి కొడుకు క్రిష్ణమూర్తులను మనం నిజ జీవితంలో చూడగలమా? వట్టి వేళ్లు, నిమ్మకాయ, అల్లంలతో తయారైన పానీయాలు, షర్ బత్ లకుతోడు దేశభక్తులందరికీ అడ్డాగా నిలిచింది పెండెం సోడా సెంటర్. కోకోకోలా, పెప్సీలు దేశంలోకి రావడాంతోటే ఆడ్రసులు లేకుండా పోయాయి. ఈ కథ భారతదేశంలో నిలువనీడకూడా లేకుండా మట్టికొట్టుకుపోయిన అనేక చిన్న, సన్నకారు చేతివృత్తుల వారి అందరి జీవితాలను మనకు గుర్తుకు తెప్పించి హృదయాన్ని బరువెక్కిస్తుంది. ‘దూద్ బఖష్’, ‘జమీన్’, ‘న్యూబాంబే టైలర్స్’ లాంటి చక్కటి, చిక్కటి మేలిమి కథలందిస్తున్న మహమ్మద్ ఖదీర్ బాబు తెలుగు కథ మీద మనకెంతో విశ్వాసం, నమ్మకం పుట్టిస్తాడు. " 


ఈ సంపుటిలో మొత్తం 12 కధలున్నాయి. ముందుగా వీటన్నిటి ఇతివృత్తం వ్రాస్తే, ఈ కధలు చదివేటప్పుడు కలిగే చక్కటి అనుభూతి, పాఠకుడు కోల్పోగలడు. ఈ పుస్తకం లోని కధలపై ఇంత తెలుసుకొన్న తరువాత, న్యూ బాంబే  టైలర్స్ కొని చదవకుండా  ఉండటం సాధ్యమా? 


New Bombay Tailors  and Other stories -Telugu Stories
Mohammed Khadeerbabu
తొలి ప్రచురణ: 2012
డెమి1/8 పేజీలు 214
అందమైన ముద్రణ - నాణ్యతకల కాగితం
ధర: 160/-
కావలి ప్రచురణలు
లభ్యత:  ముఖ్య పుస్తకాల దుకాణాలలో 


 Photos, Audio, Video and Text by cbrao.




సోమవారం, ఫిబ్రవరి 20, 2012

బ్లాగులు- వ్యాఖ్యలు -15

                          Rashtrapati Nilayam, Bolaram, Secunderabad Photo: cbrao

                             
మీరో మాంచి కథ రాసారు. పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది. డబ్బులు లేవు. ఏం చేస్తారు?

What an idea! Nice.

http://janatenugu.blogspot.com/2011/07/blog-post_1693.html

"మాయదారి వీడియో"

వీడియో తో చిక్కేనండి మరి. మీ వారు చెప్పినట్లు, అరగంట  తరువాత (ఈ లోపు మీ భోజనం కూడా అయిపోతుంది)  క్యూ పెద్దగా ఉండదు. అప్పుడు  ఇలా మధ్యలో దూరాల్సిన అవసరం కూడా రాదు. నింపాదిగా వధూ వరులతో కబుర్లు కూడా చెప్పవచ్చు.

http://srilalitaa.blogspot.com/2011/02/blog-post.html


'For Women' లో నా ఆర్టికల్!

షికాగొ, న్యూయార్క్ చిత్రాలు ఉంచారు వ్యాసంలో. మీరు ఆ నగరాలు  సందర్శించినప్పుడు  తీసినవా?  మరో విషయం అమెరికాలో. మన కవితలలో గోడ మీద బల్లి, మంచంలో నల్లి  అంటూ అక్కడ వ్రాయలేము. గోడలపై  విద్యుత్ దీపాలకు ఆకర్షితులయే పురుగులు కూడా  అమెరికా, కెనడాలలో నా దృష్టికి రాలేదు.

http://vennelasantakam.blogspot.com/2011/07/for-women.html

"నరిశెట్టి ఇన్నయ్య గారిని, యార్లగడ్డ (LP) గారిని కలిసాను"

"అవును ఒబామా వీరి పొరుగువారే అని నవ్వుతూ నేను అంటే ఇన్నయ్య గారు నవ్వారు. " - ఒబామా పొరుగువారు నరిసెట్టి రాజు (ఇన్నయ్య గారి కుమారుడు).  The Washington Post దినపత్రిక  Managing editor  గా ఉన్నారు.  వీరి పత్రిక కార్యాలయాన్ని ఒబామ సందర్శించి (ఎన్నికలముందు) సంపాదకులని కలిశారు.

షికాగో లో ఉంటూ శ్రీయుతులు  ఇన్నయ్య, యార్లగడ్డలను మీరు కలవగలగటం ముదావహం. శ్రీయుతులు జంపాల, జయదేవ్, రామరాజ భూషణుడు యలవర్తి  ప్రభృతులు షికాగో లో చక్కటి సాహితీ సేవ చేస్తున్నారు.  

ఆనాటి గుంటూరు జిల్లా  ఇ-పుస్తకం  ఈ దిగువ లింక్ లో లభ్యమవుతుంది.
http://deeptidhaara.blogspot.com/2011/03/blog-post_17.html

http://sarath-kaalam.blogspot.com/2011/07/lp.html

బ్లాగు పేరు మార్పు

చందమామ కబుర్లు బాల్యంలోకి తీసుకెళతాయి.  సంతోషకరమైన రోజులని మరలా గుర్తుకుతెస్తాయి. పాత చందమామ కు ఆహ్వానం. కొత్త (పాత) చందమామ బ్లాగు  చిరునామాలో చందమామ స్పెల్లింగ్ సరిగా ఉన్నట్లు లేదు.  

http://alanaati-telugu-chandamamaama.blogspot.com/

http://manateluguchandamama.blogspot.com/2011/08/blog-post.html


డయాబెటిస్ తో ఆరోగ్య జాగ్రత్తలు

నలుగురికీ ఉపయోగపడే వ్యాసాలివి. కొనసాగించండి. ఆరొగ్యమే మహాభాగ్యము.

http://mytelugurachana.blogspot.com/2011/08/65-53.html

జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం


వ్యాసం చాలా వివరంగా ఉంది. స్టాక్ మార్కెట్ మదుపుదారులకు ఉపయుక్తమైన సమాచారమిది.

http://teluguvartalu.wordpress.com/2011/08/24/%E0%B0%9C%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%A4/


పుస్తకాల పురాణం

"ఒక్కసారి చదవగానే జన్మంతా గుర్తుండేలాంటి పుస్తకం, వాసిరెడ్డి సీతాదేవి గారి "మట్టిమనిషి"." -అవును.  ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ధారావాహికంగా  వస్తున్నప్పుడు చదివాను. మరలా చదవక పోయినా  ఈ నవల లోని కొన్ని సంఘటనలు ఇంకా గుర్తున్నాయి అంటే ఈ రచన గొప్పదనమే.  
"పిల్లలక్కూడా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది." - అదృష్టం. టి.వి., కంప్యూటర్ ఆటలు, సినిమాల వల్ల, పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చెయ్యటం కష్టమవుతున్న   సమయం లో,  పుస్తకాలు చదివే పిల్లలని చూస్తే ముచ్చటేస్తుంది.     

http://sunitatelugublog.blogspot.com/2011/08/blog-post_27.html


శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -14


శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం  ప్రచురించటం శ్లాఘనీయం. అయితే, దీనిని ఈ నాటి యువతరం కూడా అర్థం చేసుకునేలా, ప్రతి టపా దిగువున వచనంలో సరళంగా భావాన్ని వ్రాస్తే మరింత ఉపయుక్తకరంగా ఉండగలదు.  

http://sahityasourabham.blogspot.com/2011/08/14.html


మూగబోయిన ఆదిలక్ష్మిగారు

అయ్యో! చనిపోయి ఏమి సాధించేది? ఏ ప్రయోజనం నెరవేరుతుంది?  ఆదిలక్ష్మి గారు త్వరలో కోలుకుంటారని ఆశిద్దాము.

http://pradeepblog.miriyala.in/2011/09/blog-post.html

ఆదివారం, ఫిబ్రవరి 19, 2012

మహమ్మద్ ఖదీర్‌బాబు కధా సంపుటం - న్యూ బాంబే టైలర్స్-1

మహమ్మద్ ఖదీర్ బాబు  అంధ్ర పాఠకులకు చిరపరిచితుడు. ఖదీర్ తన మొదటి కధ పుష్పగుచ్ఛం ను 1995 లో వ్రాసాడు. ఖదీర్ ఆత్మకధ, కావలి లోని తల్లితండ్రులు, మిత్రులు, అక్కడి ముస్లిం వ్యక్తుల జీవన చిత్రణ ఐన దర్గామిట్ట కధలకు మంచి గుర్తింపు వచ్చింది. దర్గామిట్ట కతలు తో ఎందరో ఖదీర్ అభిమానులయ్యారు.  దర్గామిట్ట కతలే కాకుండా ఖదీర్ వ్రాసిన ఇతర పుస్తకాలు ప్రశంసలను, విమర్శలను సంపాదించాయి. ఏ రచయితకైనా పాఠకుల స్పందన కావాలి. He wishes to Get Noticed. ఖదీర్ కు ఇలాంటి గుర్తింపు చాలినంతగా ఉంది. ఇప్పటి దాకా ఖదీర్ వ్రాసిన పుస్తకాలపై ఒక హ్రస్వ వీక్షణ చేద్దాము.  

Link 1                               Link 2 
పోలేరమ్మబండ కతలు (2004 )  - బాల్యం, స్కూల్ విద్యార్థుల కధలు, జ్ఞాపకాలు

Bring mouse on top of titles to get linked pages

దర్గామిట్ట కతలు

ఈ కధలు చదివాక ముళ్లపూడి  ఖదీర్ ను అభినందిస్తూ  “ఈ (కతల) నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచిని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ, అమ్మలూ, అవ్వలూ, తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు” అంటారు.
ఖదీర్ బాబు కధలను పరిచయం చేస్తూ   కొత్తపాళి "సజీవ మైన పాత్రలతో నిజ జీవితాన్ని సెంటిమెంట్ల లాంటి చీప్ ట్రిక్కులేవీ లేకుండా సూటిగా, కొంత హాస్యంతోనూ, కొంత ఆర్ద్రతతోనూ కలిపి చెప్పుకొచ్చిన చక్కటి కథలు. మీకు మధ్య తరగతి తెలుగు ముస్లిముల జీవితం గురించి ఆట్టే తెలియక పోతే పుస్తకం తెరవగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది. కంగారు పడకుండా రెండడుగులు లోపలికి వచ్చారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాగా తెలిసిన వాళ్ళే. " అంటారు.

బాలీవుడ్ క్లాసిక్స్

మన్ చాహే గీత్


నూరేళ్ళ తెలుగు కథ

అందరితోను ప్రశంసలు పొందిన ఖదీర్ కు దిష్టి తగిలినట్టుంది. ఈ పుస్తకం ప్రశంసలతో పాటు విమర్శలనూ అందుకొంది. కధలను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేశారని కొందరు, తెలంగాణ రచయితలకు తగినంత ప్రాధాన్యం లభించలేదని ఇంకొందరు, కధలు తిరిగి చెప్పిన తీరు బాగా లేదని మరికొందరూ విమర్శలు గుప్పించారు.  నామిని శిష్యుడైన ఖదీర్ పై నామిని ప్రభావం ఉంది.  వీరిద్దరిలో ఎవరు పెద్ద పుడింగో  విమర్శకులకు అంతుపట్టలేదు.

న్యూ బాంబే  టైలర్స్ - Genre వృత్తుల ఇతివృత్తం, ప్రపంచీకరణ, ఆటంకవాదులు, ముస్లిం వ్యక్తుల జీవన చిత్రణ 
ఖదీర్ పై విమర్శలకు సమాధానమా అన్నట్లు ఇప్పుడు వెలువడింది న్యూ బాంబే  టైలర్స్ పేరుతో కొత్త కధా సంపుటి. మనల్ని వెంటాడే, మధన పరిచే కధలున్నాయిందులో.   
ఈ సంపుటం లో వచ్చిన గెట్ పబ్లిష్డ్  కధను ఒక పుస్తకంగా హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు గతంలో ప్రచురించారు.  ఇదే కాదు ఖదీర్ వ్రాసిన కొన్ని కధలు ఇలా ఒకో కధ ఒకో పుస్తకంగా వెలువడి  ఒక కొత్త వొరవడిని సృష్టించాయి.
 Click on photo to enlarge
Left to right: M/s Jampala choudary, K.I.Varaprasad Reddy,Volga, Khadeer Babu, Danny, Satish Chandar
ఫిబ్రవరి 15, 2012  న హైదరాబాదు ప్రెస్ క్లబ్, సోమాజిగూడాలో, వొల్గా గారి అధ్యక్షతన  ఈ  పుస్తకాన్ని శాంతా బయోటెక్స్ అధినేత కె.ఐ. వరప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించారు. 

అధ్యక్షురాలు వొల్గా మాట్లాడుతూ  ఈ సంపుటం లోని చివరి కధ (Get Published) తనను ఎంతో వొత్తిడికి గురిచేసిందని, సాధారణంగా పుస్తకావిష్కరణ తరువాత మాత్రమే సంపుటం లోని కధల గురించి మాట్లడతారని కాని తాను ఆ కధ చదివిన వేదనలో ఆ కధ గురించి మాట్లాడలేకుండా ఉండలేక పోతున్నానని, ఆ కధ పూర్వాపరాలగురించి వివరించారు. వారు చెప్పింది వినే ముందు పాఠకులకు ఆ కధ మూడు ముక్కలలో చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో మొత్తం ఐదు పాత్రలు. 1) షకీల్ -ఆంధ్రా ప్రాంతపు పత్రికా రచయిత, హైదరాబాదులో పని చేస్తుంటాడు. 2) డ్రైవర్ ఉద్యోగం చేసే, గొడ్డు మాంసం పై ప్రీతి కల నయాబ్ 3) మసీదు వద్ద చెప్పులకు కాపలా కాసి జీవనొపాధి గడించే నయాబ్ భార్య ఫాతిమ 4) మసీదు మెట్లపై  దొంగ మెడికల్ ప్రిస్క్రిప్షన్ తో యాచించే ఫాతిమా కొడుకు ముష్టాక్ 5) రచయిత షకీల్ యొక్క కార్యాలయ సంపాదకుడు.  ముంబాయి తాజ్‌మహల్ హోటల్ పై దాడి జరిగినప్పుడు  నయాబ్ ను, అతని మిత్రులను ఆటంకవాదులుగా అనుమానించి, పోలీసులు ఇంట్లోంచి బలవంతంగా తీసుకుపోయి పలు చిత్రహింసలకు గురిచేసి చివరకు సరైన ఆధారాలు లేని కారణంగా వదిలివేస్తారు. అయితే ఆటంకవాదులుగా ముద్రపడిన కారణంగా వీరి జీవితం   అస్తవ్యస్తమవుతుంది. షకీల్ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానన్న నష్టపరిహారాన్ని, పరిహారంతో న్యాయం జరగదని,  ఫాతిమా తిరస్కరిస్తుంది. నయాబ్ కుటుంబపు వ్యక్తులెవరూ ఆ పై మసీదు వద్ద కనపడకుండా ఎటో దూరంగా వెళ్లిపోతారు. రాజ్యహింసకు గురైన నయాబ్ లాంటి వాళ్ల కధలు చదివి మనం ఒక నిట్టూర్పు విడుస్తాము.  వోల్గా గారి మాటలలో ఈ కధా పరిచయం వినండి.  


http://dl.dropbox.com/u/31976678/nbt-1.mp3


ఈ కధా సంపుటం లోని మొదటి కధ న్యూ బాంబే  టైలర్స్ . ఈ కధ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్ధుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు  సంపాదించుకుంటున్న తరుణంలో  పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్   ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు.  ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కధ. 



ఈ సంపుటి లోని జమీన్ కధకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై  కధ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం:  ఇది ఇద్దరు బాల్యమిత్రుల కధ.  కసాయి కొడుకు హుసేన్, మాలపల్లె లో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాల లో ఉండే హుసేన్‌కు తన స్వస్థలమైన కావలి లో చిన్న ఇల్లు కట్టుకోవాలని, అక్కడే కనుమూయాలని ప్రగాఢ కోరిక.  స్థలం లభ్యమయ్యిందన్న కబురు బ్రమ్మయ్య నుంచి అందగానే కావలికి పయనమైన హుసేన్ ఆ స్థలం తన మిత్రుడు బ్రమ్మయ్యదే అని తెలుసుకొని ఆనందభరితుడవుతాడు. అయితే బ్రమ్మయ్య కొడుకు రమణ ఆర్.ఎస్.ఎస్. పార్టీ లో చేరి ఆ సిద్ధాంతాలను ఒంటపట్టించుకొని, సాయిబు హుసేన్ కు స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో, ఖిన్నుడయిన హుసేన్  చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు, వికల హృదయంతో. 


ఒక సాయంత్రపు అదృష్టం  - ఈ కధను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో  కధ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కధానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రక్రుతి సహజమైన  అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక వర్షం కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు.  రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా,  ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కధానాయకుడిలో  ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా  తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.
   
న్యూ బాంబే  టైలర్స్, జమీన్ మరియు ఒక సాయంత్రపు అదృష్టం కధలపై వరప్రసాద్‌రెడ్డి గారి పరిచయం వినండి.   

http://dl.dropbox.com/u/31976678/nbt-2.mp3


(ఇంకా ఉంది)


మహమ్మద్ ఖదీర్‌బాబు కధా సంపుటం - న్యూ బాంబే  టైలర్స్-2 లో
ఖదీర్‌బాబు  కధలపై జంపాల చౌదరి తదితరుల విశ్లేషణ
ఖదీర్‌బాబు మాటలలో తన కధల గురించి - Video

Photos, Audio, Video and Text by cbrao.

మంగళవారం, ఫిబ్రవరి 14, 2012

అత్తగారు జపాన్ యాత్ర


డా.భానుమతి రామకృష్ణ వ్రాసిన అత్తగారు జపాన్ యాత్ర కధ ఇప్పుడు మీరు వినవచ్చు. 



ఈ కధ చెప్పిన గొంతు ఎవరిది? ఈ కధ నచ్చిందా? అయితే మరిన్ని డా.భానుమతి అత్తగారి కధలకు
ఈ కింది గొలుసు చూడండి.

http://21stcenturytelugu.blogspot.in/2011/12/blog-post_15.html 

అంతర్జాలం లో మీకు తెలిసిన తెలుగు శ్రవణాలు ఉంటే వ్యాఖ్య ద్వారా తెలుపగలరు.