గురువారం, జనవరి 31, 2013

ఆమె ఎవరు?


దెయ్యాలున్నయ్యా లేవా? ఆడదెయ్యం, మొగదెయ్యం ఇంకా కొరివి దెయ్యాలున్నాయా? ఆడదెయ్యం ఎప్పుడూ తెల్ల చీరలో మాత్రమే కనిపిస్తుందెందుకని? స్కూల్ విద్యార్ధులను ఎక్కువగా బాధించే సమస్య ఇది. అభివృద్ధి చెందిన దేశమైన ఉత్తర అమెరికాలో కూడా దెయ్యాలున్నాయని నమ్మే వారు అన్ని పట్టణాలలో ఉన్నారు. శాండియాగో, సవన్నా లాంటి పట్టణాలలో సాయం వేళలలో ప్రత్యేక పర్యటన కార్యక్రమాలున్నాయి, వీటి అన్వేషణకై. అసంతృప్తులైన వ్యక్తులే కొరికలు తీరక దెయ్యాలుగా వస్తారని నమ్మకం. నిన్న మొన్నటి దాక మనల్ని కనిపెట్టుకున్న మన ఆత్మీయులు, మరణం తరువాత కూడా మన బాగోగులు చూస్తారనే నమ్మకంలోంచే దెయ్యాలున్నాయన్న నమ్మకానికి రెక్కలొచ్చాయి.     

ఇంతకీ దెయ్యాలున్నాయని మీరు నమ్ముతారా? అసలు వాస్తవమేమిటి? ఇక్కడ చూడండి.        

బుధవారం, జనవరి 30, 2013

ఫేస్‌బుక్ అసభ్యరాతల నిందితుల నిర్బంధం





                                        ఆంధ్రజ్యోతి దిన పత్రిక సౌజన్యంతో    
                                       

                                      

గాంధీజీ చివరి క్షణాలు

                            

వెనిగళ్ళ వెంకటరత్నం

                           
January 30, 2013
                           
గాంధీజీ హత్య జరిగి 65 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు భారతీయుల మనస్సులలో చెరగని ముద్రే వేశాయి. మహాత్ముడ్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని పలువురి మేధావులు మధనపడుతున్నారు. గాంధీజీ శారీరకంగా ఏమంత బలవంతుడు కాడు. 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా చరిత్రపుటల్లో, సెల్యూలాయిడ్‌లో బంధించినా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ‘అహింస- సత్యాగ్రహం’ ఆయుధాలుగా ఢీకొని భారతదేశ స్వాతంత్య్ర సముపార్జనకు ఎనలేని కృషిచేసిన ధీశాలి. దక్షిణాఫ్రికాలో మామూలు కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నల్లజాతీయుల హక్కులకోసం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ‘అహింస- సత్యాగ్రహం’ ఆయుధాలుగా తొలిసారి అక్కడే ప్రయోగించాడు. ఒక రాజకీయాల్లోనే కాదు - దైనందిన జీవితంలో భాగమైన ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారపు అలవాటు, ఆర్థిక విధానాల మీద తనదైన ముద్ర వేశాడు.

1948 జనవరి30న బిర్లా భవన్‌లో రోజువారి కార్యక్రమంలో భాగమైన సాయంత్రపు ప్రార్థనా సమావేశానికి తన మేనకోడళ్ళైన ‘అభ-మనుల’ను చేతి ఊతంగా చేసుకొని గుమికూడిన వారికి నమస్కారం చేస్తూ అడుగులేస్తుండగా గుంపులో నుంచి ఒక ఆగంతకుడు మనుని కిందకు త్రోసివేసి, తన పిష్టల్‌తో మూడు గుండ్లు గాంధీపై కాల్చగా- ఒక్కసారిగా ‘హేరామ్‌’ అంటూ గాంధీ నేలకొరిగి వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుశ్చర్యపట్ల అక్కడివారు నిశ్చేష్ఠులయ్యారు. వెంటనే లార్డ్‌మౌంట్‌ బాటన్‌, నెహ్రూ, పటేల్‌లు గూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అంతకుముందు కొద్ది రోజుల క్రితమే జనవరి 20న ప్రార్థనా సమావేశంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బాంబు పేల్చాడు. గాంధీజీ వ్యతిరేకించినా, పటేల్‌ ఆదేశాల మేరకు అక్కడున్న జనసమూహాన్ని పోలీసులు సోదాచేశారు. అయినా నేరస్థుడ్ని గుర్తించలేకపోయారు. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా పోలీసు భద్రత పెంచే విషయంలో గాంధీజీ పటేల్‌ను వ్యతిరేకించాడు.
1947 డిసెంబరులో ఒకరికి రాసిన లేఖలో తనకు మరణఘడియలు సమీపిస్తు న్నట్లు గాంధీజీ వ్యక్తం చేశాడు- దేవుని సేవలో మరణించాలని కోరుకున్నాడు. ‘రాముడే నా మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఆయన ఆడించినట్లల్లా ఆడటమే నా పని. నా జీవితం ఆయన చేతుల్లో మాత్రమే ఉంది. ఈతరుణంలో నేనెంతో ప్రశాంతం గాఉన్నాను’. నెహ్రూ-పటేల్‌లను నెమ్మది పరచ డానికి మాత్రమే అదనపు పోలీసు భద్రతకు ఒప్పుకున్నట్లు తన స్నేహితుడు బిర్లాతో అన్నాడు. మృత్యువంటే తనకెలాంటి భయం లేదని చెప్పకనే చెప్పాడు.

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అహింస మీద నమ్మకమున్నది నేనొక్కడ్నే కావొచ్చు. అహింసతో పోరాడేశక్తి ఇమ్మని భగవంతుడ్ని వేడుకుంటున్నాను. నా భద్రతకోసం ఏర్పాటు చేసిన పోలీసులు, మిలటరీ నన్ను కాపాడలేవు- రాముడు ఒక్కడే నాకు రక్షకుడు’ అన్నాడు.ఇంతటి ప్రాణభీతి ఉన్నా ప్రశాంతతో తన లక్ష్యం కోసం పని చేయసాగాడు. కాంగ్రెస్‌కి పథ నిర్దేశం, నెహ్రూ- పటేల్‌ల మధ్య అఘాథాన్ని పూడ్చ టమే తనముందున్న లక్ష్యాలుగా పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని గాంధీజీ- మౌంట్‌ బాటన్‌తో జరిపిన చిట్ట చివరి సమావేశంలో అన్నట్లు ఆ తరువాత బాటన్‌ తెలిపాడు. 30 జనవరిన పటేల్‌తో అతి ముఖ్యమైన విషయాలపై సుదీర్ఘ చర్చల కారణంగా ప్రార్థనా సమావేశానికి రావటం ఆలశ్యం అయింది.

అక్కడి భీతావాహ దృశ్యాన్ని చూసిన మౌంట్‌ బాటన్‌ సహాయకుడు- మరణంలో గూడా గాంధీజీ మోములో ఎంతో తేజస్సు ఉట్టిపడుతోంది. తను ధరించే గుండ్రటి కళ్ళద్దాలు తొలగించారు. అనేక ఏళ్ళుగా ఇవి గాంధీజి శరీరంలో అంతర్భాగంగా ఉన్నాయి. అగరొత్తుల పరిమళం, మహిళల రోదనలు వినవస్తున్నాయి. అతి బలహీనమైన గాంధీ పార్ధివదేహం నిద్రిస్తున్నట్టుగా గోచరిస్తోంది. అక్కడ ఎంతో మంది మౌనసాక్షులుగా నిలబడి ఉన్నారు. ఇలాంటి భీకర దృశ్యాన్ని నేనెన్నడూ చూడలేదు. అక్కడ నిలబడి ఉన్నానేగాని, గాంధీ లేని భారతదేశాన్ని ఊహించుకోవటమే భయంగా ఉంది. ఈ ఘటన నన్ను కలచివేసింది. గాంధీజీ ఏ విలువల కోసం పోరాడాడో ఆ విజయం ముందు తుపాకి గుళ్ళు తలవంచినట్లుగా భావిస్తున్నాను’ అని వాపోయాడు.
గాంధీజీ కార్యదర్శి ప్యారిలాల్‌కి తను మరణించినపుడు ఏం చెయాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన పార్ధివదేహాన్ని ముందుతరాల వారి కోసం భద్రపరచడంగాని, పూజలు చెయ్యటంగాని వద్దు అన్నాడు. తన కోరికప్రకారం మర్నాడే హిందూ మతాచారాలకు అనుగుణంగా దహన సంస్కారాలు జరిగాయి. పెద్దసంఖ్యలో అధికారులు, అనధికారులు, పేద బిక్కి అందరూ దృఢసంకల్పుడూ, అకుంఠిత దేశభక్తుడు అయిన పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. అదే రోజు రాత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ తన సంతాప సందేశాన్ని రేడియో ద్వారా వినిపించారు. తనకి రాజకీయ గురువూ, తనని అమితంగా అభిమానించే జాతిపితకు ఘనమైన నివాళులు అర్పించాడు. ‘మన జీవితాల్లోంచి ఉషస్సు అదృశ్యమైపోయింది. దేశంలో ప్రసరించిన కాంతి సామాన్యమైందికాదు.

ఆ కాంతి అద్యతన వర్తమానంకన్నా ఉన్నతా దర్శాలను ప్రతిబింబించింది. జీవితాన్ని, నిత్య సత్యాన్ని ప్రస్ఫుటింపజేసింది. తప్పిదాల నుంచి రుజుమార్గం వైపు నడిపించింది. ప్రాచీనమైన ఈ దేశాన్ని స్వేచ్ఛాపథం వైపు పయనింపజేసింది. గాంధీజీ మరణంతో మనకు జీవిత ఔన్నత్యం, జీవన సత్యం ద్యోతకమవుతున్నాయి. ఆయన ప్రవచించిన ఉత్తమాదర్శాలను అనుసరిస్తే భారతదేశం ఉత్తమ మార్గంలో పురోగమిస్తుంది’.దేశ విభజన గాంధీజీని ఎంతో బాధకు గురిచేసింది. భారత దేశంలోని ముస్లింలు పాకిస్థాన్‌ పోవడానికి, అక్కడి హిందువులు మన దేశంలోకి వచ్చే ప్రహసనంలో- హిందూ ముస్లింలు అతిక్రూరంగా ఒకర్నొకరు చంపుకోవడం గాంధీజీని కలిసివేసింది. ఇటు బెంగాల్‌, అటు పంజాబ్‌లలో శవాలు గుట్టలుగుట్టలుగా పడివున్నాయి. అలా చనిపోయినవారి సంఖ్య లక్షలలో ఉంది. రక్తం ఏరులై పారింది. విభజనకు గాంధీజీ మొదట్నుంచి వ్యతిరేకమే. ముస్లిం- హిందూనేతలు పరస్పరం విశ్వాసం కోల్పోయారు. అప్పటి రాజకీయ పరిస్థితులు ప్రకారం బ్రిటిష్‌ వారు చేయగలిగింది ఏమీ లేదు- విభజించి, దేశాన్ని వీడిపోవటం తప్ప. అది చారిత్రక తప్పిదమే. దేశ విభజన రాజకీయ నిర్ణయాలకు దూరంగా, కాంగ్రెస్‌ క్రియాశీల రాజకీయాలకు 1945 లోనే గాంధీజీ దూరంగా జరిగారు.

తను కలలుగన్న స్వరాజ్యం అంటే- ఆంగ్లేయుల నుండి లభించే రాజకీయ స్వరాజ్యం కాదు. స్వీయపాలనలో అన్ని మతస్థులవారూ కలిసిమెలిసి సామరస్యంగా జీవించగలగాలి. అప్పుడే స్వరాజ్యానికి సార్థకత.ఈ మతకల్లోలనుంచి భారత దేశం బయటపడాలంటే- కాంగ్రెస్‌లో గుణాత్మకమైన మార్పు రావాలి. ఆ దిశగా కాంగ్రెస్‌కి కొత్త రాజ్యాంగ రచన తయారుచేయాలని భావించారు. 1946లోనే ఈ ఆలోచన మొగ్గ తొడిగింది. చివరి రోజుల్లో ఆయన ప్రతి ఘడియ దీనికోసం తీవ్రంగా ఆలోచించారు. తన ఆలోచల్ని 1948 జనవరి 29న తయారు చేసిన ముసాయిదాని గాంధీ ఆఖరి ప్రకటనగా పేర్కొన్నారు. దాని ప్రకారం- కాంగ్రెస్‌ - అధికారం కోసం పనిచేసే పార్టీ కాగూడదు. ప్రజాసంక్షేమం కోసం గ్రామస్థాయిలో కార్మిక- కర్షకులకోసం పనిచేస్తూ వ్యవసాయం, చేతివృత్తులను బ్రతికించు కోవాలి. అప్పుడే వారు స్వయం సమృద్ధి సాధించగలరు. ఓటుహక్కు వినియోగించే విధంగా వారిని విద్యాధికులుగా చెయ్యాలి. వీరందరూ విధిగా ‘ఖాదీ’ ధరించాలి. క్రమంగా కాంగ్రెస్‌ గాంధీజీ ఆశయాలకు దూరంగా జరిగిపోయింది. చివరిగా 1947లో ఎ.కె. ఆజాద్‌తో ‘నేను ఎంతో ధైర్యంగా ప్రచారంచేసిన అహింస ఈనాడు పరీక్షా సమయాన్ని ఎదు ర్కొంటోంది. పరస్పరం చంపుకోవడంచూస్తూంటే- ‘అహింస’ ఎప్పుడో చనిపోయిం’దని ఆవేదన చెందాడు. జీవితాంతం సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలతో పెనవేసుకొన్న గాంధీ జీవితం ఉన్మత్తుడైన హిందూ యువకుని పిస్టల్‌ బులెట్‌తో పరిసమాప్తం కావటం అత్యంత విషాదకరం.

                       
సూర్య దినపత్రిక సౌజన్యంతో