నాకు నచ్చిన సుందర నగరం శాంఫ్రాన్సిస్కో. ప్రబంధ నాయికవలే మెలికలు తిరిగిన వంపులతో, ఎత్తు పల్లాలతో ఉండే శాంఫ్రాన్సిస్కో ఎవరికి నచ్చదు? పసిఫిక్ మహసముద్రపు రెండు తీరాలను కలిపే బంగరు ద్వారపు వంతెన* అందానికి ఎవరు దాసోహమనరు? న్యూయార్క్ లో పుట్టినా మధుర గాయకుడు టోనీ బెనెట్ తన హృదయాన్ని శాంఫ్రాన్సిస్కో నగరంలో పారేసుకోవటంలో ఆశ్చర్య మేముంది?
“ శాన్ ఫ్రాన్సిస్కోలో వో అర్ధ రాత్రి “ కవితలో అఫ్సర్, మధుర గాయకుడు టోనీ బెనెట్ తో జత కలిసి యుగళగీతమే పాడాడు; శాంఫ్రాన్సిస్కో సొగసును నిందాస్తుతి లో స్తుతిస్తూ.
1
“I left my heart in San Francisco…”
టోనీ బెన్నేట్ అలా పిచ్చిగా పాడుకుంటూ వెళ్లిపోతున్నాడు
ఇప్పటికీ ఈ రాత్రి కూడా
ఈ శాన్ ఫ్రాన్సిస్కో నీలి ఆకాశంలోంచి,
ఈ చలిగాలుల లేత చీకటి పొగమంచు మీదుగా.
శాన్ ఫ్రాన్సిస్కో లో పొగ మంచు కూడా అందానికి ఒక హేతువే. ఈ పొగమంచుతో పగలే వెన్నెల లాగా అనిపించటంలో వింతేమి ఉంది? బంగారు ద్వారపు వంతెన కూడా గాలిలో తేలియాడుతుంది; అదీ వేసవి మధ్యాహ్నపు పొగమంచులో.
2
క్షమించెయ్ నన్ను, టోనీ!
నీ పాటని పిచ్చిగా నమ్మి ఈ ఆఖాతానికి కొట్టుకొచ్చా,
నువ్వు నక్షత్రాలకి కట్టిన కేబుల్ కార్లూ,
నీ నీలి సముద్రమూ
నా రెప్పల కింద దాచుకోలేకపోతున్నా.
నీ ఇల్లు నాకు దీపాల్ని తోడుక్కొని
తిరుగుతున్న అస్థిపంజరంలా అనిపిస్తోందని నేనంటే
నా కన్నునే నువ్వు శంకిస్తావనీ తెలుసులే!
ఆకాశం వైపు దూసుకెళ్ళే కేబుల్ కార్ల ఎత్తులు, పసిఫిక్ సముద్రపు లోతులు ఒక్క సారే చూడటం ఎంత కష్టం? ఎవరికైనా కుటుంబం ఎంతో ప్రీతిప్రాత్యం. ఆ కుటుంబం ఉండే ఇంటిగానే శాంఫ్రాన్సిస్కో నగరాన్ని టోనీ బెనెట్ భావించాడు. చీకట్లో దీపాల కాంతులలో మెరిసే నగరాన్ని అస్థిపంజరంతో పోలిస్తే టోనీ ఐనా మరెవరైనా కవి హృదయాన్ని శంకించక తప్పదుకదా!
3
అస లే నగరమయినా ఎవరికయినా ఇల్లవుతుందా?
ఏమో, ఈ డౌన్ టౌన్ గుండెల్లోంచి నడుస్తున్నప్పుడు
శరీరాన్నీ, గుండెని కూడా
పొగ మంచు, చలి చినుకులు ముసురుకున్నట్టే వుంది.
గరీబీకి ఏ రంగూ ఏ వాసనా వుంటాయో చూసిపోదువు కానీ,
వొక సారి ఇటు వచ్చి నీ పాటని
ఆ రంగులోంచి ఆ వాసనలోంచి వినిపించు టోనీ!
ఎక్కడో అతి ఏకాకినై ఇక్కడ తేలానని నువ్వు అన్నావే కానీ,
నగరం నచ్చితే, మనసు మెచ్చితే అదే ఇల్లవుతుంది. సుందరవనమౌతుంది. నగర వీధులనిండా చలిపులి, పొగమంచులతో నిండిఉన్నాయి. ఇక్కడా బీదా-బిక్కి ఉన్నారు. టోనీ ఈ దారిద్ర్యం కన్నావా? నీ పాటలో ఆ దీనత్వం కనపడనీ. న్యూయార్క్ జనారణ్యం లో నువు ఏకాకినన్నా వు, కాని.....
4
ఈ ఆకలి తగలబెడ్తున్న శరీరారణ్యంలో
నీ పాట చమ్కీ దండలా మిలమిలా మెరుస్తోంది,
నీడలేని తనపు చీకటి నిజాన్ని దాచేసి!
నీ / నా బంగారు వన్నె సూరీడు
ఇక్కడా అంటరాని వాడే,
ఎప్పటికీ.
నగరపు నగ్నత్వాన్ని, ఆకలి దప్పులను, అంటరాని తనాన్ని నీ మధురమైన పాట చీకటిలా మింగేస్తుంది, మరుగున పడేస్తుంది.
అమెరికా మేడిపండు లాంటిది. ఆకాశాన్ని చుంబించే భవంతులు, మిల మిలలు వెనుక అక్కడి లేమితనానికి అఫ్సర్ ఆర్ద్రతతో స్పందించిన వైనం మన మనసులని తాకుతుంది.
* Golden Gate Bridge, San Francisco.
-సి.బి.రావు
నా గురించి: పక్షులు, ప్రకృతి, యాత్ర, ఛాయాగ్రహణం నాకు ఇష్టమైనవి. తీరికవేళల్లో నచ్చిన పుస్తకాలపై సమీక్ష వ్రాస్తుంటాను. దీప్తిధార, పారదర్శి పేరుతో తెలుగు బ్లాగులు నిర్వహిస్తుంటాను. నా రచనలు pustakam.net లో కూడా చూడవచ్చు. హైదరాబాదు నివాసం. సన్నివేల్ లో వీక్షణం నా చేతుల మీదుగా ఆవిష్కరణ అవటం ప్రమోదం.
ఈ వ్యాసం వీక్షణం సాహితీ గవాక్షం, బే ఏరియా, శాం ఫ్రాన్సిస్కో, అమెరికా వారి ప్రత్యేక సంచిక సెప్టెంబర్ 2014 లో తొలి ప్రచురణ అయ్యింది.