శుక్రవారం, డిసెంబర్ 26, 2014

డిసెంబర్ 14, 2014 తెలుగు బ్లాగర్ల సమావేశ విశేషాలు


ఈ నెల డిసెంబర్ 14, 2014 న గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్ లో తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం జరిగింది. సమావేశ ప్రకటన రాగానే
"తెలుగు బ్లాగర్ అని చెప్పుకునేందుకు కూసింత గర్వపడే రోజులు అవి. నాకొక బ్లాగుంది అని మహా ఆనందంగా చెప్పుకున్న రోజులవి. తెలుగు బ్లాగు ప్రపంచం అల్లరితో, నవ్వులతో, గొడవలతో సందడిగా కళకళలాడిన రోజులవి.
"మీరు బ్లాగరా? మీ బ్లాగు పేరేంటి? ఓ మీరేనా?" అని పలకరించుకున్న రోజులవి.
"మీ బ్లాగులో ఆ పోస్ట్ భలే ఉంటుంది. మా ఆఫీసులో అందరి చేత చదివించేసాను. వాళ్ళంతా ఇప్పుడు మీ ఫాన్స్." అని ఒకరినొకరు అభినందించుకున్న రోజులవి.
"ఏవి తల్లీ , నిరుడు కురిసిన హిమ సమూహములు ?..."
తెలుగు బ్లాగరులకి, చదువరులకి తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు" అని నాగ మురళీధర్ స్పందించారు. కొసమెరుపుగా బ్లాగులనే "నిరుడు కురిసిన హిమసమూహాలని ప్లస్సు, ఫేసుబుక్కు, వాట్సుయాపు ఇత్యాది భూతాలు మింగేశాయి." అని, రామరాజు భాస్కర్ వెలుబుచ్చిన వ్యాఖ్య, ఇప్పటి పరిస్థితికి అద్దం పడ్తుంది.  


ఈ సమావేశానికి 9 మంది బ్లాగర్లు హాజరయారు. సమావేశ ప్రకటన కేవలం ఒక రోజు ముందు రావటం, అదే రోజు కవి సమ్మేళనం ఇత్యాది ఇతర సమావేశాలు కూడా జరగటం సమావేశానికి తక్కువ మంది బ్లాగర్లు రావటానికి కారణం కావచ్చు.

Bloggers meet Dec 2014.jpg

ఎడమనుంచి కుడివైపు కూర్చున్నవారు: శ్రీయుతులు గుళ్ళపల్లి నాగేశ్వర రావు, సి.బి.రావు, దేవి ప్రసాద్ జువ్వాడి; నుంచున్నవారు ప్రణయ్ రాజ్ వంగరి, సాయికిరణ్ పామంజి, కశ్యప్ ఇంకా సంతోషి కె.  ఈ పై జాబితాకు మరో ఇద్దర్ని జతచేయాలి. వారు శ్రీయుతులు వీవెన్ ఇంకా కూర్మనాథ్. ఈ ఇద్దరూ చిత్రంలో లేరు.  

ఈరోజు సమావేశానికి హాజరయిన బ్లాగర్లను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను.
గుళ్ళపల్లి నాగేశ్వర రావు: ప్రస్తుతం Wikisource Books  లో క్రియాశీలకంగా ఉన్నారు. బ్లాగ్ త్వరలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.
సి.బి.రావు: e-telugu ఉపాధ్యక్షుడు. దీప్తిధార, పారదర్శి బ్లాగులు నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో చాల చిత్రాలు ఎగుమతి చేశారు. వ్యాసాలు వ్రాశారు.
దేవి ప్రసాద్ జువ్వాడి: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి,టెక్నాలజీ ఇంకా రాజకీయాలు అభిమాన విషయాలు. మహతి అనే బ్లాగు నిర్వహిస్తున్నారు.

ప్రణయ్ రాజ్ వంగరి: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, నాంపల్లి లోని రంగస్థల కళల విభాగంలో Project Assistant గా పనిచేస్తున్నారు. వికీపీడియా, కవిసంగమం వగైరా సంస్థల కార్యకలాపాలకు అనుసంధానకర్తగా ఉన్నారు.  నా బ్లాగ్ నా ఇష్టం అనే బ్లాగు నిర్వహణతో పాటు, వికీపీడియ లో కూడా క్రియాశీలకంగా ఉన్నారు.  
సాయికిరణ్ పామంజి: ఈ కింది వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు.
కశ్యప్: e-telugu కార్యదర్శి. వికీపీడియా కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉన్నారు. కబుర్లు అనే బ్లాగు నిర్వహిస్తున్నారు.
సంతోషి కె: M.Sc (Physics) చదివారు. లేఖరి అనే బ్లాగులో విజ్ఞాన, సాంకేతిక విషయాలతో పాటు చక్కటి ప్రేమ కథలు వ్రాస్తున్నారు.
వీవెన్: e-telugu అధ్యక్షులు.  కంప్యూటర్లో తెలుగు లో వ్రాయటం సులభతరం చేసిన లేఖిని వెబ్ సైట్ సృష్టి కర్త.  తెలుగు బ్లాగుల సమాహారం కూడలిని ప్రారంభించారు.  వీవెనుడి టెక్కునిక్కులు అనే సాంకేతిక బ్లాగు నిర్వహిస్తూ అనేక వెబ్ సైట్ల తెలుగు అనువాదానికి విశేష కృషి చేశారు. మిలిపిటాస్, సిలికాన్ వాలి, అమెరికా లో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం, సిలికాన్ ఆంధ్రా వారు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, కంప్యూటర్లో తెలుగు అభివృద్ధికి పెక్కు సూచనలిచ్చారు. తెలుగు వికిపీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు.      
కూర్మనాథ్: BusinessLine దిన పత్రిక లో సాంకేతిక, వ్యవసాయ సంబంధిత విషయాలు వ్రాస్తారు.       


ముందుగా కశ్యప్, హాజరయిన బ్లాగర్ల తో బ్లాగుల్లో సాంకేతిక విషయాలపై మాట్లాడారు. వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. గోడపైని పెద్ద తెరపై కంప్యూటర్ తెరను ప్రదర్శించి కొన్ని విషయాలను విపులీకరించారు. వికీపీడియా గురించి చెప్పారు. సాయికిరణ్ పామంజి తాను నిర్వహిస్తున్న తెలుగు వెబ్ సైట్లకు  Google Adsense ప్రకటనలు రావటం లేదని  తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం గూగుల్ త్వరలో కనుగొంటుందని ఆశిద్దాము.

ఈ సమావేశ సందర్భంలో ప్రశాంతి ఉప్పలపాటి బ్లాగర్ల కోసం తమ సూచన అందించారు. మీరేదైనా సమస్యలో ఉన్నా, మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో ఎదైనా మార్పు తీసుకురావాలన్నా మీ బ్లాగులలో వాటి గురించి వ్రాయండి. మీ మిత్రులను వాటిని share చెయ్యమనండి. సమస్యకు పరిష్కారం, మీరు కొరే మార్పు రాగలదు. దీనికి నాంది మీరే పలకాలి. ఉదాహరణగా ప్రఖ్యాత రచయిత్రి ఆర్ దమయంతి హైదరాబాద్ లోని దుర్గంధం వెదజల్లే అపరిశుభ్ర పరిసరాల గురించి, వాటిని  సరిదిద్ద వలసిన ఆవశ్యం గురించి చక్కటి post వ్రాసారు ఫేస్ బుక్ లో. మీరు మీ దృష్టికి వచ్చిన అంశాల గురించి వ్రాయవచ్చు.  

ఒకప్పుడు తెలుగు బ్లాగు సముదాయానికి ( telugublog@googlegroups.com) కొత్త బ్లాగర్లు తమ సమస్యలు వివరిస్తూ తరచుగా జాబులు వ్రాసేవారు. ఇపుడు విండోస్ ఎక్స్.పి స్థానంలో,  విండోస్ 8.1 రావటం వలన  తెలుగు ఖతులతో సమస్యలు దాదాపుగా తీరినట్లే. ఇప్పుడు సభ్యుల ఉత్తరాలు బాగా తగ్గిపోయాయి.  గూగుల్+ కు, తెలుగు బ్లాగులకు ప్రధాన పోటీదారుగా ఫేస్ బుక్ విజయం సాధించింది. ఫేస్ బుక్ లో చాల మంది తెలుగు వాడటం గమనించవచ్చు. ఇది ప్రమోదకరం.

ఇ-తెలుగు ప్రధాన ఆశయమైన కంప్యూటర్లో తెలుగు వాడటం నెరవేరింది. ఇ-తెలుగు, పాత్రికేయులకు, రచయితలకు  నిర్వహించిన సదస్సులు "మీ కంప్యుటర్ కు తెలుగు నేర్పండి" ఇందుకు దోహదపడ్డాయి. వీటికి పునాదిగా లేఖిని, కూడలి  ఇంకా తెలుగుబ్లాగు గుంపు తమ వంతు పాత్ర సక్రమంగా నిర్వహించాయి. ఈ పరిణామం తృప్తికరం. ఇ -తెలుగు గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు క్రియాశీలకంగా లేదు. ప్రస్తుత సమస్య ఏమంటే, సంస్థ ఆశయాలకనుగుణంగా, సంస్థ కార్యక్రమాలు నిర్వహించే  స్వచ్ఛంద  కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంది. ఔత్సాహిక కార్యకర్తలకు ఇ-తెలుగు స్వాగతం చెప్తోంది.

   

శనివారం, డిసెంబర్ 13, 2014

ఆహ్వానం: తెలుగు బ్లాగర్ల సమావేశం


హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం



ఈ నెల రెండవ ఆదివారం,  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో జరుగుతుంది.

ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్
తేదీ, సమయం:  : ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం  3 గంటల. నుండి 6 వరకూ

తెలుగు భాషాభిమానులు, బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ, కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ…
ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా, అంతర్జాలం లో మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు బ్లాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము.
ఇదే మా ఆహ్వానం! .

మీ మిత్రులు,

సి.బి.రావు సెల్: 9493404866  http://deeptidhaara.blogspot.in
కశ్యప్ సెల్: 9396533666       kaburlu.wordpress.com
ప్రణయ్ రాజ్ వంగరి సెల్: 09948 152 952  http://pranayrajvangari.blogspot.in/


 

సోమవారం, డిసెంబర్ 08, 2014

ఎస్.వి.పంతులు

                                          Sri S.V.Pantulu (Left) along with Sri Innaiah


నిన్న పంతులు గారు చనిపోయినట్లు ఈ రోజు ఇన్నయ్య గారు ఫోన్ లో చెప్పేదాకా నాకు తెలియదు. హైదరాబాదులోని చాల మంది మిత్రులకు కూడా ఇది విచారకర వార్తే. వారు చివరిదాకా చాల సాధారణంగా జీవితం గడిపిన ఒక అసాధారణ వ్యక్తి. పంతులు గారి గురించి వారిని బాగా ఎరిగిన నరిసెట్టి ఇన్నయ్య గారి మాటల్లో మరింత తెలుసుకోవచ్చు ఈ దిగువ వ్యాసంలో. -cbrao డిసంబర్ 8, 2014.
 హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెడితే అక్కడ సాధారణమైన దుస్తులతో పొట్టిగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నాయకులు తరచు పంతులుగారిని పిలవండి అంటూంటారు. ఆయనే ఎస్.వి. పంతులు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ సమాచారం కావలసినా పంతులుగారే ఆదుకుంటారు. విషయ పరిజ్ఞానంలో అసాధారణ జ్ఞాపక శక్తిగల పంతులుగారు సౌమ్యుడు, స్నేహపాత్రుడు.
ఎస్.వి. పంతులు పూర్తి పేరు సంకా వినయ పంతులు. 1934లో తెనాలిలో పుట్టారు. 1950 ప్రాంతాల నుండి ఆచార్య ఎన్.జి. రంగాకు సన్నిహితంగా, అనధికార పి.ఏ.గా ఉన్నారు. ఆయన చనిపోయే వరకూ అలాగే కొనసాగారు. పార్టీ రాజకీయాలలో తలదూర్చకుండానే ఎందరో నాయకులకు కార్యకర్తలకు సలహాదారుగా, సన్నిహితుడుగా ఉండగలగడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రంగా గారి సాన్నిహిత్యం వల్ల రాష్ట్ర, దేశనాయకులతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి.
పంతులుగారి పరిచయాలు పరికిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో పేర్కొనదగింది కీ.శే. బి.ఆర్. అంబేద్కర్ తో 1952లో పరిచయం. అటు ఆచార్య రంగా, ఇటు అంబేద్కర్ 1952 ఎన్నికలలో ఓడిపోయి, న్యూఢిల్లీ వెస్ట్రన్ కోర్టులో పక్క పక్క గదుల్లో ఉండేవారు. వారిని పలకరించడానికి ఎవరూ వచ్చేవారు కాదు. భారతదేశంలో ఓడిపోయిన వారి పరిస్థితి అలాగే ఉంటుంది. అప్పుడు పంతులుగారు వారిరువురికీ సేవలు చేస్తూ సన్నిహితంగా ఉండడాన్ని మధురస్మృతిగా భావిస్తారు. అంబేద్కర్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడం అసాధారణ విషయమే.
ఎస్.వి. పంతులు 1951లో తెనాలిలో నాకు పరిచయమయ్యారు. అప్పటి నుండి మా స్నేహం కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ నుండి చీలిపోయి ఆచార్య రంగా కృషికార్ లోక్ పార్టీ పెట్టి తెనాలిలో తొలి మహాసభలు నిర్వహించారు. ఎడ్లపాటి వెంకటరావు, ఎలవర్తి శ్రీరాములు మొదలైనవారు ఆ సభల ఏర్పాట్లు చూశారు. వాటికి హాజరైన నాయకులలో గౌతు లచ్చన్న, కందులు ఓబుల రెడ్డి, విద్యార్థి నాయకుడుగా ఉన్న కె. రోశయ్య (నేటి మంత్రి) వీరాచారి, విజయరాజకుమార్, ఆర్.సి.హెచ్. మనోహరం, వై.ఆర్.కె.రెడ్డి, సుంకర సత్యనారాయణ ఇత్యాదులెందరో ఉన్నారు. సినీ నటుడు చిత్తూరు నాగయ్య వచ్చారు. శ్రీకాకుళం నుండి అంపోలు అప్పల స్వామి ఆనాడు తాటిచెట్టు పెకలించి వేయడం సభలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పంతులుగారు నేను అప్పుడు ప్రేక్షకులుగా వాటిని ఆనందించి అనేకమందితో పరిచయాలు ఏర్పరుచుకున్నాం.
పంతులుగారికి టంగుటూరి ప్రకాశంపంతులు, తెన్నేటి విశ్వనాథం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కె. విజయభాస్కరరెడ్డి, బండారు రత్న సభాపతి, కాకాని వెంకటరత్నం. పి.వి.చలపతిరావు బాగా తెలుసు. కమ్యూనిస్టు నాయకులలో తరిమెళ నాగిరెడ్డి, సి.హెచ్. రాజేశ్వరరావు దగ్గరా తెలుసు. ఆ తరువాత కాంగ్రెసువారిలో కేంద్రరాష్ట్రాలలో తెలిసినవారు అసంఖ్యాకంగా ఉన్నారు. అఖిల భారత స్థాయిలో రాజగోపాలాచారి, మీనూ మసానీ, పీరూ మోడీ, హెచ్.ఎమ్.పటేల్, ఎన్. దండేకర్, ఆర్.సి.కూపర్, సంతోష్ బగ్వోడియా, దగ్గరగా తెలుసు.
1975లో పంతులుగారు యూరోప్, రష్యా పర్యటన చేశారు. అప్పుడు జర్మనీ పరిచయస్తులకు మీనూ మసానీ లేఖనిచ్చి, పంతులుగారికి తోడ్పడమని రాశారు. ఇంగ్లండు పర్యటనలో సహాయపడమని అక్కడి వారికి ఆచార్య రంగా లేఖ పంపారు. రష్యాలో పర్యటనకు ఇస్కస్ సంస్థ పంతులుకు సహాయం చేసింది. ఫ్రాన్స్ హాలండ్ తదితర దేశాలు చూచి విశేషాలు తెలుసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రకటించిన రోజులలో పంతులుగారు అలాంటి విదేశీ పర్యటన చేశారు.
సుప్రసిద్ధ సైంటిస్ట్ స్వామినాథన్ పంతులుగారికి ఎలా తెలుసు అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. హైదరాబాదులో స్వామినాథన్ తో సమావేశాలు ఏర్పాటు చేసిన ఘనత పంతులుగారిదే. ఆయనకు వ్యవసాయమంటే రైతుల సమస్యలంటే ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో నిపుణలుగా ఉన్న వ్యవసాయ సైంటిస్టులను గుర్తించి రాష్ట్ర ఫ్రభుత్వంతో వారికి సత్కారాలు అందించగలిగారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ గా చేసిన ఎమ్.వి. రావు ఎంతో ఆదరణగా పంతులుగారిని చూస్తారు.
పత్రికారంగంలోని ఎమ్.చలపతి రావు (నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు), న్యాపతి నారాయణ మూర్తి (ఆంధ్రప్రభ తొలి సంపాదకుడు – పాన్ సుపారీ శీర్షిక ద్వారా పాఠక లోకానికి సుపరిచితుడు), బి.ఎస్. ఆర్. కృష్ణ (ప్రసుతం మదరాసులో ఉంటున్నారు), వామన రావు (ఖాసా సుబ్బారావు అల్లుడు – న్యూ స్వరాజ్య సంపాదకుడు), ఆంధ్రపత్రిక విలేఖరి శర్మ (ముక్కు శర్మ అనేవారు), రాజేద్రప్రసాద్ (హిందూ పత్రికలో చనిపోయేవరకూ పనిచేశారు), నర్రావుల సుబ్బారావు (ఆలిండియా రేడియో, దూరదర్శన్ లో పనిచేశారు, ఇలాంటి మిత్రుల  జాబితా సుదీర్ఘంగా ఉన్నది.
కీర్తి శేషులు వి.వి.గిరి రాష్ట్రపతిగా పోటీ చేసినపుడు పంతులుగారు ఎన్నికల ఏజెంటుగా పనిచేశారంటే వినేవారికి వింతగానే ఉంటుంది. హైదరాబాదులో శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క వావిలాల గోపాలకృష్ణయ్య తప్ప గిరిగారిని సమర్థించడానికి ఎవరూ రాలేదని పంతులుగారు చెపుతుంటారు.
ఎమ్. రత్న స్వామి, వి.కె. సుందరం, హండే, మారిస్వామి మొదలైనవారు తమిళనాడునుండి పంతులుగారికి దగ్గర మిత్రులుగా ఉండేవారు. సంజీవరెడ్డి హైదరాబాదు వచ్చినప్పుడు పంతులుగారిని ఫోన్ చేసి సరోవర్ హోటల్ లో రూము అట్టి పెట్టమని చెపుతుండేవారు. 1955 ఎన్నికలలో ఐక్య కాంగ్రెస్ పక్షాన ఆచార్య రంగా సంజీవరెడ్డి ఒకే కారులో ఆంధ్రదేశమంతా పర్యటిస్తూ పంతులుగారినే వెంటబెట్టుకెళ్ళారు.
అలాంటి పంతులుగారికి నేటికీ సొంత ఇల్లు లేదు. ఏర్పరుచుకోవాలనే ఆసక్తీ లేదు. ఒకప్పుడు ఒక డొక్కు స్కూటరు మీద తిరుగుతూండేవారు. వృద్ధాప్యం వలన ఇప్పుడు సి.టీ.బస్సులలోనే వెళ్ళివస్తుంటారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోకి నిరాఘాటంగా ఎన్నోసార్లు వెళ్లివచ్చిన పంతులుగారు సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. విషయాలను విడమరచి చెప్పడంలో ఎన్నికల ఫలితాలు అంచనా వేయడంలో ఆయన వాస్తవ వాది.
-నరిసెట్టి ఇన్నయ్య

శనివారం, నవంబర్ 01, 2014

Trick or Treat


A residence decorated for Halloween in Denver, Colorado
Click on photos to enlarge

అమెరికా లో ఈ రోజు (31st October) ఏ వీధి కెళ్ళినా కొంచం సావధానంగా ఉండక తప్పదు. హాలోవీన్ పండగరోజు కదా మరి. మనం ఏ ఇంటిముందో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా వింత శబ్దం తో ఏ దెయ్యమో మన ముందు ప్రత్యక్షం కావచ్చు. గృహసముదాయాలుండే ప్రాంతాలలో ఎక్కువ ఇళ్ళముందు భీతి కలిగించేలా అస్థిపంజరాలు, గోరీల ముందుంచే రాతి పలకలతో అలంకరిస్తారు. ఆ రాతి పలకలపై రాతలు కూడా భయం కలిగించేలా ఉంటాయి. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ఈ హాలోవీన్ పండగ ను ఇక్కడి పిల్లలు మొదట సంచయించి, "అమెరికా పిల్లలు అడుక్కోరు" అని 1948 లో ఉద్యమం చేపట్టినా ఈ రోజు అది చిన్నపిల్లలందరకీ ఒక ఆటగా రూపాంతరం చెందింది.

                                ఈ సాయంత్రం దెయ్యాల పండగనాడు మా ఇంటికొచ్చిన చిన్నారి దేవతలు

ఈ రోజంతా పిల్లలు మన ఇంటి గంట మోగిస్తూ, తలుపు తెరవగానే "Trick or Treat" అంటూ ఊదరకొడ్తారు. ఇవ్వాళ సాయంత్రం  ఇంటి గంట మోగితే వెళ్ళి తలుపు తీయగానే ఇద్దరు చిట్టితల్లులు  Trick or Treat అంటూ పాట ఎత్తుకున్నారు. శ్రీమతి రమణ ఇంటిలోకి వెళ్ళి వారికోసం చాకొలేట్లు ఇంకా బిస్కెట్స్ తెచ్చి  వారికిచ్చాక వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాము. కొసమెరుపేమంటే ఇది జరిగింది అమెరికాలో కాదు, హైదరాబాదులో. ప్రపంచీకరణ మహత్యం మరి.

ఈ  Trick or Treat గురించి మరిన్ని వివరాలకై ఈ కింది గొలుసులో చూడవచ్చు.

blog.dictionary.com/trick-or-treat

Photos: cbrao
         

శుక్రవారం, అక్టోబర్ 31, 2014

సంజీవదేవ్ ఉత్తరాలు

తెలుగునాట, లేఖా సాహిత్యానికి గుర్తింపు, గౌరవం తెచ్చినవారిలో సంజీవదేవ్ ప్రముఖులు. తాత్వికుడు, బహుభాషాకోవిదుడు, చిత్రకారుడు, కళా విమర్శకుడు, రచయిత ఐన సంజీవదేవ్ ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, మానవవాది ఐన నరిసెట్టి ఇన్నయ్యకు వ్రాసిన 13 ఉత్తరాలు State Archives, Tarnaka లో భద్రపరచబడ్డాయి. వీటిలోంచి ఒక లేఖను సంజీవదేవ్ దస్తూరిలోనే పాఠకులకు అందచేయగలుగుతున్నందుకు ప్రమోదం.

Click on letter to enlarge and for comfortable reading.

  

బుధవారం, అక్టోబర్ 08, 2014

శాన్ ఫ్రాన్సిస్కోలో వో అర్ధ రాత్రి -నాకు నచ్చిన కవిత

నాకు నచ్చిన సుందర నగరం శాంఫ్రాన్సిస్కో. ప్రబంధ నాయికవలే మెలికలు తిరిగిన వంపులతో, ఎత్తు పల్లాలతో ఉండే శాంఫ్రాన్సిస్కో ఎవరికి నచ్చదు? పసిఫిక్ మహసముద్రపు రెండు తీరాలను కలిపే బంగరు ద్వారపు వంతెన* అందానికి ఎవరు దాసోహమనరు? న్యూయార్క్ లో పుట్టినా మధుర గాయకుడు టోనీ బెనెట్ తన హృదయాన్ని శాంఫ్రాన్సిస్కో నగరంలో పారేసుకోవటంలో ఆశ్చర్య మేముంది?

 “ శాన్ ఫ్రాన్సిస్కోలో వో అర్ధ రాత్రి “ కవితలో అఫ్సర్, మధుర గాయకుడు టోనీ బెనెట్ తో జత కలిసి యుగళగీతమే పాడాడు; శాంఫ్రాన్సిస్కో సొగసును నిందాస్తుతి లో స్తుతిస్తూ.

 1 “I left my heart in San Francisco…”
 టోనీ బెన్నేట్ అలా పిచ్చిగా పాడుకుంటూ వెళ్లిపోతున్నాడు

 ఇప్పటికీ ఈ రాత్రి కూడా
ఈ శాన్ ఫ్రాన్సిస్కో నీలి ఆకాశంలోంచి,
ఈ చలిగాలుల లేత చీకటి పొగమంచు మీదుగా.


శాన్ ఫ్రాన్సిస్కో లో పొగ మంచు కూడా అందానికి ఒక హేతువే. ఈ పొగమంచుతో పగలే వెన్నెల లాగా అనిపించటంలో వింతేమి ఉంది? బంగారు ద్వారపు వంతెన కూడా గాలిలో తేలియాడుతుంది; అదీ వేసవి మధ్యాహ్నపు పొగమంచులో.

 2 క్షమించెయ్ నన్ను, టోనీ!
 నీ పాటని పిచ్చిగా నమ్మి ఈ ఆఖాతానికి కొట్టుకొచ్చా,
 నువ్వు నక్షత్రాలకి కట్టిన కేబుల్ కార్లూ,
నీ నీలి సముద్రమూ
 నా రెప్పల కింద దాచుకోలేకపోతున్నా.
నీ ఇల్లు నాకు దీపాల్ని తోడుక్కొని
 తిరుగుతున్న అస్థిపంజరంలా అనిపిస్తోందని నేనంటే
 నా కన్నునే నువ్వు శంకిస్తావనీ తెలుసులే!

 ఆకాశం వైపు దూసుకెళ్ళే కేబుల్ కార్ల ఎత్తులు, పసిఫిక్ సముద్రపు లోతులు ఒక్క సారే చూడటం ఎంత కష్టం? ఎవరికైనా కుటుంబం ఎంతో ప్రీతిప్రాత్యం. ఆ కుటుంబం ఉండే ఇంటిగానే శాంఫ్రాన్సిస్కో నగరాన్ని టోనీ బెనెట్ భావించాడు. చీకట్లో దీపాల కాంతులలో మెరిసే నగరాన్ని అస్థిపంజరంతో పోలిస్తే టోనీ ఐనా మరెవరైనా కవి హృదయాన్ని శంకించక తప్పదుకదా!

 3 అస లే నగరమయినా ఎవరికయినా ఇల్లవుతుందా?

 ఏమో, ఈ డౌన్ టౌన్ గుండెల్లోంచి నడుస్తున్నప్పుడు
 శరీరాన్నీ, గుండెని కూడా
పొగ మంచు, చలి చినుకులు ముసురుకున్నట్టే వుంది.

 గరీబీకి ఏ రంగూ ఏ వాసనా వుంటాయో చూసిపోదువు కానీ,
వొక సారి ఇటు వచ్చి నీ పాటని
ఆ రంగులోంచి ఆ వాసనలోంచి వినిపించు టోనీ!
ఎక్కడో అతి ఏకాకినై ఇక్కడ తేలానని నువ్వు అన్నావే కానీ,

 నగరం నచ్చితే, మనసు మెచ్చితే అదే ఇల్లవుతుంది. సుందరవనమౌతుంది. నగర వీధులనిండా చలిపులి, పొగమంచులతో నిండిఉన్నాయి. ఇక్కడా బీదా-బిక్కి ఉన్నారు. టోనీ ఈ దారిద్ర్యం కన్నావా? నీ పాటలో ఆ దీనత్వం కనపడనీ. న్యూయార్క్ జనారణ్యం లో నువు ఏకాకినన్నా వు, కాని.....

 4 ఈ ఆకలి తగలబెడ్తున్న శరీరారణ్యంలో
 నీ పాట చమ్కీ దండలా మిలమిలా మెరుస్తోంది,
నీడలేని తనపు చీకటి నిజాన్ని దాచేసి!

 నీ / నా బంగారు వన్నె సూరీడు
 ఇక్కడా అంటరాని వాడే,
 ఎప్పటికీ.

 నగరపు నగ్నత్వాన్ని, ఆకలి దప్పులను, అంటరాని తనాన్ని నీ మధురమైన పాట చీకటిలా మింగేస్తుంది, మరుగున పడేస్తుంది.

 అమెరికా మేడిపండు లాంటిది. ఆకాశాన్ని చుంబించే భవంతులు, మిల మిలలు వెనుక అక్కడి లేమితనానికి అఫ్సర్ ఆర్ద్రతతో స్పందించిన వైనం మన మనసులని తాకుతుంది.

 * Golden Gate Bridge, San Francisco.

 -సి.బి.రావు

 నా గురించి: పక్షులు, ప్రకృతి, యాత్ర, ఛాయాగ్రహణం నాకు ఇష్టమైనవి. తీరికవేళల్లో నచ్చిన పుస్తకాలపై సమీక్ష వ్రాస్తుంటాను. దీప్తిధార, పారదర్శి పేరుతో తెలుగు బ్లాగులు నిర్వహిస్తుంటాను. నా రచనలు pustakam.net లో కూడా చూడవచ్చు. హైదరాబాదు నివాసం. సన్నివేల్ లో వీక్షణం నా చేతుల మీదుగా ఆవిష్కరణ అవటం ప్రమోదం.

 ఈ వ్యాసం వీక్షణం సాహితీ గవాక్షం, బే ఏరియా, శాం ఫ్రాన్సిస్కో, అమెరికా వారి ప్రత్యేక సంచిక సెప్టెంబర్ 2014 లో తొలి ప్రచురణ అయ్యింది.

శనివారం, అక్టోబర్ 04, 2014

అంతరిక్షం లో నేను

మనిషి ఎగరాలన్న తపనతో విమానం కనిపెట్టాడు. ఇప్పుడు ఖండాంతర యానం కొన్ని గంటలలో చేయగలుగుతున్నాము. ఆ తర్వాత.. మనిషి జిజ్ఞాస ఇంతటితో ఆగదు కదా! గ్రహాంతర యాత్ర. అపొల్లో గ్రహ సముదాయినికి చెందిన బెన్ను గ్రహానికి నాసా వారు OSIRIS-REx అనే అంతరిక్షవాహనం పంపుతున్నారు. ఇది బెన్ను గ్రహానికి వెళ్ళి అక్కడి భూమి నమునాలను గ్రహించి తిరిగి వస్తుంది. The Planetary Society లో నా పేరు నమోదు చేసుకొన్నాను. ఈ అంతరిక్ష వాహనం తో 2016 లో నా ప్రయాణం కూడా మొదలవుతుంది. బెన్ను లో 500 దినాలు గడిపి అక్కడి భూ నమునాలతో 2023 లో తిరిగి రాక. గమనించవలసిన విషయమేమంటే ఈ యాత్రలో నేనంటే నేను కాదు; నా పేరు బెన్ను గ్రహం దాకా వెళ్ళి తిరిగి వస్తుంది. ఆ తర్వాత కూడా చాలా కాలం అంతరిక్షం లో తిరిగే అంతరిక్షవాహనం లో నా పేరు ఉండగలదు. ఈ యాత్రలో నేను పాల్గొంటున్నట్లుగా The Planetary Society వారు పంపిన ధృవపత్రాన్ని జతపరుస్తున్నా -చూడగలరు.
అంతరిక్షయాన వివరాలకై చూడండి ఈ వెబ్ సైట్ http://www.asteroidmission.org మరిన్ని వివరాలకై ఈ కింది చలనచిత్రం చూడండి. http://youtu.be/U-VR6pNi70k