శనివారం, డిసెంబర్ 19, 2015

నండూరి పార్థసారధి గారితో ముఖాముఖి



డిసెంబర్ 13, 2015న కథాకుటుంబంవారి నెల నెలా జరిగే సమావేశం పాత్రికేయుడు, రచయిత నండూరి పార్థసారధి గారి ఇంట్లో జరిగింది. నం.పా.సా గారు తమ పాత్రికేయ జీవనం, విభిన్న రచయితలతో తమ అనుభవాలు ఇంకా రసమయి మాసపత్రిక నిర్వహణ దాకా పలు విషయాలు ముచ్చటించారు. తన నవల సాహిత్య హింసావలోకనం కొందరు రచయిత మిత్రులను ఎలా దూరం చేసిందో వివరించారు. ఈ పుస్తకం సమకాలీన రచయితలపై ఒక కొరడా దెబ్బ లాంటిది. హాస్య, వ్యంగ రసాలతో రచయితలను చీల్చి చెండాలిన రచనిది. ప్రతి రచయిత చదవతగ్గ పుస్తకం. రసమయి మాస పత్రిక సాహిత్య, సంగీత, చిత్రలేఖనం, నృత్యం, సినెమా ఇంకా అనేక ప్రత్యేక అంశాలపై దృష్టి పెట్టిన విశిష్ట పత్రిక. పత్రిక కు కావలసిన రచనలు అందక పోవటం తో, బాధాకరమే ఐనా  పత్రికను ముయ్యవలసి వచ్చిందన్నారు.

ఈ సమావేశం లో శ్రీయుతులు కస్తూరి మురళీకృష్ణ, సి.బి.రావుల మధ్య సమకాలీన సైన్స్ ఫిక్షన్ గురించిన ఆసక్తికరమైన చర్చ జరిగింది. మురళీకృష్ణ ఈ విషయంపై మాట్లాడుతూ తాను, డా.చిత్తర్వు మధు ఈ వర్గం లో పెక్కు రచనలు చేసి తెలుగు లో సైన్స్ ఫిక్షన్ లో అగ్రభాగాన ఉన్నామన్నారు. భవదీయుడు శ్రీయుతులు కె సదాశివరావు ఇంకా అనిల్ కె రాయల్ రచనలు చదివిఉన్నాడు కాని వీరి రచనలు ఇంకా చదివి ఉండలేదు. త్వరలో కుజుడికోసం చదవాలని, వీలైతే సమీక్షించాలని భవదీయుడి అకాంక్ష. తెలుగు సైన్స్ ఫిక్షన్ తీరుతెన్నెలు గురించి మీరేమనుకుంటున్నారు?      

ఈ సమావేశానికి రచయిత్రులెవరూ హాజరు కాలేదు.


చిత్రం లో ఎడమనుంచి శ్రీయుతులు జానకీరాం, వర్చస్వి, కస్తూరి మురళీకృష్ణ, నండూరి పార్థసారథి, వడ్డి ఓంప్రకాష్ నారాయణ్, ఇసనాక మురళీధర్ ఇంకా మురళీ మోహన్.

చిత్రం: cbrao