శనివారం, నవంబర్ 11, 2006

నా నెల్లూరు పర్యటన -5

సుకుమార రెడ్ది గారు సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటారు. రెడ్డి గారు మనుషుల మీదే కాదండోయ్, జంతువుల మీద కూడా అపారప్రేమ కురిపిస్తారు. నెల్లూరు జీవకారుణ్య సంఘం కార్యక్రమాలలో కూడా తమవంతు సేవలందిస్తారు. కులాసా కబుర్లయ్యాక, రెడ్డి గారికి నా అభినందనలు అందచేసాక, వారి పనుల గురించి వారి ముఖతా విన్నాను. ఆదివారం సభా కార్యక్రమ కరపత్రికలు వారికి రామకృష్ణగారు అందచేసారు. సభలో కలుస్తానని వారు వెళ్ళారు.

రామకృష్ణగారి కుటుంబం చిన్నది. వారి శ్రీమతి సుజనారామం అధ్యాపక వృత్తిలో ఉండి, ఆరోజు అధ్యాపకుల శిక్షణా తరగతులకు వెళ్ళారు. రామకృష్ణగారి మాతృమూర్తి కమలమ్మగారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. రామకృష్ణ గారికి ఇద్దరు ఆడపిల్లలు. ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు. ఉదయం అల్పాహారం అయ్యాక కార్యాలయంలో ఏదో ముఖ్యమైన పని ఉందని రామకృష్ణగారు వెళ్ళారు. ప్రశాంతి తను గొలగమూడిలో ఉన్న అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించటానికి వెళ్లాలని, నాకు వేరే కార్యక్రమం లేనందువలన నన్ను కూడా రమ్మన్న ఆహ్వానంపై ఇరువురమూ గొలగమూడి ప్రయాణమయ్యాము.


Photo:cbrao

శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి

గొలగమూడి ఒక కుగ్రామం.నెల్లూరుకు సుమారు 10 కి.మీ ల దూరంలో ఉంది. హైదరాబాదులో చిల్కూరుకు ఎంత ప్రాచుర్యం ఉందో నెల్లూరులో గొలగమూడికీ అంతే ప్రాచుర్యముంది. నెల్లూరు నుంచి మంచి రవాణా సదుపాయముంది. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివాడు.12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు ఇచ్చాడు. దారాలు ఇచ్చాడు. ఆ తరువాత వాక్కు చెప్పాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన, భక్తుల నుద్దేశించి, వారికోసం తన సందేశాలను, తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు, స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. భక్తులు వీరిని షిర్డి సాయి అవతారముగా భావిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు వీరిని అవధూతగా కొలుస్తారు. మరికొందరు వెంకయ్య స్వామిని దత్తావతారమని తలుస్తారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దెవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి. ఈ దేవాలయ అభివృద్ధికి హీరో చిరంజీవి విరాళం తోడ్పడిందని చెప్తారిక్కడివారు. దేవాలయ ప్రాంగణం అనేక వ్యాపార దుకాణాలతో నిండి ఉంది. షిర్డి గ్రామం సాయినాధుడు లేకుండా మనజాలదు. గొలగమూడి గుడి కూడా అట్లే, ఎటుచూసినా అన్ని దుకాణాలు, వెంకయ్య పేరుపైనే ఉంటాయి. వ్యాపారం, ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయాయీ ఊళ్ళో.


Photo:cbrao

సశరీరంతో ఉండి ఎన్ని పనులు చెయ్యగలరో అశరీరంతో కూడా అన్నే పనులు చెయ్యగల మహిమాన్వితులను అవధూతలంటారు. వారు భక్తుల కొంగుబంగారమై నిరంతరమూ వారికి రక్షగా ఉంటారు. ఎన్ని సమస్యలు, రుగ్మతలున్నప్పటికీ, అవధూత సాన్నిహిత్యంలో భక్తులు ఎంతో మానసిక ప్రశాంతత పొందుతారు. వారికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రశాంతికి ఈ స్వామిపై గురి మెండు. గుడిలోకి వెళుతూనే అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణం గావించాము. ఇక్కడ అహర్నిశమూ అగ్ని వెలుగుతూనే ఉంటుంది. తదుపరి దేవాలయము చుట్టూ ఒక ప్రదక్షిణ గావించి వెంకయ్యస్వామి దర్శనం చేసుకున్నాం. గుడి లోపల చాలామంది స్త్రీలు పుష్పాలను మాలలు కడుతున్నారు. భక్తులెవరైనా లోపలకు వెళ్ళి మాలలు కట్టవచ్చని ప్రశాంతి చెప్పారు. తను దేవుని చుట్టూ ప్రదక్షిణలు గావించవలసి ఉన్నందున, నన్ను ఆ పూలవాటిక దగ్గర నిరీక్షించమని చెప్పారు. నిరీక్షిస్తూ చుట్టూ పరికించి చూశాను. దేవాలయ కుడ్యాలపై రాసిన వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులు నన్నాకర్షించాయి. మీరూ చదవండి.

1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.

2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.

3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.

4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.

5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.

6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.

7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.

8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేది గదయ్యా.

9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.

10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.

11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.

12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.

13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.

15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.

16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.

17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.

18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.

19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.

20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.వెంకయ్యస్వామి ఆలోచనాధారతో, ఊర్ధ్వ లోకాలలో విహరిస్తున్న నా మనస్సును, వెళ్దామా అన్న ప్రశాంతి పిలుపు, ఇహలోకంలోకి తెచ్చింది. గుడి పక్కనే ఉన్న శిష్యుల సమాధులను దర్శించి, స్వామి వారి కుటీరం చూడటానికి వెళ్ళాము. స్వామి వారి చిన్న ఆవాసాన్ని అలాగే ఉంచి దానిపై నూతన భవన నిర్మాణం చేశారు. ఇక్కడే మేము స్వామివారి శిష్యులు గురవయ్య స్వామివారిని దర్శించాము. మరలా గుడి ప్రాంగణంకి వచ్చి పాదరక్షలు సేకరించుకుని వస్తూ అక్కడే వున్న పుస్తకాల దుకాణంలో వున్న పలు పత్రికలు, స్వామిపై ఎక్కిరాల భరద్వాజగారు రాసిన పుస్తకం చూశాము. వెంకయ్య స్వామిపై వెలువడుతున్న సద్గురు కృప అనే ఆధ్యాత్మిక మాస పత్రిక కూడా అక్కడే చూశాము. శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర మరియు లీలల వివరాలకై చూడండి...
http://www.saimastersevatrust.org/Books/Pdfbooks.html

ఆ రోజు శనివారము అవటము వలన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు అక్కడే ఉచిత భోజన సౌకర్యమున్నప్పటికీ, రామకృష్ణగారు మాకై నెల్లూరులో వేచిఉన్నారు కావున, అక్కడ భోజనం చెయ్యకుండానే తిరుగు ప్రయాణమయ్యాము. ఆ ప్రయాణ సమయంలో ప్రశాంతి తాను వెంకయ్య స్వామితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటానని చెప్పి, నన్ను ఆశ్చర్యానికి గురిచేశారు.

14 వ్యాఖ్యలు:

నాగరాజు చెప్పారు...

ఇంత చక్కటి వ్యాసం వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ వెంకయ్య స్వామి గురించి ఇంకా వివరాలు ఏమైనా ఉంటే, తప్పకుండా వ్రాయగలరు.

cbrao చెప్పారు...

శ్రీ వెంకయ్య స్వామి గురించి సుబ్బరామయ్య గారు ఆంగ్లం లో రాసిన పుస్తకంలో మరింత సమాచారం లభ్యమౌతుంది. ఉచితంగా download చేసుకోండి. http://www.saimastersevatrust.org/Books/EnglishSmall.pdf

T.Balasubrahmamyam చెప్పారు...

ఒక చిన్న సవరణ. వెంకయ్య స్వామివారు ఎప్పుడూ పిచ్చివాడు కాడు.ఆయన తత్వం అర్థం కాని అక్కడి ప్రజలు ఆ రోజుల్లో అలా అనుకున్నారు. ఆయన గురించి నేను త్వరలో నా "తెలుగు సాహిత్యం" బ్లాగులో రాయబోతున్నాను.(ఒక పుస్తక సమీక్షలో ప్రాస్తావికమైన భాగంగా)

అజ్ఞాత చెప్పారు...

మానవుడు నిజమైన మానవుడిగా ప్రవర్తించినా, నిజమైన మానవత గురించి చెప్పినా...వెంటనే వాడిని భగవాన్ ఎందుకు చేసెస్తారో నాకర్ధం కాదు. బహుశా 3012 వ సంవత్సరంలో దొంగతనం మహా పాపంఆనీ, భార్యను ప్రేమించాలని చెప్పనా వాడు భగవంతుడు అయిపోతాడేమో...

మనిషిని మనిషి గా గౌరవించండి, మానవ ఔన్నత్త్యం ఈ వెంకయ్య గారు చెప్పిన కంటే కూడా మహత్తరం గా ఉంటుంది. ఈ రకంగా చూస్తే మదర తెరిస్సాకు, గాంధీకి ఎప్పుడో దేవాలయాలు కట్టెయ్యాలి..

శిఖరం పై నుంచి పడబోయే వాడు పురికొసనే దేవుడనుకుంటాడు.

Rama Krishna చెప్పారు...

rao gaaru,
mee write ups chhala baagunnai.
manchi travel recorder meeru.
Venkayya swami gurinchi teliyachappadam baagundi.
all the best
ramakrishna

అజ్ఞాత చెప్పారు...

Venkayya sami gurunchi chalabagavrasru meru.inka mari konnililalu add cheyandi adhi andharu telusukogalaru.

Thabks
Srikanth reddy
POdili
Prakasam (d.t)-523240

srikanth reddy చెప్పారు...

Meru inka develope cheyandi websiteni.

సత్యసాయి కొవ్వలి చెప్పారు...

రావుగారూ, మంచి యాత్రావిశేషం. 18 వ వచనం మీరు ఖచ్చితంగా పాటిస్తున్నారని తెలుగుబ్లాగు గుంపులో మీ పోస్టులు చెప్తున్నాయి :))

cbrao చెప్పారు...

ఎప్పుడో రాసింది ఇన్నాళ్ళకు చదివారంటే వెంకయ్య స్వామే మిమ్మలను అక్కడకు రప్పించి ఉంటాడు. స్వామి చెప్పిన 18 వ వచనం " దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా" - చాన్నాళ్ళ తరువాత, తెలుగు బ్లాగుల పాత జాబులు చదివే వారి అయోమయాన్ని తొలగిస్తుంది. " వెంకయ్య స్వామి ' అనే పదాన్ని search చేసి ఈ వ్యాసం చదువుతున్నవారు తరచుగా కనిపిస్తారు. Google search results లో ఈ వ్యాసం ప్రధమంగా నిలుస్తుంది ఈనాటికీ. దీప్తిధారను చదివే వారు నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నారు. (Statisticks from Site Meter) అంతా వెంకయ్య మహత్యం.

Sarada చెప్పారు...

namasthe, swami gurinchi andarikee telicheppe mee prayatanm chala bagundhi. venkayyaswami pilisthe palike daivam .ayan nani pichi vadu ani antam tagadhu. Avadhootalu pichivarilaga unmadhululaga pasipillalulaga untaru ani gurucharitralo undhi.so ela choosukunna ayan avadhootha.He is a self realised soul and he is the God himself.Ikkada evarini badithe varini demudini cheyatam enti ?? asalu andaroo demulle...every one is god according to Bhagavat gita. The one who can see this is self realised an dwho cant see this is human, the one who is trying to see this is Mumukshu. well thanks anyway for a nice article.

అజ్ఞాత చెప్పారు...

Dear Sir,

Your writing style is very attractive. Thanks for attempting to share your thoughts on & experience with Sri Swami. I request you to kindly read Sri Avadhuta Leela by Sri P.Subbaramaiah or the book written by Sri E.Bharadwaja master and post more things and details on swami here. Please do update and do more postings on Swami after reading the above books. Many people can get to know swami through your postings.

Thank you again.

ras చెప్పారు...

శ్రీ రావ్ గారూ,
నమస్కారములు. వెంకయ్య స్వామిగురించి ఎంతఎక్కువమందికి తెలియచేస్తే అంతమందికి ప్రయోజనకరం గా ఉంటుంది. మానవజాతినికాపాడగలిగే ఆ మహనీయుని గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. దేవుడు ఈ సత్కార్యాన్ని కొనసాగించగలిగేశక్తి, సామర్థ్యాలు మీకు ఇచ్చి కాపాడుగాక.
ఇట్లు
శ్రీ స్వామి వారి పాదరేణువు
రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ప్రిన్సిపాల్, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఆదోని, కర్నూల్ జిల్లా.
ఆదోని,
౧౪-౩-౨౦౦౩

durgeswara చెప్పారు...

daaram tegakumdaa gattigaane vunnadi.venkayyatata chetilo

Rayapeddi Vivekanand చెప్పారు...

It's a good effort. However why you tried to attribute unnecessary credit to hero Chiranjeevi?
Bhagavan Venkayya Swamy is "Sakshath Dattavataram". there is no need of any special introduction to him.
two aspects you should have avoided is
1) base less remark regarding chiranjeevi's donation. The temple is developed by devoted followers like Tulasamma avva and many more devotees. there is no role of so called hero. Swamy does not require any hero's endorsement. OK.
2)Why you tried to co-relate this temple to Chilukuru?-
Chilukuru is not the first temple which introducted 108 pradakshinas. It has been an age old practice in datta sampradayam.
I have my own reservations against chilukuru. If you are interested I will let you know.
Golgamudi does not requrie cheap marketing gimmicks like Chilukur temple. Here no priest will be shouting through mike against the government. Chilukuru is a place where couple of priests are trying to eat away the entire money.
Dont compare Golagamudi with chilukuru.
I appreciate your effort, but it lacks research. Try to understand datta sampradayam, then try to understand the real power of Golagamudi venkayya swamy. Then write.
Dont hurt the sentiments of the real devotees
Vivekanand

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి