గురువారం, ఫిబ్రవరి 28, 2013

మరణానంతరం జీవించటం ఎట్లా?

                              సమాధులు, డాలి సిటి, సాన్ ఫ్రాన్సిస్కో     చిత్రం: సి.బి.రావు

రచయిత/బ్లాగర్ కు మృత్యువుంటుందా? సమాధానంగా అవును/కాదు అని చెప్పాల్సుంటుంది. బ్లాగర్ చనిపోతే అతని బ్లాగులేమవుతాయి? ట్విట్టర్ ఖాతా ఏమవుతుంది? ఫేస్ బుక్ ఖాతా నిద్ర పోవలసిందేనా? బ్లాగర్ చనిపోయిన విషయం అతని ఫేస్ బుక్ మిత్రులకెలా తెలుస్తుంది? ఒక రచయిత తన జీవిత కాలంలో కొన్ని విషయాలు దాచిపెట్టి తన మరణాంతరం మాత్రమే ప్రజలకు చెప్పాలంటే, ఏమి చెయ్యాలి? డిజిటల్ యుగంలో ఇవి రచయితలముందున్న పెను సవాళ్ళు.

 అయోధ్యలో బాబ్రి మసీదు విధ్వంసం ఎలా జరిగింది? దానికి బాధ్యులెవరు? ఇలాంటి సున్నితమైన విషయాలను తను జీవించి ఉండగా స్వర్గీయ పి.వి.నరసింహారావు చెప్పలేదు. అయితే తన మరణాంతరం వెలువరించిన అయోధ్య డిసంబర్ 6, 1992 పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర, ట్వైన్ కోరికపై తన మరణాంతరం 100 సంవత్సరాల తర్వాత ప్రచురించబడింది.

 మృత్యువును ఎవరూ ముందుగా ఊహించలేరు, కాన్సర్ రోగులు తప్ప. మన కళ్ళముందే అహ్మెడాబాద్, ముంబాయి, పూనె,బెంగళూరు, కొత్త డిళ్లి ఇంకా హైదరాబాదు నగరాలలో విధ్వంసకారుల చే పేల్చబడిన బాంబుల వలన జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మనము చూశాము. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో చెప్పలేము. ఆరొగ్య కారణాల వలన ఐతే ఏమి, టెర్రరిస్ట్ కార్యక్రమాలవలన ఐతే నేమి మృత్యువును ఎవరూ ఊహించలేరు.

 రచయిత తన రచనల ద్వారా చిరంజీవై ఉంటాడు. మరణానతరం నేత్ర దానం, శరీర దానం వలన కూడా మనిషి జీవిస్తాడు. తన వారసులకు, ఇష్టమైన వారికీ వీలునామా వ్రాసి తన ఇష్ట ప్రకారం ఆస్తి పంచవచ్చు. ఇహ మిగిలింది తన e-mail, బ్లాగ్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాలు. వీటిని కొనసాగించటం ఎట్లా? దీనికీ ఉపాయం ఉంది. ఫేస్ బుక్ లో If I Die మరియు DeadSocial లాంటి అప్లికేషన్స్ లభ్యమవుతున్నాయి. వీటి ఖాతాదారులు తమ మరణాంతరము ఉపయోగించుకునేలా పెక్కు సౌకర్యాలు కల్పించారు. ఈ అప్లికేషన్స్ బ్లాగరు మరణ వార్తను Facebook, Twitter & Linkedin ఖాతాలలో తెలియ చేస్తాయి. బ్లాగర్ తుది సందేశం లేక అతను చెప్పాలనుకున్న విషయాలను నిర్ణీత సమయాలలో అందచేస్తాయి. ఎవరు ఇంతవరకు చూడని దృశ్య, శ్రవణాలను తమ పాఠకులకు అందచేస్తాయి. ఫేస్బుక్ లో ఖాతా లేని వారికి కూడా ప్రత్యేక సందేశాలు అందించే సదుపాయం కూడా ఉంది. బ్లాగరు తన సంతానానికి, భార్యకు కూడా వ్యక్తిగత సందేశాలు పంపవచ్చును. భార్యకు వ్రాసే ఉత్తరంలో ఆస్తిపాస్తుల వివరాలు, జీవిత భీమా పాలసీ, బాంక్ లాకర్ ఇంకా వీలునామా వగైరా వివరాలు తెలుపవచ్చును. మనమలు, మునిమనమలకు ప్రతి సంవత్సరము వారి పుట్టిన రోజున తన సందేశాన్ని పంపవచ్చు; వారికి యుక్త వయస్సు వచ్చేదాకా. తన రచనలను, తన మరణానంతరం ప్రచురించాలనుకుంటే, కంప్యూటర్లో, ఒక ఫోల్డర్ లో, వాటిని భద్రపరచి, దాని రహస్య సంకేతపదం (పాస్వర్డ్) తన ట్రస్టీల కిచ్చి ఎప్పుడు వాటిని ప్రచురించాలో సూచింపవచ్చు.

 ఈ సదుపాయం చెడుగా ఉపయోగించకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. బ్లాగరు మరణాన్ని తన మిత్రులు ధృవీకరించాక మాత్రమే ఈ అప్లికేషన్స్ తమ సేవా కార్యక్రమాలు మొదలు పెడ్తాయి. బ్లాగర్ తన తదనంతరం ఎవరికి ఎలాంటి సందేశాలు పంపాల్సింది నిర్ణయిస్తాడు. తన ట్రస్టీల ద్వారా బ్లాగు వగైరా ఖాతాలను తొలగించాలనుకుంటే ఆ పని కూడా సాధ్యమవుతిందిప్పుడు.

ఇవి కూడా చూడండి.  Legacy Locker, Futuris.tk, Deathswitch, AssetLock. వీటిలో మీకు అనువైన ఖాతాను ఎంచుకొనవచ్చు.

2 వ్యాఖ్యలు:

innaiah చెప్పారు...

This is very sensible information in the internet age. Hope it will be utilized. Humanists, rationalists, skeptics, agnostics will like such sane approach. It will also avoid blind beliefs, superstitions and false religious promises by priestcraft
Innaiah Narisetti

ప్రేరణ... చెప్పారు...

చక్కని ఉపయుక్తకరమైన పోస్ట్.....ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి