Participants in the family meet of rationalists: Smt Lakshmi Nageswar, Shariff Gora (Standing),
Dr Om Prakash and Srinivas Jodavula
మానవ వికాస వేదిక వారి కుటుంబ సమావేశం "కలుసుకుందాం -తెలుసుకుందాం- కలిసి భోంచేద్దాం" అక్టోబర్ 20, 2013 ఆదివారం శ్రీమతి లక్ష్మి నాగేశ్వర్ గారి జూబిలీ హిల్స్, హైదరాబాదు నివాసం లో జరిగింది. ఈ సమావేశం లో సుమారు 40 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరిలో హేతువాదులు, నాస్తికులు ఇంకా కులరహిత సమాజం కోసం కృషిచేసే కార్యకర్తలున్నారు. ఈ కార్యకర్తలు, ఇలాంటి విశ్వాసాలు ఉన్న వ్యక్తులు మన సమాజం లో తక్కువ. అమెరికా లో ప్రజాదరణ పొందిన "You are not alone" కార్యక్రమంతో, ఈ కార్యక్రమం పోలి ఉంటుంది. హేతువాదులు, నాస్తికులు ఇంకా కులరహిత వివాహం చేసుకున్నవారిలో ఈ కార్యక్రమం ఆత్మస్థైరాన్నిస్తుంది. నేనొక్కడినే ఇలా ఆలొచించటంలేదు - నాకు తోడుగా ఎందరో ఇలానే ఆలోచిస్తున్నారన్న భావన మరింత ఉత్సాహంగా ఈ భావజాలం లో కొనసాగటానికి కావల్సిన శక్తినిస్తుంది.
A section of the participants: First row Right to left: cbrao, Nelson Rushdie and family members
నిజానికి నేడు సమాజం లో అవాంఛిత కులవ్యామోహం పెక్కు సమస్యలను, అసమానతలను, అంటరానితనాన్ని సృష్టిస్తుంది. కాలేజీలలో కులాల పేరున విహారయాత్రలు విద్యార్థులలో విభజనకు కారణభూతమవుతున్నాయి. రాజకీయాలు కూడా కులప్రాతిపదికిన జరుగుతున్నాయి. కాలం చెల్లిన ఈ కులవ్యామోహానికి అడ్డుకట్ట వేయవలసిన సమయం ఆసన్నమైంది. శ్రీమతి లక్ష్మి నాగేశ్వర్ గారి గారి భర్త శ్రీ వి.నాగేశ్వర్ గోరా గారి శిష్యుడు ఇంకా లవణం మిత్రుడు. ఆయన నాస్తికుడు, హేతువాది ఇంకా మానవవాది. భార్యా భర్తలిరువురూ కులనిర్మూలన సంఘం లో కింద నుంచి పై స్థాయి వరకు పెక్కు పదవులు లో పనిచేశారు. నాగేశ్వర్ గారి మరణం తర్వాత కూడా శ్రీమతి లక్ష్మి కులనిర్మూలన సంఘ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వర్ణాంతర వివాహ వేదిక స్థాపించి పెక్కు కులాంతర వివాహాలు జరిపించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి సమాచారం సేకరించి AP Casteless Couples Directory ను, లవణం సహకారంతో ప్రచురించారు. ఈ పుస్తక పరిచయం దిగువ అంతర్జాల గొలుసులో చూడవచ్చు.
కుల నిర్మూలన ఆవశ్యకతను వివరిస్తూ కీ||శే డి.జి.రామారావు "కులరహిత సమాజం" అనే పుస్తకాన్ని వ్రాసారు. ఈ పుస్తక పరిచయం దిగువ అంతర్జాల గొలుసులో చూడవచ్చు.
కులరహిత సమాజం, AP Casteless Couples Directory పుస్తకాలు చదవగోరే వారు contact@vikasadhatri.org కు జాబు వ్రాస్తే download Link పంపిస్తారు.
AP Casteless Couples Directory పుస్తకాన్ని ఈ కింది గొలుసు నుంచి కూడా దిగుమతి చేసుకొనవచ్చు.
కులరహిత సమాజం కోసం శ్రమించి, కృషి చేసిన వారిలో పెరియార్ రామస్వామి నాయకర్ ప్రముఖంగా ఉంటారు. వీరి జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘పెరియార్ రామస్వామి నాయకర్’ సినిమాను ఈ దిగువ గొలుసులో చూడవచ్చును.
ఈ రోజు కార్యక్రమంలో స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని తమ జీవిత అనుభవాలను క్లుప్తంగా చెప్పారు. ఇంతమంది కులరహిత వివాహం చేసున్నవారిని, హేతువాదులను, నాస్తికులను ఒకే చోట చూడటం ప్రమోదం.
Nelson Rushdie -Idi Nijama?
పరిచయాలు, భోజనాలు అయ్యాక, సమావేశానికి వచ్చిన రచయిత, చిత్రకారుడు, సంఘసేవకుడు ఐన నెల్సన్ రష్డీ తాను రచించిన "ఇది నిజమా?" (ప్రధమ భాగం) పుస్తకాన్ని సభికులకు ఉచితంగా అందచేసారు. ఇది బైబుల్ పై వివరణాత్మక విమర్శనా గ్రంధం. ఈ పుస్తకం పై సమీక్ష దిగువ గొలుసులో చదవండి.
జన విజ్ఞాన వేదిక, రాష్ట్ర కార్యనిర్వాహక సమన్వయకర్త ఐన టి.వి.రావు ప్రశ్న ఎందుకు అనే విషయం పై వివరించారు. ప్రశ్న వల్ల ఆలోచన, హేతువాద దృక్పధం అలవడగలవని విపులంగా వివరించారు. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ప్రొత్సాహించాలన్నారు. ఆ తర్వాత నెల్సన్ రష్డీ (http://nelsonrushdie.blogspot.in/p/contact.html) మాట్లాడుతూ జీవితాన్ని నాలుగు ఘట్టాలుగా విభజించిస్తే అవి ఎలా ఉంటాయో చమత్కారంగా చెప్పారు. వారి చమత్కారం దిగువున చదవండి.
బాల్యంలో చిగురు
కౌమార్యంలో వగరు
యవ్వనంలో పొగరు
వృద్ధాప్యంలో సుగరు
టి.వి.రావు ప్రశ్నించే తత్వం పై ఆసక్తికర క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. మొదట ఒక కలం చూపించి దానిపై ప్రశ్నలడగమన్నారు. తరువాత దేవుడు అనే అంశం పై ప్రశ్నలడగమన్నారు. ఆ బాల గోపాలం ఉత్సాహంగా ప్రశ్నలు సంధించారు. 1 దేవుడి చిరునామా ఏమిటి? 2 దేవుడి లింగమేమిటి? 3 దేవుడు రోజూ షేవ్ చేసుకుంటాడా? 4 దేవుడి కులమేది? 5 దేవుడు ఏ రంగులో ఉంటాడు? 6 దేవుడికి ఎన్ని భాషలొచ్చు? 7 సృష్టి ముందా? లేక దేవుడు ముందా? ఇలాంటి ప్రశ్నలు 60 పైనే అడిగారు. బి.బి.షా కార్యక్రమ సమన్వయకర్తగా ఉండి ఎక్కువ ప్రశ్నలడిగిన కుమారి స్ఫూర్తిని విజేతగా ప్రకటించారు. స్ఫూర్తి తనకు బహుమతిగా వచ్చిన రూ.100/- ను మానవ వికాస వేదిక 28, 29 డిసంబర్ 2013 న, బాటసింగారం, హైదరాబాదు లో నిర్వహించే 4వ రాష్ట్ర మహాసభ నిధి కి విరాళంగా ఇచ్చింది.
తరువాత టి.వి.రావు సభికులకు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి "మానవ పరిణామంలో మతము-సైన్స్" అనే Audio Cd ని పరిచయం చేశారు. దీనిని సెప్టెంబర్ మాసంలో రోహిణీప్రసాద్ గారి వర్ధంతిసందర్భంలో ఆవిష్కరించారు.
పిల్లలు పెరిగే విధానాన్ని బట్టే హేతువాదాన్ని తగుశాతం లో గ్రహిస్తారు. పిల్లలను స్వేచ్ఛగా పెరగనిచ్చి, యుక్తవయస్సు వచ్చాక దేవుని గురించిన అభిప్రాయాలు సొంతంగా (తల్లి తండ్రుల ప్రభావం లేకుండా) ఏర్పర్చుకునేలా పెంచాలి, అని, కె.వి.రాజు (మానవ వికాస వేదిక) పిల్లల పెంపకం పై సూచనలిచ్చారు.
ఈ కార్యక్రమంలో షరీఫ్ గోరా, విక్రం, గుత్తా, సి.బి.రావు, జోడావుల శ్రీనివాస్, డా|| ఓం ప్రకాష్, హనుమంతరావు ప్రభృతుల కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి