సోమవారం, డిసెంబర్ 11, 2006

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం డిసెంబరు 2006

త్రివిక్రమార్కీయం
Topic of the meet: అత్యుత్తమ బ్లాగు టపాలను పుస్తకరూపంలో ప్రచురించడం.

BE1
Trivikram at entrance: ‘Hello Veeven’

ముందు నిర్ణయించినట్లుగానే హైదరాబాదు పుస్తకమేళా ప్రవేశద్వారం దగ్గర కలుసుకున్నాం. నాలుగ్గంటల వరకు ఎదురుచూసినా కొత్త సభ్యులెవరూ రాలేదు. సరిగ్గా అపుడే వీవెన్ ఫోన్ చేసి రాలేకపోతున్నానని తెలపడంతో అక్కడి నుంచి బయలుదేరి ఈట్స్ట్రీట్కెళ్ళాం.. చావా కిరణ్ పోస్టర్లు ప్రింటు చేశాడట కానీ తన పెళ్ళిపనులతో తీరిక లేకపోవడం వల్ల వాటిని సమావేశస్థలికి చేర్చలేకపోయాడు. సుధాకర్ ఇచ్చిన "వందటపాల పార్టీ" తీసుకుని మాటల్లో పడ్డాం.

హర్ష "ఏ దేశమేగినా ఎందు కాలిడినా" మనకు మొదట గుర్తింపునిచ్చేది భాషేనని, మాతృభాషను నిర్లక్ష్యం చెయ్యడమంటే మన గుర్తింపును (identity) కోల్పోవడమేనని అన్నాడు. పుస్తకమేళాలో కొన్ని "బయటివనరులు" సేకరించిన హర్ష వాటిలోని సమాచారాన్ని త్వరలో వికీపీడియాలోకి ఎక్కించగలడని ఆశించవచ్చు. వికీపీడియా విశ్వసనీయత గురించి సుధాకర్ "వికీపీడియా బలమే దాని బలహీనత" అని అభిప్రాయపడ్డాడు. రక్షిత వ్యాసాల్లో తప్ప మిగిలిన వ్యాసాల్లో ఎవరుపడితే వారు ఏ మార్పులైనా చెయ్యగలిగే వెసులుబాటు ఉండడం వల్ల నిర్వాహకులు నిరంతరం అత్యంత జాగరూకులై ఉండవలసి వస్తోందని, వారు ఏ మాత్రం ప్రమత్తులైనా తప్పుదోవపట్టించే/తప్పుడు సమాచారం చలామణీ అయ్యే ప్రమాదముందని అభిప్రాయపడ్డాడు. ఎవరైనా వికీపీడియాలోకి లాగిన్ అయితే తప్ప మార్పులు చేసే అవకాశం లేకుండా ఉంటే బాగుంటుందేమో?
భాస్కరరావు గారిలాంటి ఉత్సాహవంతులు, సుధాకర్ లాంటి కాకలుతీరిన బ్లాగరులు సైతం చురుగ్గా తెవికీలో ఎందుకు రాయలేకపోతున్నారు? అనే ప్రశ్నకు సుధాకర్ WYSiWYG కు అలవాటుపడిన వారికి వికీపీడియా గందరగోళంగానే ఉంటుందని, వికీ ఫార్మాటుకు అలవాటుపడడం కొద్దిగా కష్టమేనని అన్నాడు. సుధాకర్ వేసిన అనుబంధప్రశ్న: తెవికీలో యాధృచ్చిక పేజీ నిజంగానే యాధృచ్చికమేనా? అని. ఎందుకంటే ఎప్పుడు యాధృచ్చికపేజీని నొక్కినా ఏదో ఒక గ్రామానికే వెళ్తోంది. అది ఏదో ఒక గ్రామానికో, పల్లెలు బోరు కొడితే సినిమాకో వెళ్ళడం ఆశ్చర్యమేమీ కాదని, ఎందుకంటే తెవికీలో అత్యధిక వ్యాసాలు వీటి గురించే ఉన్నాయని రమణ, హర్షలు వివరించారు.

ఇక అతి ప్రధాన అంశం అత్యుత్తమ బ్లాగు టపాలను ప్రచురించడం: విహారి చెప్పిన మాసపత్రిక ఆలోచన ఆచరణయోగ్యం కాకపోయినా సంవత్సరానికి ఒకసారి అత్యుత్తమ బ్లాగుటపాలను ఏర్చికూర్చి ఒక పుస్తకం తీసుకురావడం మంచిదనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీనికి స్పాన్సరర్ల కోసం ప్రయత్నిస్తామని సమావేశ వివరాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న చావా కిరణ్, చదువరి తెలిపారు. ఐతే దానికంటే ముందు కంప్యూటరుకు తెలుగు నేర్పడం గురించి, తెలుగువికీపీడియా గురించి, తెవికీలో ప్రతి ఒక్కరూ రాయవలసిన ఆవశ్యకతను గురించి, తెలుగుబ్లాగుల గురించి పరిచయవ్యాసాలనే ఒక చిన్న కరదీపిక లాగ ప్రచురించి వీలైనంత ఎక్కువమందికి - అన్ని వర్గాల పాఠకులకు, విద్యార్థులకు, విశ్వవిద్యాలయాలకు చేర్చడం - అవసరమని భావించాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను రావుగారు తెలియజేస్తారు.
ప్రచురణార్హమైన బ్లాగుటపాల ఎంపిక: ప్రతి తెలుగుబ్లాగరిని తన బ్లాగుల్లో నుంచి అత్యుత్తమైనవని తాను భావించిన టపాలను (తన స్వంత రచనలై ఉండి, ప్రచురించడానికి అభ్యతంతరం లేనివి) ఐదుకు మించకుండా ఎంపిక చేసుకోమనడం, అలా వచ్చిన టపాలను ఓటింగుకు పెట్టడం ద్వారా తుది ఎంపిక చేయడం ఒక మార్గం.
మీ మీ సలహాలు, సూచనలు తెలుపగలరు.
ఇతర విషయాలు అనేకం మాటల్లో చోటుచేసుకున్నాయి. తెలంగాణా గురించి, ప్రజాస్వామ్యం గురించి, అమల్లో కొనసాగుతున్న కాలం చెల్లిన, అర్థరహితమైన చట్టాల గురించి, హైదరాబాద్ పక్షిప్రేమికుల పక్షివీక్షణ పోటీ గురించి, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల గైడెడ్ టూర్ల గురించి, స్థాయి తగ్గిన 'రచన' గురించి, ఇలా...
Text: Trivikram Photos: cbrao

రాయని భాస్కరుడు
తెలుగు పరిమళ వ్యాప్తికై చర్యలు

ES
Eat Street-Subway- ఎడమనుంచి కుడివైపుకు త్రివిక్రం, సుధాకర్, హర్ష, రమణ.


Hyderabad Necklace Road లోని Eat Street Food Joint ఎప్పటిలానే కోలహలంగా ఉంది ఈ ఆదివారం. తెలుగు బ్లాగరు మిత్రులం Sub Way లో కూర్చుని Hot Capucchinoa Coffee తాగుతూ ఆలుగడ్డ chips తింటూ చెయ్యాలనుకుని, చెయ్యలేకపోతున్న విషయాలపై ద్రిష్టి పెట్టాము. ముఖ్యంగా ఒక ఉచిత, చిరు పుస్తకం సుమారు 15-20 పేజీలలో వెలువరించాలని లక్ష్యం. ఇందులోని విషయాలు 1) మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పడం ఎలా? - ఇందులో విన్ 98, విన్ 2000 ఇంకా Windows XP వాడే వారు తెలుగు ఫాంట్ల వ్యవస్థీకరణ (Installation) చెయ్యటం, తెలుగు Key Board వగైరా ఉంటాయ్. 2) తెలుగు వికి - ఇందులో తెలుగు వికి పరిచయం, వికి లో వ్యాసం రాయండి, వికి గురించిన అనుబంధ సమాచారం ఈ వ్యాసంలో ఉంటాయి. 3) తెలుగు బ్లాగులు - ఇందులో తెలుగు బ్లాగుల పరిచయం, తెలుగులో బ్లాగు ఎలా రాయాలి, సహాయాం కోసం ఎవర్ని, ఎప్పుడు, ఎక్కడ అడగాలి, లేఖిని మరియు కూడలి పరిచయం ఉంటాయి. తెలుగు సమావేశాలలో, యూనివర్సిటి, కాలేజ్ తెలుగు శాఖలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంపిణి చెయ్యాలని తెలుగు బ్లాగరుల ఆకాంష. మన కార్యక్రమాలలో ఇది ప్రధమ దశ.

రెండవ దశ కార్యక్రమాలు

తెలుగు బ్లాగరుల ఎంపిక చేసిన బ్లాగులు పుస్తక రూపేణా సంవత్సరమునకోసారి ప్రచురించి, పుస్తక విక్రేతల ద్వారా పంపిణి చెయ్యటం. పుస్తకాలను తక్కువ లాభాలకు అమ్మి, వచ్చిన డబ్బు మరుసటి సంవత్సర ప్రచురణలకు వినియోగించాలని ఆలోచన. ఈ పుస్తకాలను సమీక్షకై పలు పత్రికలకు పంపే యోచన కలదు.

ఈ ప్రధమ, రెండవ దశ కార్యక్రమాలకు కావలసిన ఆర్థిక వనరుల సమీకరణ మరియు నిర్వహణ

Sponsors ద్వారా, తెలుగు బ్లాగరు మిత్రుల ఆర్థిక సహాయముతో కార్యొన్ముఖలం కావాలని యోచన. Telugu Bloggers Association స్థాపించి, Register గావించి, Bank ఖాతా తెరచుట, Non-Profit association గా లక్ష్యముండి Executive Committee ఎంపిక చేసుకుని ఆదాయపన్ను శాఖ నుంచి పన్ను మినహాయింపుకై దరఖాస్తు చెయ్యాలని తలంపు. లక్ష రూపాయల ప్రారంభ నిధులుండవలెనని అంచనా. Microsoft ఇంకా అలాంటి సంస్థల (ఊదాహరణకు తెలుగు యూనివర్సిటి), తెలుగు ప్రేమికుల సహకారంతో ఈ బృహత్కార్యం ఆవిష్కరించబడాలని సంకల్పం. January మాసపు సమావేశంలో కార్యనిర్వాహక సభ్యుల ఎంపిక, తదుపరి కార్యక్రమ ప్రణాళిక నిర్ణయించటం జరుగుతుంది. మీ నుంచి అందిన సూచనలను ఈ సమావేశంలో పరిశీలిస్తారు.

తదుపరి సమావేశం

హుస్సేన్ సాగర్ తటాకమధ్యమున గల బుద్ధ భగవానుని సమక్షంలో, జనవరి 2007 లో.


పుస్తక ప్రదర్శన

IBE
ఎడమనుంచి కుడివైపుకు సిబిరావు, త్రివిక్రం, రమణ.


సమావేశం ముగిశాక మిగిలిన ముగ్గురం (రమణ, త్రివిక్రమ్, సిబిరావులు) పుస్తకమేళా మీద పడ్డాం. నేపథ్యంలో సినారె, మృణాళిని, తదితరుల ఉపన్యాసాలు వినిపిస్తూండగా పుస్తకాలు కొనుగోలు చేశాం. ఉపన్యాసాలు ముగిశాక సినారె, వరవరరావు తదితరులు మేమున్న దరిదాపుకే వచ్చారు. ఈ సారి పుస్తకాల Stalls ఎక్కువగానే ఉన్నాయి. తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన పుస్తకాలను పుస్తకప్రియులు ఎంతో ఆసక్తిగా చూసి కొన్నారు. జనం సందడి కూడ ఎక్కువగా ఉండి పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని నిరూపించారు అభిమానులు. Credit cards చాలా చోట్ల స్వీకరించే సౌకర్యం లేక పుస్తక అభిమానులు తాము కొనాలనుకున్న పుస్తకాలు కొనలేక నిరాశకు గురయ్యారు.

Text and Photos: cbrao

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

రావుగారూ..విపులముగా సమావేశము గురించి రాసినందుకు ధన్యవాదాలు. రాత్రి నుండి ఎన్ని సార్లు కూడలి పై రిఫ్రెష్ బటన్ సంధించానో ఈ టపా కోసం..ఇంక నా అభిప్రాయాలు ఆలోచనలు ఇక్కడే మళ్లి రాస్తాను.

అజ్ఞాత చెప్పారు...

తెలుగు బ్లాగర్ల సమావేశ విషయాలు తెలియ పరిచినందుకు చాలా సంతోషం.

తెలుగు బ్లాగర్ల సమావేశానికి నాకు కూడ హాజరు కావాలని వుంది. ఈ సారి భారత్ వచ్చినప్పుడు తప్పకుండ కలవడానికి ప్రయత్నిస్తాను. తెలుగు కోసం ఎంతో కొంత ప్రతి ఒక్కరూ చేస్తూనే పోవాలి లేక పోతే దాని మనుగడకే ప్రమాదం. అందరూ సమావేశానికి సమయానికి రావాలంటే ఓ చిన్న ఉపాయం. ముందు గా వచ్చిన వాళ్ళకిఎ ఒక మంచి తెలుగు పుస్తకం(లు) బహూకరిస్తే సరి.

"మన మాతృభాష మృత భాష కాకూడదు".

తెలుగు బ్లాగర్ల సంఘం అన్నది అద్భుతమైన ఆలోచన. దాన్ని వీలయినంత త్వరలో నమోదు చెయ్యండి. నేను కూడా యదా శక్తి గా విరాళాల కోసం ప్రయత్నిస్తాను. నేను నా తరఫున (మరియు విరాళాలు సేకరించి) కనీసం పది వేల రూపాయలు విరాళంగా పంపిస్తాను. మన రాబోయే ఉగాది కి తెలుగు బ్లాగర్ల సంఘం నమోదు చేసి తెలుగు బ్లాగర్ల ఉగాది కవితలతో మొదలు పెడితే బాగుంటుందేమొనని నా అభిప్రాయం.

జై తెలుగు తల్లి.
విహారి.

రాధిక చెప్పారు...

ee saari chaala manchi vishayaalu charchincharu.anni college laloa telugu viki gurinchi,telugu blaagula gurinchi teliselaa pratulu pamchadam anedi manchi aaloacana.jayoastu..

వీవెన్ చెప్పారు...

ఈసారి విశేషాల విశేషం: మీ ఇద్దరి సంయుక్త ప్రయత్నం! బాగుంది, కృతజ్ఞతలు.

తెవికీ గురించి: ఎవరైనా మార్పలు చేయవచ్చనేది వికీమీడియా యొక్క విధానం.

తదుపరి సమావేశ ఆహ్వానం సమూహానికి పంపించా.

Dr.Pen చెప్పారు...

బ్లాగు మిత్రులందర్నీ చూసి ఆనందమేసింది.2003 డిసెంబరులో నేను తిరిగిన పుస్తకప్రదర్శన, కొన్న పుస్తకాలు జ్ఞాపకానికొచ్చాయి. ధన్యవాదాలు!

స్వేచ్ఛా విహంగం చెప్పారు...

ప్రచురించినందుకు ధన్యవాదాలు.
సరైన దిశలో చర్చించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి