శుక్రవారం, అక్టోబర్ 12, 2007

సాహితీవనం -9



తెలుగులో లేఖా సాహిత్యం

వైజాగ్ నుంచి మిత్రులు కవికుమార్, సుంకర చలపతిరావు కు, వడ్డాది పాపయ్య, సంజీవదేవ్ రాసిన ఉత్తరారలను ' లేఖలు ' గా ప్రచురించిన పుస్తకాన్ని పంపారు.అది చూస్తుంటే ఉత్తరాలు గురించిన నా అనుభూతి, మిత్రులు చరసాల తన అంతరంగాలు బ్లాగులో, ఉత్తరాలు అనే వ్యాసం,December 12, 2006 న ప్రకటించినప్పుడు, చదివి, స్పందిస్తూ రాసిన విషయం గుర్తుకొచ్చింది.అప్పుడు నేను రాసాను "ఆంగ్లంలో , తెలుగులో, లేఖా సాహిత్యం కొన్ని కొత్త గవాక్షాలను తెరిచింది; జ్ఞాన ప్రపంచానికి. సంజీవదెవ్ లేఖలంటే నాకు ప్రాణం".

లేఖా సాహిత్యం ఆంగ్లంలో ఉన్నంతగా తెలుగులో లేదు. తండ్రి (జవహర్ లాల్) తనయ (ఇందిరా గాంధి) కు రాసిన ఉత్తరాలు జగత్‌ప్రసిద్ధం.జవహర్ జైలు గోడల మధ్య నుంచి రాసిన ఈ ఉత్తరాలు, ప్రపంచ నాగరికతను, చరిత్రను వివరిస్తాయి. ఇవి Two Alone, Two Together: Letters between Indira Gandhi and Jawaharlal Nehru 1922-64 గా పెంగ్విన్ వారు ప్రచురించారు.

కొడవటిగంటి కుటుంబరావు ఉత్తరాలు,శ్రీశ్రీ ఉత్తరాలు, చలం ఉత్తరాలు, సంజీవదేవ్ ఉత్తరాలు పుస్తక రూపం లో గతం లో వెలువడ్డాయి. ఇంకా మరుగున బడ్డ మాణిక్యాలెన్నో? వీటిలో ఎవరి శైలి వారిది. సంజీవదేవ్ ఉత్తరాలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఎన్నో ఆసక్తికరమైన చర్చలతో నిండి ఉంటాయి. చాలామంది, నాతో కలుపుకుని, ఈ ఉత్తరాలు చదివాకే సంజీవదేవ్ కు ఉత్తరాలు రాయటం, వారి జవాబులకోసం నిరీక్షించటం జరిగాయి. దేవ్ తన ఉత్తరాలలో ఒక చిన్న కవితనో లేక తను వేసిన painting నో అదనంగా పంపే వారు. వాటిని మేము బోనస్ గా భావించేవారము. ఈ paintings, miniature landscapes అయి ఉండేవి. వీటిలో, తెలిసిన రూపాలను,అస్పష్ట రూపాలుగా చిత్రించే వారు. కొన్నింటిలో మానవాకారాలు సూచన ప్రాయంగా గోచరించేవి. సంజీవదేవ్ రసరేఖలు, రూపా రూపాలు, దీప్తిధార వగైరా వ్యాస సంకలనాలలో భారతీయ చిత్రకళ, శిల్ప కళ గురించి, కళాకారుల గురించి పరిచయ వ్యాసాలు రాస్తుండే వారు. చిత్రకళ, శిల్పకళల గురించి తెలుసుకోవటానికి అవి ఒక విజ్ఞాన ఖని.

‘ లేఖలు ' పుస్తకం లో వడ్డాది సంజీవదేవ్ పై వెలిబుచ్చిన అభిప్రాయాలు సత్య దూరమని, సంజీవదేవ్ గురించి ఎరిగినవారెవరైనా చెపుతారు. లలిత కళల పై సాధికారత ఉన్న సంజీవదేవ్ కు కళలు గురించి తెలియవని వడ్డాది అనటం విడ్డూరంగా ఉంది. (చూ. పజీలు 8,9 ఇంకా 10)
సంజీవదేవ్ ఉత్తరాలు, ఇంతవరకూ చదవని వారి కోసం, దేవ్ శైలి చూడటానికి, వారి ఉత్తరం లోంచి, ఒక పారాగ్రాఫు ఇస్తున్నాను.
“ ప్రస్తుతం ఏమీ వ్రాయటం లేదు.ఏమీ చిత్రించటం లేదు.ఎక్కడా ప్రసంగించటం లేదు.కొన్నాళ్లపాటు వీటన్నంటినీ చేయకపోవటం లో ఉంటుంది ఆనందం. ఏమైన చేయటం లో ఆనందం వున్నట్లే,ఏమీ చేయక పోవటంలో కూడా ఆనందం ఉంటుంది.ఆ చేయక పోవటం అనేది, చేయటానికి ఉత్సాహాన్నిస్తుంది.ఉల్లాసాన్నిస్తుంది.ఏమీ చేయకపోవటం అనేది the passive aspect of creativity అవుతుంది.అయితే, ఏదో ఒకటి చేయటానికి అలవాటయిన మనిషి ఎలా చేయకుండా వుండలేడు.ఏమీ చెయ్యకుండా వున్నప్పుడు కూడా ఎదో చేస్తున్న భ్రమలో, జీవిస్తాడు. భ్రమలన్నీ మంచివి కాకపోవచ్చు కాని కొన్ని భ్రమలు మాత్రం వాస్తవానికంటే,ఎక్కువ వాస్తవమేమో అనిపిస్తుంది. సరే, ఉంటాను.

మీ,
సంజీవ దేవ్ "

పుస్తకం వెల రూ.10/- మాత్రమే. ప్రతులకై

Smt Sunkara Jhansi Lakshmi,
Flat no: 201, R.R.Enclave,
Near Zinc Gate,Gajuvaka Post,
Visakhapatnam -26

సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

A) సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

3) ఎనిమిది అధ్యాయాలు

B) అల్పజీవి నవల, ఆరు సారా కథలు, ఆరు సారో కథలు రాసిన ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి వృత్తి రీత్యా

4) న్యాయవాది

C) Romancing with Life స్వీయ చరిత్ర రాసిన వారు

2) దేవ్ ఆనంద్
దేవ్ ఆనంద్ తీసిన గైడ్ సినిమా, ఉత్తమ హిందీ చిత్రాలలో ఒకటి. R.K.Narayan రాసిన Guide ఆధారంగా ఈ చిత్రం తీశారు.దేవానంద్ ద్విపాత్రాభినయం చేసిన నలుపు - తెలుపు చిత్రం, హందోనో ను రంగులలోకి మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నై.జీనత్ అమన్, టీనామునింలను తెరకు పరిచయం చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్ కి మేన మామ ఇంకా చేతన్, విజయానంద్ లకు సోదరుడు. 1946 నుంచి 2005 దాక 110 చిత్రాలలో నటించారు.

D) భారతదేశము, శ్రీలంక ల మధ్య రామసేతు నిర్మాణం గావించిన కట్టడ నిపుణుడు

2) సుషేణుడు
రామసేతు నిర్మాణాన్ని నలుడు, సుషేణుదు అనే ఇద్దరు వానర ఇంజనీర్లు కావించారు. చారిత్రాత్మక ఆధారాలు అడగొద్దు. హిందువుల ఇతిహాసం, రామాయణం పై ఈ జవాబు ఆధారపడి ఉంది.

ఇంకా వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి