శుక్రవారం, ఫిబ్రవరి 04, 2011

పుట్టని పాపకు లేఖ

"పుట్టని పాపకు లేఖ"  కవిత వ్రాసిన పెరుగు సుజనారామం అధ్యాపకురాలు. వీరు   వ్రాసిన  మల్లెమొగ్గలు : చిన్నారుల వ్యక్తిత్వం  అనే  బాలల మనో వికాసానికి తోడ్పడే   పుస్తకాన్ని విశాలాంధ్ర  ప్రచురణాలయాలు  వారు ప్రచురించారు. ఈ కవిత తొలిసారి "నన్ను క్షమించొద్దు"  అనే పేరుతో ముద్దమందారం బ్లాగులో ప్రచురితమయ్యింది. సుజనారామం గారిదే మరో బ్లాగు తామసి .ఈ బ్లాగులు మన తెలుగు బ్లాగు సంకలనులకు అనుసంధానం కాలేదు. ఈ కవిత మొదటిసారి చూస్తూనే అలా చదివించి, ఆకట్టుకుంది. దీప్తిధార పాఠకులకు నచ్చుతుందని  ఆశిస్తూ , ఈ కవిత మీ కోసం ఇక్కడ.

Photo courtesy: fun-mag

నన్ను క్షమించొద్దు ప్లీజ్
నా చిట్టి తల్లీ
నిమిషంలోనే
నా మనసంతా ఆక్రమించావు
తామరాకుల్లాంటి
బుజ్జి బుజ్జి పాదాలతో
ఎగసి పడే తరంగాలతో
నా పొట్టలో నువ్వు చేసే అల్లరి
నా ఉహల్లోకి రాకముందే
నిన్ను భ్రూణ హత్య చేశాను

నా కళల కంటి పాపా
నీ తల్లి నిర్దయరాలేనమ్మా
నన్నెందుకు మొగ్గలోనే త్రున్చేసావమ్మా
అని ప్రశ్నించకుతల్లీ !
నీ కోసం ప్రపంచాన్ని ఎదిరించాలనే ఉంది
నీ కోసం దూరంగా పారిపోవాలనే ఉంది
కాని నిస్సహాయరాలుని
నా చుట్టూ ఉన్న ప్రేమ రాహిత్యంతో
అందరూ ఉండీ లేనిదానిలా
నిన్నో నిర్భాగ్యురాల్నిచేయలేను

నా కేప్పటికీ నీ మీద ప్రేమే తప్ప
ద్వేషం రానే రాదు
ప్లీజ్ ....నీ బుజ్జి కాళ్ళ తో
నా గుండెని తన్నొద్దు
అమ్మా...అమ్మా అంటూ నా చెవిలో
గుస గుస లాడవద్దు
నా మీద నాకే పెరిగిన కోపాన్నీ ద్వేషాన్నీ
తగ్గించ వద్దు
నన్ను క్షమించవద్దు

-పెరుగు సుజనారామం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి