శనివారం, జూన్ 16, 2007

తానా సంపాదకీయంశాంతినికేతన్ లో ఒక కుడ్య చిత్రం Photo: cbraoమనిషికీ మనిషికీ మధ్య బంధం సున్నితమైంది అది రక్తమూ, ప్రేమా,
స్నేహమూ, బంధుత్వమూ దేనితో కూడుకున్నదయినా. ఒక చిన్న మొక్కకి ఎరువు వేసి
నీరు పోసి పందిరి కట్టి పోషించుకున్నట్టే ప్రతి సంబంధాన్నీ జాగ్రత్తగా
కాపాడుకుంటూ పెంపొందించుకోవాలి. అయితే ఆ మొక్క ఎదిగి తీగెలు సాగి పూలు పూచాక
దాని సంరక్షణలోనూ, పోషణలోనూ అలసత్వానికి లోనవుతాము.

అదే నిర్లక్ష్యంతో ఏ బలహీన క్షణంలోనో పరుషంగానో, చులకన చేస్తూనో ఒక
మాట అవతలివారి నాలుకనుండి జారుతుంది. నీ హృదయం గాయపడుతుంది.
అనాలోచితంగా వారు చేసిన ఒక చేష్ట నీకు కష్టాన్ని కలిగిస్తుంది. వారి
ప్రాధాన్యతా క్రమం వలన అవసరానికి వినిపిస్తుందనుకున్న మాటా,
అందుతుందనుకున్న సాయం నీకు అందవు. నీ అహం దెబ్బ తింటుంది. లేదా ఒక
అపార్ధం చోటు చేసుకుంటుంది. ఆ పై ప్రతి మాటా, చేతా కొత్తకోణంలో
కనిపించి వేధించడం మొదలెడతాయి. తప్పు ఖచ్చితంగా అవతలివారిదేనని
ఇద్దరూ బలంగా నమ్ముతారు. వాదాలూ, మౌనాల అనంతరం ఇక మొహం కూడా
చూడాలనిపించదు. అన్ని రోజులుగా పెంచుకున్న, పంచుకున్న బంధం నిశ్శబ్దంగా
తెగిపోతుంది.

అంటే నీ జీవితంలో, నీ ప్రపంచంలో ఒక భాగాన్ని నిరాకరిస్తున్నట్టే. నీలో ఒక
పార్శ్వాన్ని తొలగించుకున్నట్టే. మరొకరి ప్రపంచంలో నువు మరణించినట్టే.
తప్పెవరిదయినా నష్టం ఇద్దరిదీ.

పొరపాటు మానవ సహజం. నీమీద నీకే కోపం వచ్చిన సందర్భాలలో నిన్ను
క్షమించేసుకుంటావు. అర్ధంలేని పట్టింపులు విడిచి నీ ఆత్మీయుల్ని అడక్కుండానే
ఉదార హృదయంతో క్షమించలేవా? క్షమాగుణం మనిషిగా నిన్ను ఉన్నత స్థాయికే
చేరుస్తుంది. లేదా ఒక బంధాన్ని నిలుపుకునేందుకు నీ అహాన్ని కాస్త చంపుకుని
తప్పు నీది కాదని నువ్వనుకున్నా వొప్పుకుని క్షమాపణ అడగలేవా? ఒక
చిరునవ్వూ, ఒక పలకరింపూ, ఒక వెచ్చటి స్పర్శతో వారిని తిరిగి నీ
జీవితంలోకి ఆహ్వానించి నీ ప్రపంచాన్ని పరిపూర్ణం చేసుకోలేవా?

ప్రధాన సంపాదకుడు,
కన్నెగంటి చంద్రశేఖరరావు

----

Source Courtesy: Sri Krishna Rao Maddipati of DTLCgroup
Tana: http://tana.org/

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి