గురువారం, జూన్ 12, 2008

పాపినేని శివశంకర్ ‘చివరి పిచ్చుక’


Dr.Papineni Sivasankar Photo Courtesy: Dr Papineni

సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై పరిశోధన చేసిన డా. పాపినేని శివశంకర్, ప్రసిద్ధ కథకుడు, కవి. ఇప్పటివరకు సుమారుగా 150 కవితలు,30 చిన్న కథలు ఇంకా 100 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.వాసిరెడ్డి నవీన్ తో కలిసి 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు.శివశంకర్ గారి కవితలు పలు సంకలనాలుగా (స్తబ్ధత - చలనం,ఒక సారాంశం కోసం, ఆకు పచ్చనిలొకంలో,ఒక ఖడ్గం - ఒక పుష్పం), కథలు మట్టి గుండె (1992) గా వెలువడ్డాయి. సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై చేసిన పరిశోధన 1996 లో పుస్తకంగా వెలువడింది. చినుకు,కథా సాహితి,విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో, సాహితీ పురస్కారం పొందారు. తాడికొండ B.S.S.B.College లో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

ఏది మంచి కథ? చక్కటి పొందిక , సహజ గుణాత్మకంగా ఉంటూ, జీవిత వాస్తవాలను ప్రతిబింబించేదే, కథ అవగలదని,కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు అభిప్రాయపడ్డారు.శివశంకర్ గారి ప్రసిద్ధ కథ,‘చివరి పిచ్చుక’, కథ 2004 లో ప్రచురితమైనది. నిజమే, పట్టణాలలో పిచ్చుకలు కనుమరుగయ్యాయి. పర్యావరణ, వడ్లు నిలువ చేసుకునే పద్ధతులలో వచ్చిన తేడా వలన, పక్షుల స్థితిగతులలో కూడా మార్పులు వచ్చాయి. పక్షులు మన వాతావరణ ఆరోగ్యానికి గుర్తు. అవి తగ్గితే, మన పర్యావరణ నాణ్యత తగ్గిందని అర్థం. ఈ కథ పై, 2006 లో రచ్చబండ లో ప్రచురితమైన, ఆరి సీతారామయ్య గారి కథా విశ్లేషణ చదవండి.

చివరి పిచ్చుక



Sparrows Photo: cbrao

నేను ప్రాధమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో సాయంకాలం బడినుంచి రాగానే ఒక్కోసారి
చేనికి పంపించేవాళ్ళు మావాళ్ళు. వడిసేలతో. పిట్టల్ని తరమటానికి. వూళ్ళో దాదాపు అందరు రైతులూ జొన్న వేసేవారు. అందరూ రెండు పూటలా జొన్న సంగటి తినే వారు. జొన్న సంగటి చింతకాయ
పచ్చడితో తింటుంటే ఎంత బాగుండేదో! జొన్న చేలల్లో కంకి పడుతున్నప్పుడు పిచ్చుకలూ, రకరకాల
పిట్టలూ గుంపులు గుంపులుగా వచ్చేవి. విత్తనాలు పాలు పోసుకుంటున్నప్పుడు మరీను. దోవలో కనపడ్డ చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరుకోని చడ్డీ జేబుల్లో పోసుకోని చేనికి పోవటం, చేని మధ్యలో కట్టిన చిన్న పందిరి ఎక్కటం, అక్కడనుంచి వడిసేలతో పిట్టలు కనపడ్డ వైపు రాయి రువ్వటం, పిట్టలు ఎగిరిపోయి మరో వైపు వాలటం, అటువైపు నేనొక రాయి రువ్వటం, అవి మళ్ళా ఇంకోవైపు లేచిపోవటం ఇదీ కథ. ఒకటి రెండు గంటలతరవాత విసుగుపుట్టో, ఆకలయ్యో, చీకటిపడి పిట్టలు గూళ్ళకు పోతేనో, నేను కూడా ఇంటికి పొయ్యేవాణ్ణి. పాపినేని శివశంకర్ గారి చివరి పిచ్చిక ఆ రోజుల్ని గుర్తుకుతెచ్చింది.

ఆ రోజుల్లో తింటానికేగాదు, డబ్బుగా కూడా వాడేవారు జొన్నల్ని. పొలాల్లో
పనిచేసిన కూలీలకు సాయంత్రం జొన్నలు కూలికింద కొలిచేవారు. సంవత్సరం
పొడుగునా పనిచేసిన చాకలికీ, మంగలికీ కల్లాం దగ్గరే గింజలు ఇచ్చేవారు.
బాకీలు ఉన్నవారు తమ బాకీ కింద జొన్నలు తీసుకునేవారు. ఎప్పుడన్నా కోమటి
శెట్టి దగ్గర ఏదన్నా కొనుక్కోవాలంటే, అమ్మమ్మ నాక్కూడా ఒక రుమాల్లో జొన్నలు
పోసిచ్చేది.

ఆ రోజుల్లో కూడా తిండిగింజల పైర్లు వెయ్యగా ఇంకా పొలం ఉన్నవాళ్ళు వ్యాపార పంటలు వేసేవారు. ముఖ్యంగా పొగాకు. రాను రానూ, పొగాకు వెయ్యటం లాభంగా ఉందని గుర్తించిన సన్నకారు రైతులు కూడా తిండిగింజలు పండించే పొలాల్లో పొగాకు వెయ్యటం మొదలుపెట్టారు. అందరికీ అన్నం పెట్టే రైతు తన కుటుంబావసరాలకు తిండి గింజలు కొనుక్కోవటం మొదలుపెట్టాడు. పొగాకులో లాభం వచ్చినప్పుడు బాగానే ఉండేది. రానప్పుడు పెద్ద దెబ్బయ్యేది.

క్రమంగా పొగాకు పోయి అంతకంటే లాభసాటి అయిన పత్తి వచ్చింది. పత్తికి పెట్టుబడి ఎక్కువ. అంతా సక్రమంగా జరిగితే పొగాకుకంటే చాలా ఎక్కువ లాభం. కాలం కలిసిరాకపోతే ...ఈ కథ అందరికీ తెలిసిందే.

ఎటు చూసినా పంట పొలాలతో పచ్చగా కనిపించే వూళ్ళు మారిపోయాయి. ఇప్పుడు
వ్యాపార పంటలు ఎక్కువ. రైతులు తిండిగింజలు కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు
గింజలకోసమూ, పైరుచేలల్లో సమృద్ధిగా దొరికే పురుగుల కోసమూ, గుంపులు గుంపులుగా పోతూ
కనిపించే పిచ్చికలు ఇప్పుడు అంతగా కనిపించటం లేదు.

ఇలాంటి వూళ్ళలో వచ్చిన పరిణామాలే శివశంకర్ గారి కథకు నేపధ్యం. కథను ఒక మగ పిచ్చిక
ద్వారా చెప్పిస్తాడు శివశంకర్. ఒక ఆడ పిచ్చిక ? పికిలి తో చెలిమి కుదిరి, గుడ్లు పెట్టుకోవటానికి వీలుగా ఒక ఇంటి చూరులో గూడు కడుతుంది పిచ్చిక. మూడు గుడ్లు పెడుతుంది పికిలి. ఇద్దరు పిల్లలు
బ్రతుకుతారు. ఒక రోజు మేతకోసం వెళ్ళిన పిచ్చికలు తిరిగొచ్చే లోగా, ఇంటి యజమాని పూరిల్లు
పీకేస్తాడు. డాబా కట్టుకుందామని. పిచ్చిక పిల్లలు రెండూ అందులో చచ్చిపోతాయి.

అక్కడా ఇక్కడా తిరిగి తిరిగీ కొన్నాళ్ళకు ఒక ఇంటి ముందున్న లోతైన బావిలో,
నీళ్ళకు కొంచెం పైగా ఉన్న ఒక సందులో, గూడు కట్టుకుంటాయి పిచ్చికలు. కథలో
ఈభాగం నాకు ఎంత నచ్చిందో! ఆ రోజుల్లో మా ఇంటికి దక్షిణం వైపు ఒక లోతైన బావి ఉండేది. దాంట్లో పిచ్చికలు గూడు కట్టుకుని ఉండేవి. శివ శంకర్ గారు రాసినట్లు నీళ్ళతో పైకొచ్చే బిందెలమీద సవారీ చేస్తూ పైకొచ్చేవి పిచ్చికలు. తీరా పైకొచ్చి ఎగిరిపోయేవి. ఉదయం ఎంతో మంది నీళ్ళకొచ్చేవారు. లోతైన బావి కావటం వల్ల నీళ్ళు చేదటం అంత సులభం కాదు. నీళ్ళ కోసం వచ్చిన ఆడ వాళ్ళూ, పిల్లలూ ఎవరైనా మగవాడొచ్చిందాకా ఆగే వారు. అతను నీళ్ళు చేది వాళ్ళ బిందెల్లో పోసేవాడు. ఎంత జాగ్రత్తగా పోసినా నీళ్ళు చిందేవి. ఇలా ఉదయం సాయంత్రం నీళ్ళ కొచ్చే సమయం లో బావి చుట్టూ మడుగులు ఏర్పడేవి. ఈ మడుగుల్లో పిచ్చికలు జలకాలాడుతుండేవి.

ఒక రోజు పిచ్చికలుంటున్న బావిలో మట్టి పడుతుంది. యజమాని బావి బూడ్పించి
అక్కడే ఒక బోర్ వెల్ తవ్విస్తాడు. పిచ్చికలు మళ్ళా గూడులేని ప్రాణులవుతాయి.

కథ చివర్లో పికిలికోసం మేతకెళ్ళిన మగ పిచ్చికకు మిరప, పత్తి తోటల్లో
చచ్చిన పురుగులు తప్ప మరేమీ దొరకవు. అవే తెచ్చి పికిలికివ్వటం, ఆ
పురుగులుతిని పికిలి చచ్చిపోవటం జరుగుతుంది. మగ పిచ్చుక మళ్ళా తోడులేని
ఏకాకి అవుతుంది.

పోయిన ఇరవై ముఫైయేళ్ళలో తెలుగు పల్లెటూళ్ళలో వచ్చిన వ్యవసాయ పైర్ల మార్పులూ,
ఈ మధ్య వచ్చిన కరువులూ, రైతుజీవితాల్లో వాటివల్ల కలిగిన బాధలూ, ఈ పిచ్చికల
జీవితాల్లో ప్రతిబింబిస్తాయి. రైతుకుటుంబాల మనుగడ ఎలా కష్టం అవుతుందో, పిచ్చికల జీవితాలూ
అలాగే అవుతాయి. పిచ్చికల బ్రతుకులను చాలా సమర్ధవంతంగా చిత్రిస్తాడు శివశంకర్.

ఈ కథలో నాకు ఒక లోపం కనిపించింది. ఇది పిచ్చిక దృష్టికోణం నుంచి చెప్పిన
కథ. కానీ కొన్ని చోట్ల రచయిత జోక్యం కనిపిస్తుంది. జాతుల అంతర్థానం
(extinction of species) మీద జరుగుతున్న సభలో మాట్లాడుతున్న మనుషుల
సంతాపం కపటం అంటుంది పిచ్చిక. నిజానికి ఈ జాతి ప్రపంచాన్ని
మోసగించటానికే మాటలు నేర్చింది అంటుంది. ఇలాంటి ఊహలూ ఆలోచనలూ పిచ్చిక
చైతన్యానితో సామ్యం లేనివి. అలాగే కథ చివర్లో పిచ్చిక అనంతాకాశం లో
కలిసిపోతూ రెండు చేతుల జాతి {మనుషులు} సమస్తాన్నీ ధ్వంసం చేస్తూ,
చివరికి తానే ధ్వంసమగునుగాక! అని శపిస్తుంది. ఇది పిచ్చిక శాపం లాగా
ఉండదు, శివశంకర్ గారి శాపం అనిపిస్తుంది. పిచ్చికచేత చెప్పించ దలచిన
కథను పూర్తిగా పిచ్చికకే వదిలేస్తే బాగుండేది.

Overall this is a wonderful story. Nice language, excellent observations of nature rarely found in Telugu stories and for the most part, good effort in presenting the recent changes in the Telugu countryside from the point of view of a small bird.

---------------------------------0000000000000----------------------------------------

కృతజ్ఞతలు: ఆరి సీతా రామయ్య, పాపినేని శివశంకర్, రచ్చబండ.
పెచ్చుపెరిగిపోతున్న భూతాపం వలన, కావలసిన పర్యావరణం పై అవగాహనకు, బత్తీబంద్ కార్యక్రమాలకు నా వంతుగా, ఈ జాబు దీప్తిధారలో ప్రచురణ.

3 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

thank you, sir.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

రావు గారు, ఈ కధ వెబ్ లో ఎక్కడైనా దొరుకుతుందా చదవడానికి...చాలా ఇంటరెస్టింగ్ ఉంది మీరు కధలోంచి తీసుకుని ప్రస్తావించిన కొన్ని విషయాలు....

cbrao చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు: సగం తెరిచిన తలుపు కధల సంకలనం లో చివరి పిచ్చుక కధ ఉంది. ఈ పుస్తక సమీక్ష చూడండి
http://sambhashana.wordpress.com/2008/08/24/%E0%B0%B8%E0%B0%97%E0%B0%82-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/

పెద్ద పుస్తకాల దుకాణాలలో ఈ పుస్తకం లభ్యమవగలదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి