శనివారం, అక్టోబర్ 25, 2008

విహారి నవ్వుల తోటలో కుందేలు



ఎర్ర రాళ్ల కొండలోంచి వాహన మార్గం

అక్టోబర్ 23, 2008 సమయం సాయంత్రం 5 గంటలు.చీకటి పడకముందే, ఎర్ర రాళ్ల కొండలు చూసివద్దామన్న విహారి సూచనకు తలూపాను.డెన్వర్ లో ఈ ఎర్ర రాళ్ల కొండలు ప్రసిద్ధిగాంచినవి. కొలొరాడో color - ado, అంటే ఎర్రరాళ్ల ప్రాంతమని స్పానిష్ వారు పేరు పెట్టి పిలువసాగటంతో,ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది.



Red Rocks వద్ద ఛాయా చిత్రంలో ఉన్నవారు:cbrao బొమ్మ తీసినవారు:విహారి

డెన్వర్ లోని Red Rocks లోని ప్రత్యేకత ఏమంటే, రెండు కొండల మధ్య ఉన్న ప్రత్యేక ధర్మాన్ని,ధ్వనితరంగశాస్త్రం (acoustics) సహాయంతో, ధ్వనిని పెంచి (ఎలాంటి amplifier, speakers లేకుండా), సంగీత కచ్చేరీలు నిర్వహిస్తారిక్కడ.



ఎర్ర రాళ్లలో ఆరుబయలు రంగమంటపం (Open air theater)

ప్రపంచంలోనే, మరెక్కడా లేని, అరుదైన రంగమంటపమిది. వానాకాలం లో ఇక్కడి ఎర్రరాళ్ల సొగసు, ఇంద్రధనసు రంగులు చూసితీరవలసినదే. ఈ Red Rocks గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు Red Rocks Web Site చూడవచ్చు. అక్కడి ఎర్రరాళ్లను, ఆరుబయటి రంగుమంటపం (Open air theatre) చూసాక, డెన్వర్ కొండల మీదుగా, వంపులు తీరి ఉన్న రహదారిపై ప్రయాణించే సమయంలో అకస్మాత్తుగా మా వాహనం ఆగింది. దానంతట అది ఆగలేదు.



గడ్డి మేస్తూ దుప్పి

ఎదురుగా రెండు దుప్పులు (Deer ) రహదారి పక్కన గడ్డి మేస్తూ కనిపించటంతో, విహారి వాహనాన్ని ఆపటం జరిగింది. రహదారిపై ఏటా అమెరికాలో 2000 పై చిలుకు వన్యప్రాణులు, రహదారి దాటుతూ మరణిస్తున్నాయి. వీటి రక్షణకై పెక్కు చర్యలు తీసుకుంటున్నారు.రహదారికి రెండు పక్కలా కంచె వేసి వీటిని రక్షిస్తున్నారు. రహదారిపై, వన్యప్రాణులు రహదారి దాటే ప్రాంతమని, హెచ్చరించే ప్రకటనలు, దారి పొడుగూతా కనిపిస్తుంటాయి.ఇదివరలో ఈ ఎర్ర రాళ్ల ప్రాంతంలో, జింకలు, గుంపులు గుంపులుగా కనిపించేవని, ఇప్పుడు సంగీత కచ్చేరీల వలన, జనం రావటం ఎక్కువవటం తో వాటి సంచారం తగ్గిందని విహారి ద్వారా తెలుసుకొన్నాను.సూర్యాస్తమయం అవటంతో, వెలుతురు తక్కువగా వుండి, నా కెమరా ఆటో ఫోకస్ కావటానికి కష్టపడసాగింది.అయినా,దుప్పుల చిత్రాలు, కొన్ని తీయగలిగాను.

కొండదారి పై మా ప్రయాణం కొనసాగి, చిన్న చిన్న పట్టణాల మీదుగా పయనిస్తూ,Highlands Ranch లోని Blackbird Circle లోని విహారి ఇంటి ముందర మా వాహనం ఆగింది. విహారి, కుడివైపు ఉన్న పచ్చిక బయలులో, గడ్డి తీరికగా మేస్తున్న కుందేలుపై, నా దృష్టిని సారించటం తో, ఉత్సుకతో వాహనం దిగి ఆ కుందేలును దూరం నుంచి ఛాయా చిత్రాలు తీస్తూ దగ్గరగా వెళ్లసాగాను.ఆశ్చర్యం,కుందేలు నన్ను చూసి బెదరలేదు. చుట్టూ చూశా, ఎక్కడన్నా తాటాకులు దొరుకతవేమోనని.



డెన్వర్ లో ఆకులు రాలే కాలం (Fall - Maple Leaves)

ఆకురాలు కాలమవటంతో,చుట్టూ రాలిన మాపిల్ (Maple leaves) ఆకులు కనిపించాయి.ఆ మాపిల్ ఆకులను సేకరించి,కుందేలుకు దగ్గరగా వచ్చి చప్పుడు చేయసాగాను.ఊహు! ఈ కుందేలు మాపిల్ ఆకుల చప్పుళ్లకు బెదిరేది కాదని తెలిసిపోయింది.భారత దేశం అడవులలో, కుందేళ్లను తాటాకు చప్పుళ్లతో బెదిరించటం అలవాటయిన నాకు, అమెరికాలో ఈ కుందేలు బెదరకపోవటం ఆశ్చర్యం కలిగించింది.ఇహ లాభం లేదని,దగ్గరగా వెళ్లి చేతితో చప్పట్లు చేయబోయి,దగ్గరగా వెళ్తుంటే 'ఆగు ' అన్న మాట వినపడటంతో, ఉలిక్కిపడి చుట్టూరా చూశా, ఏదన్నా దెయ్యం అలా పలుకుతుందేమోనని.



హాలోవిన్ పండుగకు స్వాగతం చెప్తూ చేసిన, గ్రుహం ముందటి అలంకరణ

దెయ్యం నా ఆలోచనలోకి రావటానికి ప్రత్యేక కారణం లేక పోలేదు.ఈ రోజు మధ్యాహ్న సమయం లో, శ్రీమతి ప్రశాంతి నాకు వాళ్ల కౌంటీ లోని, హాలోవిన్ (Halowin) పండగ (దెయ్యాల పండగ) కోసం ప్రత్యేకంగా అలంకరించిన, చాలా గృహాలను చూపటం జరిగింది. ఈ దెయ్యాల పండగ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. వాటి (హాలోవిన్ దెయ్యాల) తాలుకు ఆలోచనలు నా మనస్సును ప్రభావితం చేసి,ఏ మానవ సంచారం లేని ఆ సమయంలో,ఆ శబ్దమెటునుంచి వస్తున్నది అని తెలుసుకోందుకై, చుట్టూ పరికించి చూశా. ఎవరూ లేరు. మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? ఆశ్చర్యం, ఆ శబ్దం కుందేలు వైపు నుంచి వచ్చింది.



మాట్లాడే కుందేలు

నమ్మశక్యం గాక, కుందేలు వైపు మరో అడుగు వేశా. కుందేలే ' ఆగు ' అని మరలా హెచ్చరించింది. నేను అమితాశ్చర్యంతో, ఏమిటి నీవు మానవులవలే మాట్లాడుతున్నావు? అదియునూ,ఆంగ్లంలో కాకుండా తెలుగులో ఎట్లా మాట్లాతున్నావని అడిగాను. కుందేలు చెప్పిన సమాధానానికి నేను కుదేలయిపోయా.

కుందేలు అన్నది, తాను అదే ప్రాంతంలో ఉంటానని, విహారి తోటలో, టొమటో ఇంకా ఇతర కాయగూరల మొక్కలు, గడ్డి తింటానికి తరచూ ఇక్కడికి వస్తుంటానని , విహారి సాయంకాలపు బడిలో, కౌంటీలోని పిల్లలలకు తెలుగు బోధిస్తుంటే, తనూ విని వినీ, పిల్లలతో పాటు, తనకూ తెలుగు వచ్చేసిందనీ, అందుకే తను తెలుగులో మాట్లాడగలుగుతున్నానని. (విహారి, భూపతి పంతులువారిగా తెలుగు పాఠాలు చెప్పే విశేషాలు, మీరు, అమెరికాలో తెలుగు వారి పిల్లలకు తెలుగు పాఠాలు అనే వ్యాసంలో తెలుసుకోవచ్చు). అంతే కాదు, పంతులుగారి పిల్లలు కూడా, ఇంట్లో తెలుగే మాట్లాడుతుంటే, తనూ తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నానని, కుందేలన్నది.

సరే బాగుంది, నాకు ఇంకో సందేహముంది అన్నా. సరే,డెన్వర్ వచ్చి, ప్రశ్న దాచటమెందుకు, అడగవచ్చు అని కుందేలనటంతో, నేను ఇన్ని చప్పుళ్లు చేస్తున్నా, నీవు బెదరక పోవటం లోని రహస్యం తెలుసుకోవాలనుంది అన్నా. ఇందాక చెప్పాగా, నేను విహారి తోటకు తరచు వచ్చిపోతుంటానని.విహారి తెలుగు పాఠాలతో పాటుగా, విహారి బ్లాగు కబుర్లూ వింటున్నా. మొదట 50, తరువాత 100, అలా అలా విహారి టపాలకు 300 పై చిలుకు Hits రావటం తో, ఆ కబుర్లు వింటూ, హిట్లకీ,చప్పుళ్లకీ తట్టుకునే ధైర్యమొచ్చేసింది. అందుకే, ఇందాక, మీరు అన్ని చప్పుళ్లు చేసినా, భయపడలేదు అన్నది.

కుందేలు ఇన్ని కబుర్లు చెప్తుంటే, ముచ్చటేసి, ఒక్కసారి దాన్ని రెండుచెవులతో ఎత్తి, గాలిలో గిర గిరా తిప్పి నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యాలనిపించి, దానికి దగ్గరగా వెళ్లసాగాను. ఆగు, నీ పరిధిని దాటుతున్నావన్న కుందేలు హెచ్చరిక లెక్కచేయకుండా, కుందేలుకు, ఇంకా దగ్గరికి వెళ్ల సాగాను. నేను దగ్గరికి రావటాన్ని గమనించి, కుందేలు రెప్పపాటులో అద్రుశ్యమయ్యింది, ఆశ్చర్యంగా.


ఛాయా చిత్రాలపై కాఫీ, టీ హక్కుదారులు: cbrao

8 కామెంట్‌లు:

Aruna చెప్పారు...

Nice.[:)]

సుజాత వేల్పూరి చెప్పారు...

"చుట్టూ చూశా ఎక్కడన్నా తాటాకు దొరుకుతుందేమోనని.." హ హ ! తెలుగు మాటలు నేర్చిన కుందేలు "బ్లాగో అంటే బ్లాగో " అంటుందన్నమాట అయితే!

Ramani Rao చెప్పారు...

మరి తెలుగు ధారాళంగా మాట్లాడుతున్న ఆ కుందేలు, మన బ్లాగు మిత్రులని కలవడానికి భారత దేశానికి వస్తుందేమో కనుక్కోలేకపొయారా? మేము చూసి/విని ఆనందించేవాళ్ళము కదా! అవునూ అడిగానని అనుకోవద్దు, చెప్పకుండ దాటేయద్దు, విదేశీ ప్రయాణ జోరులో మీ తెలుగు భాష తీరు కాస్త మారినట్లుంది. ఆంగ్ల భాష ప్రభావమా?

Sujata M చెప్పారు...

చాలా బావుంది. తెలుగు వచ్చిన కుందేలుని చూసి, నేను సెంటి 'మెంటల్ ' ఐపోయానేమో - ఐస్ లోంచీ వాటర్ వచ్చింది. నిజం చెప్పమన్నారా - విహారి అన్న పేరు చూసి ఏమన్నా నవ్వొకోవచ్చని ఇటొచ్చాను - తరించాను. చాలా ఇన్ ఫర్మేటివ్ !! హాలోవీన్ శుభాకాంక్షలు.

సుజాత వేల్పూరి చెప్పారు...

మేము కొలరాడో వెళ్ళినపుడు Garden of Gods అనేప్రదేశం చూశాము. ఇలాగే ఉంటుంది. అదేనా ఈ రెడ్ రాక్స్?

cbrao చెప్పారు...

@Sujata: They are different.Pl see the link for Red Rocks as given in the article.

అజ్ఞాత చెప్పారు...

కుందేలు అదిరిందండి, అసలు నేను నిజం అనుకున్నాను. :-)

Prasanna Kumar చెప్పారు...

మీ బ్లాగ్ అద్భుతం రావు గారు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి