శనివారం, డిసెంబర్ 19, 2009

పుస్తకాల వరదలు -రెండవ రోజు



కంచం ముందు కూర్చున్నాక ఈ రోజు కంచంలో అన్నం బదులు ఎవరైన పుస్తకాలు వడ్డిస్తే ఎంత బాగుండును అని ఎప్పుడైనా అనుకున్నారా? అకస్మాత్తుగా అల్లాఉద్దీన్ వచ్చి మీ గదంతా పుస్తకాలతో నింపిపోతే? మీకు లాటరీలోలక్ష పుస్తకాలు వస్తే? చుట్టూ పుస్తకాలు - ఏ పుస్తకం చదవాలి ? హైదరాబాదు నెక్లేస్ వీధిలో పుస్తక ప్రదర్శన మేళా కువస్తే అదే పరిస్థితి. ఏ స్టాల్ కు వెళ్లాలి? ఏమి కొనాలి? నేను ప్రతిరోజూ జేబు నిండా పైకంతో వెళ్లి, వచ్చేటప్పుడు రెండుచేతుల నిండా పుస్తకాల సంచులతో ఇంటికి వస్తున్నా. ఇంకా చూడవలసిన దుకాణాలు ఎన్నో మిగిలిపోతున్నాయి.



రాజన్, సతీష్, విజయ శర్మ సందర్శకులతో

సరేమన e తెలుగు స్టాల్ బ్లాగర్ వాలంటీర్లతో, వచ్చే పోయే సందర్శకులతో సందడిగా ఉంది. ఎప్పటివలే సహృదయచక్రవర్తి నిన్న స్టాల్ కు వచ్చే తరుణంలో జిలేబీలు, కారం వస్తువులు తెచ్చి ఆకలితో వున్న వాలంటీర్ల మెప్పు పొందాడు.




ఈ పుస్తక మేళాలో ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుందని నిన్న చెప్పా కదా. ఈ రోజు Speed Math -Tutor పుస్తకావిష్కరణ.మంత్రివర్యులు గల్లా అరుణకుమారి (గౌరవనీయ రహదారి మరియు భవనముల శాఖా మంత్రిణి, ఆంధ్ర ప్రదేష్) చేతుల మీదుగా జరిగింది. వారు మాట్లాడుతూ " పుస్తకాలపట్ల ఆదరణ కరువైన ఈరోజులలో ఇలాంటి పుస్తక ప్రదర్శనలు చదువరులకు పుస్తకాలపై ఆసక్తిని మరలా పెంచుతాయి. మా నాన్న గారు మాకు బాల్యమునుంచీ పుస్తకాలపై ఆసక్తి కలిగేలా పెంచారు. వారు పుస్తకాలను ఎంతగానో ప్రేమించే వారు. చిన్నప్పుడు మాకు బొమ్మలకు బదులుగా మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చేవారు. వారు స్వతహాగా రచయిత. మా తండ్రి రాజగోపాలనాయుడుగారు కురుక్షేత్ర, రామానుజ ప్రతిజ్ఞ, వీర శివాజి, బుద్ధం శరణం గచ్ఛామి మొదలగు పుస్తకాలు రచించారు. శివాజికు అతని మామగారు శౌర్యం ఉప్పొందేలా ఉత్తేజకరమైన కథలు చెప్పేవారు. గోర్కీ అమ్మలాంటి కథ ఎంతోహృద్యంగా ఉండి జీవితానికి మంచి ప్రేరణనిస్తుంది. గొప్పవారి ఆత్మ కథలు ఆత్మప్రబోధాన్ని కలుగచేస్తాయి.ప్రకాశంపంతులుగారు బయటకు వెళ్లినప్పుడు ప్రతి రోజు న్యాయవాది తారసపడేవారు. ఆ స్ఫూర్తితో తను కూడా నిత్యజీవితంలో న్యాయవాది కావాలని ఆరాటపడేవారు. కావ్యాలు, పురాణాలు ఎల్లవేళలా ప్రజాదరణ కలిగి ఉంటాయి. మానసిక వికాసానికి దోహదపడే ఈ పుస్తకాల ప్రదర్శన పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న ఊళ్లలోకూడ ఏర్పాటు చెయ్యవలసిన అవసరముంది."



ఎడమవైపు నుండి మనవైపు చూస్తున్న రచయిత గుడిపాటి (తెల్ల చొక్కాలో), కుడి వైపు చివర (తెల్ల చొక్కాలో) రచయిత మురళీ మోహన్ (బ్లాగు: తుర్ఫు ముక్క)

ఈ రోజు నేను సందర్శించిన పుస్తకాల షాపు పాలపిట్ట బుక్స్. ఇక్కడ పలు పుస్తకాలు నన్ను ఆకర్షించాయి. మొదటగా ఆకట్టుకున్నది 2,178 వీక్షణలు, అత్యధిక వ్యాఖ్యలు 57 పొందిన (http://pustakam.net/?p=2432) జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య పేరుతో ఎన్.వేణుగోపాల్ పీఠిక గల అఫ్సర్ తాజా కవితల పుస్తకం ఊరి చివర. ఏలే లక్ష్మణ్ ముఖచిత్రరచనతో ఉన్న ఈ పుస్తకం డిసంబర్ 2009 లో వెలువడింది. నన్నాకర్షించిన మరో పుస్తకం ' వాన కురిసిన పగలు ' -తమ్మినేని యదుకుల భూషణ్ కవితలు. మన తెలుగు బ్లాగరు కస్తూరి మురళీకృష్ణ పుస్తకాలు జీవితం -జాతకం (కథలసంకలనం) ఇంకా మైకేల్ జాక్సన్ పుస్తకాలు తీసుకున్నా. ఆంగ్ల సాహితీ కారులను పరిచయం చేసే గుడిపాటి గారి పుస్తకం కిటికీ (ఏలే లక్ష్మణ్ ముఖచిత్ర రచన) ఇంకా పూడూరి రాజా రెడ్డి వ్రాసిన మధుపం తీసుకున్నాను. ఈమధుపానికి ఉపనామం ఒక మగవాడి ఫీలింగ్స్. పూడూరి రాజా రెడ్డి బ్లాగు చిరునామా http://raji-fukuoka.blogspot.com/ . మధుపం పై సమీక్ష కై చూడండి http://pustakam.net/?p=2544
పాలపిట్ట బుక్స్ దుకాణం లో వార్త లో పనిచేసే గుడిపాటి , వసంత గార్ల పరిచయమయ్యింది. సాయంత్రం ఆరు తర్వాత వీరు అక్కడ కనిపించే అవకాశముంది. తెలుగు బ్లాగరు మురళీమోహన్ ఓడిహళ్ల (బ్లాగు తుర్ఫు ముక్క) పుస్తకాలు కూడా ఇక్కడ కనిపించాయి.



ఎడమ నుండి కుడి వైపు విజయ శర్మ,మురళీమోహన్ ఓడిహళ్లి, రాజన్, సి.బి.రావు,శ్రీనివాస కుమార్, సతీష్ కుమార్, ఇంకా కశ్యప్

కార్యదర్శి కశ్యప్ మన e తెలుగు మిత్రుల సహాయంతో ఒక చక్కటి CD ని రూపకల్పన చేయటం జరిగింది. కంప్యూటర్లో తెలుగు వాడేవారికి, తెలుగు బ్లాగర్లకు సైతం తెలియని softwares ఇందులో పొందుపరచటం జరిగింది. స్టాల్ దర్శించే వారికి నామమాత్రపు విరాళానికే దీన్ని అందచేస్తున్నారు. దీనిలోని విషయాలు గురించి చెప్పటానికి ఒకప్రత్యేక వ్యాసం వ్రాయాల్సుంటుంది. తెలుగు బ్లాగర్లు స్టాల్ లో ఈ CD అడిగి తీసుకోండి. పదో లేక ఇరవైరూపాయలు విరాళంగా ఇచ్చి e తెలుగు కోశాధికారిని సంతోషపెట్టండి. అసలే మనకు రాబడి తక్కువ ఖర్చు ఎక్కువకదా. ఈ CD పెక్కు విశేషాలతో ఉపయుక్తంగా యుండగలదు. Inscript tutorial ఉందన్నారు. పాఠకులు ఈ CD వాడి దానిపై తమ అభిప్రాయం వ్రాయగలరు. మీ సూచనలు అమలుపరచటానికి ప్రయత్నం చేస్తాము.



కూర్చున్న వారు ఎడమనుండి : సి.బి.రావు, శ్రీనివాస కుమార్, ఇంకా కశ్యప్
నుంచున్న వారు ఎడమనుండి : మురళీధర్ నామాల, సతీష్ కుమార్, ఇంకా విజయ శర్మ

ఈ రోజు మన స్టాల్ కు పలువురు విచ్చేసి తమ సందేహాలు తీర్చుకున్నారు. కంప్యూటర్ విజ్ఞానం మాస పత్రికసంపాదకులు N.G. తేజ మన స్టాల్ సందర్శించారు. మన సహాయం కోరారు. జనవరి 2010 సంచికతో బాటుగా తెలుగు బ్లాగులపై ఒక ప్రత్యేక CD ఇస్తున్నారు. అంతే కాకుండా తెలుగు బ్లాగులపై 64 పేజీల ప్రత్యేక అనుబంధాన్నికూడా అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి editor@computervignanam.net Cell: 97040 70000

ఇంతవరకూ ప్రదర్శనశాల దర్శించిన ఇద్దరు మహిళా బ్లాగర్లను గుర్తించాను. వారు శ్రీమతి మాణిక్యాంబ (మనకోశాధికారి చక్రవర్తి తల్లి). బ్లాగు: ఓ సగటు భారత నారి ఆలోచనలు..
http://ratnahamsa.blogspot.com/
మరొకరు శ్రీమతి జ్వలిత (విజయ కుమారి) -ఉపాధ్యాయిని, కవయిత్రి.
బ్లాగు పేరు: జ్వలిత
http://jvalitha.blogspot.com/
వీరు ఖమ్మంలో ఉపాధ్యాయిని. ఇంకా ఆవిష్కరణకాని తమ పుస్తకం "సుదీర్ఘ హత్య " - కవిత్వం ప్రతిని నాకు కానుకగా ఇచ్చారు. ఈ కవితలు పలు పత్రికలలో గతంలో ప్రచురించబడ్డవి. "సుదీర్ఘ హత్య " అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుందిప్పుడు."అసమర్ధులు ఆయుధాలు పట్టుకోరు - మౌన మంత్రాలు మార్గాలు చూపవు - ఊహాగానాలు ఉద్యమాలు నడపలేవు - కాలుతున్నప్పుడు సిద్ధాంతాలుండవు -కడుపైనా...బతుకైనా " - జ్వలిత

పాలపిట్ట పుస్తకాలస్టాల్ లో గుడిపాటి పుస్తకాలపై వారి సంతకమడగటం మరువొద్దు. స్టాల్ నిర్వాహకులనడిగితే అక్కడికి వచ్చే రచయితలను పరిచయం చేస్తారు.రాయాల్సింది చాలా ఉంది. ప్రతి రోజు విశేషాలు చూడండి. నేటికింతే.

Photos: cbrao Canon Powershot SD1100IS

5 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

మీ టపా మొదటి పేరా నాకు భలే నచ్చింది. నా విషయంలో ఇలాంటి ఊహలు నిజమైతే భలే ఉంటుంది.

రావు గారూ, మొత్తానికి పోయిన సారి మీరు లేకుండానే బుక్ ఫేర్ కాస్తా అయిపోయింది. ఈ సారి ఇంత యాక్టివ్ గా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది.

నేను ఆదివారం మధ్యాహ్నం నుంచీ స్టాల్ లో ఉండటానికి వస్తాను. అంటే కేవలం అందుకే కాదూ..పుస్తకాలు కూడా కొనుక్కోడానికి!

Afsar చెప్పారు...

భాస్కర రావు గారు:

పుస్తక ప్రదర్శన గురించి రాసి, మమ్మని వూరిస్తున్నారు. సుజాత గారన్నట్టు, ఆ మొదటి పారాగ్రాఫు మరీ మనో విందుగా వుంది.

గుడిపాటి "పాలపిట్ట" గురించి అన్ని చోట్లా మంచి మాటలు వింటున్నా, చదువుతున్నా. చాలా కాలం తరవాత సీరియస్ పుస్తక ప్రచురణని వొక బాధ్యతగా తీసుకుని పని చేసే వొక పబ్లిషరు మనకి దొరకడం అదృష్టం. ఆయన కష్టానికి తగిన ఫలం కూడా దొరకాలని ఆశిద్దాం.

అఫ్సర్

cbrao చెప్పారు...

@సుజాత : ఈ రోజు పలు మహిళా బ్లాగర్లు వచ్చారు. రేపు కూడా రావచ్చు. మీరు వస్తే మాకు సంతోషమే.

cbrao చెప్పారు...

@అఫ్సర్: పుస్తకాలతో అందమైన అమ్మాయిలు cat walk చేస్తే ఎలావుంటుందో ఊహించగలరా? ఇదో కవితా వస్తువవుతుంది కదా! చూడండి పుస్తక ప్రదర్శన - నాలుగో రోజు విశేషాలు.

భావన చెప్పారు...

Wonderful.మీ మొదటి పేరా మనసునెక్కడికో తీసుకుని వెళ్ళింది. :-)
అబ్బ ఎన్ని పుస్తకాలో... మీరంతా లక్కీ ఫెలోస్. మరి మాలాంటి వాళ్ళకు చూసి కొనుక్కుంటే పంపించే ఆలోచన కూడా చెయ్యడీ పుణ్యం వుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి