ఆదివారం, ఫిబ్రవరి 19, 2012

మహమ్మద్ ఖదీర్‌బాబు కధా సంపుటం - న్యూ బాంబే టైలర్స్-1

మహమ్మద్ ఖదీర్ బాబు  అంధ్ర పాఠకులకు చిరపరిచితుడు. ఖదీర్ తన మొదటి కధ పుష్పగుచ్ఛం ను 1995 లో వ్రాసాడు. ఖదీర్ ఆత్మకధ, కావలి లోని తల్లితండ్రులు, మిత్రులు, అక్కడి ముస్లిం వ్యక్తుల జీవన చిత్రణ ఐన దర్గామిట్ట కధలకు మంచి గుర్తింపు వచ్చింది. దర్గామిట్ట కతలు తో ఎందరో ఖదీర్ అభిమానులయ్యారు.  దర్గామిట్ట కతలే కాకుండా ఖదీర్ వ్రాసిన ఇతర పుస్తకాలు ప్రశంసలను, విమర్శలను సంపాదించాయి. ఏ రచయితకైనా పాఠకుల స్పందన కావాలి. He wishes to Get Noticed. ఖదీర్ కు ఇలాంటి గుర్తింపు చాలినంతగా ఉంది. ఇప్పటి దాకా ఖదీర్ వ్రాసిన పుస్తకాలపై ఒక హ్రస్వ వీక్షణ చేద్దాము.  

Link 1                               Link 2 
పోలేరమ్మబండ కతలు (2004 )  - బాల్యం, స్కూల్ విద్యార్థుల కధలు, జ్ఞాపకాలు

Bring mouse on top of titles to get linked pages

దర్గామిట్ట కతలు

ఈ కధలు చదివాక ముళ్లపూడి  ఖదీర్ ను అభినందిస్తూ  “ఈ (కతల) నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచిని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ, అమ్మలూ, అవ్వలూ, తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు” అంటారు.
ఖదీర్ బాబు కధలను పరిచయం చేస్తూ   కొత్తపాళి "సజీవ మైన పాత్రలతో నిజ జీవితాన్ని సెంటిమెంట్ల లాంటి చీప్ ట్రిక్కులేవీ లేకుండా సూటిగా, కొంత హాస్యంతోనూ, కొంత ఆర్ద్రతతోనూ కలిపి చెప్పుకొచ్చిన చక్కటి కథలు. మీకు మధ్య తరగతి తెలుగు ముస్లిముల జీవితం గురించి ఆట్టే తెలియక పోతే పుస్తకం తెరవగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది. కంగారు పడకుండా రెండడుగులు లోపలికి వచ్చారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాగా తెలిసిన వాళ్ళే. " అంటారు.

బాలీవుడ్ క్లాసిక్స్

మన్ చాహే గీత్


నూరేళ్ళ తెలుగు కథ

అందరితోను ప్రశంసలు పొందిన ఖదీర్ కు దిష్టి తగిలినట్టుంది. ఈ పుస్తకం ప్రశంసలతో పాటు విమర్శలనూ అందుకొంది. కధలను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేశారని కొందరు, తెలంగాణ రచయితలకు తగినంత ప్రాధాన్యం లభించలేదని ఇంకొందరు, కధలు తిరిగి చెప్పిన తీరు బాగా లేదని మరికొందరూ విమర్శలు గుప్పించారు.  నామిని శిష్యుడైన ఖదీర్ పై నామిని ప్రభావం ఉంది.  వీరిద్దరిలో ఎవరు పెద్ద పుడింగో  విమర్శకులకు అంతుపట్టలేదు.

న్యూ బాంబే  టైలర్స్ - Genre వృత్తుల ఇతివృత్తం, ప్రపంచీకరణ, ఆటంకవాదులు, ముస్లిం వ్యక్తుల జీవన చిత్రణ 
ఖదీర్ పై విమర్శలకు సమాధానమా అన్నట్లు ఇప్పుడు వెలువడింది న్యూ బాంబే  టైలర్స్ పేరుతో కొత్త కధా సంపుటి. మనల్ని వెంటాడే, మధన పరిచే కధలున్నాయిందులో.   
ఈ సంపుటం లో వచ్చిన గెట్ పబ్లిష్డ్  కధను ఒక పుస్తకంగా హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు గతంలో ప్రచురించారు.  ఇదే కాదు ఖదీర్ వ్రాసిన కొన్ని కధలు ఇలా ఒకో కధ ఒకో పుస్తకంగా వెలువడి  ఒక కొత్త వొరవడిని సృష్టించాయి.
 Click on photo to enlarge
Left to right: M/s Jampala choudary, K.I.Varaprasad Reddy,Volga, Khadeer Babu, Danny, Satish Chandar
ఫిబ్రవరి 15, 2012  న హైదరాబాదు ప్రెస్ క్లబ్, సోమాజిగూడాలో, వొల్గా గారి అధ్యక్షతన  ఈ  పుస్తకాన్ని శాంతా బయోటెక్స్ అధినేత కె.ఐ. వరప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించారు. 

అధ్యక్షురాలు వొల్గా మాట్లాడుతూ  ఈ సంపుటం లోని చివరి కధ (Get Published) తనను ఎంతో వొత్తిడికి గురిచేసిందని, సాధారణంగా పుస్తకావిష్కరణ తరువాత మాత్రమే సంపుటం లోని కధల గురించి మాట్లడతారని కాని తాను ఆ కధ చదివిన వేదనలో ఆ కధ గురించి మాట్లాడలేకుండా ఉండలేక పోతున్నానని, ఆ కధ పూర్వాపరాలగురించి వివరించారు. వారు చెప్పింది వినే ముందు పాఠకులకు ఆ కధ మూడు ముక్కలలో చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో మొత్తం ఐదు పాత్రలు. 1) షకీల్ -ఆంధ్రా ప్రాంతపు పత్రికా రచయిత, హైదరాబాదులో పని చేస్తుంటాడు. 2) డ్రైవర్ ఉద్యోగం చేసే, గొడ్డు మాంసం పై ప్రీతి కల నయాబ్ 3) మసీదు వద్ద చెప్పులకు కాపలా కాసి జీవనొపాధి గడించే నయాబ్ భార్య ఫాతిమ 4) మసీదు మెట్లపై  దొంగ మెడికల్ ప్రిస్క్రిప్షన్ తో యాచించే ఫాతిమా కొడుకు ముష్టాక్ 5) రచయిత షకీల్ యొక్క కార్యాలయ సంపాదకుడు.  ముంబాయి తాజ్‌మహల్ హోటల్ పై దాడి జరిగినప్పుడు  నయాబ్ ను, అతని మిత్రులను ఆటంకవాదులుగా అనుమానించి, పోలీసులు ఇంట్లోంచి బలవంతంగా తీసుకుపోయి పలు చిత్రహింసలకు గురిచేసి చివరకు సరైన ఆధారాలు లేని కారణంగా వదిలివేస్తారు. అయితే ఆటంకవాదులుగా ముద్రపడిన కారణంగా వీరి జీవితం   అస్తవ్యస్తమవుతుంది. షకీల్ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానన్న నష్టపరిహారాన్ని, పరిహారంతో న్యాయం జరగదని,  ఫాతిమా తిరస్కరిస్తుంది. నయాబ్ కుటుంబపు వ్యక్తులెవరూ ఆ పై మసీదు వద్ద కనపడకుండా ఎటో దూరంగా వెళ్లిపోతారు. రాజ్యహింసకు గురైన నయాబ్ లాంటి వాళ్ల కధలు చదివి మనం ఒక నిట్టూర్పు విడుస్తాము.  వోల్గా గారి మాటలలో ఈ కధా పరిచయం వినండి.  


http://dl.dropbox.com/u/31976678/nbt-1.mp3


ఈ కధా సంపుటం లోని మొదటి కధ న్యూ బాంబే  టైలర్స్ . ఈ కధ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్ధుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు  సంపాదించుకుంటున్న తరుణంలో  పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్   ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు.  ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కధ. ఈ సంపుటి లోని జమీన్ కధకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై  కధ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం:  ఇది ఇద్దరు బాల్యమిత్రుల కధ.  కసాయి కొడుకు హుసేన్, మాలపల్లె లో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాల లో ఉండే హుసేన్‌కు తన స్వస్థలమైన కావలి లో చిన్న ఇల్లు కట్టుకోవాలని, అక్కడే కనుమూయాలని ప్రగాఢ కోరిక.  స్థలం లభ్యమయ్యిందన్న కబురు బ్రమ్మయ్య నుంచి అందగానే కావలికి పయనమైన హుసేన్ ఆ స్థలం తన మిత్రుడు బ్రమ్మయ్యదే అని తెలుసుకొని ఆనందభరితుడవుతాడు. అయితే బ్రమ్మయ్య కొడుకు రమణ ఆర్.ఎస్.ఎస్. పార్టీ లో చేరి ఆ సిద్ధాంతాలను ఒంటపట్టించుకొని, సాయిబు హుసేన్ కు స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో, ఖిన్నుడయిన హుసేన్  చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు, వికల హృదయంతో. 


ఒక సాయంత్రపు అదృష్టం  - ఈ కధను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో  కధ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కధానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రక్రుతి సహజమైన  అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక వర్షం కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు.  రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా,  ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కధానాయకుడిలో  ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా  తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.
   
న్యూ బాంబే  టైలర్స్, జమీన్ మరియు ఒక సాయంత్రపు అదృష్టం కధలపై వరప్రసాద్‌రెడ్డి గారి పరిచయం వినండి.   

http://dl.dropbox.com/u/31976678/nbt-2.mp3


(ఇంకా ఉంది)


మహమ్మద్ ఖదీర్‌బాబు కధా సంపుటం - న్యూ బాంబే  టైలర్స్-2 లో
ఖదీర్‌బాబు  కధలపై జంపాల చౌదరి తదితరుల విశ్లేషణ
ఖదీర్‌బాబు మాటలలో తన కధల గురించి - Video

Photos, Audio, Video and Text by cbrao.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి