శుక్రవారం, డిసెంబర్ 26, 2014

డిసెంబర్ 14, 2014 తెలుగు బ్లాగర్ల సమావేశ విశేషాలు


ఈ నెల డిసెంబర్ 14, 2014 న గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్ లో తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం జరిగింది. సమావేశ ప్రకటన రాగానే
"తెలుగు బ్లాగర్ అని చెప్పుకునేందుకు కూసింత గర్వపడే రోజులు అవి. నాకొక బ్లాగుంది అని మహా ఆనందంగా చెప్పుకున్న రోజులవి. తెలుగు బ్లాగు ప్రపంచం అల్లరితో, నవ్వులతో, గొడవలతో సందడిగా కళకళలాడిన రోజులవి.
"మీరు బ్లాగరా? మీ బ్లాగు పేరేంటి? ఓ మీరేనా?" అని పలకరించుకున్న రోజులవి.
"మీ బ్లాగులో ఆ పోస్ట్ భలే ఉంటుంది. మా ఆఫీసులో అందరి చేత చదివించేసాను. వాళ్ళంతా ఇప్పుడు మీ ఫాన్స్." అని ఒకరినొకరు అభినందించుకున్న రోజులవి.
"ఏవి తల్లీ , నిరుడు కురిసిన హిమ సమూహములు ?..."
తెలుగు బ్లాగరులకి, చదువరులకి తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు" అని నాగ మురళీధర్ స్పందించారు. కొసమెరుపుగా బ్లాగులనే "నిరుడు కురిసిన హిమసమూహాలని ప్లస్సు, ఫేసుబుక్కు, వాట్సుయాపు ఇత్యాది భూతాలు మింగేశాయి." అని, రామరాజు భాస్కర్ వెలుబుచ్చిన వ్యాఖ్య, ఇప్పటి పరిస్థితికి అద్దం పడ్తుంది.  


ఈ సమావేశానికి 9 మంది బ్లాగర్లు హాజరయారు. సమావేశ ప్రకటన కేవలం ఒక రోజు ముందు రావటం, అదే రోజు కవి సమ్మేళనం ఇత్యాది ఇతర సమావేశాలు కూడా జరగటం సమావేశానికి తక్కువ మంది బ్లాగర్లు రావటానికి కారణం కావచ్చు.

Bloggers meet Dec 2014.jpg

ఎడమనుంచి కుడివైపు కూర్చున్నవారు: శ్రీయుతులు గుళ్ళపల్లి నాగేశ్వర రావు, సి.బి.రావు, దేవి ప్రసాద్ జువ్వాడి; నుంచున్నవారు ప్రణయ్ రాజ్ వంగరి, సాయికిరణ్ పామంజి, కశ్యప్ ఇంకా సంతోషి కె.  ఈ పై జాబితాకు మరో ఇద్దర్ని జతచేయాలి. వారు శ్రీయుతులు వీవెన్ ఇంకా కూర్మనాథ్. ఈ ఇద్దరూ చిత్రంలో లేరు.  

ఈరోజు సమావేశానికి హాజరయిన బ్లాగర్లను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను.
గుళ్ళపల్లి నాగేశ్వర రావు: ప్రస్తుతం Wikisource Books  లో క్రియాశీలకంగా ఉన్నారు. బ్లాగ్ త్వరలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.
సి.బి.రావు: e-telugu ఉపాధ్యక్షుడు. దీప్తిధార, పారదర్శి బ్లాగులు నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో చాల చిత్రాలు ఎగుమతి చేశారు. వ్యాసాలు వ్రాశారు.
దేవి ప్రసాద్ జువ్వాడి: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి,టెక్నాలజీ ఇంకా రాజకీయాలు అభిమాన విషయాలు. మహతి అనే బ్లాగు నిర్వహిస్తున్నారు.

ప్రణయ్ రాజ్ వంగరి: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, నాంపల్లి లోని రంగస్థల కళల విభాగంలో Project Assistant గా పనిచేస్తున్నారు. వికీపీడియా, కవిసంగమం వగైరా సంస్థల కార్యకలాపాలకు అనుసంధానకర్తగా ఉన్నారు.  నా బ్లాగ్ నా ఇష్టం అనే బ్లాగు నిర్వహణతో పాటు, వికీపీడియ లో కూడా క్రియాశీలకంగా ఉన్నారు.  
సాయికిరణ్ పామంజి: ఈ కింది వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు.
కశ్యప్: e-telugu కార్యదర్శి. వికీపీడియా కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉన్నారు. కబుర్లు అనే బ్లాగు నిర్వహిస్తున్నారు.
సంతోషి కె: M.Sc (Physics) చదివారు. లేఖరి అనే బ్లాగులో విజ్ఞాన, సాంకేతిక విషయాలతో పాటు చక్కటి ప్రేమ కథలు వ్రాస్తున్నారు.
వీవెన్: e-telugu అధ్యక్షులు.  కంప్యూటర్లో తెలుగు లో వ్రాయటం సులభతరం చేసిన లేఖిని వెబ్ సైట్ సృష్టి కర్త.  తెలుగు బ్లాగుల సమాహారం కూడలిని ప్రారంభించారు.  వీవెనుడి టెక్కునిక్కులు అనే సాంకేతిక బ్లాగు నిర్వహిస్తూ అనేక వెబ్ సైట్ల తెలుగు అనువాదానికి విశేష కృషి చేశారు. మిలిపిటాస్, సిలికాన్ వాలి, అమెరికా లో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం, సిలికాన్ ఆంధ్రా వారు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, కంప్యూటర్లో తెలుగు అభివృద్ధికి పెక్కు సూచనలిచ్చారు. తెలుగు వికిపీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు.      
కూర్మనాథ్: BusinessLine దిన పత్రిక లో సాంకేతిక, వ్యవసాయ సంబంధిత విషయాలు వ్రాస్తారు.       


ముందుగా కశ్యప్, హాజరయిన బ్లాగర్ల తో బ్లాగుల్లో సాంకేతిక విషయాలపై మాట్లాడారు. వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. గోడపైని పెద్ద తెరపై కంప్యూటర్ తెరను ప్రదర్శించి కొన్ని విషయాలను విపులీకరించారు. వికీపీడియా గురించి చెప్పారు. సాయికిరణ్ పామంజి తాను నిర్వహిస్తున్న తెలుగు వెబ్ సైట్లకు  Google Adsense ప్రకటనలు రావటం లేదని  తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం గూగుల్ త్వరలో కనుగొంటుందని ఆశిద్దాము.

ఈ సమావేశ సందర్భంలో ప్రశాంతి ఉప్పలపాటి బ్లాగర్ల కోసం తమ సూచన అందించారు. మీరేదైనా సమస్యలో ఉన్నా, మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో ఎదైనా మార్పు తీసుకురావాలన్నా మీ బ్లాగులలో వాటి గురించి వ్రాయండి. మీ మిత్రులను వాటిని share చెయ్యమనండి. సమస్యకు పరిష్కారం, మీరు కొరే మార్పు రాగలదు. దీనికి నాంది మీరే పలకాలి. ఉదాహరణగా ప్రఖ్యాత రచయిత్రి ఆర్ దమయంతి హైదరాబాద్ లోని దుర్గంధం వెదజల్లే అపరిశుభ్ర పరిసరాల గురించి, వాటిని  సరిదిద్ద వలసిన ఆవశ్యం గురించి చక్కటి post వ్రాసారు ఫేస్ బుక్ లో. మీరు మీ దృష్టికి వచ్చిన అంశాల గురించి వ్రాయవచ్చు.  

ఒకప్పుడు తెలుగు బ్లాగు సముదాయానికి ( telugublog@googlegroups.com) కొత్త బ్లాగర్లు తమ సమస్యలు వివరిస్తూ తరచుగా జాబులు వ్రాసేవారు. ఇపుడు విండోస్ ఎక్స్.పి స్థానంలో,  విండోస్ 8.1 రావటం వలన  తెలుగు ఖతులతో సమస్యలు దాదాపుగా తీరినట్లే. ఇప్పుడు సభ్యుల ఉత్తరాలు బాగా తగ్గిపోయాయి.  గూగుల్+ కు, తెలుగు బ్లాగులకు ప్రధాన పోటీదారుగా ఫేస్ బుక్ విజయం సాధించింది. ఫేస్ బుక్ లో చాల మంది తెలుగు వాడటం గమనించవచ్చు. ఇది ప్రమోదకరం.

ఇ-తెలుగు ప్రధాన ఆశయమైన కంప్యూటర్లో తెలుగు వాడటం నెరవేరింది. ఇ-తెలుగు, పాత్రికేయులకు, రచయితలకు  నిర్వహించిన సదస్సులు "మీ కంప్యుటర్ కు తెలుగు నేర్పండి" ఇందుకు దోహదపడ్డాయి. వీటికి పునాదిగా లేఖిని, కూడలి  ఇంకా తెలుగుబ్లాగు గుంపు తమ వంతు పాత్ర సక్రమంగా నిర్వహించాయి. ఈ పరిణామం తృప్తికరం. ఇ -తెలుగు గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు క్రియాశీలకంగా లేదు. ప్రస్తుత సమస్య ఏమంటే, సంస్థ ఆశయాలకనుగుణంగా, సంస్థ కార్యక్రమాలు నిర్వహించే  స్వచ్ఛంద  కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంది. ఔత్సాహిక కార్యకర్తలకు ఇ-తెలుగు స్వాగతం చెప్తోంది.

   

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

Good initiative sir.

Anil Atluri చెప్పారు...

ఆలస్యంగా ఈ సమావేశం గురించి తెలియడం మూలంగా నేను రాలేకపొయ్యాను.
దూరం మరొక కారణం. ఇదివరలో పార్క్‌లో ప్రతి రెండవ శనివారం కలుసుకునేవారం.
"ఇ-తెలుగు ప్రధాన ఆశయమైన కంప్యూటర్లో తెలుగు వాడటం నెరవేరింది."
పాక్షిక సత్యం.

srinivasrjy చెప్పారు...

సమావేశం వివరాలు పంచినందుకు ఆనందంగా ఉన్నా హాజరైన సభ్యుల సంఖ్య ప్రస్తుత తెలుగు బ్లాగుల పరిస్థితికి అద్దం పడుతుంది . తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషిచేసిన ఇ -తెలుగు " గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు క్రియాశీలకంగా లేదు " అన్నారు . మీకు కావాల్సిన కార్కకర్తలు బ్లాగులోకంలో సిద్దంగా ఉన్నారని నేను భావిస్తున్నాను . వారి విధి విధానాలను తెలియపరిస్తే ఇ-తెలుగు ఆశయాల్లో భాగస్వామ్యం అవ్వొచ్చు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి