మంగళవారం, ఫిబ్రవరి 20, 2007

బ్లాగుల కబుర్లు

కౌముది వెబ్‌ మ్యాగజైన్‌కి ఒక రోజున 5000 మంది unique visitors వచ్చారు. కొత్త పత్రిక ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం ఉండటం సహజం.
కూడలికి daily visitors 300 దాకా వుంటారు. ఇవి కాకుండా 500 దాకా rss feeds ఉంటాయి. ఇవన్నీ home page కి వచ్చే hits. అన్ని పేజీల హిట్లంటే ఇంకా ఎక్కువుంటాయని మీరు తేలికగా ఊహించగలరు.
తేనెగూడు జనవరి నెల వీక్షకుల సంఖ్యా వివరాలు
Month Unique visitors Number of visits
Jan 2007 843 2487

తెలుగు బ్లాగుల బలాన్ని అంచనా వేయటానికి ఇలా మనము తులనాత్మకంగా పరిశీలన చెయ్యవచ్చు. వెబ్ పత్రికలు చదివేవారు కూడలి, తేనెగూడు కూడ చదువుతారనుకోవటము కేవలము wishful thinking. వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. ఈ -మాట, కౌముది, ప్రజా కళ వగైరా పత్రికలకు ఉత్తరాలు రాసేవారు మన కూడలి లోని బ్లాగులకు ఎన్నడూ రాయలేదనే విషయం గమనించారా? వెబ్ పత్రికల పాఠకులు భిన్నంగా ఉంటారని తెలుసుకోవటం అవసరం. మీ బ్లాగులో రాస్తే కూడలి పాఠకులు చదువుతారు కాని కౌముది పాఠకులు చదవరు. పాఠకులకు కొన్ని ఇష్టాలుంటాయి. వాటి ప్రకారం తాము బ్లాగులు చదవాలో, వెబ్ పత్రికలు చదవాలో, నిర్ణయించుకుంటారు. మీరు అన్ని వెబ్ పత్రికలు చదవనట్లే, ఆ పత్రికల పాఠకులు తెలుగు బ్లాగులు చదవరు. దీనికి కారణం వారికి మన బ్లాగుల గురించి సమాచారం లేకపోవటం ఒక ముఖ్య కారణం. ఈ లోపాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. మీరు కొత్త పాఠకులను పెంచుకోవాలంటే వెబ్ పత్రికలకు రాయక తప్పదు.

ఆదివారం, ఫిబ్రవరి 18, 2007

అడవిలో అర్థరాత్రి -3

Click on photos to enlarge


అడవిలో అర్థరాత్రి ఎలావుంటుందో, అది విశదమవసాగింది కొద్ది నిముషాలలో. చిమ్మ చీకటి. ఎదురుగా ఏమీ కనిపించదు. మొదట పెద్ద రోడ్ పై వెళ్లే టప్పుడు ఎదుటవారిలో ఎవరైనా లేత రంగు దుస్తులు వేసుకుంటే వాటి ఆధారంగా దారిని గుర్తిస్తూ నడవాలి. అరణ్యఘోష అంటారే అదేంటో అప్పుడు బాగా తెలిసింది. కీచురాళ్లు పెద్దగా రొద చేస్తున్నై. అక్కడక్కడ మిణుగురు పురుగులు గాలిలో ఎగురుతూ మా ముందున్న చెట్లను చూపుతున్నాయి. ముందు ముగ్గురు, అ వెనక ముగ్గురు అలా నడుస్తున్నాము. ఆకాశం నిర్మలంగా ఉండటంతో నక్షత్రాలు స్పష్టంగా కనపడసాగాయి. షఫతుల్లా, BSAP ఉపాధ్యక్షుడు మాకు నక్షత్రాలగురించి తక్కువ స్వరంలో వివరించారు. మధ్య మధ్యలో search light వెలిగించి రోడ్ పక్కలకు focus చేసి వన్యప్రాణుల ఆచూకీ కనిపెట్టడానికి రాజీవ్ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంకొంచం ముందు కెళ్ళాక రోడ్ కి కుడివైపునగల సన్నని బాటలో అడవి అంతర్భాగానికి పయనించ సాగాము. ఇప్పుడు ఒకరి వెనక మరొకరము నడవ సాగాము. అప్పుడు నాకు నేను చదువుకున్న Kenneth Anderson, Jim Corbet ల Man eating tigers of Kumaon కథలు గుర్తు కొచ్చాయి. అవి చదివాక పులి మనస్తత్వం కొంతగా అవగతం అయ్యింది. గుంపుగా ఉన్నా, వాహనం పై ఉన్నా, పులి మనలను attack చెయ్యదు. ఒంటరిగా ఉన్నప్పుడు, వాహనం పై కాక నేలపై ఉన్నప్పుడు అది మనపై నిర్భయంగా దాడి చేస్తుంది. గుంపు లోని వ్యక్తులు single line formation లో వెళితే పులి చివర ఉన్న వ్యక్తిపై దాడి చేసే అవకాశాలు ఎక్కువ. ఆలోచనలో పడి నడవటంతో నేను వెనక పడ్డాను. ఆ single line గా నడుస్తున్న గుంపులో నేనే చివరి వాడిని. నా ముందున్న వ్యక్తి ముదురు రంగు చొక్క వేసుకోవటంతో అతను కూడా కనపడని పరిస్థితి. ఆ సమయంలో పులి ఆ పక్కల ఉంటే అది నిర్భయంగా నా పై దాడి చెయ్యటానికి అనుకూలమైన పరిస్థితులు మెండు కా సాగాయి. ఈ సత్యం అవగతమయ్యాక, నాలో, నాకు తెలియకుండానే భయం మొదలయ్యింది.

అంతలో ఏదొ అలికిడి అవటంతో గుంపు ముందుకు వెళ్లటం ఆగింది. ఎదైనా దుప్పో లేక కుందేలో ఆ చప్పుడుకు కారణం కావచ్చు. Search light వెలిగింది. ప్రకాశవంతమైన వెలుగులో కూడా ఏమి కనపడ లేదు. అడవిలో జంతువులను వాటి కాంతివంతమైన కళ్ళతో గుర్తించవచ్చు. Search light off చేసి మెరిసే కళ్ళకై చేసిన మా అన్వేషణ ఫలించ లేదు. నక్షత్రాలను చూస్తూ,మిణుగురుల నాట్య విలాసాన్ని గమనిస్తూ,నిశ్శబ్దంగా నడుస్తున్నాము. ఎంత నిశ్శబ్దంగా అనుకున్నా కాలి బూట్ల కింద నలుగుతున్న ఎండుటాకుల చప్పుడు తప్ప లేదు.ఏ జంతువునీ కనుగొనలేకపోయామనే నిరుత్సాహం కలిగినా, ఉత్కంఠభరితమైన అర్థరాత్రి అడవిలో అన్వేషణ మరుపురాని జ్ఞాపకాలు మిగిల్చిందని చెప్పవచ్చు. ముందు నడుస్తున్న forest guard ననుసరించి మా tent చేరుకున్నాము. చలి ఎక్కువగా వుండటంతో -(డిసెంబర్ మాసం,అడవి మధ్యన,అదీ సరస్సు ఒడ్డున చలి లేక పోతే ఆశ్చర్యం కానీ, ఉంటే ఆశ్చర్యం ఏముంది?) నేను వేసుకున్న జాకెట్, మేజొళ్ళ తో సహా పడుకున్నా చలి అనిపించింది. కారణం తెల్లారాక తెలిసింది.నేను పడుకున్న చోట గుడారానికి, నా తల వెనక, పెద్ద రంధ్రం కనిపించింది. రాత్రి చీకటిలో గమనించ లేక పోయాను. హతొస్మీ అనుకున్నాను.

మూడవ రోజు: రాత్రి ఆలస్యంగా నిద్రించటంవలన ఉదయం లేవటమూ ఆలస్యం అయ్యింది. కాలకృత్యాల కోసం ఒక నీళ్ళ సీసా తీసుకొని గుడారానికి దూరంగా అడవిలోకి వెళ్ళి ఒక పొద వెనక కూర్చున్నాను, ఎదురుగా వున్న సరస్సు కేసి చూస్తూ.నిన్న ఆనందాన్ని కలిగించిన సరస్సు నేడు భయాన్ని కలిగించింది. నిన్న సభ్యుల ప్రశ్నలకు వహీద్ గారు సమాధాన మిచ్చారు. మామడ అడవిలో పులులు లేవనీ, ప్రధాన రహదారికి అవతలివైపు ఉన్న అరణ్యంలో ఉన్నాయని చెప్పారు. ఈ అడవిలో పులులు లేవు కానీ కొండ చిలువులు అసాధరణం కాదు. వాటి ఆహారం కోసం అవి నిరంతరంగా అన్వేషిస్తూనే ఉంటాయి. నిన్న సరస్సు చుట్టూ తిరిగినప్పుడు అందులో మాకు ముసలి కనిపించలేదు కానీ అందులో అవి ఉన్నట్లుగా వహీద్ గారు చెప్పి, తను ఒక ముసలిని చాయ చిత్రం తీసినట్లుగా చెప్పి, తన cellphone లో ఆ ముసలి చిత్రాన్ని చూపారు. ఇప్పుడు నా ముందు , వెనక ముసలి, కొండ చిలువ కలిపి,రెండు సవాళ్ళు విసిరాయి నాపై - కాచుకో మరి అంటూ... నా చూపు ముందు ఉంచాల్నా, లేక వెనక ఉంచాల్నా అన్న సందిగ్ధం మనస్సును వెంటాడ సాగింది. పని ముగించుకుని tent వైపు వడి వడిగా అడుగులు వేశాను.


నేను tent చేరేసరికి అప్పటికే కొందరు ఉత్సాహవంతులు bird watching మొదలు పెట్టారు. మొహం కడిగాక, కాఫీ తాగుతూ ఆకాశం కేసి చూస్తే


ఒక గరుడ పక్షి ( Brahminy Kite) ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది. నేను నా కెమరా తీసుకుని సరస్సువైపు వేగంగా నడిచాను. నా కోసమే అన్నట్లుగా నే నున్న చోటికే వచ్చిన గరుడ పక్షిని కెమరాలో బంధించాను. Tent దగ్గర కొచ్చే సరికి అక్కడ ఈనాడు విలేఖరి వచ్చి ఉన్నారు. వహీద్ గారి ఆహ్వానంపై హైదరాబాదు నుంచి పక్షుల వీక్షణ కోసం వచ్చిన మా గురించి, మా hobby గురించి cover చేయటానికి వచ్చారాయన. మాతో కొన్ని ప్రశ్నలు , సమాధానాలు ప్రక్రియ అయ్యాక మేము పక్షి వీక్షణ చెస్తున్న కొన్ని చాయా చిత్రాలను వారు తీసుకొన్నారు. వారి report ఈనాడు తీసుకొన్న జిల్లా ఎడిషన్ పుణ్యమా అని అక్కడి అదిలాబాదు జిల్లాకే పరిమితం. ఇదో వింత పరిస్థితి. మన పక్క జిల్లా లో, కాదు కాదు మీరు హైదరాబాదులో అమీర్‌పేట లో ఉంటే మీకు దిల్షుక్‌నగర్ వార్తలు కనిపించవు. ఇదే technology తెచ్చిన మాయాజాలం. ఈ చమత్కారం వలన హైదరాబాదు మిత్రులు నిర్మల్ పర్యటన గురించి ఈనాడులో తెలుసుకోజాలరు.

Birders at telescope

రాజీవ్, దాక్టర్ల బృందం తమతో తెచ్చిన దుర్భిణీ యంత్రాన్ని (telescope) ను సరస్సు ఒడ్డున అమర్చి దూరంగా ఎత్తైన చెట్టుపై ఉన్న Grey Headed Fish Eagle పై focus పెట్టారు. ఈ దుర్భిణీలో ఎంతో దూరంగా ఉన్న ఆ పక్షి ఎదురుగా ఉన్నట్లే అనిపిస్తుంది. పక్షి, దాని habitat స్పష్టంగా తెలుస్తున్నై. Breakfast అయ్యాక అంతా వహీద్ గారికి వీడ్కోలు చెప్పి నిర్మల్ పట్టణం ముందున్న కచ్చార్ చెరువు వైపు మా వాహనాలను పరుగులు తీయించాము. నిర్మల్ కోటకు ఎదురుగా ఉందీ సరస్సు.


Habitat at Kassar Lake
సరస్సు కావల పలు నివాస భవనాలున్నై. ఒక water control point ఉన్న చోట జీపు దిగి , రోడ్ పైనుంచి చప్టా మీదుగా కిందకు దిగి మా bird watching మొదలెట్టాము. అనూహ్యంగా ఎన్నో రకాల పక్షులకు నిలయమైందీ సరస్సు.

Lotus flower in Kacchar Lake

అక్కడక్కడా తామర పూలతో శొభాయమానంగా ఉంది.

Common Coot

ఎదురుగా ఎన్నో బొల్లి కోళ్ళు (Common Coot), Red Crested Pochard, Cotton Teal పక్షులు అధిక సంఖ్యలో కనిపించాయి. ఇవికాక వెరే రకాల పక్షులు చిన్న సంఖ్య లో కనిపించాయి. Asian WaterFowl Census (Bombay Natural History Society) ప్రాజెక్ట్ కోసం కస్సార్ చెరువు లోని పక్షులను లెక్కించి మా పుస్తకాలలో రాసుకొన్నాము. ఆ report form ఇలా ఉంటుంది. అంతా అనుకున్నట్లే జరిగింది. ఇంక మా అతిధిగృహానికి బయలుదేరాము.

ఇంతకు క్రితమే చెప్పినట్లుగా మా అతిథిగృహం Divisional Forest Officer వారి కార్యాలయ ఆవరణలో ఉంది. ఈ campus చాలా పెద్దది. ఇందులో చాలా వృక్షాలు ఉన్నాయి. అవి ఎన్నో రకాల పక్షులకు ఆవాసమై ఉన్నాయి. అతిథిగృహం ముందున్న పెద్ద చెట్టు తొర్రలో గుడ్లగూబ ( Spotted Owlet)ను మా సభ్యులు కనుగొన్నారు. అంతే కాదు అదే చెట్టుపై రెండు ముక్కుల గువ్వ (Grey Hornbill) ను కూడా గమనించారు. ఇవే కాక మిగతా చెట్లపై అనేక పక్షులను ఆసక్తిగా గమనించారు. ఇంతలో office boy వచ్చి D.F.O., Waheed గారు పిలుస్తున్నరని వర్తమానం తెచ్చాడు. మేమంతా వహీద్ గారికి కృతజ్ఞతలు తెలుపుటకై వారి కార్యాలయ conference hall కి వెళ్ళాము. అప్పుడు వారు మాకు కొన్ని చాయా చిత్రాలు చూపారు. వాటిలో చిన్న పులి పిల్లనెత్తుకున్న వహీద్ గారి చిత్రం నన్నాకర్షించింది.వారినే అడిగితే చెప్పారు. మామడ కంటే ఇంకా ఎగువన ఉన్న అడవిలో ఈ పులిపిల్ల తల్లి నుంచి వేరు పడిందనీ దానిని వారే కొంత కాలం సాకి,బాగోగులు చూసి చివరకు హైదరాబాదు లోని zoo కి అప్పగించామని చెప్పారు. తల్లి నుంచి పిల్ల ఎలా విడివడిందని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ,' తల్లి ఆహారం కోసం పిల్లను విడిచి దూరంగా వెళ్ళినప్పుడు, పిల్ల కొన్ని పరిస్థితుతలో ఆత్మ రక్షణకై ఉన్నచోటు నుంచి దూరంగా వెళ్లడటమూ లేక అది ఉన్నచోటే ఉన్నప్పటికీ అక్కడ గొర్రెల కాపరులు,గొర్రెలూ,మేకలూ అధికంగా వచ్చి ఉండటంతో, తన ఉనికిని వెళ్ళడించటం, తనకు క్షేమం కాని పరిస్థితులలో, తల్లి పిల్లను విడిచి దూరంగా వెళ్ళవలిసి వచ్చినప్పుడు, పిల్ల ఆహారం కోసం తచ్చాడుతూ బలహీనం గా ఉండి forest guard ల చేతికి చిక్కుతుంది.' అని వారు చెప్పారు. Guards కు దొరకని పక్షంలో దానిని శత్రువులు దాడి చెయ్యటమో లేక ఆహారం కోసం అలమటించి, శుష్కించి ఆ పిల్ల చనిపోవటమో జరుగుతుందని వివరించారు. మా అందరకు చక్కటి తేనీరు అందించారు ఈ సమావేశ సమయంలో. వహీద్ గారికి మరోమారు ధన్యవాదాలు తెలిపాము.

నిర్మల్ పట్టణం నిర్మల్ చిత్రాలకు, కొయ్య బొమ్మలకూ ప్రసిద్ధి. నిర్మల్ 1) paintings, 2) toys గురించిన సమాచారానికై ఇక్కడ చూడండి. నిర్మల్ ప్రధాన రహదారిలో society వారి showroom ఉన్నప్పటికీ మాకు వ్యవధి లేనందువలన సందర్శించ లేక పోయాము. తృప్తి చెందిన హృదయాలతో, నిర్మల్ కు వీడ్కోలు చెప్పి, మధ్యాహ్నం 1.30 గంటల బస్ లో హైదరాబాదు కు బయలు దేరి మా మా నెలవులకు చేరుకున్నాము. ప్రియమైన పాఠకులారా, ఈ వ్యాసం మీకు కూడా తృప్తి కలిగించగలదని ఆశిస్తూ -సెలవు.

గురువారం, ఫిబ్రవరి 15, 2007

e - తెలుగు రెండవ అడుగు

ఎంత పెద్ద ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. e - తెలుగు ప్రయాణం మొదలయ్యింది సంక్రాంతి కానుక తో. 11th Feb 2007 న ఈ నెల e - తెలుగు సమావేశం జరిగింది. తొలిసారిగా ఈ సమావేశానికి సత్యశాయి గారొచ్చారు. సమావేశ స్థలం: కుకట్‌పల్లి లోని పటెల్ కుంట ఉద్యానవనం. కుకట్‌పల్లి లో అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరికి చేరుతూనే చదువరిగారికోసం చూశాము. ‘మీ వాడు ‘ చదువరి అక్కడ మా కోసం నిరీక్షిస్తూ కనిపించారు. అందరం కలిసి గమ్యస్థానం చేరాము.
Click on photos to enlarge

Chaduvari and Satya Sai (Left to Right)

మిత్రులంతా ముందు వెనుకగా ఒక్కరొక్కరొచ్చి సమావెశంలో చురుగ్గా పాల్గొనటం జరిగింది. కొత్తగా సమావేశానికి వచ్చిన సత్యసాయి గారు మన తెలుగు బ్లాగరులకు పరిచితులే. వీరి పరిచయం త్రివిక్రం మాటలలో "దక్షిణ కొరియాలో వ్యవసాయ శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్న సత్యసాయి కొవ్వలి (సత్య శోధన) ప్రముఖ తెలుగు బ్లాగరి. చక్కటి భాష, భావ ప్రకటనా శక్తి కొవ్వలి సొత్తు. హాస్యాన్ని రాయగల కొద్ది మంది బ్లాగరులలో సత్యసాయి గారొకరు. బ్లాగు రాసే వారు బ్లాగరి అయితే, శ్రేష్ఠమైన బ్లాగరులను బ్లాగ్వరులు అని, చిరకాలంగా బ్లాగుతున్నవారిని బ్లాగ్భీష్ములు అని ప్రయోగించారొక వ్యాసంలో." ఉద్యానవనం చేరిన వెంటనే బయట ఉన్న ప్రకటన పలకలు (bill boards) మా దృష్టిని ఆకర్షించాయి. వాటిపై రాసుంది ' Photography strictly prohibited' అని. ఈ విషయాన్నే సత్యసాయి గారు తమ బ్లాగులో క్రితమే ప్రస్తావించియున్నారు. గర్భ గుడి లో చాయాగ్రహణం పై నిషేధపు ఉత్తరువులు అర్థం చేసికొనవచ్చు. కాని ఉద్యానవనం లో కూడా వద్దన్న మొదటి భారతీయ ఉద్యానవనం ఇదేనోమొ.


Sriharsha, cbrao and Trivikram

పరిచయ కార్యక్రమం అయ్యాక చర్చ e-తెలుగు మార్గదర్శక సూత్రాలపై (Bye-Laws) జరిగింది. c.b.rao గారు తయారు చేసిన ఈ నిభందనావళిపై సుదీర్ఘ చర్చ తరువాత కొన్ని మార్పులతో దానిని ఆమోదించటం అయ్యింది. సభ్యులు శక్తివంతంగా చర్చ జరుపుటకై చదువరి మిఠాయిలు పంచారు.


Trivikram, Srinivasa Raju, Sudhakar

Bye-Laws మీకు ఇక్కడ లభ్యమవుతాయి.
e telugu Bye - Laws -  Public
e telugu Bye - Law...
Hosted by eSnips


ఈ సమావేశంలో తీసుకొన్న కొన్ని ముఖ్య నిర్ణయాలు.

e-telugu.org website లో
1) ఒక మాస పత్రిక (Unicode or P.D.F.)
2)Wiki Software తో కొన్ని పుటలు (pages). ఇది ఎలావుంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.
ఇంకా


Chava Kiran, Venkata Ramana

Workshop on Telugu Unicode
తెలుగులోని ఉత్తమ టపాలతో ఒక పుస్తక ప్రచురణ. ఈ పనికై ఒక త్రిసభ్య ఆలోచనసభ (Committee) ఉండగలదు.

ఉత్తమ తెలుగు బ్లాగులను e-telugu ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది? షరా మాములే దీనికి ఒక త్రిసభ్య ఆలోచనసభ ఉంటుంది. ఇందులోని సభ్యులను పొటీ లోకి పరిగణించము.


Veeven (Right to Chaduvari) listens keenly to what Chaduvari says about Koodali; ‘A blog must appear in Koodali, soon after it is uploaded.’

Bye-Laws మరియు ఇతర ఆలోచనలపై మీరు ఏమి అనుకుంటున్నారు? రండి, కలిసి నడుద్దాం.
This meeting is powered by Chaduvari.

Text & Photos: cbrao

సోమవారం, ఫిబ్రవరి 12, 2007

తీపి వార్తలు

తీపి వార్తలు - రాస్తున్నది- సి.బి.రావు. చక్ర కేళి అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా? ఇవి గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైనవిగా భావించవొచ్చు. నేను ఆంధ్రప్రదేష్ లో పలు జిల్లాలు తిరిగాను కాని ఇవి గుంటూరుజిల్లాలోనే ఎక్కువగా లభ్యం అవటం వలన మిగతా జిల్లాల వారికి వీటి గురించి పెద్దగా తెలియదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ఇది కనపడదు.ఈ పండు పరిమాణంలో చిన్నది గాను, తీపిదనంలో పెద్దదిగాను ఉంటుంది. దీనిగురించి తెలియని వాళ్ళకు ఇది తీపి వార్తేగా మరి.

తీపి వార్తల వివరాలలోకి వెళ్ళేముందు కొన్ని ముఖ్య ప్రధాన వార్తలు
అ) యహూ వెబ్ సైట్ ఇప్పుడు తెలుగులో
ఆ) ఉత్తమ తెలుగు బ్లాగు బహుమతుల ఎంపిక
ఇ) కూడలి
ఈ) తీపి గుర్తులు

అ) యాహూ అని ఒక కేక Junglee చిత్రంలో షమ్మి కపూర్ వేసినది గుర్తుందా? నేను కొంతకాలం ఆ వెబ్ సైట్ భారతీయులదేమోనని భ్రమపడ్డాను. కాకపొయిననూ యహూ అని మీరు ఇప్పుడు తెలుగు లో కూడా అరవవొచ్చు. చూడండి.
http://in.telugu.yahoo.com/
వార్తలే కాకుండా ప్రత్యేక వ్యాసాలు,కథలు, కాకరకాయలతో ఆకర్షణీయంగా ఉంది. ఈ కింద పేజీ తెరవటంలో మీ సహనాన్ని పరీక్షించవచ్చు.
http://docs.yahoo.com/info/suggest/

ఆ) ఉత్తమ భారతీయ బ్లాగుల nomination ఒక కొలిక్కి వచ్చింది. ఇందులో మీ బ్లాగు పేరు ఇక్కడ చూడండి.
http://www.indibloggies.org/nominations-2006/
ఇక్కడ మీ బ్లాగు పేరు ఉన్నవారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ బ్లాగు పేరు లేకపోతే, వచ్చే సంవత్సరం ఉండగలదని నా అకాంష. దానికై ఇప్పటినుంచే కృషి చెయ్యండి.

ఇ) కూడలి మీకు ఇష్టమని నాకు తెలుసు. బృందావనము, కూడలి - అవి అందరివే. గోవిందుడు, వీవెన్ అందరివాళ్ళే. కూడలి మీకు మరింతగా ఉపయోగపడేదిగా ఉండేందుకు ఏమి చెయ్యాలో మీ సూచనలు పంపండి, దిగువ ఇచ్చిన చిరునామాకు.
http://groups.google.com/group/telugublog/

ఈ) తీపి వార్తలు - తీపి గుర్తులు

మీకేమైన తీపి గుర్తులున్నాయా? ఉంటే ఈ టపాకు మీ వ్యాఖ్యానం లో రాసి మీ మిత్రులతో పంచుకోండి. సంతోషం పంచుకున్నప్పుడు నాలుగితలవుతుందని భట్ల పెనమూరు సంగతేమోకానీ మా పొన్నూరులో అంటారు. మొన్న 22 సంవత్సరాల భూమికను అడిగా. తనకేమైనా తీపి గుర్తులున్నాయా అని. తనూ, ఆకాష్ ఎన్నో సాయంత్రాలు ice cream parlor లలో గడిపారట, ఎన్నో ice creams లాగిస్తూ. ఆ మధురమైన సాయంకాలాలు గుర్తుచేసుకునేందుకై ice creams లో వచ్చే sticks పదిలంగా భద్రపరిచిందట. ఆ sticks తన తీపిగుర్తులని భూమిక తలుస్తోంది. అదండీ తీపిగుర్తులు ఐస్‌క్రీం స్టిక్స్ కథ. అవాక్కయ్యారా!

గురువారం, ఫిబ్రవరి 08, 2007

మీకు వచ్చిన e-mail చదవొద్దు;వినండి

మీ సందేశాలను కింది box లోకి copy & paste చెయ్యండి. ఒక అందమైన అమ్మాయి మీ సందేశాలను తన శ్రావ్యమైన గొంతుకతో చదివి వినిపిస్తుంది. నమ్మటం కష్టంగా ఉందా? మీరే ఆ అమ్మాయిని అడగండి చదవమని - చదువమని నన్నడగవలెనా? పరవశించి చదవనా అని ఆ అమ్మాయి సమాధానం విని ఆశ్చర్య పోండి. ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇంకా తెలుగు నేర్చుకోలేదు. త్వరలో నేర్చుకుంటానంటున్నది.

మాట్లాడే చిన్నది

బుధవారం, ఫిబ్రవరి 07, 2007

వివాహ ఆహ్వాన పత్రం

ఈ మధ్య నాకు అందిన వివాహ ఆహ్వాన పత్రం, తెలుగులో, నూతన తరహలో, భిన్నంగా ఉందీ పత్రిక. మీరూ చూసి, వెయ్యండి నాలుగు అక్షింతలు, నూతన వధూ వరులపై.

Video వివాహ ఆహ్వాన పత్రం

గురువారం, ఫిబ్రవరి 01, 2007

జగమెరిన బ్రాహ్మణునికి జంధ్యమేలా?

ఈ సామెత ఎక్కువమందికి తెలిసిన తెలుగు సామెత. బ్రాహ్మణులెవరో గుర్తించటానికి ఈ జంధ్యం బాగా ఉపయోగపడేది. మరి జగమెరిన బ్రాహ్మణుడిని జంధ్యం లేక పొయినా బ్రాహ్మణుడిగా గుర్తిస్తాము, గౌరవిస్తాము, ఆశీర్వాదం అందుకొంటాము. భాషా ఇండియా బహుమతి గ్రహీత సుధాకర్ జగమెరిగిన బ్రాహ్మణుడు. ఇప్పుడీ సుధాకర్ 'శోధన మీకు నచ్చిందా?' అని అడుగుతున్నారు. నేనడుగుతున్నా - మీ శోధన ఎవరికైనా, ఎందుకు నచ్చదని? తన ఈ బ్లాగును ఇండిబ్లాగర్స్ అవార్డులకు nominate చెయ్యమని రాశారు తన బ్లాగులో. జంధ్యమున్న సుధాకర్ మెడలో మరో జంధ్యం వేద్దామా లేక జంధ్యం లేని వారికి తేనెగూడు వారు sponsor చేస్తున్న ఈ వీరతాడు వేద్దామా? ఆలోచించండి.

- cbrao


పోటీలలో మనకు బాగా నచ్చిన బ్లాగులనే నామినేట్ చెయ్యడం అవసరం. సమర్థుడైన అభ్యర్థిని గత ఎన్నికల్లో గెలిపించామని ఈ ఎన్నికల్లో అతనికి ఓటెయ్యకుండా ఉండం కదా (అంతకంటే సమర్థుడు ప్రస్తుతం పోటీలో ఉంటే తప్ప)? ఉన్నవాటిలో శోధనే అత్యుత్తమ తెలుగు బ్లాగు అని ఎక్కువ మంది అనుకుంటే మళ్లీ శోధనకే అవార్డు రానివ్వండి. తప్పేముంది? పోటీల్లో గెలుచుకునే మెడల్స్ లాంటి ఈ అవార్డులను జంధ్యాలతో పోల్చలేం.

- Trivikram