గురువారం, ఆగస్టు 18, 2011

పుస్తక పరిచయం: అమెరికా ఇల్లాలి ముచ్చట్లు

వ్రాసినవారు: వెనిగళ్ళ కోమల


శ్యామలాదేవి దశిక రచన అమెరికా ఇల్లాలి ముచ్చట్లు బాపు అర్థవంతమైన, ముచ్చటైన బొమ్మ ముఖచిత్రంగా, రచయిత్రి  శ్రీమతి చెరుకూరి రమాదేవి ప్రశంసాపూర్వక వ్యాఖ్యానంతో చూడ ముచ్చటగా తయారయింది. ఇందులో ఎన్నో వూసులు 21 భాగాలుగా గుదిగుచ్చి, 13 కథలు జోడించి, బోల్డ్ ప్రింటుతో చూడగానే చదవాలనిపించేటట్లు ప్రచురించారీపుస్తకాన్ని.

పురాణం ఇల్లాలి ముచ్చట్లు తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు శ్యామలాదేవి. కథా వస్తువు 30, 40 ఏళ్ళనాడు అమెరికా వచ్చిన స్త్రీల అనుభవాలు, వారి జీవన శైలి. చక్కని వాడుక భాషలో, సందర్భానుసారంగా సామెతలు జొప్పిస్తూ, హాస్యరసోపేతంగా ఉన్న వాస్తవాలను చక్కగా చిత్రించారు. సంభాషణలో భార్య, భర్తల మధ్య ఉన్నట్లున్నా భర్త తెరవెనుకే ఉన్నారు.గొప్ప చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి, తక్కువ చదువులు వున్న మధ్య తరగతి అమ్మాయిలను వివాహమాడి వారితో అమెరికాలో మనుగడ సాగించిన వ్యక్తులే ఇందులో పాత్రధారులు. 30, 40 ఏళ్లనాడు శ్యామలాదేవి టీనేజరుగా భర్త రామకృష్ణగారితో జీవితం పంచుకోవటానికి అమెరికాలో అడుగు పెట్టారు. తాను విన్నవీ, కన్నవీ, అనుభవించినవీ, సాధించినవీ ఇందులో అక్షరబద్ధం చేశారు.

పల్లెటూరి పెళ్ళాలుగా వచ్చినా అవకాశాలు అందిపుచ్చుకుని, చదువులు సాగించి, ఉద్యోగాలు చేసి, పిల్లలను ఎవరి ఆసరా లేకుండా పెంచుకొన్న మట్టి బొమ్మలు, బంగారు బొమ్మల్లాగా జీవితంలో రాణించిన ఆడవారి ముచ్చట్లే యివన్నీ. భర్తలు ఉద్యోగాలకు అంకితం అవటం వలన ఇంటి బాధ్యతతో, ఉద్యోగాలతో, పిల్లల ఆలనా, పాలనా, ఆటా, పాటా, చదువూ సంధ్యా, వారి పెళ్ళిళ్ళు అన్నిటిలో అందెవేసిన చేయయిన ఆనాటి తెలుగు అమ్మాయిలు రాణించిన తీరు, అలాంటి వారంటే రచయిత్రికి గౌరవభావం ఉండటం ఇందులో చూస్తాం.

ఇక ముచ్చట్ల కొద్దాం.
పుట్టినరోజు కానుకగా, భర్త చక్కని హ్యాండ్ బ్యాగ్ కొనిస్తే మురిసిపోయి, తన వస్తువులు – అలంకరణ సామగ్రీ అందులో అమర్చుకోవచ్చని తలపోసిన ఇల్లాలికి అనతి కాలంలోనే దాని ఉపయోగం మరోరకంగా ఉండి బస్తా బరువు మోస్తున్నట్లు అయింది. ప్రయాణంలో భర్త యిచ్చిన రూట్ మ్యాప్ కట్టలు, సిగరెట్లు, పర్సు వగైరా, చిన్న పిల్లలకు ప్రయాణం విసుగు పుట్టకుండా ఉండాలి గనుక వారి బిస్కట్లు, కేండీలు, బొమ్మలు పుస్తకాలు అన్నీ ఆ బ్యాగ్ లోనే ఇమడాలి. దూరదేశాల ప్రయాణమైతే పాస్ పోర్టులు, డాలరు బిళ్ళలూ, సమస్తం అందులోనే. మధ్య మధ్య ‘బాగ్ జాగ్రత్త’ అని భర్త హెచ్చరికలతో ప్రశాంతత కరువై బస్తా మోస్తున్న ఫీలింగే.

మగవాళ్ళ మతిమరుపు చూస్తూంటే కోపం జాలి రెండూ కలుగుతాయి. భర్త ఫోనులో మాట్లాడుతూ చేయి అడ్డంపెట్టి “వాడి పేరేమిటి? దానికి పిల్లలెంతమంది? మా చెల్లెలు మొగుడి పేరేంటి?” అని అడుగుతుంటే అన్నీ తామే గుర్తుపెట్టుకోవాలన్నమాట అని విసుక్కున్న సందర్భాలు అనేకం. బ్రహ్మదేవుడు మగవారిని సృష్టించేటప్పుడు జ్ఞాపకశక్తి ఇమడ్చడం మర్చిపోతే సరస్వతీ దేవి గుర్తు చేసిందిట. ఇక మగవారి జ్ఞాపకశక్తిని కూడా అడవాళ్ళ ముఖానే రాసి ఆ మగాళ్ళను పెళ్ళి చేసుకుని మీ తిప్పలు మీరు పడండన్నాడట. ఉద్యోగాలకే అంకితమై ఇంటి విషయాలు పట్టించుకోని మగమహారాజులూ ఉన్నారు. అన్ని కుస్తీలు భార్యలే పట్టాలి. తమ పిల్లల పేర్లూ, వయసులు, చదివే క్లాసులు అడిగితే తడుముకునే వాళ్ళు లేకపోలేదు. ప్రతి దానికి మరచిపోయాను అని తప్పించుకుంటారు.

తెలుగు భాషనూ, సంస్కృతినీ, సంప్రదాయాలనూ ఉద్ధరిస్తామంటూ సంఘాలు పెట్టి స్టేజ్ ఎక్కి ఇంగ్లీషులో ఉపన్యాసాలు దంచుతారు. పైగా పిల్లలకు బొత్తిగా తెలుగు రావట్లేదని చింతిస్తారు. ‘మీరొక్క చేయివేస్తే చాలునోయ్’ అంటూ ఆడవారిని ఉబ్బేసినా, చివరికి పనిభారమంతా వాళ్ళ మీదే పడుతుంది. ఈ మగాళ్ళకు టిఫిన్లు చేసి అందించటం, పిల్లల్ని సముదాయించటం, వారితో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టీసు చేయించటంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ఆడవాళ్ళు. ఆడపనీ, మొగపనీ అనీ తేడాలేకుండా ఇన్ని బాధ్యతలు  నిర్వహించే  ఈ ఆడవారు ‘ఆల్ ఇన్ వన్’ లే గాక ఆ సమాజంలో ఇముడుతూ కూడా తెలుగు తనానికి సంస్కృతికి ప్రతీకలు. అమెరికాలో తెలుగుతనం, సంస్కృతి, సంప్రదాయాలు పచ్చగా కొనసాగటం వారి వల్లనే అంటారు రచయిత్రి.

మగవారికి ఇన్ని చురకలు పుష్కలంగా వడ్డించిన రచయిత్రి వారికి చెందవలసిన క్రెడిట్, గౌరవం, మర్యాదా, మన్ననా ఎంతో సౌహార్ద్రంగా ‘క్రీమ్ ఆఫ్ ది క్రాప్’లో అందచేశారు. మగవారు ఉన్నత విద్యనభ్యసించి, పెద్ద ఉద్యోగాలు చేస్తూ మారు మూల ప్రదేశాలలో సాధారణ చదువులు చదివిన అమ్మాయిలను పెండ్లి చేసుకుని (కారణాలు ఏమైనా) అమెరికా తీసుకువచ్చారు. ప్రపంచాన్ని చూపించారు. చదువుకోవటానికీ, ఉద్యోగాలు చేయటానికీ, మంచి భార్యగా, గృహిణిగా, తల్లిగా రాణించటానికి ఉన్న అవకాశాలన్నీ అందిపుచ్చుకోనిచ్చారు. సమర్థవంతులు స్వశక్తితో బాధ్యతలు నిర్వహించగలిగేలా చేశారు. అలాంటి మగవాళ్ళందరికీ వందనాలంటారు రచయిత్రి.

తెలుగు టి.వి. ముచ్చట్లు చెపుతూ మనల్ని కడుపుబ్బ నవ్విస్తారు. తెలుగు రాని యాంకర్లు ‘వెరీగుడ్డండీ, ఓకేనాండీ, ఓలుక్కేద్దామండీ’ అంటూ బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడామనుకుంటుంటే మనకి టి.వి. కట్టేయాలనిపిస్తుంది. వంటల కార్యక్రమంలో యాంకరు స్వీటు తయారీలో చివరిగా ‘ఎలకల పొడి’ కలిపితే మంచి ఫ్లేవరు ఉంటుందంటుంటే ఫ్లేవరు సంగతి దేవుడెరుగు, అది తింటే ఠపీమని చావటం ఖాయం అంటారు రచయిత్రి. భక్తి కార్యక్రమం ఉదయాన్నే నిర్వహిస్తారు. ఆ టైములో గృహిణికి గుక్క తిప్పుకోకునే తీరికే ఉండదు – ఇక ఆ కార్యక్రమం చూసేదెలా?తెలుగు సంఘాల పేరుతో జరిగే అవకతవకలు, దుబారాలు రచయిత్రి దృష్టినుండితప్పించుకోలేదు. న్యూజెర్సీలో కళాసమితి వారి కృషిని కొనియాడారు సంధ్య కేరక్టరు ద్వారా.

అమెరికాలో పిల్లల చదువుల ముచ్చట్లు చెపుతూ ఆమె చిన్ననాటి బడి, పంతులుగారు, చదువు – గుణింతాలు, ఎక్కాలూ బృందగానంతో వల్లించటం, తప్పు చేస్తే కేన్ దెబ్బలూ, గోడ కుర్చీలూ, కోదండాలు గుర్తుచేసుకుంటారు. వర్షం కురిస్తే బడికి పోనక్కరలేదు. కాగితం పడవలాట, చింతపిక్కలాట, వామనగుంటలాట ఆడుకోవటం మురిపెంగా తలుచుకుంటారు. ఆ జ్ఞాపకాలు ‘పారిజాత పరిమళం’ లాగా మదిని సృజిస్తుందంటారు. అమెరికాలో మంచి బడులున్నా, శ్రద్ధగా బోధించే టీచర్లున్నా, కార్లలో స్కూలుకి దించి, తీసుకువచ్చే తల్లిదండ్రులున్నా బడి అన్నా, టీచరన్నా ఇష్టం లేదంటూ బ్యాగ్ విసిరేసి వీరంగం ఆడే పిల్లల్ని చూసి, అలాంటివారిని తమ ఊళ్ళో బడికి పంపిస్తే చదువు బాగా వస్తుందని చమత్కరిస్తారు.

అమెరికాలో మనవల్ని పెంచటానికి ఈ రోజుల్లో  అమ్మ, నాయనమ్మలూ, తాతయ్యలూ ఇండియా నుండి దిగటం పరిపాటి అయింది. కాని ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చెరొకసారి రమ్మంటున్నారట, అటు ఖర్చు, ఇటు టైము కలిసివస్తుందని అలా చేస్తున్నారట.

‘జంటగా ఎన్నో ఏళ్ళుగా మోస్తున్న బరువు బాధ్యతల్ని అప్పుడప్పుడే దించుకుంటూ, స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్న తరుణంలో హఠాత్తుగా జీవిత భాగస్వామిని కోల్పోయిన ఆత్మీయులకు అంకితం’ అంటూ అన్నపూర్ణ, శేఖర్ ల కథ ‘ప్రేమానురాగం’లో రచయిత్రి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తుంది.

ఇక చివరగా ‘ఇండియా అంతా అమెరికా మయం’ అంటూ ఇండియా విజిట్ కి వచ్చినప్పటి తమ అనుభవాలు నెమరువేస్తారు. బంధువుల యిళ్ళకు వెళితే అక్కడి సీను అలవోకగా వర్ణిస్తారు. ఒక దంపతులు అమెరికాలోని పిల్లలతో ‘ఛాట్’ చేస్తూ బిజీగా ఉండి తరువాత వీరిని పట్టించుకుంటారు. ఇంకొక దంపతులు ఫోనులో అమెరికాలో ఉన్నవారితో మాట్లాడుతూ బిజీ, మరో యింట్లో అమెరికా నుండి పిల్లలు వస్తున్నారని ఏర్పాట్లు పెళ్ళి సందడిని మరిపిస్తారు. మరో వృద్ధదంపతులను పలకరిద్దామని వెళితే వారు అమెరికాలో తమ మనవడి ఉద్యోగ విజయాలూ, అతనికి ఇండియా రూపాయల్లో లెక్కగట్టి వచ్చే జీతం గురించి ఏకరువు పెడతారు. అలా ఎవరింటికెళ్ళినా అంతా అమెరికా మయంగా ఉంటుంది. ఆఖరికి టైలర్ వద్ద బట్టలు కుట్టమని వెడితే, ‘నాదంతా ఎన్.ఆర్.ఐ. బిజినెస్ వారంలో కుట్టమంటే తీరుబడిలేదు. ఇప్పుడిచ్చి వెళ్ళండి. మరో ట్రిప్పులో కలెక్ట్ చేసుకోండి’ అన్నాడట. రచయిత్రి తల్లి దగ్గర పనిచేసే ఆదెమ్మ కూడా అమెరికా జపమే చేస్తుంది. తనతో అమెరికా తీసుకెళితే నాలుగిళ్ళలో పనిచేసి సంపాయించుకుని ఇండియా వచ్చి కంప్యూటర్ బాబు లు   లాగా మంచి యిల్లు కొనుక్కుంటానమ్మా అంటుంది.

ఇవన్నీ మచ్చుకి ముచ్చట్లే. అసలు ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు’ చదివితే మీకే తెలుస్తుంది – ఎంత ఆనందం కలుగుతుందో, ఎన్ని విషయాలు నేర్చుకున్నామా అని. శ్యామలాదేవి కలం నుండి మరెన్నో చక్కటి రచనలు జాలువారాలని అకాంక్షిస్తున్నాను. 

ప్రచురణ – వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
తొలి ప్రచురణ: 2010
1/8 డెమి ఆకారం, పేజీలు:139
ధర: $ 20  రూ.100/-
అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభించును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి