బుధవారం, నవంబర్ 19, 2008
శాన్ ఫ్రాన్సిస్కో లో స్లండాగ్ మిలియనేర్
కాస్ట్రో థీయేటర్ ప్రాంగణం Photo: cbrao
స్లండాగ్ మిలియనేర్ (Slumdog Millionaire) చిత్రం గురించిన వార్తలు, ముఖ్యంగా టోరాంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో People's Choice Award గెలుచుకున్నప్పటినుంచి, ఈ చిత్రం ఆస్కార్ బహుమతికి కూడా పరిగణింపబడవచ్చన్న వార్తలు విన్న తరువాత, ఈ చిత్రం చూడాలనే ఆసక్తి పెరిగింది.
మూడవ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలన చిత్ర మహోత్సవం Photo:cbrao
శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలన చిత్ర మహోత్సవంలో ఈ చిత్రం కూడా వుందని తెలిసాక, శాన్ ఫ్రాన్సిస్కో లో ఈ చిత్రం చూడటం జరిగింది ఆదివారం నవంబర్ 16, 2008 న.
శాన్ ఫ్రాన్సిస్కో నగరం రహదారులు ఎత్తు పల్లాలతో, ఎన్నో మలుపులతో, సుందరమైన దృశ్యాలతో చూడసొంపుగా ఉంది. కొన్ని రహదారులయితే ఏటవాలుగా చాల ఎత్తుగా ఉన్నాయి. కాస్ట్రో ప్రాంతానికి సమాంతరంగా ఉన్న రహదారిలోంచి, మా కారు మలుపు తిరిగి స్లండాగ్ మిలియనేర్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న కాస్ట్రో థీయేటర్ చేరింది కాని కారు నిలుపుకునే స్థలం లభించక, కారు పెట్టుకునే స్థలం కోరకు సుమారు ఒక 15 నిమిషాల అన్వేషణ తర్వాత, అదృష్టవశాత్తు థీయేటర్ కు సమీపం లోనే కారు నిలుపుకునే స్థలం లభించటంతో, మా అదృష్టాన్ని మేమే అభినందించుకున్నాము. కాస్ట్రో థీయేటర్ శాన్ ఫ్రాన్సిస్కో లోని కాస్ట్రో అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం స్వలింగసంపర్కులకు (Gays & Lesbians) పేర్గాంచినది. థీయేటర్ కు ఎదురుగా ఉన్న ఒక బార్ ఇలాంటి Gays కు స్వాగతం చెప్తూంది. గుమ్మం లో ఒక యువకుడు (వయసు సుమారు 32 సంవత్సారాలుండవచ్చు) కేవలం ఒక లోదుస్తును మాత్రం ధరించి, అతిధులకు స్వాగతం చెప్తున్నాడు. ఆ పక్క దుకాణాలలో వీడియో సినిమాలు, అద్దాల బీరువాలలో ప్రదర్శనకుంచారు. ఇవి స్వలింగ సంపర్కులకొరకు, అమ్మకానికి ఉద్దేసించినవి.
మేము కారు నిలిపిన చోటునించి చూస్తే కాస్ట్రో థీయేటర్ ప్రాంగణం కోలాహలం గా ఉంది. ఇప్పటికే ఎంతో పేరొచ్చిన చిత్రం కావున, ఈ చిత్రాన్ని చూడాలని ఉత్సాహంగా వచ్చినవారితో నిండి ఉంది. టిక్కట్లు ముందుగా కొన్నవారు గంట ముందరనుంచే క్యూలో నుంచుని, లోపలికి వెళ్లటానికి ఎదురుచూస్తున్నారు.
థీయేటర్ ముందరి ఈ Box -Office 1922 నుంచీ వుంది Photo: cbrao
ఇక్కడి సినిమాప్రదర్శనశాలలో ఒకటే క్లాస్ ఉంటుంది. కూర్చునే కుర్చీల క్రమ వరుస సంఖ్య టిక్కెట్లపై వుండదు. ముందు వచ్చినవారు వచ్చినట్లుగా ఎవరికిష్టమైన కుర్చీలలో వారు కూర్చొనవచ్చు. వెండితెర ముందర కుర్చీఐనా, దూరంగా ఉన్న కుర్చీ ఐనా అన్ని టిక్కెట్లకూ ఒకటే ధర. చిత్రం సాయంత్రం 7.45 కు ప్రారంభించవలసి ఉన్నది. ఆ సమయానికీ చాలా మంది ప్రేక్షకులు, కూర్చునేందుకై, ఖాళీ సీటు వెదుక్కునే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ముందుకొన్నవారికి, టిక్కెట్లపై సీటు నంబర్ ఇస్తే, థీయేటర్ లో ఇంత గందర గోళం ఉండదుకదా అనిపించింది. కాని టిక్కెట్లపై సీటు నంబరు ముద్రిస్తే, ప్రేక్షకులు సీటు నంబర్ ప్రకారం కూర్చోటానికి, సహాయకులను హాళ్లలో ఏర్పాటు చెయ్యాలి. సీటు నంబరు చూపించేవారి జీతభత్యాల ఖర్చు, ఇక్కడ ఎక్కువ కావున వాటిని తగ్గించటానికి, టిక్కెట్లపై సీటు నంబర్లు ముద్రించరిక్కడ. భారతదేశం లో ఇలాంటి విలాసాలకు (ఇది నిజంగా luxury అంటారా?) అలవాటుపడి, ఇలా సీట్లు వెదుక్కోవటం ఇబ్బందిగా ఉంటుంది. చిత్రానికి ఆలస్యంగా వస్తే భార్యా భర్తలైనా విడివిడిగా, దూరంగా కూర్చోవలసినదే. కొత్త సినిమాలకు ఆలస్యంగా వస్తే ఇక్కడి సినిమా హాళ్లలో పక్క సీట్లు దొరకవంతే.
థీయేటర్ లోపల బంగారు కాంతుల మధ్య వెండి తెర Photo: cbrao
శాన్ ఫ్రాన్సికో నగరంలో 100 వ కొండగుర్తుగా (Landmark building) గా నమోదయిన ఈ కాస్ట్రో చిత్ర ప్రదర్శన శాల , 1922 లో మూడు లక్షల డార్ల ఖర్చుతో నిర్మించారు. కాస్ట్రో ను, వాస్తుశిల్పి తిమోతి. ఎల్, సుందరంగా, మెక్సికన్ చర్చి ని పోలి ఉండే విధంగా నిర్మాణాకృతి ఇచ్చారు.
ప్రాక్పశ్చిమ కళా మేళవింపుల కుడ్య చిత్రం Photo: cbrao
ప్రదర్శన శాల లోపలి కిరువైపు గోడల పై గల కుడ్య చిత్రాలపై స్పానిష్, ఇటాలియన్ మరియు ప్రాచ్య (Oriental) దేశాల కళా ప్రభావం కనిపిస్తుంది. నాటకాలకు, సినిమా ప్రదర్శనలకు అనువుగా స్టేజ్ రూపనిర్మాణం గావించారు. చిత్రశాల బాల్కనీకు, కింద అంతస్తుకు వెళ్లటానికి అందమైన మెట్లున్నాయి. మెట్ల కిరువైపులా అలనాటి పాత చిత్రాల పోస్టర్లు కనువిందు చేస్తాయి. కింద అంతస్తులో, చిత్రాలకు సంబంధించిన సభలు జరుపుకొనే వీలుంది. కాలక్రమేణా ఎన్నో ఆధునిక మార్పులకు గురై, ప్రస్తుతము, అధునాతన శబ్ద వినికిడి యంత్రాలతో ఉన్నది. గతంలో దీన్ని అద్దెకు ఇచ్చి ఉన్నప్పటికీ, ప్రస్తుతం హాలు యాజమాన్యమైన నాసర్ (Nasser) కుటుంబం వారే దీనిని నడుపుతున్నారు. 1400 మంది కూర్చొనగలే ఈ చిత్రశాలలో, ప్రస్తుతము నాటకాలు, విదేశీ చిత్రాలు, చిత్రోత్సవాలు ఇంకా ప్రత్యేకమైన చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.
తెర ముందర ఆర్గాన్ వాయిద్యం వాయిస్తున్న కళాకారుడు Photo: cbrao
సమయం రాత్రి 7.45 కు, హాలులో గల దీపాల వెలుతురు తగ్గింది. ఆశ్చర్యంగా తెరముందుగల ఖాళీ ప్రాంతంలో, కిందనుంచి ఒక చిన్న వేదిక పైకి వచ్చింది, యాంత్రికంగా. ఆ వేదిక పై ఒక సంగీతకారుడు, ఆర్గాన్ వాయిద్యంపై, సుమారు ఒక పదిహేను నిమిషాల పాటు, తన సంగీత నైపుణ్యంతో, అద్భుతమైన స్వరాలు వినిపించాడు.
సంగీత కచ్చేరి ముగిసిన తదుపరి,ఆర్గాన్ యంత్రం ఉన్న వేదిక కిందకి వెళ్లుతుంది, యాంత్రికంగా Photo: cbrao
ఎనిమిది గంటలకు మరల దీపాలు తమ పాత పూర్తి కాంతిని సంతరించుకొన్నాక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు, ఆ కళాకారుడు ప్రేక్షకులవైపు తిరిగి అభివాదం చేశాడు. కరతాళ ధ్వనుల తరువాత, కళాకారుడి వేదిక కిందకు వెళ్లిపోయింది. కార్యక్రమ నిర్వాహకులు వచ్చి, ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని జరపటానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపటంతో, ఆ తదుపరి కార్యక్రమమైన, చిత్ర ప్రదర్శనకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రేక్షకులు కూడా ఆత్రంగా నిరీక్షిస్తుండగా, మరలా దీపాల కాంతి తగ్గి, తెరలు తొలగి స్లండాగ్ మిలియనేర్ చిత్ర ప్రదర్శనకు వేదిక సిద్ధమయ్యింది.
చిత్ర దర్శకుడు డాని బాయిల్, ఈ చిత్రం యొక్క భారత దేశం లోని చిత్రీకరణగురించి, చెప్పినది, చూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
చాలా బావుంది రావు గారూ సినిమా చూడ్డానికి ముందు మీ అనుభవాలు,
అలాగే స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా గురించి మీ అభిప్రాయాలు కూడా వ్రాసి నవతరంగేట్రం చేయమని కోరుకుంటున్నాను.
శాన్ ఫ్రాన్సిస్కో లోని, కాస్ట్రో చిత్రశాలలో సినిమా చూడటం ఒక అపూర్వమైన ఆనంద వీక్షణాన్ని కలుగచేస్తుంది. మీకు కాస్ట్రో పరిచయం నచ్చినందుకు ప్రమోదం. చిత్ర సమీక్షంటారా, అలాగే, వీలు వెంబడి రాసి, ప్రచురిస్తా.
కాస్ట్రో థియేటర్ శాన్ ఫ్రాన్సిస్కన్ థియేటర్లన్నిట్లోకీ అద్భుతమైనది అని వినున్నా కానీ అక్కడికెప్పుడూ వెళ్లలేదు. మీ రివ్యూ చదివాక అక్కడికి తప్పకుండా వెళ్లాలనుకుంటున్నాను.
బావుంది. ఏనార్బర్ లో మిషిగన్ థియెటర్ కూడా కొంచెం ఇలాగే ఉఉంటుంది.
చిత్రాల సమీక్షతో బాటు, మంచి చిత్రశాలల సమీక్ష కూడా మన తెలుగు బ్లాగరులు రాస్తే ఉపయోగంగా ఉంటుంది. పాఠకులు కొత్తఊరు వెళ్లినప్పుడు, ఇలాంటి ప్రత్యేకతలున్న, చిత్రశాలలు చూసే వీలు కలుగుతుంది. శాన్ హోజే ప్రాంతంలో AMC 20 మంచి చిత్రశాలల (20 Screens) గుంపు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి