బుధవారం, మే 04, 2011

మరణశయ్య

Sanjiva Dev Photo:cbrao

మరణం తరువాత ఏమి జరుగుతుంది?  పునర్జన్మలుంటాయా? మరణం అంటే ఒక అంతు చిక్కని  రహస్యమేనా?  మనిషి మృత్యువంటే ఎందుకు భయపడతాడు?   మనిషి మృత్యువంటే ఎలాంటి దృక్పధం కలిగి ఉండాలి?  
"మరణశయ్య" వ్యాసం సంజీవదేవ్ గారు దివంగతులయ్యాక  వారి డైరీలలో  యాదృచ్ఛికంగా కనిపించింది. ఇది ఇంతవరకూ ప్రచురణకాలేదు.  దీప్తిధార పాఠకుల కోసం ఇక్కడ  ప్రచురిస్తున్నాను.

-సి.బి.రావు.

మానవుడు అంతకుముందు అనేక విధాలైన శయ్యల మీద శయనించి ఉంటాడు. కాని, మరణశయ్య మీద శయనించి వుండడు. భీష్మ పితామహుడు తన జీవన సంధ్యలో అంపశయ్యమీద శయనించాడట. ఆయనకు అంపశయ్యయే మరణశయ్యగా వుండిపోయింది. పుట్టిన వాళ్ళంతా ఒకనాటికి మరణశయ్య మీద శయనించి తీరాల్సిందే.కాని హృద్రోగాలు అధికమవుతున్న యీ రోజుల్లో చాలా మంది మరణశయ్యతో పనిలేకుండానే ఎక్కడపడితే అక్కడే ఎవరితో చెప్పకుండానే మరణిస్తున్నారు.
తెలివి తప్పకుండా కొందరు మరణశయ్యమీదనే కొన్నాళ్ళు జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటూ వుండిపోతారు. వారు వర్తమానకాలంలో కంటే భూతకాలాన్నే ఎక్కువగా దర్శిస్తుంటారు. మరణశయ్యమీద శయనించి, వర్తమానకాలం వారికి మరణంతో తగిలి వున్నది. భూతకాలం జీవితంతో.
మరణశయ్య మీద శయనించి వున్న ప్రతివ్యక్తి భూతకాలం మొత్తం వెలుగుతోనే నిండి వుండదు. దానిలో ఎంతో చీకటి కూడా వుంటుంది. అయినా, మరణశయ్య మీది వ్యక్తికి గతించిన తన జీవితంలోని చీకటి కనిపించక వెలుగు మాత్రమే కనిపిస్తుంది. విషాదంలో వున్న వ్యక్తికి చీకటి ఘడియలు ఎక్కువగా గుర్తు రావు. వెలుగు ఘడియలే ఎక్కువగా గుర్తుకొస్తాయి.
బాల్యంలో తాను ఆడిన ఆటలు, యవ్వనంలో తాను పాడిన పాటలు, తాను జరిపిన ప్రణయగాధలు, భగ్నప్రేమ తెచ్చిన వ్యధలు, తాను అనుభవించిన యదార్థకథలు, యీ విధంగా ఎన్నో ఎన్నో మరణశయ్య మీద కళ్ళు మూసుకు పడుకున్నా కూడా తిరిగి ప్రత్యక్షమవుతూనే వుంటాయి. ఆ సజీవ జీవితం మళ్ళీరాదు. ఎన్నెన్నో, యీ చావు పాన్పు ఎక్కక ముందు మరచిపోయిన జీవన లీలలు కొత్తరంగులతో, సరికొత్త రాగాలతో ఇపుడు ప్రత్యక్షమవుతుంటాయి.
జీవితం అంటే నిర్వచనం ప్రకారం సంతోషంగా మరణించటానికి తయారు అయే స్థితి. ఎంత సంతోషంగా జీవిస్తున్నా కూడా ఒక రోజుకు తాను మరణిస్తాననే భయం పీడిస్తూనే వుంటుంది. తమకు ఒకనాటికి మృత్యువు ఎదురవుతుందని మరచిపోయి జీవించేవారు కూడా లేకపోలేదు.
మృత్యువును గురించి నిత్యం భయపడుతుండటం ఎంత అవాంఛనీయమో అసలు మృత్యువు అనేది వున్నదని పూర్తిగా మరచిపోయి జీవించటం కూడా అంత అవాంఛనీయం. ఒకనాటికి మృత్యువు ఎదురవుతుందనే విషయాన్నీ మరవరాదు. మృత్యువు ఎదురవుతుంది; ఒకనాటికి అని భయపడనూ రాదు.
మృత్యువుకు భయపడేవాళ్ళు మృత్యువు అంటే జీవితానికి అంతం కాదనీ, మరణించటం అంటే జీవితంలో ఒక  మార్పు మాత్రమే అనీ, మరణానంతరపు జీవితం వున్నదనీ, తిరిగి పునర్జన్మను పొందుతామనే నమ్మి ఆ ఆశతో సంతోషంగా వుంటారు.
మరణానంతర జీవితం వున్నదో లేదో ఇంతవరకూ రుజువు కాలేదు. అటువంటిది లేదనేది బయటికి కనబడుతున్నది. వున్నదనేది కనపడటం లేదు. బయటకి కనపడనిదంతా లేదని నమ్మటం కూడా ఒక మూఢ విశ్వాసమే. కనపడటం కనపడకపోవటం మాత్రమే సత్యానికి నిదర్శనాలు కావు.
ఏది ఏమైనా, పునర్జన్మ వున్నదనే నమ్మకం చాలామందిలో వుండే మృత్యుభయాన్ని తొలగిస్తుంది. కొంతవరకు పునర్జన్మలో నమ్మకం లేకపోయినా కూడా మృత్యువుకు భయపడకుండా సంతోషంగా మరణించేవాళ్ళు ధన్యులు.
మరణం అంటే విచారం కలగటం. లేక భయం వేయటం సహజం. ఇష్టమైన వాళ్ళనూ, ఆత్మీయులనూ, ప్రియమైన పరిసరాలను వదలి మరోదేశం వెళ్ళిరావటానికే భయపడతారు. వారిని శాశ్వతంగా వదలి వెళ్ళే ప్రయాణం కాదు. కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చే ప్రయాణం. అయినా, వారిని వదిలి వెళుతూ మనసులో బాధపడతారు.
త్వరలో తిరిగి వచ్చి మళ్ళీ ఆత్మీయులను చూచుకొనే ప్రయాణానికి బయలుదేరుతూ తాత్కాలిక వియోగానికే బాధపడే మనిషి ఇంకెప్పటికీ శాశ్వతంగా తిరిగిరాని, ఇక ఏనాటికీ ప్రియమైన వారంతా చిరంతనంగా కనపడని ప్రయాణానికి సన్నాహం అవుతున్నప్పుడు మనిషి బాధపడటంలో ఆశ్చర్యం ఏముంది? ఆ తిరిగిరాని ప్రయాణమే మరణం. మరొక దేశపు ప్రయాణం నిమిత్తం యీ మర్త్యలోకాన్ని వదలాల్సిన అవసరం లేదు. కాని మరణించటం అంటే యీ మర్త్యలోకాన్నే పూర్తిగా, శాశ్వతంగా వదలిపోవాలి. అందుకు విచారం కలగక సంతోషం కలుగుతుందా?
లేదు, సంతోషమే కలగాలి. విచారకరమైన పనిని సంతోషంతో నెరవేర్చటం జీవనాదర్శాల్లోని ఉన్నతమైన ఆదర్శం. నివారించటానికి వీలులేని అనివార్యాలకు అనుకూలపడటం అభ్యసించకపోతే జీవితం విషాదకరమవుతుంది.
మరణం అనేది అన్నిటికంటే అనివార్యమైంది. దాన్ని ఏవిధంగానూ, ఏ దేశంలోనూ, ఏ కాలంలోనూ నివారించటానికి వీలులేంది. ఏ ఇతర విషయాన్ని గురించీ భవిష్యవాణి ఖచ్చితంగా చెప్పజాలంకాని ప్రతివ్యక్తి జీవితంలో తప్పక మరణం ప్రవేశిస్తుందనే భవిష్యవాణిని ఖచ్చితంగా చెప్పగలం...
కనుక వ్యక్తి, మరణశయ్య మీద శయనించి వుండి జీవితం మీద కాంక్షను కాక మరణం మీద కాంక్షను పెంచుకోవాలి. జరిగిపోయిన తన భూతకాల జీవితంలోని తీయని స్మృతులను కాక మరణశయ్య వున్న వర్తమాన కాలపు అనుభూతిని ఆనందమయం చేసుకోవాలి. తాను శయనించి వున్న స్థలాన్నీ కాలాన్నీ కూడా మరచిపోయి ఆ రెంటికీ దూరంగా మరో ఆనందమయి జగత్తులో వున్నట్లు కల్పనను నిర్మించుకోవాలి. ప్రథమంలో ఏ కల్పనయినా, కల్పనగా గోచరిస్తుంది. కాని నిదానంగా అది వాస్తవంగా తయారవుతుంది.
మరణించిన వారిని గురించి ఇటీవల రకరకాల కథలు వచ్చినాయి. సగం మరణించి ఆస్పత్రులలో తిరిగి బ్రతికి వచ్చినవారు చెప్పిన కథలన్నీ ఒకరకంగా వుండకపోవటాన్ని గమనించాల్సిన విషయం. అటువంటి సత్యం అందరకూ ఒకటిగానే గోచరించాలి. కాని మనిషికొక విధంగా గోచరిస్తే అది వస్తుగత సత్యం కాక వ్యక్తిగత భ్రాంతి మాత్రమే అవుతుంది.
ఆ వ్యక్తిగత భ్రాంతికి చెందిన విషయాన్ని మరోవిధంగా సమర్ధించి చూడవచ్చు. నలుగురు వ్యక్తులు కాశ్మీర్ ను సందర్శించి తిరిగి వస్తారు. వారిని అక్కడి విషయాలు చెప్పమన్నప్పుడు వారు నలుగురూ చెప్పిన విషయాలు దేనికదే భిన్నంగా వుంటుంది. నలుగురి వివరణలూ ఒకటిగా వుండవు. ఇదే రీతి మరణించి తిరిగివచ్చిన వారికి కూడా వర్తింపచేస్తే వారు చెప్పింది మాత్రం అసత్యం ఎట్లా అవుతుందీ అని.
ఈ రెంటికీ పైకి పోలికవున్నట్లు కనిపించినా అసలులో పోలిక లేదు. కాశ్మీర్ సందర్శించి వచ్చిన నలుగురు చెప్పిన మాటల్లో భేదం వున్నది కాని ఆ మాటలు తెలిపిన విషయంలో భేదం లేదు. నలుగురు తెలిపిన విషయం ఒకటిగానే వున్నది. కాని మరణించి తిరిగి వచ్చినవారు తెలిపిన విషయంలోనే భేదం వున్నది. ఇక మాటల బేదం ఎందులో అయినా వుండనే వుంటుంది.  విషయమే భేదించింది కనుక వారు చెప్పింది వస్తుగత సత్యంకాక వ్యక్తిగత భ్రాంతి అని నమ్మాలని వస్తుంది.
మరణానంతర జీవితం, పునర్జన్మ మొదలైనవి వుంటే సంతోషించాల్సిందే. సందేహం లేదు. మరణం, జీవితానికి ఒక అంతం కాక మార్పు మాత్రమే అయితే ఆహ్లాదమే కాని విచారం కాదు. ఆ విధంగా పునర్జన్మలే వుంటే, వ్యక్తికి తన క్రిందటి జన్మ ఎందుకు గుర్తుండదా అని.
అందుకు సమాధానం ఏమంటే క్రిందటి మూడు రోజుల క్రింద తిన్న కూర గుర్తుండదు. అటువంటప్పుడు ఎన్నో ఏళ్ళ క్రిందట మరణించటానికి పూర్వం వున్న క్రిందటి జన్మ ఏవిధంగా గుర్తుంటుందని. దానికి తోడు మరణం అనే ఒక గొప్ప శారీరక, మానసిక పరివర్తన ఆ జన్మకూ యీ జన్మకూ మధ్య నిలచివున్నదాయె. అటువంటప్పుడు క్రిందటి జన్మ గుర్తుండకపోవటంలో ఆశ్చర్యం ఏముంది?
అందరకూ క్రిందటి జన్మ గుర్తుండకపోవటం లేదు. కొందరికి వారి క్రిందటి జన్మలు గుర్తున్న ఉదాహరణలు ప్రపంచం అంతటా లభిస్తూనే వున్నాయి. కాని క్రిందటి జన్మ గుర్తున్నదనే వ్యక్తుల్లో చాలా మోసం రుజువైంది. అందువల్ల ఆ క్రిందటి జన్మను గురించి చెప్పేవారిని నమ్మటానికి వీలులేదు.
పదిమందిలో తొమ్మిదిమంది చెప్పిన మాటలు మోసమయి ఒక్కమాట నిజమైతే ఆ నిజమైన మాటను విశ్వసించవచ్చుగా. హిమాలయాలను చూడని పదిమంది హిమాలయాలకు పోతున్నట్లు ప్రకటించి బయలుదేరుతారు. వారిలో తొమ్మిదిమంది హిమాలయాలకు పోకుండా తిరిగివచ్చి హిమాలయాలను గురించి చెపితే తమ మాటలకూ హిమాలయాలకూ కలవక వాళ్ళది మోసం అని తేలింది.
కాని ఆ ఒక్క మనిషినీ పరీక్ష చేసి చూడగా ఆయన హిమాలయాలకు వెళ్ళివచ్చిట్లు రుజువైంది. పోకుండా తిరిగి వచ్చినవాళ్ళు చెప్పినట్లుగా లేవు హిమాలయాలు. ఆ ఒక్కడు చెప్పినట్లుగా వున్నాయి. అటువంటప్పుడు అతనిది మోసం కాదని తేలుతుందిగా? ఆ ఒక్కడూ హిమాలయాలను చూడటమే కాక వాటి ఫోటోలు కూడా తీసుకువచ్చాడు. ఆ ఒక్కడూ వెళ్ళివచ్చినట్లు చెప్పిన హిమాలయ స్థలాల్లోకి వెళ్ళి విచారిస్తే ఆయన వచ్చిపోయినట్లు కూడా తెలియజేశారు. కాబట్టి ఆ తొమ్మిదిమందిది మోసం అయినా కూడా ఆ ఒక్కడికి మోసం కాదని తేలుతుంది.
ఇదే పోలికను క్రిందటి జన్మ గురించి తమ జ్ఞాపకాలను తెలిపే వారికి కూడా ఎందుకు వర్తింప చేయకూడదు? ఎందరో మోసం చేసినా ఒక వ్యక్తి అయినా నిజం చెపితే ఆ ఒక్కడి మాటకు విలువ ఇచ్చి పునర్జన్మ వున్నదని  ఎందుకు నమ్మకూడదు? ఏమిటో ఇదంతా అయోమయంగా వుంటుంది! డాక్టర్ స్టీవెన్ సన్ అనే అమెరికన్ పరామనోవైజ్ఞానికుడు ప్రపంచం అంతా పర్యటించి క్రిందటి జన్మ గుర్తున్నదని చెప్పేవారిని గురించి చాలా చాలా సాక్ష్యాలు సేకరించాడు. కాని ఇంతవరకూ ఆయన పునర్జన్మ విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నాడు.
మరణశయ్య మీది వారందరూ దిగులుతోనే వుండదు. చాలా తక్కువ మంది దిగులు చింతలు వదలి సంతృప్తిగా మరణించేవారు కూడా వుంటారు. దాదాపు వయసుపండిన వారు మరణశయ్యమీద వుంటే వారు ఇతర్లను, అంటే తమ ఆత్మీయులను చూచి అంతగా బాధపడరు. ఆత్మీయులూ మరణాసన్న వ్యక్తిని చూచి బాధపడరు అంతగా. జీవితాన్నంతా సంతృప్తిగా జీవించి పండిన వయసులో కన్ను మూస్తున్నాడనే సంతృప్తి ఆత్మీయులకూ జనిస్తుంది. మరణించనున్న వారికీ జనిస్తుంది.
మరణశయ్య మీద కొన్నాళ్ళపాటు స్పృహ లేకుండా శయనించి వుండే వ్యక్తులుంటారు కూడా. అది ఎంతో హాయి అయిన పని మరణించేవారికి, మరణాన్ని గురించిన విచారం కాని, భయం కాని, ఆత్మీయుల వియోగం కాని వారికి తట్టవు. వారు ఒకరకంగా ప్రాణం వుండి కూడా మరణించిన వారిలో జమ. అటువంటి స్థితిలో వారు ఆత్మీయులను చూచి బాధపడరు కాని ఆత్మీయులు మాత్రం వారిని చూచి బాధపడతారు.
జీవితంలో మరణం చాలా విచిత్ర సంఘటన. ప్రాణం వుండగా నిప్పు చూస్తే భయం వున్న మనిషిని నిప్పుల్లో దహనం చేస్తుంటే ఏమీ బాధపడడు. కాని భస్మం అయిపోతాడు. అదివరలో చీకటి గదిని చూచి భయపడే వ్యక్తిని భూమిలో పాతిపెట్టినప్పుడు ఏ మాత్రం చలించడు. అదివరలో ధనం మీద ఎంతో కాంక్ష వున్న వ్యక్తి ప్రాణం పోయిన తరువాత ఎటువంటి కాంక్షయే వుండదు. చేతన అచేతనంగా మారిపోయినప్పుడు అంతా తలక్రిందులై పోతుంది.
సృష్టి పుట్టిన దగ్గర నుండీ కూడా ఎవరూ ఇంతవరకూ మరణించకుండా వున్నవారు లేరు. మృత్యువును జయించ గలిగిన వ్యక్తి ఇంతవరకు ఎవరూ జనించలేదు. అయితే, ఇంతవరకూ జరగంది ఇకముందు జరగకూడదనేది ఏమీలేదు. ఆధునిక విజ్ఞానం ఒకనాటికి మృత్యువును కూడా యీ భూమిమీద నుండి తుడిచిపెడుతుందేమో తెలియదు. శరీరంలోని క్షీణించే సెల్సును క్షీణించకుండా చేయగలిగితే మృత్యువు వుండదు. ఇంతవరకూ ఆ పని చేయలేకపోతున్నారు.
మరణం అనేది వుండబట్టే మనిషి జీవితాన్నింతగా ప్రేమిచగలుగుతున్నాడు. మరణం లేనినాడు జీవించటంలో విసుగెత్తి జీవితం మీది ప్రీతిని పోగొట్టుకుంటాడేమో. అమరత్వంతో విసిగిపోయి మృత్యువు నిమిత్తం ఆశిస్తే అది లభించదు. అప్పుడు మనిషి జీవితం చాలా దుఃఖమయం అవుతుంది. జీవించాలంటే ఇష్టం లేదు. మరణించాలంటే మరణం అనేదే లేదు. అటువంటప్పుడు జీవించలేక మరణించలేక బాధపడటం మాత్రమే చేయగలుగుతారు.
మరణం లేనప్పుడు వ్యాధులూ, వృద్ధాప్యం, సంతానోత్పత్తి మొదలైనవి కూడా వుండకూడదు. పుట్టిన వాళ్ళంతా చావకుండా జీవించి వుంటూ  ఇంకా నిత్యం అంతులేకుండా సంతానం జనిస్తుంటే యీ బ్రహ్మాండ గోళంలోనే ఎక్కడా ఖాళీ వుండదు. మరణం అనేది వున్న యీ రోజుల్లోనే జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే మరణమే లేకపోతే ఇంకెంత పెరుగుతుందో వూహించజాలం! మరణం లేనపుడు జననమూ వుండకూడదు.
నేటి ప్రజలు ఎంత అభినందనీయులో, కారణం జననాలను లేకుండా చేసుకొంటున్నారు కాని, మరణాలను లేకుండా చేసుకోవటం లేదు. మరణించటం అనేదే లేకపోతే జీవించటమే మరణించటం అవుతుంది. జీవించటం వుండాలంటే, జీవితం మీది ప్రేమ నిలవాలంటే భూమి మీద ప్రతి మరణం బ్రతికి వుండాలి!
మరణం, మారణం. మరణం అంటే చావటం, మారణం అంటే చావటం. నేడు మరణాల సంఖ్య కంటే మారణాల సంఖ్య ఎక్కువగా పెరుగుతూంది. తమకు మరణం లేకుండా వుండటానికి, తాము సుఖజీవనం చేయటానికి నేడు మారణహోమం నిరంతరం జ్వలిస్తూనే వుంది. కాని ఆ మారణజ్వాలలు ఇతర్లను దహించే పనిలో స్వయంగా తమను కూడా వదలవు! తమ ప్రక్క ఇంటికి నిప్పు అంటిస్తే తమ ఇల్లు కూడా మిగలదు.
మనిషి తాను జీవిస్తూ ఇతర్లను జీవింపచేయాలి కాని తాను జీవిస్తూ ఇతర్లను మరణింప చేయటం మానవతా లక్షణం కాదు. నేడు యీ రెండవదే ఎక్కువ గోచరిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడ. అయితే, కొన్ని దేశాల్లో తక్కువ మరికొన్ని దేశాల్లో ఎక్కువ. మరణశయ్యలు మారణశయ్యలుగా మారటం మానాలి.
మరణశయ్య నిజంగా ఒక కరుణశయ్య! జీవితంలో అదివరలోని తన జీవితం ఎన్ని క్రౌర్యాలకో ఆలవాలం అయివుండవచ్చు. కాని మరణశయ్య మీది జీవితం మాత్రం కారుణ్యానికి ప్రతిబింబం. లోకంలోని మంచితనం అంతా మరణశయ్యను ఆక్రమిస్తుంది. పరమ విరోధులు కూడా మరణశయ్య మీది మనిషిని చూడవస్తారు. కాని వీరిలో కొందరు ఆ మరణించనున్న వ్యక్తి త్వరలో మరణిస్తే బాగుండుననే కోరికతో చూడటానికి రావటం కూడా జరుగుతుంది.
మరణశయ్యను, దుఃఖశయ్యగా, నిస్పృహశయ్యగా, జీవించే మరణించి వున్నవారి శయ్యగా, భయంతో కంపించే శయ్యగా చేసుకోని మరణాసన్నుల మరణశయ్యగా ఒక ఆనందనికేతనం!
మరణాన్ని గురించి రవీంద్రనాథం ఠాకూర్ అంటారు –
When death comes and whispers to me
         “Thy days are ended,”
Let me say to him, “I have lived in love
         And not mere in time.”
He will ask “Will thy songs remain?”
I shall say, “I know not, but this I know that
         Often when I sang I found my eternity”.
(మృత్యువు నెమ్మదిగా నాతో “నీ రోజులు ముగిశాయి” అని చెప్పినప్పుడు నేను తనతో అంటాను, “నేను ప్రేమలో జీవించాను. కాని కేవలం కాలంలో మాత్రమే కాదు” అని.
తాను అడుగుతాడు నన్ను, “నీ గేయాలు మిగిలివుంటాయా”అని.
నేను చెపుతాను, “నేనెరుగను, ఇది మాత్రం నేనెరుగుదును, నేను తరచుగా పాడినపుడల్లా నా చిరంతసత్వాన్ని కనుగొంటుంటాను”)
కవిని మృత్యువు అడుగుతుంది. నీ రోజులు ముగిశాయి కనుక తనలోకి రమ్మని. కాని కవి తెలివిగా జవాబు చెప్పేడు. తాను కాలంలో మాత్రమే జీవించక ప్రేమలో జీవించానని, దీని అర్థం. తాను జీవించే కాలం అయిపోవచ్చు కాని తాను జీవించే ప్రేమ ఎప్పటికీ అయిపోదని. కనుక తనకు అప్పుడే మృత్యువు రావటానికి వీలులేదని. కాలం అంతమవుతుందేమో కాని ప్రేమ అంతం కాకుండా అమరంగా నిలిచిపోతుందని! మృత్యువు ముందు కాలం తలవంచినా, ప్రేమ తలవంచదని!!


2 కామెంట్‌లు:

innaiah చెప్పారు...

సంజివ్ దేవ్ మానవ వాది. కనుకనే శాస్త్రీయ
అవగాహనతో జీవితాన్ని మరణాన్ని చక్కగా చెప్పగలిగారు.ఇలాంటి లోతైన విషయాలు ప్రాచీన గ్రీక్, రోమన్ తత్వవేత్తలు, ఆధునికంగా బెర్త్రాంద్ రస్సెల్, ఎం.ఎన్.రాయ్, కార్ల్ శాగన్, ఇంగర్ సాల్ , ఇజక్ అసిమోవ్ వంటి వారు చెప్పగలిగారు.
ఈ విషయం లో సంజీవ్ దేవ్ వారి కోవకు చెందుతారు.
ఆయన చెప్పింది వంట పడితే బాబాల మహథుల, మాతల మహిమల భ్రమలకు గురికారు.
Narisetti Innaiah
from USA

cbrao చెప్పారు...

Ponnaganti V Krishna Rao, Houston,TX తమ అభిప్రాయం అందచేశారు.
Thanks for Sanjivdev's article, "Maranasayya". I fondly recalled my association with Dr. Sanjivdev and his writings.
This article reflects the essential approach of Sanjivdev. His scientific as well as artistic temperement. His humanism and romanticism. His capacity to look deep into human nature and into the workings of the mind. His openmindedness and yet a lack of gullibility.
When I first read Sanjivdev several years ago to write an article on him, "Manovignanikudiga Sanjivdev" for a book, persuaded by a friend, Kavikumar, I was fascinated by his psychological insights and anticipation of or coming closer to many psychologists, notably Eric Fromm.
This essay too reminds me Erik H. Erikson's reflection on the final stage of life.
I quote for your convenience:
"
Late Adulthood: 55 or 65 to Death
Ego Development Outcome: Integrity vs. Despair
Basic Strengths: Wisdom
Erikson felt that much of life is preparing for the middle adulthood stage and the last stage is recovering from it. Perhaps that is because as older adults we can often look back on our lives with happiness and are content, feeling fulfilled with a deep sense that life has meaning and we've made a contribution to life, a feeling Erikson calls integrity. Our strengt h comes from a wisdom that the world is very large and we now have a detached concern for the whole of life, accepting death as the completion of life.
On the other hand, some adults may reach this stage and despair at their experiences and perceived failures. They may fear death as they struggle to find a purpose to their lives, wondering "Was the trip worth it?" Alternatively, they may feel they have all the answers (not unlike going back to adolescence) and end with a strong dogmatism that only their view has been correct.
The significant relationship is with all of mankind—"my-kind."
© Copyright 2002, Revised 2009, Arlene F. Harder, MA, MFT "

Thank you once again for bringing this essay into light.

కామెంట్‌ను పోస్ట్ చేయండి