బుధవారం, ఆగస్టు 22, 2012

మౌంటైన్ వ్యూ కబుర్లు -3

T.V. Technology in USA

Pause Live TV  

12th august 2012 నాడు ఒలింపిక్ ఆటల ముగింపు ఉత్సవాలు NBC ఛానల్ లో Live చూస్తూఉన్నా. శ్రీమతి రమణ  పావ్ భాజి తయార్ అని వంటింట్లోంచి కేక వేయటంతో   టి.వి. కి వ్యవధానం (Pause) బొత్తం నొక్కి, వంటింట్లోకి వెళ్ళి   పావ్ భాజి తెచ్చుకొని వచ్చి, ఇందాక టి.వి. ఆపిన దగ్గరి నుంచి చూడటం మొదలెట్టాను. అమెరికా లో డిష్ టి.వి లో Live TV ని పాజ్ లో పెట్టి, పని ముగించుకొని వచ్చి, ఎక్కడ ఆపామో అక్కడనుంచి టి.వి చూసే సౌకర్యం ఉంది. మనకు ఎవరన్నా ఫోన్ చేసినా టి.వి ని పాజ్ చేసి, నింపాదిగా ఫోన్ మాట్లాడి, టి.వి కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా చూసి ఆనందించవచ్చును. భారతదేశం లో ఈ సౌకర్యం నేను ఎప్పుడూ  వాడలేదు. మీరెవరైనా ఈ సదుపాయం వాడుతున్నారా? టి.వి. లో  జాన్ లెనన్ Imagine పాట వస్తుంది. ఊహించండి, దేశాలు, సరిహద్దులు లేని, విశ్వశాంతి నెలకొన్న ప్రపంచం  ఎంత బాగుంటుందో!

Digital Video Recorder

ఇక్కడ మా ఇంట్లో డిష్ టి.వి.  సాటిలైట్ తో సంధానమైనది ఉన్నది. ఒక ప్రోగ్రాం చూస్తూ మరో ప్రోగ్రాం Digital Video Recorder లో సంగ్రహింప (Record) వచ్చు. అంతే కాదు Digital Video Recorder లో సంగ్రహింపబడిన ఏ కార్యక్రమమైనా చూస్తూ టి.వి. లోని మరో కార్యక్రమాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం వలన మంచి ఆసక్తికరమైన ప్రొగ్రాం ఏదైన వచ్చే సమయంలో బయటకు వెళ్ళాల్సి వస్తే, ఆ కార్యక్రమాలను రికార్డ్ చెయ్యమని Digital Video Recorder కు మనము ఆదేశం ఇవ్వవచ్చు. ఉదాహరణగా  రోజూ చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ చూసే అలవాటు  మనకు ఉందనుకోండి. ఒకసారి Schedule చేసి ప్రతి రోజూ రికార్డ్ చెయ్యమని ఒకేసారి ఆజ్ఞ ఇస్తే చాలు. హచ్ కుక్కపిల్లలా ఆ ప్రొగ్రాం ఎప్పుడొచ్చినా స్వయంచాలితంగా అది తన పని తను చేసుకుపోతుంది.   

Video on Demand

ఇంతే కాదు టి.వి లో మనకు కావల్సిన కార్యక్రమం కొరకు అన్వేషణ కూడా జరపవచ్చు. ఇంకా Video on Demand పద్ధతిలో పలు కార్యక్రమాలు మనం కొరినవిధంగా చూసే ఏర్పాటు ఉందిందులో. ఉదాహరణకు Olympic Games Opening Ceremony సమయంలో మనము వేరే ఊళ్ళో ఉన్నా, ఆ ప్రొగ్రాం కొరకు అన్వేషిస్తే వచ్చే లింక్ సాయంతో ఆ ప్రోగ్రాం మనము చూడవచ్చు. Video on Demand లో కొన్ని ప్రోగ్రాంలు చెల్లింపు పద్ధతిపై చూడవచ్చు. ఉదాహరణకు Dish TV లో మీరు విద్యా బాలన్ నటించిన "The Dirty Picture' చిత్రాన్ని 5 డాలర్ల చెల్లింపుతో చూడవచ్చును.   

భారతదేశం లో నిర్మితమయ్యే కార్యక్రమాలున్న ఈ టి.వి., జెమిని, మా టి.వి., టి.వి.5, టి.వి. 9, సోనీ, ఆప్ కా కలర్స్ (భారత దేశంలో కలర్స్) కార్యక్రమాలు మాములుగా ప్రసారమయితే, ఆంగ్ల ప్రోగ్రాంలు, దాదాపుగా  అన్నీ HD లో ప్రసారమవుతాయి. ఎంత పెద్ద టి.వి తెరపై నన్నా ఇవి ఎంతో శ్రవణ, దృశ్య నాణ్యతతో ప్రసారమవుతాయి.ఒలింపిక్ ఆటలు వంటి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలవుతాయిక్కడ.    

ఆగస్ట్ 16 మధ్యాహ్న సమయాన టి.వి లో ఏదో ప్రొగ్రాం చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా టి.వి.లో ప్రసారాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగాయో అంతుపట్టలేదు. 2నిమిషాలు శల్యపరీక్ష  తరువాత తెలిసినదేమంటే విద్యుచ్ఛక్తి కి అంతరాయం కలిగిందని. 2 నిమిషాలు ఎందుకంటే, కరంట్ పోతుందనే విషయం ఊహకు అందని అంశం ఇక్కడ. మన హైదరాబాదులో భూకంపం వస్తే ఇళ్ళలోవారు ఎలా బయటకు వస్తారో, అలాగా, మా ఇరుగు పొరుగు బయటకు వచ్చి మీ ఇంట్లో Power ఉందా అని అడగ సాగారు. అమెరికా వచ్చాక మా పక్కింటివారిని చూడటం అదే ప్రధమం. వారు జపనీయులని తెలిసింది. ఈ సమయంలో గాలి స్థంభించినట్లుగా అనుభూతి చెందాము. ఎయిర్ కండిషనర్  పనిచేయదు. Cooking Stove పని చెయ్యలేదు.  40 నిమిషాల తర్వాత కరంట్ వచ్చింది. అందరి కళ్ళలో కాంతి కనిపించింది. ఇందాక చూస్తూ ఆగిపోయిన టి.వి ప్రోగ్రాం చూడాలని  టి.వి. బొత్తం నొక్కాను. డిష్ టి.వి. ఉపగ్రహ సంకీతనం (Signal) అందకపోవటంతో, టి.వి. ఆ సిగ్నల్ అందుకోవటానికి ఏదో ప్రొగ్రాం స్వయంచాలితమై 5 నిమిషాల తర్వాత సంకీతనం అందుకుని టి.వి. మరలా పని చేయసాగింది.   

టి.వి లో కార్యక్రమాలను మనకు అనువైన వేళలో చూడటానికి  Dish Network HDTV Digital Video Recorder Satellite Receiver  లో ప్రోగ్రాం చేసుకొని నాకు వీలయిన సమయంలో వాటిని చూసి ఆనందించేవాడిని. అలాగా  Globe Trekker, బడే అచ్ఛె లగ్తె  హై, చిన్నారి పెళ్ళికూతురు వగైరా కార్యక్రమాలను DVR లో సంగ్రహించేవాడిని. కార్యక్రమం చూశాక ఆ ప్రోగ్రాం DVR నుంచి తొలగించటం ఒక అలవాటుగా   మారింది.  ఆ సాయంత్రం చిన్నారి పెళ్ళికూతురు చూశాక ఆ తల (చిన్నారి పెళ్ళికూతురు) కింద ఉన్న అన్ని కార్యక్రమాలను ఎంచుకొని Delete బొత్తం నొక్కాను. ఏమయ్యిందో ఏమో మరి చిన్నారి పెళ్ళికూతురు తో పాటుగా, నేను, ఇంకా మా ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు ఎన్నో నెలలుగా  Record చేసిపెట్టుకున్న కార్యక్రమాలు మొత్తం, తుడిచిపెట్టినట్లుగా, అన్నీ తొలగించబడ్డాయి.

ఆ మరుసటి రోజు టి.వి గదిలోకి వెళ్తే ఎప్పుడూ వినోదాన్నందించే DVR ఎలాంటి కార్యక్రమాలు తనలో ఇముడ్చుకొని లేకుండా శూన్యంగా కనిపించింది. మనసు భారమయ్యింది. DVR కు కూడా Backup ఉంటే బాగుణ్ను అనిపించింది.    
     

2 వ్యాఖ్యలు:

Tejaswi చెప్పారు...

మీ దృశ్యశ్రవణ పేటిక ముచ్చట్లు బాగున్నవి

cbrao చెప్పారు...

@Tejaswi: మీ స్పందనకు ధన్యవాదాలు. మీ ప్రొఫైల్ లో మీ గురించిన వివరాలు లేవు. Update చెయ్యగలరు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి