బుధవారం, ఆగస్టు 08, 2012

మౌంటైన్ వ్యూ కబుర్లు

2012 మే మాసంలో అంధ్రలో ఎండలు, మండుటెండలు ఇంకా వడగాల్పులు. ఆ వేడిని తప్పించుకోవటానికి ఎయిర్ కూలర్ లేక ఎ.సి. ఉన్న గదిలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతాం.అదే ఇల్లంతా ఎ.సి. ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అసలు ఊరంతా ఎ.సి.ఐతే! మరీ దురాశగా ఉంది కదూ! ఊహకందని ప్రతిపాదన కదా? కాని మౌంటైన్ వ్యూ (Mountain View, Silicon Valley, California) కు వొచ్చాక ఆ ఊహ నిజమైంది. ఇక్కడ ఇల్లే కాదు ఊరు ఊరంతా ఎ.సి.లాగా ఉంది ఇక్కడ వాతావరణం. ఎంతో హాయిగా ఉంది. అయితే జూన్ నెల వచ్చాక ఇక్కడ వాతావరణం లో మార్పు కనిపిస్తోంది. నిన్న, ఇవ్వాళ ఆశ్చర్యకరంగా ఇంట్లో గాలి పంఖా (fan) వాడుతున్నాము. బహుశా ఇంకొన్ని రోజులు ఫాన్ అవసరం ఉండవచ్చు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం దాక పంఖా కు విశ్రాంతే.

మా పెరటి ఆపిల్ చెట్టు

మేము వచ్చేసరికి ఆపిల్ చెట్టు పూలు పూసి, పిందెలతో ఉంది. ఏ కారణం వలనో గత పర్యాయం ఇక్కడకు వచ్చినప్పుడు కాసినంత కాపు ఇప్పుడు లేదు. 2010 లో అయితే శ్రీమతి రమణ పచ్చి ఆపిల్ కాయలతో ఎంచక్కా ఆవకాయే పెట్టింది. చిన్న పరిణామంలోని ఆకుపచ్చ ఆపిల్ కాయలు కొంత వగరుగా, పుల్లగా ఉండి ఆపిల్ ఆవకాయకు కావల్సిన రుచినిచ్చాయి.

తెలుగు వారి సమావేశాలు

వారాంతం వొస్తే ఇక్కడ కోలాహలమే. మన ఆంధ్రప్రదేష్ లో ఐతే బంధు మిత్రులను తరచుగా వివాహలలో కలుస్తుంటాము. ఎన్ని వివాహాలంటే, పెళ్లికి వెళ్లాలంటే విసుగేశంత. ఇక్కడ వివాహాలు అరుదుగా తప్ప బంధు మిత్రుల లో జరగవు. ఆ లోటు తీర్చటానికా అన్నట్లు ఇక్కడ పుట్టిన రోజు పండగ, సీమంతం (Baby shower), దసరా, దీపావళి, సంక్రాంతి మరియు ఉగాది పండుగ సమయాలలో సామాజిక సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. పండగ సమయాలలో ఇక్కడి తెలుగు సాంస్కృతిక సంఘాలవారు పార్క్ లలో సమావేశాలు జరుపుతారు. ఇంకా తానా, ఆటా, నాటా, నాట్స్ వగైరా సంఘాలవారు ప్రతి సంవత్సరము తెలుగు సభలను జరుపుతుంటారు. అమెరికా తెలుగువారు కుల ప్రాతిపదకపై విడిపోయి ఇలా భిన్న సంఘాలు పెట్టుకోవటం బాధాకరం. తమాషా విషయమేమంటే ఈ పుట్టిన రోజులు వగైరా వేడుకలు అన్నీ వారాంతం లోనే ఎక్కువగా జరుగుతాయి. వారం రోజులలో ఇక్కడివారు తమ తమ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం దృష్ట్యా ఇది అనివార్యం.

మౌంటైన్ వ్యూ పార్క్ లో తెలుగు మిత్రుల సమావేశం

ఇక్కడికి వచ్చిన మొదటి వారాంతం లో కవయిత్రి గీతా మాధవి ఇక్కడి తెలుగు వారితో Mountain View, Rengstorff Park లో ఒక సమావేశం ఏర్పరిచారు. ఇక్కడి తెలుగు వారితో పరిచయం కలిగింది. ఆటలు, పాటలు, కబుర్లు, మధ్యాహ్న విందు భోజనం (Potluck lunch) ల తో సరదాగా గడిచింది.మరిన్ని సమావేశ ఛాయాచిత్రాలు ఈ దిగువ ఇచ్చిన గొలుసులలో చూడవచ్చు.

https://plus.google.com/photos/114125420321576521677/albums/5750046785761708305?authkey=CM38tumN58qv5wE

https://plus.google.com/photos/115779731434350218592/albums/5750317393696013697?authkey=CJTjvfX_-paCxwE

డా|| గీతా మాధవి తెలుగు వికాసం ను స్థాపించి తెలుగు భాష, సంగీత తరగతుల ద్వారా అమెరికా విద్యార్థులకు భాషా, కళా సేవ చేస్తున్నారు. తన వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

http://www.teluguvikasam.com/

కార్యక్రమం చివరలో శ్రీమతి గీత విద్యార్ధులు తాము నేర్చుకున్న పాటలను ఆహుతులకు వినిపించి శ్రవణానందం కలుగచేశారు.

4 వ్యాఖ్యలు:

శ్రీ చెప్పారు...

నేను మార్చి నుండి జూన్ చివరి వరకు సిలికాన్ వాలీలోనే ఉన్నాను. జులైలో డలాస్ వచ్చేసాను. మీరు సిలికాన్ వాలీలో ఉన్నారని తెలిస్తే కలిసిఉండేవాడిని.

కాలిఫోర్నియా వాతావరణం ఒక అద్భుతం! చాలా హాయిగా ఉంటుంది. ఎంత ఎండాకాలమయినా శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా చల్లగా ఉండేది.

Bhaskara Rao Chimakurthy చెప్పారు...

సిలికాన్ వాలి, బెంగళూర్లలో చక్కటి హాయిగొలిపే వాతావరణమే సాఫ్ట్ వేర్ పరిశ్రమ ఉనికికి, ప్రగతికి మూలకారణమని తలుస్తాను. మనం కొద్దిలో మిస్ అయ్యామే. డాలస్ లోనే ఉంటారుగా, ఎప్పుడన్నా కలుద్దాము.

Padmarpita చెప్పారు...

అవునా!! భలే ఎంజాయ్ చేసారుగా:-)

Bhaskara Rao Chimakurthy చెప్పారు...

@పద్మార్పిత: ఇప్పుడే మీ బ్లాగు చూసా. వీక్షకుల సంఖ్యను కొలమానంగా తీసుకుంటే బహుశా మీ బ్లాగ్ నంబర్ ఒకటి అవుతుందేమో! అభినందనలు.
నిజ జీవితంలో హైదరాబాదును, అమెరికాను సమంగా ఆనందిస్తా. స్నేహితులు, మంచి పుస్తకం, అంతర్జాలం, మనం ఎక్కడున్నా వాటిలో మార్పుండదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి