మంగళవారం, ఆగస్టు 28, 2012

తెనాలి తో నా అనుబంధం

'గీతాంజలి' , 'గీతా సారం'  పుస్తకాల రచయిత గీతాంజలి మూర్తి  గారు ఆంధ్రా పారిస్ గా పిలువబడే తెనాలి పట్టణం తో తమకు గల అనుబంధాన్ని వివరిస్తున్నారు. వారి మాటలలో ఈ వ్యాసాన్ని చదువగలరు. -సి.బి.రావు.  


        తెనాలి తల్లితో నాకున్నది 'కన్నతల్లి పేగుబంధం' వంటిదే అంటే అతిశయోక్తి కాదు.  స్వతంత్ర భారతావనిలో 1947 లోతెనాలిలోనే  జన్మించి కళా/ సాహిత్య సౌరభాలను ఆఘ్రాణిస్తూ  ఈ నేలతో, ఈ గాలితో, ఈ నీటితో పెనవేసుకున్న నా ఈ జీవన నౌకాయానం, ఒక సుమధుర స్వప్నం వంటిది. ఈ స్వప్నం సాకారమవగా, నా స్మృతి పేటికలో దొంతర్లుగా చేరి తెనాలిలో నేను పెనవేసుకున్న అనుబంధాల మందారమాలను గురించి కొన్ని మాటలలో ఇమడ్చాటానికి ప్రయాత్నిస్తాను. చిన్ననాట, మిషన్ స్కూల్ లో 'క్రీస్తు జననం' నాటికలో, గొర్రెలకాపరి పాత్రలో, తరువాత తాలుకా హై-స్కూల్ లో 'వెంకన్న కాపురం' నాటికలో, చిన్న  పాత్రలో నటించి 'బాల రామాయణం' బహుమతి పొందటం నాలో ఉన్న నటునికి ప్రాణం పోసింది. శ్రీ రామ నవమి, దసరా పండుగల సమయం లో తెనాలి శోభను, తెనాలి విశ్వరూపాన్ని చూసి ఆనందించిన వారి జీవితం  ధన్యం.తెనాలి ని  'రెండవ భద్రాద్రి' అని ఎందుకు అన్నారో ఆనాటి శ్రీ రామనవమి ఉత్సవాలు చూసిన వారికి తెలుస్తుంది.  శివరాత్రికి సంగం జాగర్లమూడి నడచి వెళ్లి చెరుకుగడలు తింటూ రాత్రంతా జాగారం  చేసి  పొందిన  ఆనందం,  కొద్ది మాటలలోనే ఎలా చెప్పటం ? కొండను అద్డం లో  చూపినట్లు  ఉంటుంది  కదా !

          ముఖ్యంగా, అప్పుడు నిర్వహించిన ఆధ్యాత్మికోపన్యాసములు, కూచిపూడి నాట్యాలు, తెల్లవార్లూ  ప్రేక్షకులను ఉర్రూతలూగించిన    పద్య  నాటకాలూ - ఓహ్ ! ఒకటేమిటి ? ఎప్పుడూ తెనాలి - ఉత్సవ శోభతో వెలిగి పోయేది.  ముఖ్యంగా శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గీతోపన్యాసాలు, వాటికి హాజరైన క్రిక్కిరిసిన జనంతో  కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణం నిండిపోగా బయట బోస్ రోడ్డు మీద కూడా జనం నిలబడి వినడం తెనాలి తో నాఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత  దృఢపరచిన  సందర్భం.  నాలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించటం లో ఈ కార్యక్రమాల ప్రభావం ఎంతో ఉంది. మా మిత్రమండలి సమావేశాలు, చినరావూరు పార్కు లోనూ, అప్పుడే ప్రారంభించిన వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరుని   ఆలయ ప్రాంగణంలోనూ,  గంటలతరబడి జరిగి మమ్మల్ని అలరించేవి. 

 తెనాలి నేల, నీరు, గాలి ఎంత గొప్పవో  !! ప్రఖ్యాత రచయితలైన కొడవడిగంటి, చలం, త్రిపురనేని, చక్రపాణి, జి.వి కృష్ణారావు; బొల్లిముంత  శివరామ కృష్ణ, శారద, మరియు వందలమంది కళాకారులు నడచి తెనాలి వాసులను ఉత్తేజపరచిన ఈ నేలపై నేను కూడా ఆత్మీయానుబంధంతో నడవగలగటం నా ఆదృష్టం.   అందుకే, నేను హైదరాబాద్ లో ఉంటున్నా, ఇప్పటికీ ఇక్కడ వీచే సాహిత్య, కళా సౌరభాలను తెనాలి  వచ్చి పోతూ ఆస్వాదిస్తున్నాను. ఈ క్రమంలోనే, నేను అనువదించిన 'గీతాంజలి' ని, 'గీతా సారం' సంకలన గ్రంధాన్నీ' తెనాలి లోనే ఆవిష్కరించి, పంచిపెట్టటం జరిగింది. ఇలా తెనాలి తో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను. ఇటువంటి "తెనాలి తల్లికి, వందనం" ! తెనాలి వాసులకు 'అభివందనం' !!.

గీతాంజలి మూర్తి
23.8.2012  

1 వ్యాఖ్య:

ellanki.bhaskaranaidu చెప్పారు...

thanks to your interesting contributions. it is simply wonder to co inside both of our interests.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి