
Chalasani Prasada Rao Painting by R.K.Laxman
నేపధ్యం:శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిపై
ఇన్నయ్య గారి వ్యాసానికి అనూహ్య స్పందన లభించింది. లభిస్తున్నది. పాఠకులని విస్మయానికి గురిచేసిందా వ్యాసం. వారిలో ఎన్నో సందేహాలు పొడసూపినవి. పాఠకుల ఉత్తరాలకు ఒక్కటొక్కటిగా జవాబిస్తున్నాను. అయినా జవాబివ్వని ఉత్తరాలింకా చాలా ఉన్నవి. ప్రతి ఒక్కరికీ జవాబివ్వటం సులభ సాధ్యం కాదు. మిత్రులు కీ.శే.చలసాని ప్రసాద రావు (విపుల, చతుర మాస పత్రికల సంపాదకులు)వ్రాసిన "ఇలా మిగిలేం" అనే విమర్శనాత్మక వ్యాసాల పుస్తకం గురించి గతంలో దీప్తిధారలోని
ఇలాకూడా జరగొచ్చు అనే టపాలో ప్రస్తావించియున్నాను.విశ్వనాధ వారి భావాలను, వారు తలకెత్తుకొన్న హైందవ సాంప్రదాయ పునరుద్ధరణాలోచనలపై సమీక్షలు,పాఠకులకు వాటిగురించిన అవగాహనకు తోడ్పడగలవు. ఈ ప్రయత్నంలో భాగంగా విశ్వనాధ వారి రచనలు,వారు వెలిబుచ్చిన భావాల పై చలసాని ప్రసాదరావు గారి అభిప్రాయాలను, వారి కబుర్ల శీర్షికలో వెలువడిన వ్యాసాన్ని, "ఇలా మిగిలేం" పుస్తకం నుంచి, మీ కోసం ప్రచురిస్తున్నాను. ఈ వ్యాస రచనా కాలం 1971.
-cbrao
కవి సామ్రాట్టు....!
"నూటికి తొంభయ్యయిదుగురు దరిద్రంలో మునిగిఉండే సమాజంలో వాళ్లకేవేనా దూరపుకొండలూ, వాటి మీద టెక్నికలర్ ఆశల పుష్పాలూ చూపించకపోతే వారిని ఆపటం కష్టం. కనుకనే, రేసులు, లాటరీల్లాంటివి పుట్టుకొచ్చి, తెల్లారేసరికెవరైనా సరే లక్షాధికారులు కాదగ్గ సోషలిజానికి దగ్గరి జాక్ పాట్ దారులు వేశారు.
మనకు బుర్రంటూ ఒకటున్నాక దానికి కాస్త కాలక్షేపం, వినోదం, ఉల్లాసం కలిగించటానికి నట, విట, గాయక, రచయితల్లో ఓ విదూషక బృందం కూడా తప్పనిసరి. మరి ఈ దరిద్రులక్కూడా ఏవేనా కలర్ ఆశలు చూపకుంటే ఎలా?
అందుకే ఏటేటా ఈ నిర్భాగ్యులకు నూట పదహార్లూ, వేయిన్నూట పదహార్లూ ఉదారంగా ముష్టి వేసే సాహిత్య కంపెనీలు కొన్ని బయలుదేరాయి. దాంతో ఈ అభాగ్యులు ఆ కంపెనీలచుట్టూ తిరుగుతూ, ఆయా బహుమతులు కోసం చేయవలసిన చెక్క భజనచేస్తూ, పట్టవలసిన వాళ్ల కాళ్లు పడుతూ, లేస్తూ, యధాశక్తి తమ కష్టాలు మరచి సాహిత్య సేవ చేస్తుంటారు.
కానీ, అసలే మన సోషలిస్టు రూపాయి డివాల్యుయేశన్ తో సగం చచ్చిన సంగతి అలా ఉండగా, ఈ లాటరీలూ, రేసులూ విజృంభించి పదార్లకూ, వేయిన్నూటపదార్లకూ విలువ లేకుండా చేశాయి. కనుక, సాహిత్యంలో కూడా "జాక్ పాట్" లు లేకుంటే లాభం లేదని కొందరు ఉదారులు లక్ష రూపాయల జాక్ పాట్ తో "జ్ఞానపీట" నోదాన్ని సృష్టించేరు, శుభం.
జ్ఞానపీఠం వారి లక్ష రూపాయల సాహిత్య జాక్ పాట్ ఈసారి మన కవిసామ్రాట్టు, కళా ప్రపూర్ణ, సాహిత్య డాక్టర్ విశ్వనాధ సత్యనారాయణ గారికి రావటం మనందరికీ గర్వకారణం. ఈ సారి మనం ఏ ఢిల్లీయో, కలకత్తాయో వెళ్లినప్పుడు, అక్కడ సగర్వంగా పిలక ఎత్తుకొని చెప్పుకోవచ్చు, మన తెలుగూ సాహిత్య ఘనతను గురించి. ఇంతవరకూ మరో అయిదుగురు మాత్రమే సాధించ గలిగిన ఈ జాక్ పాట్ ను కొట్టగలిగిన విశ్వనాధ వారి "రామాయణ కల్పవృక్షం" చదవటం సంగతలా ఉంచి, కనీసం మరోసారి చూసి, ఈ సారి కళ్లకద్దుకునైనా తరిద్దామని తహతహలాడి పోయాను.
ముందు తరాల విమర్శకులు విశ్వనాథ వారిని గొప్పకవిగా గాక పెద్ద నవలా రచయితగా గుర్తిస్తారు. ఆయన నవలలన్నింట్లోకి "రామాయణ కల్పవృక్షం" చాలా గొప్పదంటారు" అని, దివ్వదృష్టిగల ఓ మహాకవిగారు ఏనాడో సెలవిచ్చారు.
కనుక, నేనో పుస్తకాల దుకాణానికి పోయి 'ఫలానా నవల కావాలండీ' అంటే, అక్కడి సాహిత్య విక్రయకుడు నన్నెగాదిగా చూసి "ఆ పేరుతో నవలేదీ లేదు నాయనా! ఛందో బందోబస్తులతో పకడ్బందీగా అల్లిన విశ్వనాధ వారి కావ్యం మాత్రం ఉంద"న్నాడు.
నాకు సంస్కృతం అంతగా రాకున్నా సంస్కృత రామాయణం చదివి, అర్థం చేసుకుని, ఆనందించగలిగాను. కానీ, తెలుగు బాగా వచ్చి ఉండికూడా విశ్వనాధ వారి తెలుగు "రామాయణ కల్పవృక్షం" మాత్రం చదవలేకపోయాను. వారిది పాషాణ పాకం అని ఏనాడో శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తొచ్చి, ఆ షాపు వాడికీ, వాడి అటక మీది సదరు జాక్ పాట్ గైడ్ కూ ఓ దండం పెట్టి వచ్చేశాను.
విశ్వనాథ వారు కారణ జన్ములు. మన తెలుగు సాహిత్యాన్నీ, ప్రాచీన హిందూ మత ప్రాభవాన్నీ ఉద్దరించేందుకే శ్రీవారు పుట్టారనటంలో సందేహం ఉన్నవారికి ఈ జన్మలో జాక్ పాట్ సంగతలా ఉంచి కనీసం లాటరీలో కన్సోలేషన్ ప్రై జయినా రాకపోగా సరాసరి నరకానికే పోతారు. ఆయనే స్వయంగా ఓసారి చెప్పుకున్నారట "నా అంతటి వాడు మరో వెయ్యేళ్ల దాకా పుట్టబోడు" అని మరెవరో అన్నారట గదా "నిజమే మహా ప్రభో! తమరు వెయ్యేళ్ల క్రితమే పుట్టేరు. ఇపుడు మమ్మల్ని అవస్త పెడుతున్నారు" అని.ఏది ఏమైనా మరో వెయ్యేళ్ల తర్వాత కూడా విశ్వనాథ వారి వంటి మహానుభావుడు పుట్టబోడనేది మాత్రం నిస్సందియమే.
విశ్వనాథ వారికి వ్యాకరణ, ఛంధో, అలంకారాది శాస్త్రాల్లో నూటికి సదా నూటొకటిన్నర మార్కులు వచ్చేవిట. అదీ వారి దర్జా! వారి వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం, హాహా... హిహీ... హుహూ, లాంటి మహద్గ్రంధాల్లోని మన మట్టి బుర్రలకు అర్థం గాని గొప్పల్నీ, ఉన్న – లేని అందాల్నీ కీర్తిస్తూ శ్రీవారి భక్త కోటి అసంఖ్యాకంగా వ్యాసాలు రాసి, సాహిత్య పత్రికల పేజీల్ని ఈ వరకే నింపివేశారు. ఇపుడు మనం అదనంగా పరిశోధించి పట్టుకునేందుకు ఏమీ లేదు.
"పురాణ వైర గ్రంధమాల" అంటూ విశ్వనాథ వారీ మధ్య ఓ అరబీరువాడు నవలల్ని లైబ్రరీల మీదికి వదిలేరు. అంత వేగంగా అన్ని నవలల్ని రాయగలగటం నిస్సందేహంగా గొప్ప సంగతే. "మన చరిత్రకారులు చరిత్రను సరిగా రాయలేదనీ, రాసిందంతా తప్పుల కుప్ప అనీ విశ్వనాధ వారు తమకు మాత్రం దైవానుగ్రహంతో లభ్యమైన దివ్య దృష్టి వల్ల కనుగొన్నారు. కనుక సదరు చరిత్రల్లోని తప్పులన్నింటినీ తిరుపతి వెళ్ళొచ్చిన గుండులా స్వచ్ఛంగా సవరించి బ్రహ్మణాధిక్యతనూ, బ్రాహ్మణేతరుల "నీచ" త్వాన్నీ సవివరంగా వర్ణిస్తూ, తాము కలల్లో కనుగొన్న అద్భుత చారిత్రక సత్యాలన్నింటినీ నవలలుగా మనకు అందించేందుకు స్పెషల్ గా ఓ కంకణం కూడా కట్టుకున్నారు.
"వారి ఉద్దేశం ఏమయినప్పటికీ, ఈ నవలల పుణ్యమా అని తెలుగు సాహిత్యంలో హాస్య రచనలు అంతగాలేని లోటు మాత్రం తీరిపోయింది. ఓపికగల పాఠక మహాశయులీ నవలల్లో అపూర్వ విషయాలెన్నో తెలుసుకుని చైతన్యవంతులు కాగలరు. ఉదహరణకు ఓ నవలలో "అచ్చోటనొక వాగుయున్నది" అంటూ విశ్వనాథ వారు. "అచటనే ఎందుకు యున్నది?" అని వారే ప్రశ్నించి, "యుండవలె గనుక యుండె" నని ఠకీమని
జవాబిస్తారు. "ఇంతకన్నా క్లుప్తంగా, ఘనంగా చెప్పి పాఠకుల నోళ్ళూ, బుర్రలూ మూయించగల ఘనులింకెవరన్నా మన తెలుగువాళ్ళలో ఉన్నారా?
"విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథమాలా శైలి అద్భుతం. అంతగొప్పగా వాల్మీకి కూడా రాయలేదని వారి శిష్యుల ఉవాచ, పైచెప్పిన వాగునే తీసుకుందాం. ఆవాగు అక్కడనే ఎందుకున్నదీ బల్లగుద్ది చెప్పాక, అసలు వాగు అననేమి? అదెట్లు పుట్టును... అనే శాస్త్ర చర్చ మొదలెడతారు, శ్రీవారు. "అక్కడెక్కడో కొండలుండెను. వాటిపై మంచు పేరుకొనును. అది కరిగి నీరుగా ప్రవహించును. ఆ పిల్ల వాగులు అలా, అలా, అలా, అలా, రాళ్ళను ఒరుసుకుని, వాటిని అరగదీయుచూ ప్రవహించి పెద్దవై, పెద్దవై, మరింత పెద్దవై వాగుగా మారును... అంటూ ఓపికను బట్టి ఆరు... లేదా పదారు పేజీల పొడుగునా వివరిస్తారు, విశ్వనాథ గారు.
"అంతగొప్ప ప్రకృతి రహస్యాన్ని ఇంత సులువుగా, మామిడి కాయలోని రసం పిండి నోరు పగలదీసి సరాసరి గొంతులో పోసినంత చక్కగా మరే కవి అయినా చెప్పగలడా?
"అందుకే ఆయన మహాకవి అయ్యేడు. తాము చెప్పెడిదే వేదము, రాసినదే ప్రామాణికము, దానికి తిరుగులేదనేది విశ్వనాథ వారి దృఢాభిప్రాయం. "తందాన" అనుటయే వారి శిష్యుల క్వాలిఫికేషన్. అందుకేనేమో వళ్ళుమండి కొత్త సత్యనారాయణ చౌదరి అనే మరో కవిగారు "నీకేం తెలీదు విశ్వనాథా! అసలు నీకే శాస్త్రమూ సరిగా రాదు. నీ రామాయణ కల్పవృక్షం వాల్మీకికే అపచారం. అందులోని పద్యాలు వజ్రపు తునకలు కావు, రాళ్ల ముక్కలు రానాయనా, రాళ్ళ ముక్కలు" అంటూ విరుచుకుపడి, ఆ విషయాన్ని సశాస్త్రోక్తంగా నిరూపించారు.
"ఓ ఆర్నెల్ల పాటు అలా నానా సాహిత్య గొడవా, రగడా జరిగాక విశ్వనాథ వారిహ ఈ సాహిత్య నాస్తిక దుర్మార్గుల్తో వాదించలేక "నాయనలారా! నా మేడ మీద గదిలో నేనొక్కడినే ఒంటరిగా పడుకుంటూ ఉంటాను గదా! మీకు అంత కసిగా వుంటే ఓ సైనేడ్ బుడ్డీ విసిరేయకూడదా! ఇలా చిత్ర వథ చేయనేల!" అని చేతులెత్తేసి మరీ వాపోయారు.
ఆ తుఫాను అలా వెలిసిందగ్గర్నుంచీ శ్రీవారు అహంకారం కాస్త తగ్గించుకుని ప్రశాంతంగా "పురాణవైర గ్రంథమాల"లో తమ మానసిక దురదలన్నింటినీ సాహిత్య వరంగా గోక్కోనారంభించారు. అందుకే దేవుడు గారు దయదలచి జ్ఞానపీఠ జాక్ పాట్ రూపంలో అనుగ్రహించినట్లున్నారు.
అందులో సందేహం అక్కర్లేదని విశ్వనాథ వారే అంటున్నారు. "నా గ్రహబలమే ఈ జ్ఞానపీఠం బహుమతి అనుగ్రహఫలం" అని శ్రీవారే స్వయంగా చెప్తున్నారంటే మనం చచ్చినట్లు నమ్మాల్సిందే! ఇప్పుడు నాకు బుధ మహర్దశ వచ్చింది. నా జాతకం అలా ఉంది. కనుకనే ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నా రాని ప్రైజు ఏ టిక్కెట్టూ కొనకుండానే వచ్చి నా కాళ్ల మీద పడింది అంటున్నారు విశ్వనాథ వారు.
మరి "రామాయణ కల్ప వృక్షం" సంగతేమంటారా? అయ్యా, తమరు ఉత్త అమాయకులు. ఇవన్నీ నశ్వరాలు, నిమిత్త మాత్రాలు. విశ్వనాథ వారే శలవిస్తున్నట్లు ఇవన్నీ రాయువాడూ, ఇప్పించువాడూ, ఇచ్చువాడూ, పుచ్చుకొనువాడూ, తినువాడూ, లేదా దాచుకొని వడ్డికిచ్చువాడూ, అంతా ఆ పరంధాముడి చేతికీలు బొమ్మలే!".
ఇది విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా అప్పట్లో నేను నెలనెలా "వసుధ" మాసపత్రికలో రాసే "కబుర్లు" శీర్షికలో 1971 ఆగస్టు సంచికలో రాసినది.
అప్పట్లో మిత్రులే కొందరు "మరి ఇంత కటువుగానా?" అని నొచ్చుకున్న సందర్భాలున్నాయి. అయితే వ్యక్తిగత విషయాల్లో మర్యాదలు పాటిస్తాంగానీ, సాహిత్య సిద్ధాంత విషయాల్లో నిర్మొహమాటంగా ఉండాల్సిందే. అది లేకనే మనమిలా తగలడ్డాం అనేది నా అవగాహన.
నిజానికి అంతకు చాలా చాలా సంవత్సరాలకు పూర్వమే నేను "విశాలాంధ్ర"లో పనిచేసే రోజుల్లో ఈ అంశం మీదనే అప్పటి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మద్దుకూరి చంద్రశేఖరరావు గారికి నా నిరసన తెలిపి ఉన్నాను.
అదేమంటే....
ఓ రోజున విశాలాంధ్ర ప్రచురణాలయం మేనేజర్ నన్ను పలిచి, ఓ పుస్తకాల లిస్టు ఇచ్చి "ఇవి ఏలూర్రోడ్డు మీద ఫలానా ఎస్సారార్ సివిఆర్ కాలేజీ దగ్గర్లో, ఫలానా చోట ఉండే విశ్వనాధ సత్యనారాయణ గారి ఇంటి వద్ద దొరుకుతాయి. ఈ చీటి ఆయనకిచ్చి పుస్తకాలు పట్రా" అని ఆజ్ఞాపించారు.
నేనప్పటికే విశ్వనాధ వారి పుస్తకాలు దొరికినంత వరకు చదివి ఉన్నాను. ముఖ్యంగా "వేయిపడగలు" మూలంగా ఆయన్ను మహా ఛాదస్తునిగా లెక్కవేసుకొని ఉన్నాను. "హాహా హిహి హుహు"లోనో మరెందులోనో గానీ ఆంగ్ల భాష విషయంలో ఆయన విమర్శలు మరీ హాస్యాస్పదంగా కనుపించాయి. అందుకని "ఈయన పుస్తకాలు అంతదూరం నించీ మోసుకొచ్చి అమ్మే ఖర్మ మనకేమిటీ? అనడిగేను, మేనేజరు వెంకట్రామయ్య గారిని. "ఓ ఆర్డరు ఉందిలేవోయ్! మన పుస్తకాల్తో పాటు అవీ సప్లయి చేయాలిగానీ, వెళ్ళి పట్రా" అన్నారాయన.
సరే, నేను అంతదూరం శ్రమపడి వెళ్లేను, కనీసం అంత "గొప్ప" వాడిని, "కవిసామ్రాట్టు"ను చూసినట్లవుతుందని.
కాలేజీలో లెక్చరర్ గనుకా, కవి సామ్రాట్ బిరుదాంకితులు గనుకా ఏలూరు కాల్వకు సమీపంలోని ఆయన "పర్ణశాల" నాకు తేలిగ్గానే దొరికింది. నిజంగా ఆదో పర్ణశాలే! చుట్టూ కర్రల్తో కట్టిన "దడి", దానికో గేటు, మధ్యలో పూరిల్లు.
నేనాగేటుకున్న తాడో పేడో గానీ వదిలించి గేటు తీసుకొని రెండు అడుగులు లోపలికి వేశానో లేదో, సాక్షాత్తూ కవిసామ్రాట్టు గారే ఆ కుటీరంలోంచి బయటికి వచ్చేరు, రెండు చేతులూ ఎత్తి "ఆగుము, ఆగుము" అని ఆదేశిస్తూ.
ఆయన నా దగ్గరకు రాగానే నేనెవర్నో బహుశా అర్థం అయిపోయుంటుంది. అయినా, ఫలానా అని చెప్పి జేబులోంచి మా మేనేజరు గారి లేఖ మరియు శ్రీవారి పుస్తకముల జాబితా ఉన్న కవరుతీసి వారిచేతికి అందివ్వబోయేను.
మడి, అంటరాని తనం అలా పాటించారు:
ఆయన జడుసుకున్నారో ఏమో గానీ "ఆగాగు" అని చెప్పి నాలుగడుగులు వెనక్కి వేసి "ఆ లేఖనట పెట్టుము" అని వర్ణశాల అరుగుకేసి చూపించేరు. నేనున్నూ కవి సామ్రాట్టుల వారి ఆజ్ఞ శిరసావహించేను.
అపుడాయన ఆ లేఖ రాజంబును మడిచెడకుండా రెండు వ్రేళ్లతో ఎత్తి తీసుకొని శ్రద్ధగా పఠించిన వారై "అచ్చోటనే యుండుము, ముందుకు రాకుము" అని యాజ్ఞాపించి వర్ణశాలలోని కేగిన వారయిరి. మరి కొంతసేపటికి పుస్తకములు తెచ్చి, తీసుకుపోమ్మని యువాచించగా "హమ్మయ్య" అనుకుని నేను గ్రంథరాజములను నా ద్విచక్ర వాహనము వెనుక సీటుకు తగ్గించుకొని, ఆఫీసున కేగి, మానేజర్ గారికా పుస్తకములకట్ట, కవి సామ్రాట్టుల స్వహస్త లిఖిత బిల్లు సహితంగా అందజేసి "అయ్యా, నన్నింకెన్నడూ సదరు చాదస్తుని వద్దకు పంపకుడు" అని ప్రార్థించిన వాడినైతిని.
ఆ తర్వాత ఓ రోజు "మద్దుకూరి చంద్రశేఖ రావు గారు" కాస్త తీరిగ్గా కనపడితే అడిగేను "ఇలాంటి వాళ్ల పుస్తకాలు అమ్మే ఖర్మ మనకేమిటండీ" అని.
చంద్రం గారు కేవలం పార్టీ కార్యదర్శేకాదు. సాహితీ పరులకు గౌరవ పాత్రుడయిన ఆనాటి ప్రముఖ విమర్శకుడు కూడానూ.
"కొందరు రచయితలు రాజకీయంగా మనకు మిత్రులే, మనవాళ్లే అయినా, వారి రచనల్లో మనకు నచ్చని రాజకీయ లేదా సిద్ధాంతపర అంచనాలున్నాయన్న కారణంగా ఇప్పటికే కొందరి పుస్తకాలు విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అమ్మటానికి నిరాకరించి విరోధాలు తెచ్చి పెట్టుకున్న అసలు సిసలు కమ్యూనిస్టులం గదా మనం! మరి ఈ విశ్వనాధ సంగతేమిటండీ!" అనేది నా అభ్యంతరం సారాశం.
ఆయన అందుకు సమాధానంగా ఏమీ అనలేక పోయినట్లున్నారు. కేవలం విని ఊరుకున్నారు. నేను రెట్టించలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగే వాడేలేడు.
ఆనాడు విశ్వనాథ వారి ఫ్యూడల్ సంస్కృతీ ప్రతీకలైన సాహిత్యాన్ని అమ్మిపెట్టే విషయంలో ఏదో పొరపాటు జరిగింది లెమ్మనుకున్నా అది ఆ తర్వాత అలవాటుగా మారి, అంతకన్నా హీనమైన పెట్టుబడిదారీ "క్షుద్ర" సాహిత్యాన్ని కూడా అమ్మిపెట్టే స్థితికి అభివృద్ధి చెందామంటే దానికి బీజాలు ఆనాడలా పడినవే కాదా!
- కీ.శే. చలసాని ప్రసాదరావు
("ఇలా మిగిలేం" పుస్తకం (1993) నుండి స్వీకరణ)