బుధవారం, డిసెంబర్ 08, 2010

మహాభారతంలో స్త్రీలు-అప్పటి వివాహ రీతులు -1

ప్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్, పిహెచ్.డి., డి.ఎస్.సి (ఆనర్స్) 
తెలుగు అనువాదం: ెనిగళ్ళ కోమల


పరిచయం
తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి అని నానుడి. భారతం వేద వ్యాసుడు వ్రాసినట్లుగా మనకు తెలుసు. భారతం లో కధలు, ఉపకధలు, పాత్రలు, పేరులేని పాత్రలు ఎన్నో అసంఖ్యాకంగా ఉన్నాయి. వీటిలో సంక్షిప్తాల గురించి తెలిసింది తక్కువ. రాజ్యాగానికి సవరణలు చేసినట్లుగా మహా భారతానికి కాల క్రమేణా ఎన్నో సంక్షిప్తాలు వచ్చి చేరాయి. ఏవి వ్యాసుడి రచనో, సంక్షిప్తాలో చెప్పలేము. ఈ వ్యాసం భారతం లోని ముఖ్య స్త్రీ పాత్రలను మనకు పరిచయం చేస్తుంది. భారత కధ పరిణామంలో ఈ స్త్రీలు చాలా ముఖ్య పాత్రను పోషించారు.  వ్యాసుడికి తన రచనాకాలంలోని భారత దేశం లోని భిన్న ప్రాంతాల వైవాహిక ఆచారాల గురించిన అవగాహన ఉన్నది. ద్రౌపది బహు భర్తృత్వం ఆశ్చర్యం కలిగించే అంశమైనా ఈ నాటికి ఈ ఆచారాన్ని లదక్ (జమ్ము మరియు కాష్మిర్ రాష్ట్రం), ఉత్తర నేపాల్ లలో చూడవచ్చు. హిందూ మతానికి ఆయువుపట్టైన భగవద్గీత మహాభారతంలో ఉండటంతో మహాభారతం హిందూ మతస్తుల దృష్టిలో పవిత్ర గ్రంధంగా పరిగణించబడుతున్నది. భారత కధ, పాత్రలు సంక్లిష్టమైనవి. ఈ ఇతిహాసం లోని స్త్రీ పాత్రలు, అప్పటి వైవాహిక రీతులు గురించిన ఆసక్తికరమైన వ్యాసమిది. ఈ వ్యాస సేకరణకు సహకరించిన మిత్రులు ఇన్నయ్య గారికి ధన్యవాదాలు.

ఆసక్తికరమైన ఈ ఆంగ్ల వ్యాసం రచయిత, అనువాదకురాలను అంతర్జాల పాఠకులకు పరిచయం చేయటం నాకు ప్రమోదాన్నిస్తుంది. వీరి పరిచయాలివిగో. 

ప్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్

కృష్ణకుమార్ గోవాడ (తెనాలి తాలూకా, గుంటూర్ జిల్లా) గ్రామస్తులు.మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజ్ లో విద్యాభ్యాసం తరువాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జూఅలజీ శాఖలో 1960 ల లో పనిచేశారు.  తదుపరి అమెరికా లోని క్లీవ్‌లాండ్ , మిల్వాకీ లోని మార్కెట్టె విశ్వవిద్యాలయాలలో పని చేశారు. అక్కడి జూఅలజీ జర్నల్ కు సంపాదకత్వం వహించారు.

ప్రొఫెసర్ కృష్ణకుమార్, జ్యోతిర్మయి (భార్య) లకు పర్యాటన ఆసక్తికరం. ప్రపంచంలోని పలు దేశాలకు, వియత్నాం నుంచి అర్జెంటీనా దాక పలు సార్లు పర్యటించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా ప్రయాణించారు. అక్కడి విద్యా సంస్థల పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రస్తుతం మేరీలాండ్ (అమెరికా) లో విశ్రాంత జీవనం గడుపుతున్నారు.  ఏకైక సంతానమైన వారి అబ్బాయి అక్కడే అట్టార్నీ గా పనిచేస్తున్నారు. కృష్ణకుమార్ గారికి  విద్యావిషయమైన అంశాల బయట, సాహిత్య సంబంధమైన విషయాల పై వ్రాయటం మరో ఇష్టం.పాత్రికేయులు గోరా శాస్త్రి , నార్ల వెంకటేశ్వరరావు ల తో వ్యక్తిగత పరిచయముంది. ప్రఖ్యాత కవి శ్రీశ్రీ అమెరికా పర్యటనలో వీరింట ఉన్నారు.

వెనిగళ్ల కోమల

తన తెలుగు అనువాదాలు చెల్లుకు చెల్లు -తస్లీమా నస్రీన్ Shodh, ఐదు సార్లు పునర్ముద్రణ ఐన ఎం.ఎన్. రాయ్ పిల్లి ఆత్మ కధ (Memoirs of a cat), అయాన్ హిర్సీ అలీ పుస్తకాలు మతగ్రహణం వీడింది (Infidel), మత పంజరంలో కన్య (Caged Bird) ఇంకా తాజాగా సంచారి (Nomad) ద్వారా చిర పరిచితమైన కోమల,జంగ్ చాంగ్ వ్రాసిన Wild Swans అనువాదం అడవిగాచిన వెన్నెల ద్వారా ఆంధ్రదేశంలో పాఠకులకు మరింత దగ్గరయ్యారు.


గుంటూర్ జిల్లా మూల్పూర్ వాసి ఐన కోమల, హైదరాబాదులోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో, ఆంగ్ల శాఖలో పని చేసారు. హేతువాది ఇన్నయ్య తో తెనాలిలో 1964లో వీరి వివాహం ప్రఖ్యాత హేతువాది, కీర్తిశేషులైన ఆవుల గోపాలకృష్ణమూర్తి జరిపారు. అమెరికా లో విశ్రాంత జీవనం గడుపుతూ,భర్త ఇన్నయ్య, కూతురు డాక్టర్ నవీన, కొడుకు రాజు నరిసెట్టి (Managing editor of Washington Post) తో కలిసి నివసిస్తున్నారు.
-సి.బి.రావు

ముందుమాట

మహాభారతం 18 పర్వాలతో, లక్షకు పైచిలుకు పద్యాలతో ఒక సుదీర్ఘ (బృహత్) కావ్యం – వ్యాసుడు రచించినట్లు నమ్మిక. అందుకే ఆ కావ్యాన్ని ‘వ్యాసభారతం అని అంటారు. భారత పండితులు మహాభారతాన్ని పంచమ వేదంగా గుర్తించారు. నాలుగు వేదాలూ చెప్పే మత, లౌకిక విషయాలను వ్యాసుడు ఇందులో క్రోడీకరించాడంటారు. మహాభారతం వ్యాసుని ఊహాజనితమైన కథా లేక చారిత్రసంఘటనల సమాహారమా అనేది ఎవరూ నిర్ధారించలేకపోయారు.మూలగ్రంథం సంస్కృతంలో ఉన్నా, అనేక భారతీయ భాషలు, కొన్ని ఇతర దేశాల భాషలలోకి అనువదించారు. హిందువులు అతి పవిత్రమని విశ్వసించే భగవద్గీత మహాభారతంలో ఒక భాగమే. అందులో అనేక మోక్షమార్గాల గురించి చర్చ ఉన్నది. మానసిక ప్రశాంతతకు ప్రథమ సాధనంగా భగవద్గీతకు ఉన్నత స్థానం ఉన్నది.
మహాభారతంలో అనూహ్యమైన సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. అందుమూలంగా  గ్రంథం సామాజిక నైతిక విషయాలనెన్నో చర్చించే కట్టు కథగానే భావించవలసి వస్తున్నది. కథంతా ఒక రాజుగారి మనవ సంతానం మధ్య ఆస్తి పంపకాలలో జరిగే న్యాయాన్యాల చుట్టూ పరిభ్రమిస్తుంది. అన్నదమ్ముల బిడ్డల మధ్య పొడచూపే ఈర్ష్యాద్వేషాలు, అయ్యో పాపం! అని మనం జాలిపడే సంఘటనలు, మానవ హక్కుల ఉల్లంఘన, మెచ్చుకోదగ్గ కార్యసాధన, గౌరవం ఇనుమడింపజేసే కార్యాచరణ అలా అనేక విషయాలు ఇందులో వర్ణించే తీరు మనల్ని అబ్బుర పరుస్తుంది. నిజంగా జరిగిన విషయాలా అని ఆశ్చర్య పోయేంతగా వర్ణనలున్నాయి. ఇందులో కొందరు స్త్రీ పాత్రలను రచయిత ఎంతో ఉన్నతంగా తీర్చి దిద్దాడు. వారి పుట్టుక, ఇతరులతో వారి సంబంధ బాంధవ్యాలూ, వారి వివాహ విధానం అన్నీ సత్యదూరమనిపించినా, వారిని భారత స్త్రీలకు ఆదర్శంగా చూపారు.  వ్యాసంలో కొందరు స్త్రీ పాత్రల నుచ్చరించటం జరిగింది. మహాభారత కాలంలో ఈ స్త్రీలు చేపట్టిన కార్యక్రమాలు, వారి వివాహ పద్ధతులు, వారి హక్కులు, వారి మనోగత వాంఛలు చాలా నిర్దుష్టంగా పరిగణనలోకి తీసుకుని ఆయా పాత్రల గురించి వ్రాశాను. రచయిత కాలం నాటి సామాజిక విలువలు, మానవ స్వభావం గురించి చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఇందుకు ఎంపిక చేసిన పాత్రలు – సత్యవతి (మత్స్యగంధి, గంధావతి అని కూడా పేర్లున్నాయి.) అంబ, అంబిక, అంబాలిక, గాంధారి, కుంతి, మాద్రి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, హిడింబి గురించి కూడా ప్రస్తావన ఉన్నది.

సత్యవతి మాతృస్వామ్య వ్యవస్థలో కుటుంబ పెద్ద. మహాభారత కథలో సత్యవతిది కుటుంబ పెద్దగా పెద్ద పీట. ఆమె పుట్టుక చాలా అసహజమైనది, అసాధ్యమైనది కూడా. జె.కె. రౌలింగ్స్ సృష్టించిన హేరీ పోటర్ పాత్రను మించిన మ్యాజిక్ పాత్ర ఆమెది. వసురాజు వేటకు వెళ్ళినప్పుడు పరిసరాల సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. రంగు రంగుల పూలూ, పక్షుల కిలకిలారావాలు వింటుంటే రాజుకు తన అందమైన భార్య జ్ఞాపకం వస్తుంది. అతనిలో కామవాంఛ చెలరేగుతుంది. కామోద్రేకంలో తాను విడచిన వీర్యాన్ని ఒక గద్ద ద్వారా తన రాణికి పంపిస్తాడు. మధ్య మార్గంలో మరో పక్షి గద్దదగ్గర ఆహారమున్నదని భ్రమించి దానితో పోరాడుతుంది.  ఆ ఘర్షణలో ఆ వీర్యం జారి నదిలో పడగా, ఒక చేపదాన్ని మింగుతుంది. శాపవశాత్తూ ఒక అప్సరస ఆ చేప రూపం దాల్చింది. ఆ చేపను పట్టి కోయగా అందులో ఒక బాలుడు, ఒక బాలిక ఉన్నారు. ఆ అబ్బాయే మత్స్య రాజ్యానికి రాజవుతాడు. అమ్మాయిని మత్స్యకారులు పెంచుకుంటారు. సత్యవతి అని నామకరణం చేస్తారు. (చూడు – ఆదిపర్వం, పే.126). (ఈ వ్యాసంలో పేర్కొన్న పేజి నంబర్లు వాల్యూం-1 (ఆది పర్వం) మహాభారతం కీసరి గంగూలీ అనువదించాడు. గూగుల్ పుస్తకాల్లో లభ్యమవుతుంది). సత్యవతి మంచి అందగత్తెగా ఎదిగింది. బల్లకట్టు ద్వారా జనాన్ని యమునా నది దాటించే పని చేస్తుండేది. ఆమె అందం పరాశరుడు అనే రుషిని ఆకట్టుకున్నది. ఆయన గొప్ప మేథావి. సత్యవతి దగ్గర చేపల కంపు ఆమె అందం ముందు పేలవమయింది. ఆ కంపు వల్లనే ఆమెకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది.
సత్యవతి  పరాశరుడితో కలయికకు రెండు అభ్యంతరాలు లేవనెత్తింది. 1. అది పగటి పూట నది ఒడ్డున ఉన్నవారు వారిని గమనిస్తారు, 2. అతనితో లైంగిక సంపర్కం జరిగితే ఆమె కన్యాత్వం కోల్పోతుంది, గర్భవతి అయితే సమాజంలో కులటగా భావిస్తారు. తన తండ్రి కోపానికి గురవుతానని కూడా భయపడింది. ఇక్కడ ఆమెకు అవినీతి అనే భయంలేదు. ఆమె అభ్యంతరాలన్నీ సమాజ పరమైనవే. ఆ రోజుల్లో స్త్రీలను నీతి విషయం గాక, సమాజంలో మచ్చపడడం ఇష్టం లేనట్లు చూపటంలో రచయిత అభిప్రాయం వెల్లడవుతున్నది.  పరాశరుడు సత్యవతి అభ్యంతరాలన్నీ మటుమాయమయ్యేలా మాట్లాడి, ఆమెను ఒప్పిస్తాడు.  ఆ రుషి (రుషులు కూడా శృంగార ప్రియులే.) తన మంత్ర శక్తితో పొగమంచు తెరను అడ్డువేసి, ఇతరులు తమని చూడకుండా చేస్తాడు. ఆ కలయిక వల్ల సత్యవతి తల్లి అయినా ఆమె కన్యత్వం యధాతధంగా నిలుస్తుందని మాటయిస్తాడు. మరో విషయం ఆ కలయిక తరువాత ఆమె సుగంధిగా మారిపోతుంది. వారి సంభోగం వలన జనించే పుత్రుడు గొప్ప మేథావి, రుషి అవుతాడు. అతనే వ్యాసుడు – మహాభారత రచయిత. (చూడు పేజి 127, 227) వ్యాసుడు ఒక ద్వీపకల్పంలో పుడతాడు. వెంటనే తల్లిని వీడిపోతాడు. తండ్రి మంత్ర శక్తులు అతనికి అబ్బాయి. తల్లికి అవసరమైనప్పుడల్లా వస్తానని ఆమెకు మాట యిస్తాడు. ఈ కథ జరగ సాధ్యం కానిది. అంతా మంత్రశక్తి వలన సాధ్యమైనదే. దీని వెనుక ఏదైనా నిగూఢార్ధమున్నదేమో.
సత్యవతి జీవితంలో తరవాత జరిగే సంఘటనలే  కావ్యానికంతా మూలం. ఆమె ఒకనాడు బల్లకట్టు నడుపుతుండగా శంతనుడనే చక్రవర్తి ఆమెను చూసి సమ్మోహితుడవుతాడు. రుషి పరాశరుని విషయంలో కంటే  ఈ చక్రవర్తి విషయంలో వ్యాసుడు నీతి నియమాలు పాటిస్తాడు. పరిపాలకులు రుషుల కంటే భిన్నంగా నీతినియమాలు పాటించాలేమో. వారు చట్టాల్ని అమలు పరచే వారు గదా. శంతనుడు సత్యవతి తండ్రి దాసరాజ దగ్గరకెళ్ళి ఆమెను వివాహ మాడటానికి అనుమతి కోరతాడు.
ఆధునిక కాలంలో తండ్రుల మాదిరిగానే సత్యవతి తండ్రి తన కూతురుకు మంచి సంబంధం కోసం చూస్తాడు. శంతను రాజుతో సత్యవతికి పుట్టే బిడ్డలే అతని రాజ్యానికి వారసులవ్వాలని ఆమె తండ్రి పట్టుబడతాడు. (పే.215) శంతను రాజుకి అప్పటికే దేవవ్రతుడనే కొడుకు ఉన్నాడు. అతను రాచరికపు విద్యలన్నిటా ఆరితేరినవాడు. తండ్రి తదుపరి రాజుగా ఎన్నుకోబడ్డాడు.
శంతనుడు దేవవ్రతుడి (దైవప్రసాదం) హక్కును కాదనలేడు. సత్యవతినీ మరువలేడు. ఆ దిగులుతో రాజుగా తన విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతాడు. దేవవ్రతుడు తన తండ్రి స్థితికి కారణం తెలుసుకుని సత్యవతితో వివాహ విషయం మాట్లాడటానికి  మత్స్యరాజు ద్వారా ఆమె తండ్రిని కలుస్తాడు. అతను పెట్టిన షరతులు విని దేవవ్రతుడు తను రాజు కాగల హక్కును త్యజిస్తాడు. సత్యవతి తండ్రి అంతటితో తృప్తి చెందడు. దేవవ్రతుడు రాజ్యాధికారాన్ని తిరస్కరించినా, అతని పుత్రులు ఆ అధికారాన్ని చేబట్టవచ్చుననే సందేహాన్ని అతను వెలిబుచ్చుతాడు. అది విన్న దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి పోతానని శపథం చేస్తాడు. అప్పటి నుండి అతడు భీష్ముడుగా (మొండివాడు, బలవంతుడు, పట్టుదల గలవాడు) కఠోర బ్రహ్మచారిగా మిగిలాడు. మహాభారతంలో కీలకపాత్ర పోషించాడు.  సత్యవతిని రాజ ప్రాసాదానికి తీసుకువచ్చి తన తండ్రితో వివాహం జరిపిస్తాడు. ఆమె ఇద్దరు కొడుకుల్ని కంటుంది – చిత్రాంగద, విచిత్రవీర్య – ఇద్దరూ యోధులే. శంతనుడి మరణం తరువాత భీష్ముడు చిత్రాంగదునికి పట్టాభిషేకం జరిపిస్తాడు. కాని అతను ఒక గంధర్వుని చేతిలో మృతి చెందుతాడు. భీష్ముడు మైనారిటీ తీరని విచిత్ర వీర్యుని గద్దె ఎక్కించి, రాణి, సత్యవతి అధీనంలో రాచ వ్యవహారాలు నడిపిస్తాడు.
సత్యవతి కథలో రచయిత రెండు రకాల లైంగిక సంపర్కాన్ని చూపుతాడు. 1) రుషిపుంగవుడు అందగత్తె అయిన సాధారణ స్త్రీతో సంభోగిస్తాడు, 2. తండ్రి అనుమతితో పిన్నవయసులో ఉన్న అమ్మాయి వివాహం వయసుమీరిన బలవంతుడైన రాజుతో జరిపిస్తాడు. తండ్రి తన కుమార్తెకు మంచి భవిష్యత్తుకు  బాట వేస్తాడు.

(ఇంకా ఉంది)




2 కామెంట్‌లు:

Afsar చెప్పారు...

రావు గారు:

ఒక మంచి వ్యాసం అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మనం రామాయణం చర్చినంతగా భారతాన్ని చర్చించలేదు. ఇలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగినా, అది మంచి దోహదమే!

మరో భాగం కోసం ఎదురు చూస్తూ..

అజ్ఞాత చెప్పారు...

Ayya ,ippatike naligi naligi vunna deenni inka teliyacheyaala?
Ee vivahaala, vaari lyngika samparkaalaku ippati sandarbham emiti?

aswinikumar

కామెంట్‌ను పోస్ట్ చేయండి