శనివారం, డిసెంబర్ 02, 2006

నా నెల్లూరు పర్యటన -7


Photo: cbrao River & Sea

కృష్ణ పట్నం చూడర బాబు

రామ కృష్ణ గారు తనను తాను పోర్ట్ అధికారులకు ఫోన్లో పరిచయం చేసుకుని పోర్ట్ చూడటానికి అనుమతి తీసుకున్నారు. పోర్ట్ లో రేవుని లోతు చేసే కార్యక్రమంలో చాలా యంత్రాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ ప్రదేశం దాటి ఇంకొంచం ముందుకెళితే ఒక బంగళా వచ్చింది. రహదారి కూడా ఆగింది. ఒక మట్టి రోడ్డు అక్కడి నుంచి లైట్ హౌస్ ను కలుపుతుంది. మేము పయనిస్తున్న వాహనములోనే లైట్ హౌస్ కి వెళ్ళాము. లైట్ హౌస్ సంరక్షిత ఆవరణలో ఉంది. అక్కడ పని చేసే ఉద్యోగుల కార్యాలయం, వారి నివాస భవనాలు అదే ఆవరణ లో ఉన్నాయి. దర్శించటానికి ప్రవేశ రుసుము ఉంది. కందలేరు నది ఒడ్డున దీన్ని కట్టారు. నడి సముద్రంలో 2 కి.మీ. దూరంలో ఉన్న నౌకలకు చిన్న పడవల ద్వార సరుకు రవాణా చెయ్యబడుతుంది. లైట్ హౌస్ ని చాయా చిత్రాలు తీయరాదని అక్కడ ప్రకటన ఉన్నది. గూగుల్ (ఉపగ్రహం) ద్వారా నేల మేద ఉన్న ప్రతి కట్టడాన్ని అంతరిక్షం నుంచి చాయగ్రహణం చేసే వీలున్న ఈ రోజుల్లొ ఇది కొంచం అతిగా ఉందనిపిస్తోంది. బహుశా వారు ఇంకా బ్రిటిష్ వారి నిబంధనలనే పాటిస్తున్నట్లున్నారు. దీన్ని 1940లో కట్టారు కాని అది పాడవటం వలన కొత్త లైట్ హౌస్ ని 1978లో కట్టడం జరిగింది. దీని ఎత్తు 98 అడుగులు. ప్రతి 15 సెకనులకు ఒక సారి మూడు ప్రకాశవంతమైన కాంతి పుంజాలను (289 kHz) వెదజల్లుతూ 18 నాటికల్ మైళ్ల దూరం దాకా నౌకలకు దిశా నిర్దేశనం కావిస్తుంది. లైట్ హౌస్ పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. పైకి వెళ్ళి చూసినప్పుడు నది ఒడ్డు , దూరంగా సముద్రపు అలలు సుందరంగా కనిపించాయి. పైన గదిలో కాంతి పుంజాలు వెద జల్లే యంత్ర సామాగ్రి ఉంది. 1960ల దాక ఈ ఓడ రేవు చురుగ్గా ఉండేది. అక్కడ నుండి బయలుదేరి మరలా బంగళా దగ్గరకి చేరుకున్నాము.


Photo:cbrao River Kandaleru

ఈ బంగళా వెనుకనుంచి కందలేరు నది ప్రవహిస్తోంది. ఈ నది ఒక పక్క బంగాళా ఖాతం తోనూ మరో పక్క బకింగ్ హాం కాలువతోను కలిసివుండి సరకులను మదరాసు కు రవాణా చేసేందుకు వీలుగా ఉంది. కృష్ణ పట్నం ఒక బెస్తవారి పల్లి కావటం వలన బంగళా వెనుకనించి పడవలు వెళ్తూంటవి. మురళీధర్ గారి ఉద్దేశ మేమంటే బంగళా వెనుక పడవలోంచి మమ్ములను సముద్రంలోకి వెళ్ళి విహరించి రమ్మనమని. కాని నదిలో లోతు తీసే పనులు జరుగుతున్నవి కావున తాత్కాలికంగా అక్కడ పడవ సదుపాయాన్ని నిలిపి వేశారు. ఈ జంఝాటం వలన సముద్రంలో విహరించాలనే మా కోరిక తీర లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. బంగాళా ఖాతంలో తుఫానులు ఎక్కువే అయినప్పటికీ కృష్ణ పట్నంలో తుఫానులు చాలా అరుదు. అందువలన నౌకలకు ఇది సురక్షితం. 30 ఓడలు నిలిచే సౌకర్యంతో, జూన్ 2008లో, 8000 మిలియన్ రూపాయల అంచనా వ్యయంతో దీని ప్రధమ దశ నిర్మాణ పనులు పూర్తికావచ్చని అంచనా. ఇక్కడనుంచి ఇనుప ఖనిజాలు, గ్రానైట్ రాళ్ళు,బొగ్గు, పెట్రో రసాయనాలు, పెట్టిలో పంపెడి సరుకులు (Container cargo) జపాన్, చైనా వగైరా దేశాలకు ఎగుమతులు అవగలవు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్ని స్థాపించనున్నారు. http://www.apgenco.com/inner.asp?frm=jvslink1 వీటికి super critical thermal station స్థాయి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థాపనకి రూ.2000కోట్లు ఖర్చుపెట్టనున్నారు. వీటిని Andhra Pradesh Power Development Company Limited (APPDCL), a Joint Venture Company of APGENCO and ILFS each with 50% equity నిర్మించనుంది. ఇప్పటికే రూ.15,000 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న 4,000 మెగావాట్ల కృష్ణపట్నం థెర్మల్ పవర్‌ప్లాంటుకి ఈ రెండూ అదనం. ఇవి పూర్తయితే మరో 600 మెగావాట్ల విద్యుత్‌కేంద్రం కూడా కృష్ణపట్నంలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అప్పుడు కృష్ణపట్నం కర్మాగారాల స్థాపిత శక్తి 6200 మెగావాట్లకి చేరుకోగలదు. వీటిల్లో ఒక్కొక్క చిరు కర్మాగారానికి 500 ఎకరాల స్థలం అవసరం.ఈ కొత్త కర్మాగారాల నిమిత్తం ప్రస్తుతం అయిదో నెంబరు జాతీయ రహదారినీ కృష్ణపట్నం పోర్టుని అనుసంధానం చేస్తున్న రెండు వరసల రోడ్డుని 2007 మధ్య నాటికి నాలుగు వరసల రోడ్డు స్థాయికి పెంచడం పూర్తవుతుంది. కృష్ణపట్నం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అన్ని దేశాల కార్పొరేట్ దిగ్గజాలూ అహమహమికతో పోటీపడుతున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కాంట్రాక్టుల విషయాలు చూసుకుంటోంది. కృష్ణ పట్నం ను ఈ మెగా ప్రాజెక్ట్స్ కు అనువైందిగా నిపుణులు గుర్తించటానికి మరొక కారణ మేమంటే ఈ పోర్ట్ 125000 టన్నుల బొగ్గును ఒకే సారి దిగుమతి చేసుకునే సామర్థ్యం కలిగి ఉండటం. APGENCO కు యూనిట్ ఉత్పాదన ధర 2 రూపాయలే. రెండో నిర్మాణ దశలో మరో 4000 మెగా వాట్ల విద్యుతుద్పాదన కేంద్ర స్థాపనకు అవకాశం ఉంది.
టెండర్ల పని అవుతూనే, ఏప్రిల్ 2007 లో ఈ కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. మన అవసరాన్ని మించి విద్యుత్ ఉత్పాదన ఉండగలదని అంచనా. కృష్ణ పట్నం లో కందలేరు (ఉప్పుటేరు)ను, సముద్రాన్ని, దూరంగా సుందరమైన అలల్నీ చూశాక కృష్ణ పట్నం గ్రామం చూడటానికి బయలుదేరాము.


Photo:cbrao Siddheswara Sivalayam

కృష్ణ పట్నం గ్రామంలో

ఇది చాలా చిన్న ఊరు. మేము అక్కడకు చేరేసరికి ఇంకా వెలుతురు ఉండటం వలన అక్కడి సిద్ధేశ్వర శివాలయం లోని ప్రాచీన శిల్పాలు చూసే అదృష్టం కలిగింది. శృంగార కవి శ్రీనాధుడు ఇక్కడ నివసించినట్లు దేవాలయం కుడ్యంపై ఉన్న ఆయన చాటు పద్యాలు చెబుతున్నాయి. నెల్లూరి నెరజాణ అనే పదం శ్రీనాధుడి సృష్టేనని ఇక్కడి వారంటారు. శ్రీనాథుడి పద్యం చదవాలనే ప్రయత్నం చేశాము కాని దానిపై సున్నం వెయ్యటం వలన వీలు కాలేదు. ప్రాచీన రాతి శిల్పాలను ఎలాంటి రంగులు వెయ్యకుండా వదిలేస్తేనే వాటి అసలు సౌందర్యం మనము చూడగలము. దేవాలయ నిర్వహణాధికారులు వాటి నిర్వహణ పై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. దేవాలయ చరిత్రను చెప్పే ఒక శిలాశాసనం కూడా ప్రాచీన తెలుగులో రాయబడి ఉంది. శ్రీనాధుడు 1350-1500 AD మధ్య కాలం నాటివాడని తెలుస్తూంది.

Apsara
Photo: cbrao Apsara

4 వ్యాఖ్యలు:

radhika చెప్పారు...

photos lo cuusi caduvutuu vuntea memu vellinattevundi.veelayite srinadhuni padyalu vunna photo kudaa pettandi plz

cbrao చెప్పారు...

శ్రీనాధుడి చాటు పద్యాలపై వెల్ల వెయ్యటం వలన ఏమీ చదవలేము. అందువలన దాని చాయాచిత్రము నిరర్ధకమని తీయలేదు. నా వచ్చే బ్లాగులో శ్రీనాధుని గురించి మరింత రాస్తాను, మీ సమాచారానికై.

radhika చెప్పారు...

thanks andi.edurucuustumtaamu

tpraja చెప్పారు...

Have you seen the new India search engine www.ByIndia.com they added all the cool features of popular products like MySpace, YouTube, Ebay, Craigslist, etc. all for free to use and specifically for India. Anyone else try this yet?

ByIndia.com First to Blend Search, Social Network, Video Sharing and Auctions Into One Seamless Product for Indian Internet Users.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి