బుధవారం, డిసెంబర్ 26, 2007

సాహితీపరులతో సరసాలు


Jandhyala Papayya Sastry's first photo in internet.


కొత్త బ్లాగ్ సీరియల్ సాహితీపరులతో సరసాలు ప్రారంభించబోతున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము.ఇన్నయ్య గారి మిత్రులలో సాహితీపరులెంతమందో వున్నారు. వారి రచనల విశ్లేషణ కాక, తనకు పరిచయమైన వారి వ్యక్తిగత కోణంలోంచి చూస్తూ,మనకు తెలిసిన వ్యక్తుల, తెలియని కోణాలను ఆవిష్కరింప చేసేవి ఈ రచనలు.ఇంకో మాటలో చెప్పాలంటే, రచయితల నిజ జీవితంలోని,కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, ఈ వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇది. మొదటగా కీర్తిశేషులయిన వారితో ప్రారంభమయ్యే ఈ రచనలు,పాఠకుల ఆసక్తి పై ఆధార పడి జీవించి వున్న వారిపై కూడా రాయాలని సంకల్పం.ఈ రచనలన్నీ అముద్రితాలు. మొదటగా, నా ప్రపంచం బ్లాగు ద్వారా ప్రచురితమవబోతున్నాయి.

ఈ వ్యాస పరంపరలో వున్న అనేక రచయితల పై రాసిన వ్యాసాల లోంచి, కొందరి రచయితల లోంచి,మచ్చుతునకలను మీకు అందిస్తున్నాము.

రాచకొండ విశ్వనాథశాస్త్రి

రాచకొండకు ఇరువురు భార్యలు, విశాఖపట్నంలో రిక్షా వాళ్ళందరికీ ఆపద్భాంధవుడైన రాచకొండ తాగినప్పుడు ఎక్కడకు తీసుకెళ్ళాలో వారందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఒక రిక్షావాడు ఒకనాడు రాచకొండను అలాంటి దశలో పెద్ద భార్య దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తడితే. “ఏరా, ఆసికాలా ఏసికాలా” అంటూ, తలుపేసుకున్నదట. అప్పుడు రెండో భార్య దగ్గరకు చేరేశాడట. స్వవిషయం చెప్పికూడా రాచకొండ నవ్వించాడు.

పురాణం సుబ్రహ్మణ్య శర్మ

విషయాల్ని కొత్త కోణం నుంచి కూడా పురాణం చూచేవాడు. తిట్లు రెండు రకాలని, బ్రాహ్మణులతిట్లు శాపనార్థాలతో వుంటాయనేవాడు, ఇలా. నీపాడె, పచ్చిబద్ధాలు, తలపండు పగల-యిత్యాదులు.

శూద్రులతిట్లు సృష్టి కార్యానికి చెందాయట!


జంధ్యాల పాపయ్య శాస్త్రి

పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ ఎ.సి. కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడైనా, తెలుగు నాటకం చక్కగా, హృద్యంగా చెప్పేవారు. ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం ఎ.సి. కాలేజీలో ఏర్పాటు చేస్తే, పాపయ్య శాస్త్రి కూడా వచ్చి, మెచ్చుకున్నారు. అది విశేషం.
చెట్లకు ప్రాణం వుంది, అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర, సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు. కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది.

కాళోజి నారాయణరావు

ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నారని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు.
వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట ఇంట్లో ఫోను లేనందున కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు రమ్మంటే, సరేనని జీపు ఎక్కి, అడిగారట. నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెడుతున్నారా అని. ఆయన నవ్వి. లేదండీ, ఢిల్లీ నుండి మీకు ఫోను వచ్చిందట, అందుకని అన్నారట. కలెక్టరేట్ లో సాదరంగా ఆయన్ను కూర్చోబెట్టి, ప్రధాని నరసింహారావుకు ఫోను కలిపారట. కాళన్నా, నీవు అన్నీ వద్దంటావు. కాని యీ సారి అలా అనొద్దు. పద్మ విభూషణ్ స్వీకరించడానికి ఒప్పుకో అంటే, కాళోజీ సరే అన్నారట.

ఇంకా నార్ల,G.V.కృష్ణా రావు,అబ్బూరి రామకృష్ణారావు,చలసాని ప్రసాదరావు, సంజీవదేవ్, మొదలగు ఎందరో సాహితీపరులపై, ఎన్నో ఆసక్తి కరమైన విషయాలతో ఈ వ్యాసాలున్నాయి. నూతన సంవత్సర కానుకగా, నా ప్రపంచం లో త్వరలో ఇవి వెలువడనున్నాయి.

http://naprapamcham.blogspot.com/

-cbrao
3 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

చంపేశారు రావు గారు,ఇంకా వారం ఆగాలా?

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

ఓ మహానుభావుడి ఫోటో చూపారు. ధన్యవాదాలు.

చదువరి చెప్పారు...

రావుగారూ, ఆ విశేషాల కోసం ఎదురుచూసేవాళ్లలో నేనూ ఒకణ్ణి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి