శనివారం, మార్చి 21, 2009

విశ్వనాథవారి వేదన: చౌదరిగారి పరామర్శ


నేపధ్యం

తన రచనలపై విమర్శలకు విశ్వనాధవారి స్పందన పాఠకులు చదివి ఉన్నారు. తన రచనలపై చౌదరిగారి విమర్శలలో పస లేదని విశ్వనాధ వారి ప్రసంగ సారాంశం. దీనికి కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారు స్పందిస్తూ వెలువరించిన వ్యాసాన్ని పాఠకులు చూడగలరు. -cbrao

భాషకు ద్రోహం

శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి

(ఆంధ్రపత్రిక అక్టోబరు 22వ తేదీ సారస్వతాను బంధంలో శ్రీ విశ్వనాథవారి ప్రసంగానికి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి సమాధానంగా వ్రాసిన వ్యాసమిది.)

చెన్నపురి ఆంధ్ర మహాసభవారు కావించిన సన్మాన సభలో రామాయణ కల్పవృక్ష విమర్శలను గూర్చి విశ్వనాథవారి కొన్ని మాటలు చెప్పినట్లు 18-10-61 ఆంధ్రపత్రికలో చదివితిమి.

ఈ ప్రసంగంలో నాకును కొంత సంబంధమున్నది. కావున ఈ నాలుగు ముక్కలు వ్రాయవలసి వచ్చినది.

ఈ రామాయణ విమర్శలు వ్రాస్తున్నవారు పండితులే. ప్రచురిస్తున్నవారు పండితులే. అయితే ఈ విమర్శలు ఎంత వరకూ నిలుస్తాయి. అనీ వారు ఆలోచించలేదు. ఇలా చేయడం భావ్యమా! న్యాయమా! అది భాషా ద్రోహం కాదా! సాహిత్యానికి తీరని అపచారం కాదా! ఈ పని భారతి పత్రిక మర్యాదకు తగునా! అని ఈ తీరుగ విశ్వనాథవారు పెద్ద ఆవేదన చూపినారు. ఈ విమర్శను తెలుగు సాహిత్యమున కత్యావశ్యకమనియు పండితులైనవారు ఈ పనిని ఎన్నడో చేసియుండవలసినదనియు ఇన్నేండ్లుగా ఈ కల్పవృక్ష విమర్శనలో ఉపేక్ష వహించుటచే ఒక విధమగు భాషా ద్రోహమనియు, నేటికైనా ఈ కల్పవృక్షములోని ‘వాస్తవికత’ లోకమునకు తెలియజేయుటచే మీకు ధన్యవాదము లనియు ఉత్కళమునుండి మద్రాసు వరకు ఎందరో అపరిచితులు ఇప్పటికే ఎన్నో ఉత్తరాలు వ్రాసిరి, వ్రాయుచున్నారు. ఇది భాషకు ద్రోహమో! భాషకు శ్రేయమో! చెప్పవలసినది కావ్యకర్త కాదు, ఆ భారము లోకమునకే వదలి తన పని తాను జేసికొనుటయే కావ్యకర్తకు ముఖ్యము.

ఈ ఘట్టములో విశ్వనాథవారు సెలవిచ్చిన అంశములివి-

 1. ఈ విమర్శించువారు తక్కువవారు కాదు, పండితులు.
 2. భాషలో తప్పుల సంగతి పండితులకు తెలియనిది కాదు.
 3. ప్రతిదానికి సమర్థన ఉండితీరుతుంది.
 4. ప్రయోగ నిదర్శనము – వ్యాకరణ సూత్రము లభిస్తుంది.
 5. తప్పులేకుండా బ్రహ్మదేవుడు కూడా వ్రాయలేడు.
 6. నేనూ తప్పులు వ్రాశాను.
 7. కాని, పత్రికలో (భారతిలో) చూపించినవి మాత్రం దోషాలు కావని సంస్కృతంలో ఎ.బి.సి.డీలు వచ్చిన వాడైనా చెప్పగలడు.
 8. అయినా ‘భారతి’ ప్రచురిస్తూ ఉంది.
 9. ‘భారతి’ ప్రసిద్ధి – స్థాయి, ఇదివరకే పోయింది.
 10. ఇప్పటి దాని స్థితి వీనినిబట్టి తెలుస్తున్నది.
 11. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించవలదని పత్రికవారికి ఈ సభాముఖాన విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ వాదనలో – యా వేదనలో అర్థము లేదనవలెను. సంస్కృత సారస్వతములోని అప్పయ్య దీక్షిత – జగన్నాథ పండితుల వాదోపవాదములు గాని, పూండ్ల రామకృష్ణయ్యగారి.... చింతామణి సంచికలు గాని, వేదము, కొక్కొండవారి భాషా చర్చలుగాని, గిడుగువారి ‘తెలుగు’ పత్రికల సంచికలు గాని, కల్లూరి – వజ్ఝలవారి విమర్శనములు గాని, తిరుపతి కవులు, రామకృష్ణకవులు, కొప్పరపు కవులు, వారి అవధాన ఘట్టములు గాని పరిశీలించి యున్నచో – ఈ రామాయణ కల్పవృక్ష విమర్శనము భాషకు అపచారము కలిగించునది కాక, భాషకు కావలసిన ఉపచారమే కలిగించి తీరునని సప్రమాణముగా చెప్పవచ్చును. అక్కడనే, తిరువళ్ళిక్కేణి తెలుగు మహాజన సమాజమువారు జరిపిన సభలో అధ్యక్షులైన ‘జలగము’ వారు ఈ విషయములో చెప్పిన ముక్కలు బంగారు ముక్కలు. మహాకవికి యిట్టి ఆవేదన ఉండరాదని, ఆవేదన పడుట సామాన్యుల లక్షణమని, మహాకవులు సామాన్యులకు అతీతులుగా వుండవలెనని, విమర్శనవము వలన వస్తువు వెల హెచ్చునని, వ్యాపారరీత్యా ఆయనకున్న అనుభవమును ఈ సాహిత్య ప్రక్రియలో సైతము చక్కగా చూపగలిగిరి. ఈ యావేదన విశ్వనాథవారిని ఎంత క్రిందికి లాగవైచినచో పాఠకులు పరిశీలించవలె.

‘నేను పెద్దవాణ్ణి అయ్యాను. బహుశా ఎంతోకాలం జీవించను. నాపై కోపము ఉంటే పిస్తోలుతో కాల్చవచ్చునే! మేడమీద ఒంటరిగా పడుకొని ఉంటాను. చిన్న సల్ఫ్యూరిక్ ఆసిడ్ బుడ్డి విసిరితే చాలునే కోపం తీర్చుకోవడానికి. అలా చేయక ఇలా చేయడం ఎందుకనే నేను అడుగుతున్నా’—

ఈ యడిగినది యీ విమర్శనము వ్రాయువారిని గూర్చియు వానిని ప్రకటించు పత్రికల గూర్చియు -- కాబోలు! ఈ యంశములో యీ మహాకవీశ్వరుల స్వభావమే వెల్లడియగుచున్నది. అభిప్రాయ భేదము ఉన్నంతమాత్రాన ఒకానొక వ్యక్తి మరొక వ్యక్తిని చంపుటయే ముఖ్యమన్న ‘ధర్మమును’ వీరు బోధించునట్లు తేలుచున్నది. గాంధీజీ యుగములో బ్రతికిన మనము ‘గాడ్సే’గాని దుశ్చేష్టులు గమనించిన మనము, ఈ విశ్వనాథవారి యీ భావములను గూర్చి ఏమనుకొనవలెనో వూహించవచ్చును. ఇట్టి .సనాతనధర్మములే వీరి రచనలలో హెచ్చుగా ఉన్నవని సప్రమాణముగా నిరూపించవచ్చును.

ఈ సభలోనే, ‘అయ్యా! మీ గురువర్యులు ద్రాక్షాపాకములో వ్రాయగా, మీరు పాషాణ పాకములో వ్రాయుట అది యొక దోషముగానే భావించుచున్న’మని ముఖాముఖిగా ప్రశ్న వేసిన శ్రీశ్రీకి సమాధానమే రాలేదు. ‘తనకు సంస్కృతము రాకపోయినా వాల్మీకి రామాయణం చదువుతుంటే అర్థమవుతున్నట్టే ఉంటుందనియు, విశ్వనాథమారు వ్రాసిన రామాయణం చదువుతుంటే తనకు తెలుగు బాగా వచ్చినా ఏమీ అర్థం కాదనియు అలా ఎందుకు వ్రాయాలని ఆ సభలోనే శ్రీశ్రీ ప్రశ్నించిరి గదా! ‘ఉన్నమాట ముఖంమీద అనేవాడు ఈ రోజుల్లో దోషి’ అని ఆ సభలోనే సెలవిచ్చిన విశ్వనాథవారు శ్రీశ్రీని గూర్చి ఏమని భావింపవలెను! అక్షరాల శ్రీశ్రీ ప్రభృతులకున్న ఆ భావముతోనే అస్మదాదులము సైతము ఈ కల్పవృక్ష విమర్శనమునకు సిద్ధమైతిమి. అంతేగాని, ఈ ‘మహాత్ములను’ పిస్తోలుతో కాల్చి పొట్టను పెట్టుకొను అపర పరశురాముడైన ‘గాడ్సే’ వంటి సనాతన వంశములో మేము పుట్టలేదు. ‘ధర్మచింత – పాపభీతి’ ఉగ్గుబాలతో నేర్చిన జాతి – మా జాతి.

ఈ ప్రసంగములకు మొగమాటపడి ‘భారతి’ వారు ఇకమీదట ఈ విమర్శనములు చేయకపోవచ్చుగాక.ఇప్పటికే వ్రాతలో 2, 3 వందల పేజీలుగా ఈ విమర్శనము పెరిగినది. ప్రతి పుటలో ప్రతి పద్యములో ప్రతి గద్యములో కావలసినన్ని దోషాలు ఎదురగుచున్నవి. ‘భారతి’ వ్యాసములన్నియు ముగిసిన పిదప ‘ప్రతి విమర్శనము’ చేసేదననియు ఆ సభలో ఒకానొకరు శపథము చేసినట్లు చదివితిమి. ఆ శపథము ప్రకారము ఆయన వ్రాసిన అంశములు సైతము పరిశీలించి ఈ గ్రంథములో సమన్వయింపవలసి యున్నది. ఇక్కడ ఒక్క మనవి.

ఇప్పటికే ..భారతి..లో చూపిన దోషాలు ఒక దోషాలు కావని విశ్వనాథవారు అన్నారు. తెలుగు కవిత్వములో ఏ.బి.సి. నేర్చినవాడయినను సంస్కృతములో ఓనమాలు వచ్చినవాడయినను చప్పున చెప్పగల బండెడు దోషములు ఈ కల్పవృక్షములో దండిగా ఉన్నవని లాక్షణిక ధోరణిలో నిరూపించగలను. విజయవాడలోనో మరొక చోటనో సంస్కృతాంధ్రములలో ప్రసిద్ధులను ఇద్దరను ఎన్నుకొని వారి ఆధ్వర్యములో సభ తీర్చి వాదోపవాదములకు అవకాశమిత్తురేని నేనే వచ్చి స్వప్రమాణములుగ ‘కల్పము’లోని దోషాలను పదులుగాదు, వందలుగాదు, వేలతరబడి సంఖ్యలో నిరూపింపగలను. ఆ దోషాలను ఏ రూపముగ సమర్థింప గలరో, ఆ వ్యాకరణము లేవో, అపూర్వ ప్రయోగము లేవో, వాని విలువ ఎట్టిదో సాంగోపాంగముగ మధ్యవర్తులకే వదలి న్యాయము పరిశీలింపవలసి యుండును.

ఇంకొక్క ముక్క .. కులభేదమన్నదే నాకు లేదని బిడ్డల సాక్షిగా, సరస్వతీ సాక్షిగా చెప్పుచున్నానని సభలో విశ్వనాథవారు ఒట్టు పెట్టుకున్నారు. నేడు ఆ భేదము నాకు లేదని సభలో అన్నంతమాత్రాన ఆయన రచనలలో ‘రికార్డు’ అయిన అంశములు మాయమై పోవునా.. ఎక్కడ ఈ రచనలలో ఈ దోషము కేంద్రీకృతమై ఉన్నదో దానిని సైతము సప్రమాణముగ నిరూపింపగలననియే నా ధైర్యము. ఇట్టి చర్చకు వీలైన సమావేశమునకై నిరీక్షింతును. భారతి వ్యాసములకు ఖండనము వ్రాయువారు, దయచేసి ఆ పత్రికల వైనము రవ్వంత నాకు తెలియజేసిరేని అవి తెప్పించుకొని నా గ్రంథము నేను సాగించుకొందును.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి