తనపై వస్తున్న విమర్శలకు బదులుగా విశ్వనాధవారు ఇచ్చిన ఉపన్యాసానికి, ప్రముఖ హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి గారి స్పందన ఈ రోజు చూద్దాము. రామాయణ కల్పవృక్షం పై విమర్శించిన కొత్త వారి కులముతో విశ్వనాధగారికేమి పని? విమర్శను సహృదయంతో స్వీకరించి అందలి గుణదోషములు కదా చూడవలసినది? తన రచనలపై ప్రశంసలే కాని విమర్శలు కూడదని విశ్వనాధ వారి అభిప్రాయమా? -cbrao
సాహిత్యానికే లోపం
(శ్రీ విశ్వనాథవారి ప్రసంగానికి జవాబుగా శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆంధ్ర పత్రిక అక్టోబరు 29వ తేదీ సారస్వతానుబంధంలో వ్రాసిన మరొక వ్యాసమిది)
విజయదశమి “ఆంధ్రపత్రిక” ప్రత్యేక సంచికలో సాహిత్య విమర్శపట్ల కొన్ని ముఖ్య ప్రసంగాలు కనబడినవి. వక్తలు యామిజాల పద్మనాభస్వామి, విశ్వనాథ సత్యనారాయణగారలు, ఇతర పెద్దలు గలరు.
ఈ మధ్య పండిత కొత్త సత్యనారాయణగారు ..తెలుగు విద్యార్థి. పత్రిక (బందరు)లో కొన్నాళ్ళకుగాను, ప్రస్తుతం ‘భారతి’లోను విశ్వనాథ సత్యనారాయణగారి “రామాయణ కల్పవృక్ష కావ్య పరామర్శ” చేయుచున్నారు. ఆ విమర్శమీద “సవ్వాళ్ళు” చేశారు. యామిజాలవారు. ప్రతి విమర్శ చేస్తామని “పందెం” వేశారు. ప్రతి విమర్శ చేయవచ్చు. కొత్త సత్యనారాయణగారి విమర్శలో లోపము గానీ, తప్పుగానీ యున్నచో ఎత్తి చూపవచ్చు. యామిజాలవారికి ఆ హక్కు కలదు. కానీ, “పందెం” దేనికి?, “సవ్వాళ్ళు” దేనికి? కారణం! వారి కాగ్రహము వచ్చినది. కొత్త సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణగారి మీద విమర్శ చేశాడా అని. ఆగ్రహమెందులకు గలిగినది? విమర్శకుని సహృదయంతో చూడలేక పోవుట చేతనే కలుగుచున్నది. వారి ప్రతి విమర్శ కూడా వచ్చినచో పాఠకలోకము మరికొన్ని విశేషాలను తెలుసుకొనవచ్చును. దానికీ పూర్వ వాదము రావచ్చు. దానివలన సాహిత్య జిజ్ఞాస విస్తరింపదగలదు.
ఎవరి కావ్యమునయితే “కొత్త” వారు పరామర్శించుచున్నారో, ఆ విశ్వనాథవారు మాట్లాడుచు కొన్ని భావాలను వ్యక్తము చేసినారు. ఆ వాక్యాలివి:
1. ఈ విమర్శ వ్రాస్తున్న ఆయన కులానికి చెందినవారిలో నాకు పెక్కుమంది ప్రాణస్నేహితులున్నారు.
2. “భారతి” ప్రసిద్ధి, స్థాయి యిదివరకే పోయినది. ఇప్పటి దాని స్థితి వీనినిబట్టి తెలియుచున్నది. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించవలదని ఆ పత్రికవారికి ఈ సభాముఖముగా విజ్ఞప్తి చేయుచున్నాను.
ఇంకా ఇతర వాక్యములు కూడా నున్నవి. ఇతరములనట్లుంచి యీ వాక్యార్థాలేమిటి? విమర్శకుని కుల గోత్రములతో కావ్య నిర్మాతకు అవసరమేమి? విమర్శకునకు – కావ్యానికి ఉన్న సంబంధములో కులగోత్ర మీమాంస యెందులకు రావలసి వచ్చినది? ఇది శోచనీయము. సాహిత్యాని కున్నట్లు కలుషితం చేయకుండ నుండుట అవసరము.
అసలు విషయము. “కొత్త” వారి రచనలు వేసిన కారణముగా “భారతి” పత్రిక స్థాయి తగ్గినది గాని, లేక అసలు “భారతి” పత్రిక స్థాయి తగ్గిన దశలో “కొత్త” వారి రచనల ప్రచురణకు చోటు దొరికినదనిగాని, విశ్వనాథవారు భావించి యుందురు. అందువల్ల కొత్త సత్యనారాయణగారిని భారతి పత్రికలో నిట్టి రచనలు వేయవద్దని సత్యనారాయణగారు సభాముఖముగా విజ్ఞప్తి చేసినారు. ఇది బహుశా అనుశాసనంగా గ్రహించిరేమో! ఏ దెట్లున్న ఈ భావుకతకు – ఇట్టి సలహాకు కారణమేమిటి? ఎవరైన ఒకరు బయలుదేరి “విశ్వనాథవారు పెద్దవారైనారు! ఇక రచన మానండి! అన్న నెట్లుండును? కాదు అసలు రామాయణ కల్ప వృక్షకావ్య నిర్మాణమే విశ్వనాథవారు చేయకున్న నెంత బాగుండునో” యని ఎవరైన అన్నయెట్లుండును? అసమంజసముగా నుండును. మరి విశ్వనాథవారి సలహా?? దాని తాతగా నున్నది.
కాని కావ్య నిర్మాత, విమర్శకుణ్ణి విమర్శ మానుకోమనుటలోని ఔచితి ఏమిటి? కాళిదాస, భారవులు తప్పులు చేయవచ్చు. శ్రీనాథునకు సీస రచన తెలియకపోవచ్చు. తిక్కన కవిత పొడి పొడి మాటలు కావచ్చు. తమ రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని అర్థము చేసికొనగలవారరుదు కావచ్చు. (అసలు పుట్టలేదని హైద్రాబాద్ ప్రసంగములో లోగడ విశ్వనాథవారన్నట్లు ప్రచురితమైనది) ఎంతైనా పత్రిక స్థాయిని దూషించి, విమర్శ చేయవలదను సలహా నివ్వడంలో ఇది విమర్శ కాదని గాని, స్థాయిలేని విమర్శయనిగాని విశ్వనాథసత్యనారాయణగారన్నట్లు అర్థమగుచున్నది. మాటలకు అర్థములుండును గదా! అంటే సమకాలికుల కావ్య విమర్శ వలదని గాని, పనికిరాదనిగాని విశ్వనాథ సత్యనారాయణగారు భావిస్తున్నారా? అయితే పెద్దవారిని విమర్శించి కాల్చివేయమంటారా? ఇదేమి ఆక్రందన? ఇంత అక్కసు, విమర్శపట్ల ఎందుకుండాలి? కవికి -- విమర్ళకునకు నుండవలసిన సంబంధమును, కవి ఇట్లేనా నిర్వచించవలసినది? ఇట్టి సన్నివేశముల నూహించియే కాబోలు జయంతి రామయ్యగారు “విమర్శకుల చెల్మియే కావ్యకర్తకున్నేరువుగాక వేరె యొక నేరువు గల్గుట చెప్ప నొప్పునె” అన్నారు.
కవి సలహాను పాటిస్తే కవియనంతరం విమర్శలు రావలెను గాని కవికాలంలో పొగడ్త మాత్రమే కాని విమర్శ రాకూడదని యర్థమగునేమో.. ఇట్టి కవి – విమర్శక సంబంధాలవాంఛనీయములు.
పోతే తను సన్మానంలో విమర్శలకు సమాధానము చెప్పకనే విమర్శకుని నోరు కట్టివేయాలన్న ప్రయత్నం చేయబూనటం హాస్యాస్పదముగాను ఉన్నది. విమర్శయన ఇంత భయము దేనికి?
సజీవ సాహిత్యానికి విమర్శ గీటురాయి. విమర్శలో మంచి చెడ్డల పరామర్శ ఉంటుంది. శబ్ద విమర్శలో వ్యాకరణ ఔచితియేగాక, శబ్ద స్వారస్య పరిశీలన ఉంటుంది. తెనుగులో ఇంకా మంచి విమర్శ గ్రంథాలు రావలసియున్నవి. ఈ ధోరణి పెద్దలే ప్రదర్శించి, నోటికి తాళాల విధానాన్ని ప్రచారము చేయజూచిన అసలు కుంటుపడుతుంది విమర్శ కదా!
విమర్శ చేయటము చాల యవసరము. నిన్న మొన్ననే అమెరికా రాయబారి “గాల్ బ్రెత్” అన్నారు: విమర్శ పరిణామానికి “ఇంజను” వంటిదని; నిజమే. విమర్శ లేక సుత్తి మాత్రమే మిగిలితే నిమ్నోన్నతులు తెలియవు. తెలియవలసిన యవసరమెంతైన నున్నది. అందువల్ల విమర్శ చేయుట తప్పు కాదు. అవసర చర్య. విమర్శ అంతా మనమంగీకరించనవసరము లేదు. కాని మార్గాన్వేషణ కానబడుచున్నది. నూతన పుంతలు దొరుకును.
కాని సమకాలీన కవుల కృతుల విమర్శలో నాత్మాశ్రయ నిబద్ధత యుండి, విమర్శ తిన్న వ్యక్తి లోలో గుంది, వదరుట సహజము. ప్రతి విమర్శ తాము చేయుటకన్నా చేయించుట గూడ సహజమే. కానీయండి! విమర్శ సాగనీయండి! విమర్శకుడు అభిరుచుల తత్పరి. తీర్పులమీద తీర్పులు రానీయండి! విమర్శను ఆవేశాలకు నాక్రందనలకు ఆకరాలు కానివ్వకండి! విజ్ఞతను ప్రదర్శించండి. కేవల విజ్ఞప్తులు మానండి. స్థాయి పడిపోయినచే నా స్థాయిని పెంచండి. మరీ దిగజారనీకండి. కవి – విమర్శకుడు సహజీవనము చెయ్యనివ్వండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి