మంగళవారం, ఆగస్టు 14, 2012

వీక్షణం: Bay Area Telugu Writers Forum

మౌంటైన్ వ్యూ కబుర్లు -2
ఉత్తర అమెరికాలో సాహితీ చైతన్యం 

ఉత్తర అమెరికాలో సాహితీ సమావేశాలు డెట్రాయిట్, డాలస్, హూస్టన్ నగరాలలో ఉత్సాహంగా, తరచుగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడి బే ఏరియాలో (Silicon Valley) సాహితీ వాతావరణం స్తబ్దుగా ఉంటుంది ఏడాదిలో ఎక్కువ భాగం; ఎప్పుడో అడపా తడపా శ్రీయుతులు గొర్తి శాయి బ్రహ్మానందం,కిరణ్‌ప్రభ ప్రభృతులు నిర్వహించే కాలిఫొర్నియా తెలుగు సదస్సులు తప్పిస్తే. 2008 నుంచి ఇక్కడ తెలుగు బ్లాగర్ల, రచయితల సమావేశాలు నేను కొన్ని నిర్వహించినప్పటికి, డాలస్ లో లాగా తరచూ సాహితీ సమావేశాలు జరిపే సంస్కృతి ఇంకా అలవాటు కాలేదు ఇక్కడ. అయితే బే ఏరియా లో పేర్గాంచిన రచయితలు, కవులు ఇంకా సంపాదకులు ఉన్నారు. కౌముది, సృజనరంజని వెబ్ మాసపత్రికలు ఈ ప్రాంతము నుంచే వెలువడుతున్నాయి. మరి లోపం ఎక్కడుందో ఒక పట్టాన బోధపడదు.

తానా, ఆటా వగైరా సంస్థలు తొలితరం తెలుగు వారితో స్థాపించబడ్డాయి. ఇవి కుల జాడ్యం, ప్రాంతీయ భేదాలు వగైరాలతో మరిన్ని చీలికలయ్యాయి. పాత తరం వారినే తప్ప నేటి తరం తెలుగు యువతను ఈ సంస్థలు ఆకర్షింపలేకపోతున్నాయి. ఇక్కడే పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు అమెరికన్ సంస్కృతిలో మమేకం అవటం ముఖ్య కారణంగా అనిపిస్తుంది. మన తెలుగు బాష, సంస్కృతి కి వారసులైన వీరు తెలుగు నేర్చుకొనకపోతే తరువాతి తరంలో తెలుగు సంస్కృతి ఇక్కడ కరువయ్యే ప్రమాదముంది. ఈ చారిత్రక అవసరాన్ని గుర్తించి సిలికాన్ అంధ్రావారు మన బడి అంటూ తెలుగు అధ్యయన తరగతులు ప్రారంభించినప్పటికి, తెలుగు చదవటం రాని తెలుగు అమెరికన్ పిల్లలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు అమెరికాలో. తెలుగు పిల్లలకు తెలుగు నేర్పటానికి మరిన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలి.

ఇలాంటి చారిత్రక సమయంలో డా|| గీతా మాధవి తెలుగు వికాసం అనే వేదిక స్థాపించి స్థానిక పిల్లలకు తెలుగు, సంగీతం నేర్పుతున్నారు. ఆగస్ట్ 12 ఆదివారం, భారత స్వాతంత్ర్య వేడుకలను సన్నీవేల్ లోని షిర్డీ శాయి దేవాలయంలో తమ శిష్యులతో కలిసి డా|| గీత నిర్వహించారు. ఈ సందర్భంగా వీక్షణం అనే మరో వేదిక ఆవిష్కరించబడ్డది. ఇంకా కవనం అనే బాలల e-book కూడా ఆవిష్కరించబడ్డది. "వీక్షణం" సాహిత్యకారులను ఒక చోట చేర్చి సదస్సులు నిర్వహించడం, రచనల ప్రచురణలు, ఆవిష్కరణలు మొదలైన వాటి ద్వారా బే ఏరియాలో సాహిత్యానికి కొత్త గవాక్షాల్ని తెరుస్తుంది. విద్యార్థుల సృజనాత్మక శక్తిని బాలల పత్రిక "కవనం" ద్వారా వెలికి తెస్తుంది. వీక్షణం ద్వారా కొన్ని సాహితీ సభలు నిర్వహించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.వీక్షణం కార్యక్రమాలలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తెలుగు వికాసం ను లేక భవదీయుడును సంప్రదించవచ్చు.

Click on photo to view the album of the event.

Telugu Vikasam, Mountain View, CA, Independence Day Celebrations 2012

1 కామెంట్‌:

innaiah చెప్పారు...

వీక్షణం ఏర్పాటు మంచి ప్రయత్నం .తాన , ఆట ,నాట, నాట్స్ వారు కూడా ఇది గమనించి ప్రయత్నం చెసె తీరులొ నదిపితె బాగుంటుంది. అమెరికాలొ వుంటున్నాము గనుక ఆ సమాజ రితులు గమనిస్తు, వారిపై కూడా ప్రభావితం చెసెటట్లు నడపండి. సంకుచిత భావాలు, మూఢ నమ్మకాలకు దూరంగా కార్యక్రమాలు జరిపితే సహకరిస్తాము .అభినందనలు.
ఇన్నయ్య నరిసెట్టి

కామెంట్‌ను పోస్ట్ చేయండి