గురువారం, మే 24, 2007

జ్యొతిష్యుడ్ని కుక్కెలా కరిచింది?

ఫిలడెల్ఫియా (పెన్సిల్వేనియా,అమెరికా) లో ఇప్పుడు జ్యొతిష్యం చెప్పడం నేరం. ఒక డజను పైనే పిచ్చి వైద్యులు, జ్యొతిష్యులు, చిలక శాస్త్రజ్ఞుల (psychics, astrologers and tarot-card readers) దుకాణాలు మూయించి వేశారు. ఆసక్తి కరమైన విషయమేమంటే గత 30 సంవత్సరాలుగా ఈ వృత్తిని నిషేధించినా అక్కడి అధికారులకు, పొలీసులు చెప్పేదాకా తెలియక పోవటం. ప్రస్తుతానికి ఈ వృత్తి లో
ఉన్నవారిని ఖైదు చెయ్యక పోయినా, మరలా జ్యొతిష్యం వైపు వస్తే, ఖైదు చెయ్యక తప్పదని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో ఈ హస్త సాముద్రికం, వైదీశ్వరం(తమిళ నాడు)నాడీ జ్యొతిష్యం, జాతకం(horoscope), కుజ దోషం, సర్ప దోషం వగైరాలపై నమ్మకం దిన దిన ప్రవర్ధమాన మౌతుంది. ఉదాహరణకు , ఆంధ్ర దేశాన సర్ప దోష నివారణకై శ్రీ కాళహస్తి లో పూజలు చేసే ప్రముఖుల చాయా చిత్రాలు దిన పత్రికలలో తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. సర్ప దోషస్తులకు ఇప్పుడు ఒక శుభవార్త. పెద్ద కాకాని (గుంటూరు జిల్లా) లో కూడా ఇప్పుడు సర్పదోష నివారణ పూజలు లభ్యమవుతున్నాయి.

వివాహ సందర్భం లో ఈ జాతకాలపై నమ్మకం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అబ్బాయి,అమ్మాయి ఇద్దరు మంచి హోదా, సంపాదన గల ఉద్యొగాలలో ఉన్నప్పటికీ,ఒకరికి మరొకరు బాగా నచ్చినప్పటికీ కెవలం జాతకాలు కలవలేదనే కారణంగా వివాహ ప్రతిపాదనలు రద్దవుతున్నాయి. జాతకాలలొ అత్యధికంగా 29 points వచ్చిన జంటలు మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారు. వశిష్ట మహర్షి పెట్టిన దివ్య ముహూర్తంలో పెళ్ళి చేసుకున్న సీతా రాములు జీవితంలో పెక్కు కడగళ్ళ పాలయ్యారు. వీటికి కారణం పూర్వ జన్మ కర్మ ఫల మన్నారు. ఏమేమి పూజలు చేస్తే వీటికి దోష నివారణ జరుగుతుందో, ఎప్పుడో వెయ్యేళ్ళ క్రితమే తాటాకులలో రాశారట మన సిద్ధులు. దీనినే నాడీ శాస్త్రమంటారు. శివ పార్వతుల సంభాషణల ద్వార మనుషుల భవిష్యత్తు గ్రహించబడి, వీటిని భవిష్యత్ తరాల కోసమై తాటాకుల్లో ఉల్లేఖించారట సిద్ధులు.


ఈ నాడీ శాస్త్రంలో మరో విశేషమేమంటే మీరు పాత జన్మలో ఎవరు,ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు. దీనివలన కొన్ని లాభాలు, నష్టాలు కూడా ఉంటాయి. మనం అంటే గిట్టని వాళ్ళు మనం వచ్చే జన్మ లో ఎక్కడ పుడతామో తెలుసుకుని, మనల్ని అనుసరించి అప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోవచ్చు. లేదా నాలా, మీకు మీ భార్య పై ప్రేమెక్కువైతే వచ్చే జన్మలో కూడా అమె కొంగు పట్టుకోవచ్చు. శైలజ భర్తకు ఆమె వచ్చే జన్మలో మధురై లో, మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రధాన పూజారి శ్రీనివాస అయ్యర్ పుత్రికగా, కోవెల్ వీధిలో జన్మించబోతుందని ముందే తెలుసు. అమెకు మీనాక్షి అనే నామకరణం చేస్తారనీ తెలుసు. మరో ఆసక్తికరమైన విశేషమేమంటే కొందరు వచ్చే జన్మ లో పుట్టబొయే పేరుతో బాంక్ ఖాతాలు తెరిచి అందులో డబ్బు జమ చేస్తున్నారట. నమ్మకం ఎలాటి పనినైనా చేయిస్తుంది. నరబలి, బాణామతి లాంటివి నమ్మకం లోంచి పుట్టినవే కదా.


జ్యోతీష్యం రుగ్వేదం లోని భాగమే. ఇది గణిత శాస్త్రం, గ్రహాల స్థితిగతుల పై ఆధార పడి ఉంది. తర తరాలుగా నవగ్రహాలు ఉన్నాయనీ, బిడ్డ జన్మించిన సమయంలో వాటి గృహ స్థితి బట్టి బిడ్డ జన్మ కుండలి, భవిష్యత్తూ చెపుతున్నారు పండితులు. అల్లుడు దశమ గ్రహమని కవులు చమత్కరించిన సమయంలో శాస్తజ్ఞులు మరో గ్రహాన్ని నిజంగానే కనుగొనటం జ్యొతిష్య పండితులకు మింగుడు పడటం లేదు. జ్యొతిష్యం శాస్త్రమని నొక్కి వక్కాణిస్తున్న సమయంలో కొత్తగా కనుగొనబడిన గ్రహం వీరికి దీటైన సవాలయింది. పూర్వజన్మలున్నాయని, వాటిపై పరిశోధనలు చేసి కనుగొన్నామని Para Psychology శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇవన్నీ అభూత కల్పనలని ఇటీవల పరిశోధనల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

కొసమెరుపేమంటే మా ఊరిలో జ్యొతిష్యుడ్ని, కుక్క కరవడం, పెద్ద వార్తయ్యింది. ఆ వీధి కి వెళితే, కుక్క కరుస్తుందని, అందరికీ జ్యొతిష్యం చెప్పే పండితుల వారికి ఎలా తెలియలేదు అని.

References:
http://www.msnbc.msn.com/id/18351044/
http://en.wikipedia.org/wiki/Jyotisha
Paul Edwards: Reincarnation a critical examination
Encyclopedia of the Paranormal –edited by Gordon Stein
http://www.amazon.com/exec/obidos/ASIN/1573920215/

7 కామెంట్‌లు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

1. ఎన్నో తెలుసుకొగలిగిన మానవుడు భవిష్యత్తుని తెలుసుకోలేడనడం ఒక చెణుకు. నేను స్వయంగా ఎన్నో భవిష్యద్ విషయాలు తెలుసుకోగలిగాను. అంతమాత్రాన నేను సర్వజ్ఞుణ్ణీ కాను.
2. జ్యోతిష్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి బాధ ఏమిటో నాకెప్పుడూ అర్థం కాలేదు. మానవుడు భవిష్యత్తుని తెలుసుకోకూడదనా ? లేక తెలుసుకోవడం అసాధ్యమనా ? తెలుసుకోకూడదు అనడానికి వారెవరు ? వారు వేరే సైన్సులమీద పరిశోధనలుచేస్తూంటే మేము అడ్డుపడ్డామా ? వారు మా దారికి ఎందుకు అడ్డం వస్తారు ? పరిశోధనల పేరుతో ప్రభుత్వాల నుంచి పన్నులు వసూలు చేసిన సొమ్ముని వేలాది కోట్లు ప్రతియేటా దండుకుంటొంటే అది దోపిడీ కాదు. అది మానవకల్యాణం. ఎవడో చిలకజోస్యం చెప్పి నాలుగు రూపాయలు తీసుకుంటే అది దోపిడీ. లేదా ఇంకెవడో జాతక చక్రం వేసి 150 రూపాయలు తీసుకుంటే అది దోపిడీ.

3. ఒక శాస్త్రాన్ని నిషేధించి మీరు దాని గొంతు నులమగలరా ? పుస్తకాల్ని నిషేధించాలనడం శాస్త్రాల్ని నిషేధించాలనడం ఇదంతా మధ్యయుగాల అనాగరిక ప్రజల బర్బర మనస్తత్వాన్ని సూచించట్లేదా ? మీరు ఒకదాన్ని నిషేధించాలని కోరుతున్నప్పుడే దాన్ని తార్కికంగా ముఖాముఖి ఎదుర్కునే శక్తిని కోల్పోయారని ప్రభుత్వాల పాశవిక సైనిక బలంతో మీ ఇష్టాయిష్టాల్ని ప్రజల మీద రుద్దదల్చుకున్నారని అర్థం. మీ నిషేధాలు మీతోనే పోతాయని గుర్తించండి. లేదా మీరు ఒకదాన్ని నిషేధించినట్లే మిమ్మల్ని కూడా ఇతరులు ఏదో ఒకరోజున మూసిపారెయ్యగలరని తెలుసుకోండి.

4. ప్రజాస్వామ్యంలో ఎవరి నమ్మకాలు వారివి. ఒకరి నమ్మకాల్ని అపనమ్మకాల్ని ఇతరుల మీద రుద్దకుండా బతికితే చాలు. ఈరోజు జ్యోతిష్యాన్ని నిషేధించమని కోరుతున్నవారు అందులో సఫలీకృతులయ్యాక రేపు దేవుణ్ణే నిషేధించమని కోరతారు. ఔరంగజేబు బలవంతంగా హిందువుల్ని ముస్లిములుగా మార్చడానికీ దీనికీ ఏమిటి తేడా ? ఇలాంటి నిరంకుశ నాస్తికత్వం ఒక రకమైన మత మౌఢ్యం కాదా ?

5. నేనేం చేస్తే నాకు మేలు జరుగుతుందో అది ఆలోచించుకోవడం చెయ్యడం మానడం నా యిష్టం. నాస్తికులెవరు నా నెత్తిన నా శ్రేయస్సుని బలవంతంగా రుద్దడానికి ? మీకు ఇష్టం లేకపోతే గమ్మునుండండి.

spandana చెప్పారు...

ఎవరి నమ్మకాలతో వాళ్ళు ఛస్తే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ఇంకొకరిని చంపకపోతే చాలు, నాస్తికులైనా సరే.

--ప్రసాద్
http://blog.charasala.com

అజ్ఞాత చెప్పారు...

జ్యోతిష్యం ఇప్పటికే చాలా మంది ప్రజలకు ఒక మానసిక రోగంగా పరిణమించింది. ఎన్ని జంటలను విడగొడుతున్నారు. మరెన్ని జంటలను బలవంతాన కలిపేసి ఈ దేశానికి మంచి జన్యు కలయక లేని పౌరులని అమ్దిస్తునారో ఆ దేవుడికే తెలియాలి.

దేవుడిని, జ్యోతిష్యాన్ని ముడిపెట్టవద్దు. నాగలోకంతో నక్కకు పోలికేంటి.

rākeśvara చెప్పారు...

చాలా స్ధులంగా వ్రాసారు . మీ నమ్మకాలు ఎవరి పక్షానున్నాయో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మంచి వ్యాసం.

ఫిలడెల్ఫియాలో జ్యోతిష్యాన్ని నిరోధించడం ఎంతైనా విశాల దృక్పదం లేకపోవడానికి చిహ్నమే.

రాకేశ్

అన్నట్టు నా బ్లాగుని రోలులో పెట్టినందుకు కృతజ్ఞతలు, నా బ్లాగు పక్కపట్టీని దిద్దినప్పుడు మీకు లంకించాలి.

cbrao చెప్పారు...

మూఢ నమ్మకాలను నిరసిస్తూ రాసిన వ్యంగ్య రచన ఇది.ఫిలడెల్ఫియా లో నకిలీ వైద్యులనూ, ప్రలోభ పెట్టి, ప్రజల నమ్మకాలను సొమ్ము చేసుకునే జ్యొతిష్కులనూ, ఖైదు కావించిన వార్తే, నేనీవ్యాసం రాయటానికి ప్రేరణ.

ఈ ఆదివారం మైక్రొసాఫ్ట్ రక్షిత గోడలలోంచి, లోనికి నడవ బోతున్నారు, తెలుగు బ్లాగరులు.

Nrahamthulla చెప్పారు...

మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడిమీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసిరావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని,అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు.మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజ లు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం,కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు.అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందనికొరడాతో బాదుతాడు.పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు,అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు.గర్బిణులు బయటకురారు.వంటపాత్రలలో,నీటిలోగడ్డిపోచలు వేస్తారు.గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు,దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.

.
ఇతర రాష్ట్రాలలో

* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షలరూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు.నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.[1]
* మధ్యప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-'సరోత బాబా' ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్.గోళ్ళను కత్తిరించే గోరుగిల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలితీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు,ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.

విదేశాలలో

* జపాన్ లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించిందంటారు.ఉత్తర దిశలో తల ఉంచి నిద్రిస్తే అది శాశ్వత నిద్రేనట.మరణించిన వారి తలలను ఉత్తర దిశలో ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తారు.నాలుగు అంకెను అశుభ సూచకంగా పరిగణిస్తారు.
* ఇండోనేసియా-జకార్తా-తొమ్మిది అంకెను దురదృష్టకరమైనదిగా పరిగణిస్తుంటారు.ఈ అధ్యక్షుడు నష్టజాతకుడు,సునామీ భూకంపానికి దేశ అధ్యక్షుని 'దురదృష్ట' జాతకమే కారణమని అంటున్నారు

బాణామతి లాంటి మూఢనమ్మకాలకు విరుగుడు చర్యలు

* గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం,సంచార వైద్య బృందాలను పంపించడం, బాణామతి రోగులను ఆస్పత్రులో చేర్చుకుని సత్వర వైద్యసదుపాయాన్ని అందించడం.బాణామతిపై సరైన అవగాహన కల్పించడం,మానసికవైద్య నిపుణులను, మానసిక శాస్త్రవేత్తలను, వైద్య, సామాజికకార్యకర్తలను నియమించడం
* సామాజికంగా , ఆర్ధికంగా వృద్ధిలోకి తీసుకు రావడానికి పేదరికాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం
* సమాచార ప్రసార సంబంధాలను, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచడం,విజ్ఞాన యాత్రలను, మాయాజల ప్రదర్శనలను వృద్ధిపరచడం
* స్వచ్చంద సంస్థలకు ప్రోత్సాహమివ్వడం,మీడియా (పత్రికా ఎలక్ట్రనిక్‌ ప్రసార మాద్యమాల) పాత్ర బాగా ఉండడం
* గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ పాఠశాలలను ప్రారంభించడం, నియత/అనియత విద్యను అందించడం, బాణామతికి వ్యతిరేకమైన పాఠ్యాంశాలను పాఠశాల విద్యాప్రణాళికలో చేర్చడం
* బాణమతికి వ్యతిరేకమైన కఠిన చట్టాలను చేయడం,నేరస్తులకు కఠినమైన దండన విధించడం
* బాణమతి నమ్మకాన్నిప్రోదిచేసే టివి సీరియళ్లను, సినిమాలను నిషేధించడం
* బాణమతి బాధితులకు రక్షణ కల్పించడం, మూఢనమ్మకాలపై ఉండే భీతిని పారద్రోలడం, వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొదించడం

Unknown చెప్పారు...

చక్కగా చెప్పారండీ నమస్కారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి