గురువారం, సెప్టెంబర్ 13, 2007

సముద్ర ఘోష


Photo Courtesy: Steven Pinker


ఈ మధ్య కాలంలో కవిత్వం పై విసుర్లు, చమత్కారాలు ఎక్కువయ్యాయి. కవిత్వానికి salability లేక పోవటం తో కవులతో మాట్లాడటమే కాలం వృధా, అన్నట్లుగా వుంటాయి, ప్రచురణకర్తల తీరు తెన్నులు. ఒక మిత్రుడు, ఇంకో మిత్రుడి పై తన సహనాన్ని కొల్పోయిన సందర్భంలో అన్న మాటలు " నువ్వు మనిషివా, కవివా? ". ఒక సినిమా లో వినిపించిన కవిత ' నీ చెల్లికి అవ్వాలి పెళ్లి, మళ్లీ,మళ్లీ '. ఇట్లాంటి కవితలతో సినిమాలలో హాస్య పాత్రలను ప్రవేశ పెట్టి, కవిత్వాన్ని, నవ్వుల పాలు చేశారు.

కవిత్వమొక తీరనిదాహమన్నాడో మహా కవి.కవితలు దేశ ప్రజలను చైతన్య వంతులను చేశాయి.కార్యోన్ముఖులను చేశాయి. వందే మాతరం, జనగనమణ ఇందుకు సొదోహరణలు. శ్రీ శ్రీ మహాప్రస్థానం మరో ఉదాహరణ. భావకవి దేవులపల్లి పాటలు romantic ideas తెచ్చాయి. మనసున మల్లెల మాలలూగించాయి. కరుణశ్రీ పాటలు పూలకూ మనసుంటుందని గుర్తు చేశాయి. మన నిత్య జీవితంలో పాడు కొందుకు, మన మనఃస్థితిని బట్ట్టి రక రకాల పాటలు మనకు సదా గుర్తుకు వస్తూనే వుంటాయి. పాట మన గొంతులో కొట్లాడుతూనే వుంటుంది.

ఇలాంటి నేపధ్యంలో నెల్లూరు కవులంతా కలిసి సముద్ర తీరంలో, సముద్రం పై కవితా గోష్టి నిర్వహించటం ముదావహం. సముద్రంలో మనకు తెలియని ఎదో శక్తి మనలను తన వైపు లాగుతూనే ఉంటుంది.సముద్రపు ఒడ్డులోని ఇసక,గవ్వలు,పీతలు,పడవలు,వలలు ఒక సమ్మొహనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ సందర్భం లో సముద్రం పై నాకు లభించిన రెండు కవితలు మీ ముందుంచుతాను. ఒకటి అట్లాంటా సముద్ర తీరం నుంచి -Dr.Naveena, Child Psychiatrist, USA, రాసిన Feelings. రెండోది బంగాళా ఖాతం దరినుంచి శ్రిమతి వి.ప్రతిమ రాసినది. ఈ కవితలలో కొన్ని సామ్యాలు పాఠకులు సులువుగా గుర్తుపట్టగలరు.

Feelings

I sat in silence, Mesmerized;
Before me lay the jubilantly calm ocean;
How calm it appears and how cool the ‘cember breeze.
Waters washing my feet,
Tamely; ever so tamely.
Yet I know, know of its great strength,
I should, shouldn’t I, it took my most loved.
Suddenly I saw it rise,
A great enchanting wave,
Lapping me up in a gentle embrace;
So graceful, so pure, and yet so sadistic;
I can see it hitting so hard against the hidden racks.
Dashing against the mossy boulders;
Its hurt,
It goes back limping, bruised…
In pain;
But always, always returns from its mysterious depths,
To embrace the blue skies above,
Jumping into the air,
Each time a longer stride, a greater crescendo,
A rising inferno;
Only to hit again, yet again; and…
To die,
With a moan of melancholy!!!
-Naveena N. Innaiah
17/3/’85


సముద్రం కంటే గొప్పది
వి. ప్రతిమ

పురాతనమైన జ్ఞాపకాలని తవ్వుకుంటూ
కోల్పోయిన మనిషితనాన్ని వెతుక్కుంటూ
పారదర్శకమైన మనుషుల కోసం
అప్పుడప్పుడూ సముద్రతీరానికెళ్తాను.
ప్రేమించిన అనేక దుఃఖసమయాలని పోగుచేసి గూళ్ళు కడతాను.
ప్రాణతోరణమై సమూహాలని తన
గుమ్మానికి కట్టేసుకున్న సముద్రం
కాళ్ళు కడిగి నాతో కరచాలనమే చేస్తుంది.
కడుపులో బడబానలాన్ని దాచుకుని పైకి
అలల రెక్కలతో ఉరకలేస్తూ,
హృదయాన్ని మొగ్గలుమొగ్గలుగా విరబూయమంటూ
జీవితరహస్యాల్ని విప్పుతుంటుందుదధి…
అనుకుంటాంగానీ
సైకత తీరాలకేసి తలలు బద్దలుకొట్టుకుని కొట్టుకుని
ఎంతకని ఎక్కిళ్ళను దిగమింగగలదు పాపం
అందుకే అవసరమైతే
ఉత్పాత ఉద్యమమై భూపప్రంచాన్ని వొణికంచనూ గలదు
శాంతి కపోతాన్ని కెరటపు రెక్కల్లో పొదువుకుని
తీరాన తిరుగాడే ప్రజలకు పంచనూ గలదు,
సముద్రం యింకా చాలా చెప్తుంది నాకు
యుద్ధభూమిలో ఉన్నపుడు ఉద్యమం తప్పనిసరి…
నేటి చరిత్రంతా పోరాటాలే కదా మరి.
ఏళ్ళ తరబడి కల్లోల సముద్రాల్ని కడుపులో దాచుకున్న
నాకంటే నువ్వు ఏమంత గొప్పదానివని సవాలు విసురుతాన్నేను.
బొట్లుబొట్లుగా రాలుతోన్న నా ప్రశ్నల వర్షాన్ని తట్టుకోలేక
నాలోలోపలికి ఐక్యమైపోతుంది సముద్రం
మరణమొకటి మొగసాల నిల్చుందని
జీవించడం మానగలమా?
సునామీ వస్తుందని…సునామీ వస్తుందని
సముద్రాన్ని ప్రేమించకుండా వుండగలమా?

5 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

ప్రాణతోరణమై సమూహాలని తన
గుమ్మానికి కట్టేసుకున్న సముద్రం
కాళ్ళు కడిగి నాతో కరచాలనమే చేస్తుంది.
--బాగుందండీ.

వికటకవి చెప్పారు...

మంచి కవితలు పరిచయం చేశారు. నాకు ఇది నచ్చింది.

మరణమొకటి మొగసాల నిల్చుందని
జీవించడం మానగలమా?
సునామీ వస్తుందని…సునామీ వస్తుందని
సముద్రాన్ని ప్రేమించకుండా వుండగలమా?

Vasundhara చెప్పారు...

ఏళ్ళ తరబడి కల్లోల సముద్రాల్ని కడుపులో దాచుకున్న
నాకంటే నువ్వు ఏమంత గొప్పదానివని సవాలు విసురుతాన్నేను.
బొట్లుబొట్లుగా రాలుతోన్న నా ప్రశ్నల వర్షాన్ని తట్టుకోలేక
నాలోలోపలికి ఐక్యమైపోతుంది సముద్రం..

దుఖాన్నైనా సహనాన్నైనా సముద్రంతో పోలుస్తారు. ఇది చదివాక ఆ పోలిక చాలా బాగా సరిపోయిందనిపిస్తోంది.

విహారి(KBL) చెప్పారు...

మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

deepasikha చెప్పారు...

Chala rojulatarvata oka manchikavitha choosanu.
Deepasikha

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి