ఇంతవరకు విశ్వనాధ వారి రచనలపై, ఇన్నయ్య, చలసాని ప్రసాద రావు, కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి, నార్ల వెంకటేశ్వర రావు గార్ల విమర్శలు పాఠకులు చదివియున్నారు. వాటిపై రసవత్తర చర్చలూ చదివియున్నారు. తన రచనలు వైదిక ధర్మ ప్రచారం, చాతుర్వర్ణ వ్యవస్థ సమర్ధన కోసం ఉన్నాయని, అంతే కాక వాటిలో పెక్కు వ్యాకరణ, భాషా ప్రయోగ దోషాలున్నాయనే విమర్శలకు విశ్వనాధ సత్యనారాయణ గారికి బదులిచ్చే అవకాశం, 1961 అక్టోబరు 15 విజయదశమినాడు , చెన్నపురి ఆంధ్ర మహాసభ వారి సన్మాన సభలో లభించింది. విశ్వనాధ వారు తమ పై విమర్శలను తిప్పికొట్టిన వైనాన్ని పాఠకులు చూడగలరు. -cbrao
మనవి మాట
కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షముపై పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరిగారి విమర్శలను 1961 భారతి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు సంచికలలో ప్రకటించియున్నాము. ఆ తరువాత శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి చెన్నపురి ఆంధ్ర మహాసభవారు సన్మానము జరిపించారు. ఆ సన్మానము 1961 అక్టోబరు 15 విజయదశమినాడు జరిగినది. ఆ సభలో మాట్లాడుతూ వారు భారతి స్థాయి పడిపోయినదన్నారు. ఆ తర్వాత దానిపై జరిగిన చర్చ అంతటినీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధములో ప్రకటించి యున్నాము. రాష్ట్రములోని పలుమంది పండితులు తదితరులు ఆ చర్చలో తమతమ అభిప్రాయములను ప్రకటించియున్నారు. ఒక సందర్భములో చర్చ సరసతను కోల్పోయి గిడసబారిపోయినది. భారతి స్థాయి తగ్గినదో తగ్గలేదో అది వేరు విషయము. కాని, ఈ చర్చలో పాల్గొన్న కొందరి విమర్శకుల రచనలవల్ల వారి వారి స్థాయి ఎట్టిదో మాత్రము వ్యక్తమైనది.
సాహితీరంగంలో కవులు, విమర్శకులు
1961 అక్టోబరు 15వ తేదీన చెన్నపురి ఆంధ్రమహాసభవారు ఏర్పాటుచేసిన సన్మాన సమావేశంలో రామాయణ కల్పవృక్షం గ్రంథకర్త కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ప్రసంగం వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
“నామీద ఒక ప్రఖ్యాత పత్రికలో విమర్శలు వస్తున్నాయి. వీనికి సమాధాన మివ్వగలమని ఇప్పుడు ప్రతి సవాలు జరిగింది. ఈ విమర్శలు రాస్తున్నవారు పండితులే. ప్రచురిస్తున్నవారు పండితులే. అయితే ఈ విమర్శలు ఎంత వరకు సమంజసం. ఎంతవరకు నిలుస్తాయి అని వారు ఆలోచించడంలేదు. విద్వాంసులైన వారే ఇలా ఎందుకు చేస్తున్నారో బోధపడకుండా ఉంది. అసలు ఇలా చేయడం భావ్యమా? న్యాయమా? ఇది భాషాద్రోహం కాదా? సాహిత్యానికి తీరని అపచారం కాదా? ఈ పని భారతి పత్రిక మర్యాదకు తగునా? అనేదే నా బాధ.”
“నేను పెద్దవాణ్ణి అయ్యాను. బహుశ ఎంతోకాలం జీవించను. నాపై కోపం ఉంటే పిస్తోలుతో కాల్చవచ్చునే. మేడమీద ఒంటరిగా పడుకొని ఉంటాను. చిన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ బుడ్డి విసిరితే చాలునే. అలా చేయక ఇలా చేయడం ఎందుకనే నేను అడుగుతున్నా.”
“నాకు భగవత్ సాక్షిగా కులభేదంలేదు. నేను సరస్వతీ పూజ చేసుకున్నాను. ఆ సరస్వతి సాక్షిగా నేను ఇది చెబుతున్నాను. నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను. ఈ విమర్శ రాస్తున్న ఆయన కులానికి చెందినవారిలో నాకు పెక్కుమంది ప్రాణ స్నేహితులున్నారు. నన్ను బి.ఏ. వరకు చదివించింది వారే. నా రామాయణ కల్పవృక్షాన్ని అచ్చు వేయించింది వారే. వ్రాస్తున్నవారు తక్కువవారు అనను. పండితులు, సంస్కృతం చదువుకున్నవారు. భాషలో తప్పుల సంగతి పండితులకు తెలియనిది కాదు. ప్రతి దానికి సమర్థన ఉండి తీరుతుంది. ప్రయోగ నిదర్శన, వ్యాకరణం సూత్రం లభిస్తుంది. తప్పులు లేకుండా బ్రహ్మదేవుడు కూడా వ్రాయలేడు. నేనూ తప్పులు వ్రాశాను. మహాకవులంతా తమ కావ్యాలలో తప్పులు వ్రాశారని చూపే గ్రంథాలు ఉన్నాయి. మహాకవి భారవిలోనూ, మహాకవి పండితుడు కాళిదాసులోనూ తప్పులు ఉన్నాయి. అందుకు సంబంధించిన సిద్ధాంత గ్రంథాలు ఉన్నాయి. తప్పులు రాసినా సమర్థించుకోవడానికి, శతకోటి దరిద్రులకు అనంతకోటి ఉపాయాలన్నట్లు, సంస్కృత భాషలో అనేక అవకాశాలున్నాయి. సమర్థించుకోవచ్చు. నేను తప్పులు వ్రాయలేదని అనను, కాని, పత్రికలో చూపినవి మాత్రం, దోషాలు కావని సంస్కృతంలో ఎ.బి.సి.డి.లు వచ్చిన వాడైనా చెప్పగలడు. అయినా భారతి వీనిని ప్రచురిస్తూ ఉంది. భారతి ప్రసిద్ధి, స్థాయి ఇదివరకే పోయింది. ఇప్పటి దాని స్థితి వీనిని బట్టి తెలుస్తున్నది. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించ వలదని ఆ పత్రిక వారికి ఈ సభాముఖాన విజ్ఞప్తి చేస్తున్నాను. ”
“పోతే నేను వైదిక ధర్మ ప్రచారం కోసం వ్రాస్తున్నాననే విమర్శ ఒకటి ఉంది. ఇది కూడా భావ్యమైన విమర్శకాదు. అయినా విజయవాడలో ఒక మిత్రుడు నన్ను ఈ విషయం నిలబెట్టి అడిగాడు. నా గ్రంథాలు చదివిన మీదట సుహృద్భావంతోనే ఈ ప్రశ్న అడుగుతున్నట్టు చెప్పాడు. దానికి నేను చెప్పాను. అయ్యా షేక్స్ పియర్ నాటకాల్లో మర్చంట్ ఆఫ్ వెనిస్ లో ఒక యూదు పాత్రను ప్రవేశపెట్టి, క్రైస్తవ ప్రచారం చేశాడు. మిల్టన్ వ్రాసిన పారడైజ్ లాస్ట్ నిండా క్రైస్తవమతం మినహా మరొకటి లేదు. అయినా మీరు మెచ్చుకున్నారు. ఇలాంటి ప్రశ్న అడగలేడు. మహామహులంతా తమ దేశాల మతాన్ని, ధర్మాన్నీ ఏదో ఒకవిధంగా ప్రచారం చేశారు. రామకృష్ణ పరమహంస చేసిన దేమిటి? రమణ మహర్షి చేసినదేమిటి? భవాన్సు జర్నల్ చేస్తున్నదేమిటి? వాటిని ఈ ప్రశ్న అడగరే. నన్నే అడుగుతారే. లోకువగా దొరికానని, నేను నా దేశాన్ని, మతాన్ని, సంప్రదాయాన్ని, పరిసరాలను, పుట్టుపూర్వోత్తరాలను, సంస్కృతిని ఎలా మర్చిపోను? వాటిని గురించి వ్రాయక నేను వేనిని గురించి వ్రాయను. అన్ని దేశాలలో అందరు కవులూ ఏది ఎలా చేశారో నేను అలాగే చేశాను. ఇందులో నేను చేసిన తప్పు ఏమిటి? ఉన్నమాట ముఖంమీద అనేవాడు ఈ రోజుల్లో దోషి. సహపంక్తిని భోజనం చేసి, పొగిడి, అవతలకు వెళ్లి వా డొట్టి లంజకొడుకు అని తిట్టేవాడు మంచివాడు. ఇలా ఉంది లోకం. మనస్థితి. ఇక్కడితో వదిలేస్తాను.”
పిమ్మట శ్రీశ్రీ , విశ్వనాథ సత్యనారాయణగారిపట్ల, వ్యక్తిగతంగాగల గౌరవాన్ని తెలుపుకోవటానికి వచ్చానంటూ, రామాయణం అంటే నిజం కథ అని నమ్మకం లేదనీ, మళ్ళీ భారతాన్ని నిజమని విశ్వసిస్తాననీ చెప్పారు. శ్రీ సత్యనారాయణ గారి మీద ముఖ్యంగా ఒక ఫిర్యాదు చేస్తున్నానని చెప్పి, వారి గురువుగారైన స్వర్గీయ శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రులవారు ద్రాక్షాపాకంలో రచనలు సాగించగా, శ్రీ సత్యనారాయణగారు పాషాణపాకంలో వ్రాస్తున్నారు. తమకు సంస్కృతం రాకపోయినా, వాల్మీకి రామాయణం చదువుతుంటే అర్థంమవుతున్నట్టే ఉంటుందని, కాని విశ్వనాథవారు వ్రాసిన రామాయణం చదువుతుంటే తనకు తెలుగు బాగా వచ్చినా, ఏమీ అర్థం కాదనీ, అలా ఎందుకు వ్రాయాలని ప్రశ్నించారు. అయినా వాల్మీకాదులు వందమంది వ్రాస్తే శ్రీ సత్యనారాయణగారొక్కరే రామాయణాన్ని రచించారనీ చెప్పారు.
తమకు జరిగిన సన్మానానికి సమాధానం యిస్తూ శ్రీ సత్యనారాయణగారు యింకా యీ విధంగా చెప్పారు. “తెలుగుదేశం లక్షణం ఈ కాసేపట్లోనే తెలిసింది. ఇంకోటి గూడా తెలిసింది. ఉదయం ఆంధ్రమహాసభ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ శాస్త్రిగారు, ప్రస్తుత అధ్యక్షులు శ్రీ నాయుడుగారు ‘తెలియదు’, ‘తెలియ’దంటూనే అమిత విజ్ఞానం చూపించారు. రాముడు కొందరికి భగవంతుడు, అలాగే కొందరికి ఏసు, కొందరికి అల్లా భగవంతులు. భిన్న మతస్తులకు భిన్న విశ్వాసాలుంటాయి. రాముడు దేవుడు కాడని క్రైస్తవుడంటే బాధలేదు. కానీ, మనలోనే కొందరు ఆ విధంగా అంటే బాధకలుగుతుంది. శ్రీ శ్రీ అంటే నాకు అంత ప్రేమ. ఆయనకు సమాధానం చెప్పను. కాని చెబుతే మాత్రం నష్టం ఏమిటి? భారతం ఎందుకు యదార్థం, రామాయణం ఎందుకు అభూత కల్పన? భారతమూ, కాల్పనికమే అన్నారు పాశ్చాత్యులు. దీనిని తిరువణ్ణామలై వాళ్ళు ఒప్పుకోవచ్చు.” తరువాత భారత యుద్ధం ఏ సంవత్సరం, ఏ రోజున, ఏ లిప్తలో ప్రారంభమైంది, భీష్ముడు ఎప్పుడు కరతల్పగతుడైనదీ, ధర్మరాజు ఎప్పుడు కైలాసానికి పోయిందీ, మొదలైన అంశాలు లెక్కకట్టి చెప్పవచ్చునంటూ, దృష్టాంతపూర్వకంగా వివరించి చెప్పారు.
ఇలాంటి ఋజువులు రామాయణంలో గూడా చూపవచ్చునని అన్నారు.
పాశ్చాత్యులు మన సంప్రదాయసిద్ధమైన విద్యా బోధనకు స్వస్తి చెప్పి, వారి చదువులను, విశ్వాసాలను ప్రవేశపెట్టారు. మన ధర్మాలు శాస్త్రాలు, సంస్కృతం పట్ల విశ్వాసం ముఖ్యం. నేనొకసారి పూనా సమావేశంలో ప్రసంగించినప్పుడు అక్కడి కళాశాలలో లెక్చరర్ గా ఉన్న ఒక ఆంధ్రుడు, ఆంధ్రులది సంకుచిత తత్వమనీ, ప్రపంచ దృక్పథం అవసరమని అన్నాడు. మనం ముందు ఆంధ్రులం తర్వాత భారతీయలం, అటుతర్వాత అంతర్జాతీయులం, పాశ్చాత్య సంస్కృతి ప్రమాణమని ఎక్కడైనా ఎవరైనా వాదానికి పూనుకుంటే పూర్వపక్షం చేయగలనని సవాలు చేస్తున్నాను. ఐతే వీనికి తగిన మధ్యవర్తి ఏడీ? ఇలాంటి ప్రశ్నలు 20-30 శాస్త్రాల సంయోజనం వల్లగాని పరిష్కారం కావు. పుట్టటంలోనే పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. అట్లాగే విభిన్న రుచులు గూడా, మతం అన్న తరువాత విశ్వాసం ఉండాలి. మతమే అక్కర్లేదంటే చేసేదిలేదు. మన ప్రాచీనులు ‘ద్వ్యణుకం’ ‘త్ర్యణుకం’ చెప్పారు. ‘ఈ అణు సమాగమానికి దోహదకారి అయిన వస్తువునే చైతన్యమన్నారు. ఆ చైతన్యమే భగవంతుడు’ అన్నారు.
2 కామెంట్‌లు:
అమ్మా! పండిన చెట్టుకే దెబ్బలన్నట్లు అలాంటి విశ్వనాథ వంటి మహానుభావులకు కూడా తప్పలేదు. లోకం తీరే అంత. కాని అలాంటివారు ఎల్లప్పుడూ వినమ్రులుగానే ఉంటారు. అదే వారి గొప్పతనం.
"పిమ్మట శ్రీ శ్రీ, శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిపట్ల, వ్యక్తిగతంగాగల గౌరవాన్ని తెలుపుకోవటానికి వచ్చానంటూ,... " ఈ వాక్యంలో మొదటి రెండు శ్రీ లను కలిపి రాస్తే బావుంటది. రెండో శ్రీ పక్కన ఉన్న కామా సరిగ్గా కనబడకపోవడం చేత, దాని తరవాతి పేరా చదివాక గానీ ఈ పేరా అర్థం కావడం లేదు, మాట్టాడేది శ్రీశ్రీ గురించని తెలీడంలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి