గురువారం, ఏప్రిల్ 23, 2009

బ్లాగు కబుర్లు

కాగడా శర్మ బ్లాగు మూతపడటం ఈ వేసవిలో చల్లని వార్త. గూగుల్ కు అందిన ఫిర్యాదులవలనే ఈ బ్లాగు అంతర్ధానమయ్యిందన్న వార్తలు వినవస్తున్నై. ధూం బ్లాగు కూడా త్వరలోనే మూతపడే లక్షణాలు కనిపిస్తున్నై. ఏ కారణాలవలనైతేనేమి, అక్షయ తృతీయ సందర్భంలో మహిళాబ్లాగర్లకు బంగారం కొనకుండానే, కొన్నంత ఆనందాన్నివ్వగలదీ వార్త. ఈ బ్లాగులలోని రాతలకు బాధపడని, భయపడని మహిళా బ్లాగర్లు ఎవరైనా వుంటే తెలియపరచండి. వారు దీప్తిధార నుంచి వీరతాడు బహుమతి కి అర్హులుగా ప్రకటిస్తా. ఈ రెండు బ్లాగులు మూతపడిన రోజే పాఠకులకు, ప్రత్యేకంగా మహిళలకు దీపావళి.

బ్లాగులు ఎవరి కోసం? ఎందు కోసం? వ్యాఖ్యలు రాకపోతే ఆ టపా తుస్సుమన్నట్లా? 25 వ్యాఖ్యలు వస్తే హిట్ అయినట్లా?

ఎట్లాంటి టపాలు పాఠకులు ఎక్కువ ఆసక్తితో చదువుతున్నట్లుగా మీ భావన?

1) సాహిత్య విషయాలు
2) సినిమా కబుర్లు
3) హేతువాద చర్చలు, వ్యాసాలు
4) గాసిప్ కబుర్లు (ఉదాహరణ ధూం వగైరా బ్లాగులు)
5) సైన్స్, ఖగోళ శాస్త్రం
6) జ్యోతిష్య శాస్త్ర కబుర్లు
7) ఆరోగ్య విషయాలు
8) అవి -ఇవి -అన్నీ
9) రాజకీయాలు
10) సంగీతం
11) ఛాయాగ్రహణం
12) యాత్రా స్మృతులు
13) వంటలు పిండివంటలు
14) వ్యక్తిగత అనుభవాలు
15) కొత్త పరికరాలు (Cell phone, Camera, Computer etc)
16) ఆత్మ కధలు, జీవితానుభవాలు
17) మనో వైజ్ఞానిక శాస్త్రం
18) చరిత్ర
19) శృంగారం

కొన్ని విషయాలపై రాసే టపాలకు స్పందన తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు శాస్త్ర (Science), సాహిత్య విషయాలపై రాసే టపాలకు, సినిమాలు, సొల్లు కబుర్లకు ఉన్నంత ఆదరణ ఉండక పోవచ్చు. హిట్లు రానంత మాత్రాన వీటి ప్రయోజనం ఉండదా? సామాజిక హితం కోసం హిట్లు రాకపోయినా,నిరుత్సాహపడకుండా ఇలాంటి విషయాలపై రాసే బ్లాగర్లకు జొహార్లు.కొత్త పరికరాలు (Cell phone, Camera, Computer etc) పై తెలుగు బ్లాగులు బహు తక్కువ. వీటి అవసరం కనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన జీవితం, పైన పేర్కొన్న అన్ని విషయాలతో ముడిపడి ఉంది. హిట్లు వచ్చినా రాకపోయినా మీకు నచ్చిన విషయాలపై రాస్తూ ఉండండి.

"సినిమా పాటలలో సాహిత్యం ఉంటుందా?" - అని ఒకానొకప్పుడు (మా కాలేజ్ రోజుల్లో) చర్చలు జరుగుతుండేవి. కొందరు ప్రఖ్యాత సినీ గేయకవుల సినీ పాటలు సంపుటాలుగా వెలువడ్డాక సందేహ నివృత్తయి, చర్చ పాతబడిపోయింది. ఇప్పుడు బ్లాగులలో తాజా చర్చ "బ్లాగులలో సాహిత్యముందా?" అని. నా ప్రపంచం బ్లాగులో ప్రచురితమైన సాహితీపరులతో సరసాలు ఇంకా వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు కలిపి తాజాగా సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు గా పుస్తక ప్రచురణ అయ్యింది. ఈ పుస్తకంలోని వ్యాసాలు తొలిసారి బ్లాగులో ప్రచురితమయిన తర్వాతే, పుస్తకంగా వెలుగు చూశాయి. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? బ్లాగులలో వస్తున్న రచనలు ఉత్త ' రాలు ' కాదు, పస ఉన్న సరుకని.

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు వ్రాసినది అక్షరాలా నిజం. నేను ఈ మధ్యనే తెలుగు లో బ్లాగ్ మొదలుపెట్టాను. నాకు కథలు వ్రాయడం తెలియదు.ఐనా నా చిన్ననాటి జ్ఞాపకాలు అందరితోనూ పంచుకోవాలని కోరిక. నా భాష అంత బాగుండదు ( అంటే పెద్ద పెద్ద రచయితల్లాగ) మీరు అన్నట్లుగా హిట్లు ఉన్నా లేకపోయినా ఎదో ఒకటి రాస్తూంటే మన భావాలు ప్రకటించుకోగలమని నా అభిప్రాయం.

అజ్ఞాత చెప్పారు...

మీ ఉద్దేశ్యంలో -
పుస్తక రూపంలో వచ్చిందే సాహిత్యమా? లేక పుస్తక రూపంలో వచ్చింది కాబట్టి సాహిత్యమా? పుస్తకాలుగా ప్రచురించబడేవన్నీ పస ఉన్న సరకులా?
ఇంకా పుస్తక రూపంలో రాని సరుకు గతి ఏమిటి?!
ఇప్పటిదాకా పుస్తక రూపంలో వచ్చిన "సరుకు" సంగతేమిటి?

cbrao చెప్పారు...

@సిరి: "పుస్తక రూపంలో వచ్చిందే సాహిత్యమా?" - కాదు.
"పుస్తకాలుగా ప్రచురించబడేవన్నీ పస ఉన్న సరకులా? " -కాదు.
"ఇంకా పుస్తక రూపంలో రాని సరుకు గతి ఏమిటి?!" - ప్రతిదానికీ ఒక సమయముంటుంది. ఈ సరకుకు ఇంకా ఆ సమయం ఆసన్నం కాలేదని అర్థం.
"ఇప్పటిదాకా పుస్తక రూపంలో వచ్చిన "సరుకు" సంగతేమిటి?" -అచ్చులో ఉన్నవన్నీ అణిముత్యాలు కావు. మట్టిలోంచి మాణిక్యాలు వెదికే పని పాఠకుడిదే.

cbrao చెప్పారు...

@harephala : కష్టేఫలి. మీకు నచ్చిన విషయాలపై రాస్తూ ఉండండి. మీ శైలి, జ్ఞానం రెండూ పెరుగుతాయి. హిట్ల గురించి పట్టించుకోనేవద్దు. శుభం.

Satyasuresh Donepudi చెప్పారు...

బ్లాగులు ఎవరి కోసం? ఎందు కోసం? వ్యాఖ్యలు రాకపోతే ఆ టపా తుస్సుమన్నట్లా? 25 వ్యాఖ్యలు వస్తే హిట్ అయినట్లా?

నా భావన:
బ్లాగులు ఎవరి కోసం? ఎందు కోసం? - నా వరుకు బ్లాగ్ ఇద్దరికోసం వ్రాసేవాడికోసం ఇంకా చదివేవాడికోసం, వ్రాసేవాడికోసం అని ఎందుకన్నానంటే ఎలాగోలా ఒక పొష్ట్ వ్రాయాలి అని అనుకొనేవాడికి పెద్దగా ఉపయోగం ఉండదు కాని, మనస్సు పెట్టి పదిమంది మనస్సులను గెలవాలి అనుకొనేవాడు జాగ్రత్తగా వ్రాస్తాడు, తద్వారా తనలోని విజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని పెంచుకొంటాడు. ఇక చదివేవాడికి, చదివినదానికి ఎంత ప్రాముఖ్యతిని ఇస్తాడనేదానిని బట్టి ఉపయోగం ఉంటుంది.

వ్యాఖ్యలు రాకపోతే ఆ టపా తుస్సుమన్నట్లా? - కాదనే చెబుతాను, ఎందుకంటే చదివిన వారందరూ వాఖ్యలు వ్రాస్తారని నేను అనుకోను, దానికి మంచిని మెచ్చుకొనే మనస్సు కావాలి, నచ్చకపోతే సరే అనుకోండి.

25 వ్యాఖ్యలు వస్తే హిట్ అయినట్లా? - కొంత కాదు, కొంత అవును...

cbrao చెప్పారు...

@Satyasuresh Donepudi: "వ్యాఖ్యలు రాకపోతే ఆ టపా తుస్సుమన్నట్లా? - కాదనే చెబుతాను, ఎందుకంటే చదివిన వారందరూ వాఖ్యలు వ్రాస్తారని నేను అనుకోను, దానికి మంచిని మెచ్చుకొనే మనస్సు కావాలి, నచ్చకపోతే సరే అనుకోండి."
-టపా మంచిదైనా స్పందించి వ్రాయటానికి పాఠకుడికి ఒక అంశం లభ్యం కావాలి. ఇది టపా లోని వివాదాస్పద కథనం కావచ్చు, అస్ఫష్టత కావచ్చు లేదా చదవగానే మనసుకు హత్తుకుపోయి రచయితను అభినందించాలనే అభిలాషా కావచ్చు. కొన్ని మంచి టపాలు కూడా ఇవేమి లేక వ్యాఖ్యలను రాసేలా ప్రేరేపించలేక పోవచ్చు. పాఠకుడు తను చదివిన టపా బాగుందనుకున్నప్పుడు, తనకెందుకు నచ్చిందో తెలియపరస్తూ క్లుప్తంగా చిన్న వ్యాఖ్య టపాలో వ్రాయటం అభిలషణీయం.

krishna rao jallipalli చెప్పారు...

కొన్ని మంచి టపాలు కూడా ఇవేమి లేక వ్యాఖ్యలను రాసేలా ప్రేరేపించలేక పోవచ్చు.... ఇది నిజం. అయినా చదివిన ప్రతి టపాకి కామెంటు రాయడం కుదరదు.. కష్టం కూడా. ఏదో రకమయిన జలక్ ఉంటె కామెంటు తప్పక పడుద్ది. దీంట్లో సందేహం లేదు.

Kathi Mahesh Kumar చెప్పారు...

వ్యాఖ్యల అంకెకన్నా, విజిటర్ల సంఖ్యకన్నా బ్లాగు రాస్తున్న ఉద్దేశం సాకారమైనప్పుడే దాన్ని బ్లాగరిగా "నా విజయం"గా గుర్తిస్తాను.

వ్యాఖ్యల్ని బ్లాగరితో జరపాలనుకునే సంభాషణలు మాత్రమే అనుకుంటే, వాటి ద్వారా జరిగే interaction ని బట్టి టపా "విలువ"ని ఎవరో బేరీజు చెయ్యడం హాస్యాస్పదం. విలువకూడా బ్లాగరి తన బ్లాగు ఉద్దేశాన్నిబట్టి స్వయంగా నిర్ణయించుకునేదే తప్ప మరొకటి కాదు.

Bolloju Baba చెప్పారు...

sir
pl. add discussions on caste, religion and region to the above list sir. they are the top viewed hot topics now.

కామెంట్‌ను పోస్ట్ చేయండి