బుధవారం, ఫిబ్రవరి 02, 2011

వీధి పిల్లలు - మహె జబీన్

Mahe Jabeen Photo: cbrao

శ్రీమతి మహె జబీన్‌ కవి, కధా రచయిత్రి ఇంకా న్యాయవాది. సాంఘికసేవా కార్యక్రమాలకు రాజీవ్ గాంధి మానవసేవా బహుమతి పొందారు.  ఆంధ్రప్రదేష్ లో, 10 వ తరగతి వాచ్యపుస్తకంలో ఈ Street Children కవితను   Board of Secondary Education వారు పాఠ్యాంశం గా ఉంచారు.

Street Chidren (వీధి పిల్లలు) - మహె జబీన్ 

Photo courtesy: Soarage International

అనేకానేక సంక్షోభాలు
జీవితాన్ని కుదిపేశాక
బ్రతకటమనేదే ఆఖరి సమస్య
ఎవరికి ఎవరు ఏమీ కానప్పుడు
సొంత రక్తంలో పరాయితనం....

చెత్త కుప్పల మీద పరచుకున్న
శాపగ్రస్త బాల్యం street children
జీవితాన్ని వెతుక్కోవడానికి
సూర్యోదయానికి సలాం కొట్టి
వాళ్ళు బయల్దేరుతారు
భుజం మీద సంచిలో
బ్రతుకు భారాన్ని మోస్తూ

అక్షరాలు దిద్దాల్సిన బాల్యం
చిత్తు కాగితాల్లో చిక్కు పడిపోయింది
పాలు తాగాల్సిన బాల్యం
పాల కవర్ల వేటలో చేజారిపోయింది

ఏ అమావాస్య వాళ్ళను
వీధిపాలు చేసిందో ?
ఎండా...వాన...
ఏ  ఋతువైతేనేం?
పగలు ...రాత్రి ...
సమయంతో  సంబంధమేమీ లేదు
ఎవరున్నారు అడగడానికి

కేవలం బ్రతకడానికి
ఎన్నెన్ని యుద్దాలు చేస్తారు వాళ్ళు
ఎన్నిసార్లు గాయ పడతారో తెలుసా?
చేత్తకుప్పల్లో దొరికే వాటిని తీసి
అపురూపంగా సంచిలో వేసుకునే
వాళ్ళను చూస్తుంటే
పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు
వాళ్ళు నడుస్తుంటే
ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుంది 


మహెజబీన్ 

ఈ కవిత నాకు పంపిన పెరుగు రామకృష్ణగారికి నెనర్లు.

5 వ్యాఖ్యలు:

Indian Minerva చెప్పారు...

కవిత బాగుందండి. మా జూనియర్ల పుస్తకాల్లో ఈ కవిత పేరు విన్నట్లు గుర్తు. కానీ అర్ధం మాత్రం ఇప్పుడే అయ్యింది. (ఇలాంటి) కవితల్ని ఆస్వాదించేంత స్థాయి మన పదవతరగతి విద్యార్ధులకుంటుందంటారా? పద్య భాగమంటే నాకు తెలిసిందల్లా ఏఅక్షరంతో ఏ లైను మొదలవుతుందో బట్టీ పట్టేసి పేపరుపై దొర్లించి రావదమే. ఖర్మవశాత్తు ఇదో "ఇంపార్టెంటు" పద్యమై ఆ విద్యార్ధులు దీన్ని కూడా బట్టీ పడుతున్నట్లైతే మరి దీన్ని పాథ్యపుస్తకంలో చేర్చిన స్పూర్తికి న్యాయం జరిగినట్లేనా?

cbrao చెప్పారు...

జాన్ కీట్స్, వర్డ్స్‌వర్త్ వంటి మహనీయుల కవితలను మన విద్యార్థులు 10 వ, ఇంటర్మీడియట్ తరగతులలో చదువుతున్నారు. ఈ Stree Children కవితను 10 వ తరగతి పిల్లలు అర్థం చేసుకోగలరనే తలంపు. వీధి బాలల లను అర్థం చేసుకోవటానికి, వారి సమస్యలపై సానుభూతితో స్పందించటానికి ఈ కవిత దోహద పడగలదని నమ్మే ఈ కవితను పాఠ్యాంశంగా ఉంచారని తలుస్తాను.

Sailajamithra చెప్పారు...

మెహజబీన్ కవిత ఆంటే ప్రతి గుండె చప్పుడే. అందులో అతిశయోక్తి లేదు. ఎంత ఎత్తు ఎదిగినా అందరిని పలకరించే తీరులో ఆత్మీయత ఉట్టిపడే ఆమె తీరు అందరికి ఆదర్శప్రాయం. '' ఏ అమావాస్య వాళ్ళను వీధిపాలు చేసిందో..ఎండ.. వాన .. ఏ రుతువైతేనేం ? పగలు.. రాత్రి సమయంతో సంభందమేమి లేదు.. ఎవరున్నారు అడగడానికి..'' అద్బుతం.. ఒక్కో వాక్యం ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి పలకరించేలా ఉంది.. అభినందనలు

శైలజామిత్ర

Snehamante చెప్పారు...

పదో తరగతి గదిలోకి వెళ్లి ఈ కవితని పాటంగా చెప్తున్నా ప్రతిసారీ నేనూ నా విద్యార్థులు ఇలా తరగతి గదిలో చదవాల్సిన ఎందరో వీధి బాలల్ని తలచుకుని దుఖిన్చేవాళ్ళం.
వ్యథ భరితమయిన వారి జీవితానికి వెలుగు కోసం ప్రయత్నించే వాళ్ళం. అందుకోసం తమవంతు సహకారాన్ని నా విద్యార్థులు అందించేవారు.ఇప్పుడు నేనూ పనిచేస్తున్న స్కూల్ కి దగ్గరలో చారిటబుల్ ట్రస్ట్ చాలా మంది చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తోంది.మహెజబీన్ కవిత మానవతని మేల్కొపుతుంది

gajula చెప్పారు...

నిశిరాత్రిలో బాలభానుడు
……………………………
చీకటికే రంగులద్ది కారుచీకట్లను
సౄష్టించే చిత్రకారుడు వాడు
భయపెట్టె చీకటిని జయించి తన
బందీగా చేసుకున్న
బాల భేతాలుడు వాడు
ప్రపంచము వొదిలేసిన చెత్తను
భుజమ్మీది బరువుగా మోస్తూ
హెర్కులసుకు సరి జోడైన వాడు
తన దుస్తుల చాటున ప్రపంచ
కల్మషాన్ని దాస్తూ విరాగిలా
తిరిగే భైరాగి వాడు
సమాజములోని కుళ్ళును
స్వార్దాన్ని ఎరుపెక్కిన కళ్ళతొ
ప్రశ్నించే నోరున్న మూగవాడు
వొకరొజు రాత్రి కనిపించి మాయమైన
తొకచుక్క వాడు
………………………
వొకరోజు రాత్రి కనబడి,మాట్లాడి ఇంటికొస్తానని మాటిచ్చి ….తిరిగిరాని బిడ్డ …ఎక్కడ వున్నా మంచిగా వుండాలని కోరుకుంటూ ….వీది బాలలు లేని సమాజాన్ని కోరుకుంటూ …

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి