ఎందుకు రాయాలి?
ప్రతి రచయితా ముందు ఇదమిద్ధంగా, జవాబు తేల్చుకోవాల్సిన ప్రధమ ప్రశ్న ఇది. ఎవరి కోసం? ఎప్పుడు? ఇవి తరువాతి ప్రశ్నలు. ఎదైనా కొత్త విషయం తనకు తెలిసినది, ప్రపంచానికి చెప్పాలన్న దుగ్ధే, రచయితను ముందుకు నడుపుతుంది. తను ఎవరి కోసం రాస్తున్నాడో కూడా, రచయిత నిర్ధారించు కోవాలి. తను ప్రవేశ పెట్టే కొత్త ఊహలు, సిద్ధాంతాలు అందరికీ నచ్చక పోవచ్చనే స్ప్రుహలో రచయిత ఉండాలి. ఉదాహరణకు రచయిత హేతువాదయితే, తన రచనలు సమాజం లోని అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచజాలవనే వాస్తవాన్ని, గ్రహించాల్సుంటుంది. ఎక్కడ, ఎవరి కోసం రాస్తున్నామనే అవగాహనతో రాయాలి. కొన్ని సార్లు Target readers స్థాయి బట్టి రచనలు చేయాల్సుంటుంది. స్కూల్ పిల్లలకు శాస్త్రీయ విషయాలు రాసే సమయంలో, పిల్లల స్థాయిలో, మన భాష, శైలి వారికి సరళంగా బోధపడే విధంగా మన రచన ఉండాలి. సాధారణ పఠితలు (శోధకులు, నిష్ణాతులు కానివారు) విషయం లో రచనలు ఏ స్థాయి లో ఉండాలి అని మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పాఠకుడి స్థాయికి, రచయిత దిగి రాయాలా లేక రచయిత తన స్థాయిలో రచన చేసి, పాఠకుడిని అట్లాంటి కథలు చదివే స్థాయికి పెంచాలా అనేది అప్పుడప్పుడూ వినిపించే ప్రశ్న. పాఠకుడు తన స్థాయికి మించిన రచనలు చదివేలా అలవాటు చెయ్యటం, రచయిత ముందున్న సవాలు. రచయిత, తన రచన స్థాయిని అంచెలంచెలుగా పెంచుకుంటూ, పాఠకుడిని తన వెంటే తీసుకు వెళ్లాలి, తన స్థాయిలో. రచయితకు కొన్ని సార్లు, ఇది కత్తి మీద సామే అవ్వగలదు. ఈ ప్రక్రియ లో విజయం సాధించిననాడే, రచయిత పలువురి మన్నలను పొందగలుగుతాడు; కీర్తి శిఖరాలను ఆరోహిస్తాడు.
http://mandahaasam.blogspot.com/2008/08/blog-post_04.html
ప్రశ్నే జగత్కల్యాణానికి కారణభూతం
"చదివినదాన్ని ఊహించి ఆనందించడం నా చుట్టూ చాలా మంది చేస్తే, నేను కాస్త తింగరోణ్ణికాబట్టి ఆనందించడంతోపాటూ ప్రశ్నించడం మొదలెట్టేవాడిని." -పర్ణశాల మహేష్
ప్రశ్న, మానవుడి మేధ ఎందుకు, ఎలా, ఎప్పుడు అన్న ప్రశ్నలు వేసియుండకపోతే, ఈనాడు మనము ఈ ఉత్తరాన్ని e-mail లో కాకుండా, పావురాల ద్వారా పంపివుండేవారము. చెట్టుపై నుంచి కింద పడే ఆపిల్ పండు, కిందకు కాకుండా, పైకెందుకు వెళ్లటం లేదన్న ప్రశ్న, భూమ్యాకర్షణ సిద్ధాంతం కనుగొనటానికి కారణమయ్యింది. పక్షులు ఎగరగలుగుతున్నాయి. మనమేల ఎగురరాదు అనే ప్రశ్న రైట్ సోదరులకు వచ్చి ఉండక పోతే, అమెరికాకు మనము ఓడలలోనే ప్రయాణం చేసే వారము. ప్రశ్న మానవాళి ఆలోచన, జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసిన మహత్తరమైన వజ్రాయుధం.
చెట్టు ముందా, విత్తు ముందా
ఈ చరాచర ప్రపంచ సృష్టికర్త భగవంతుడని చర్చి,బైబుల్, వేదాంతాలు చెప్తాయి. దేవుడున్నాడని ఆస్తికులు బల్లగుద్ది చెప్తారు. ఇది విశ్వాసం పై ఆధారపడి ఉంది. సైన్స్ ఈ ఆలొచనా విధానానికి భిన్నంగా, పలు ప్రశ్నలు వేస్తూ, తనే సమాధానాలు కనుక్కుంటూ, ఈ నిరంతర పరిశోధనలో తనను తాను సవరించుకుంటూ, ముందుకు నడుస్తుంది. తను విశ్వసించినవాటికి ఋజువులు చూపిస్తుంది. నాస్తికులు సైన్స్ ను నమ్ముతారు. దేవుడు లేడని ప్రచారం చెయ్యరు. ఆస్తికులు ఉటంకించే దేవుడి అస్తిత్వానికి, తమ శాస్త్రీయ దృక్పధంతో, దానికి ఋజువు చూపమంటారు. శాస్త్రరీత్యా దేవుని అస్తిత్వాన్ని ఋజువు చేయటం సంభవం కాలేదు కనుక, నాస్తికులు దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు.
రచయిత బలహీనమే బలం
రచయిత సున్నిత మనస్కుడు. ఒక మానసిక బలహీనత ఉంటుంది. ఆ ఋగ్మత లో,తనకు తెలిసిన విషయాలు ప్రపంచానికి తెలియ చెప్పాలన్న దుగ్ధ (urge) ఉంటుంది. ఈ దుగ్ధే అతని చేత మహత్తరమైన రచనలు చేయటానికి ఉత్తేజాన్నిస్తుంది. ఇందుకు ఉదాహరణగా కార్ల్ మార్క్స్ 'Das Capital', గోర్కీ అమ్మ వగైరా చెప్పుకోవచ్చు. నిజానికి రచయిత మానసిక ఋగ్మతే అతని బలం. ఒక విషయం పై ఆలొచిస్తూ ఉన్నప్పుడు, ఆలోచనలు, కొత్త ఊహలు జీవన ధారలా వస్తాయి. వాటిని ఆపటం కష్టం. వాటిని ఎంత త్వరగా కాగితం పైన పెడితే, అంత బలోపేతంగా ఉంటాయి. ఆలొచనలను వికసించ నీయండి. వెయ్యి భావాలు వెలుగులోకి రానీయ్యండి.
విమర్శలు బ్లాగుకు అందం, జీవం
బ్లాగుకు విమర్శలు ఉప్పు లాంటివి. ఉప్పు లేని కూర ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. విమర్శలూ జిందాబాద్. బ్లాగరూ జిందాబాద్.
