డేరా సినిమా లో Mike Dubbing
నా బాల్యంలో నాగిన్ చిత్రం మా ఊరు (పొన్నూరు, గుంటూరు జిల్లా) డేరా సినిమా హాల్ (Cinema theater made of tent, which is temporary in nature and is called as a touring talkies) లో చూసిన జ్ఞాపకం.ఇందులో వైజయంతి మాల, ప్రదీప్ కుమార్ నాయికా నాయకులు. కానయితే అసలు ఈ సినిమాలో నిజమైన హీరో, హేమంత్ కుమార్ సంగీతమే. లత పాట మన్ డొలే మెరా తన్ డొలే పాట అప్పటికి, ఇప్పటికీ హిట్ సాంగే. అందులో పాములోడు (snake charmer) వాడే సంగీత వాద్యం been ను వాయించింది ఎవరో తెలుసా? సంగీత దర్శక ద్వయం కల్యాణ్జీ ఆనంద్జీ ల లోని కల్యాణ్జీ. నాగిన్ సంగీతానికి ఒక రోజు, ఒక పాము, డేరా హాలు లోకి వచ్చి కలకలం సృష్టించిందట.
అందులోని పాము సంగీతం, ఎంత ప్రాచుర్యం చెందిందంటే, ఈనాటికీ పాములవాళ్ళు, పాములను వశం చేసుకోవటానికి, అదే సంగీతాన్ని వాయిస్తారు.మన్ డొలే మెరా తన్ డొలే పాట ఇక్కడ చూడండి.
అప్పట్లో ఎక్కువమందికి హిందీ భాష తెలిసేది కాదు. డబ్బింగ్ (ఒక భాష నుంచి మరొక భాష లోకి అనువాదం చేసే ప్రక్రియ) ఇంకా శైశవ దశలోనే ఉంది. మరి కథ మన తెలుగు ప్రేక్షకులకు ఎలా అర్థమవ్వాలి? ఇందుకోసం ఒక అనువాదకుడు మైక్ డబ్బాని (a combination of microphone, amplifier and speaker) పట్టుకుని, సంభాషణలను తెలుగులో తర్జుమా చేసి చెపుతుంటే, అవి విని, కథ , మాటలు ప్రేక్షకులు follow అయ్యేవారు.
డేరా హాలులో హిందీయే కాక తెలుగు, తమిళ చిత్రాలు కూడా ప్రదర్శించేవారు. ఆ సినిమాలు చూడాలనే ఉబలాటానికి, ఇంట్లో వారు, కళ్ళెం వేసే వారు. మా పక్కింటి జీజీ బాయి, సీతారాం ల కు నేనంటే ఎంతో ఇష్టం. వారితో బాటుగా,నన్నూ,కొన్ని సినిమాలకు, తీసుకుని వెళ్ళే వారు. టూరింగ్ టాకీస్ లో,సోఫా, కుర్చి, బెంచి ఇంకా నేల క్లాసు లుండేవి. స్త్రీ, పురుషులకు, వేరు వేరుగా, సీట్లు ఉండేవి. చక్రపాణి మరియు నాగిరెడ్డి కలిసి నిర్మించిన చంద్రహారం, ఎ.వి.ఎం. వారి జీవితం డేరా హాలు లోనే చూశాను. డడడా డడడా డడాండడం పాట జీవితం చిత్రం లోనిదే. చంద్రలేఖ లో పెద్ద పెద్ద drums పై పలు కళాకారులు మనొహరంగా నాట్యం చేయడం ఇంకా గుర్తుంది. డేరా హాలులో నేను చూసిన చంద్రహారం చిత్రంలో,పింగళి నాగేంద్ర రావు రచన, ఘంటసాల పాడిన 'ఇది నా చెలి ' పాట వినండి.
http://www.musicindiaonline.com/p/x/S4X_tAdXp9.As1NMvHdW/?done_detect
అప్పటి డబ్బింగ్ కి ఇప్పటికి, హస్తి మసికాంతరమంత తేడా ఉంది. గాంధీ సినిమా అనువాదాన్ని హిందీ లో ఎంత చక్కగా తీసారంటే, పాత్రలు, నిజంగా హిందీ లోనే మాట్లాడుతున్నాయా, అనిపించేంతగా. ఇప్పుడు సినిమా, సాంకేతికంగా, ఎన్నో రెట్లు పెరిగింది. అతి పెద్ద వెండి తెరపై, Imax theatre లో సినిమా చూస్తున్నా, టూరింగ్ టాకీస్ జ్ఞాపకాలు, ఈనాటికీ తాజాగానే ఉన్నై. అవి బాల్యపు,మధుర స్మృతులు కదా మరి.
ఈ వ్యాసం గతంలో,Telugu Literary and Cultural Association,New York వారి అంతర్జాల పత్రిక, జులై 2007 సంచికలో (http://www.tlca.com/index-july-2007.html) Mike Dubbing అనే పేరుతో,ప్రచురించబడింది. సంపాదకులకు కృతజ్ఞతలతో, దీప్తిధారలో పునః ప్రచురణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి