ఆదివారం, మార్చి 20, 2011

ఛాయాగ్రాహకుడు డి. రవీందర్ రెడ్డి ఫొటో గాలరీ ఆవిష్కరణ

  D Ravinder Reddy  Photo: cbrao

1964 లో, పెద్దపల్లి (కరీంనగర్) లో జన్మించిన రవీంద్రరెడ్డి, ఆంధ్రప్రదేష్ గర్వించతగ్గ ఛాయాచిత్రకారులలో ఒకరు.

Photo courtesy: Ravinder Reddy Click on photographs to enlarge

డిశంబర్  6, 1992  లో అతి ప్రమాదకర పరిస్థితులలో  బాబ్రి మసీదు విధ్వంసం ఛాయాచిత్రాలను తీసి, ప్రాణాలుగ్గపెట్టి, కరసేవకుల నుంచి తప్పించుకొని అయోధ్య రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఫరిదాబాద్, లక్నో ల మీదుగా ఢిల్హి  వెళ్లి ఇండియా టుడే, టైం పత్రికలకు    సకాలంలో చిత్రాలను  అందించే సాహసం చేసినవాడు రవీందర్. లాతూర్(మహారాష్ట్ర) లో  భూకంపం వచ్చినప్పుడు, మృత శిశువు చెయ్యి  శిధిలాల్లోంచి  పైకి  వచ్చి కనిపించే దృశ్యం చూస్తే గుండె ఝల్లుమనకమానదు.  రవీందర్ చిత్రాలలోని మానవీయత  చూపరులను ఆకట్టుకుంటుంది. రవీందర్ జీవితం లో ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. వాటికి అందుకున్నపురస్కారాలు ఎన్నో. రవీందర్ జీవిత విశేషాలు, తన ఛాయాచిత్ర పుస్తకాలు వగైరా విశేషాలతో  కూడిన ఈ చిన్న లఘు చిత్రం చూడండి. ఈ చిత్రం చూశాక రవీందర్ ఇంత మంచి పేరు ఎలా సంపాదించాడో మీకే అర్థమవగలదు. 

Video courtesy: Ravi Studios

Goddess Photo courtesy: Ravinder Reddy

ఏప్రిల్ 18 సాయంత్రం 7 గంటలకు సోమాజీగూడా (రాజ్‌భవన్ రోడ్) లోని  ఛాయాచిత్ర ప్రదర్శనశాలకు వెళ్లేసరికి చాలా మంది మిత్రులు, పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెల్ వాళ్లు ఇంకా ఎంతో మంది ఛాయాచిత్రకారులు ప్రదర్శనశాలను ఆవిష్కరించే ప్రఖ్యాత కళా విమర్శకుడు, కళాఖండాల సేకరణకర్త  (Jagdish and Kamla Mittal Museum of Indian Art ) జగ్‌దీష్ మిట్టల్ కోసం నిరీక్షిస్తూ కనిపించారు. ఈ నిరీక్షణ సమయంలో  కొత్త మిత్రుల పరిచయం, పాత మిత్రులతో కబుర్లు  చెప్తూ సమకాలీన ఛాయాచిత్ర కళ గురించి  మాట్లాడుతున్న సమయంలో  ముఖ్య అతిధి వచ్చేశారు. మిట్టల్ గారితో మేమూ లోనికి ప్రవేశించి  అక్కడ  చక్కగా  ప్రదర్శించిన  Colours of Hyderabad  ఛాయాచిత్రాలు చూసి ఆనందించాము. ఇది Group Exhibition.   ఈ ప్రదర్శనలో నాకు తెలిసిన, తెలియని   ఛాయాచిత్రకారుల బొమ్మలు ప్రదర్శనలో ఉన్నాయి. 

Jagdish Mittal lighting the lamp  Photo:cbrao

జగ్‌దీష్ మిట్టల్ గారు దీపప్రజ్వలన గావించి ప్రదర్శన ప్రారంభించారు. చిత్రంలో ఎడనుంచి కుడి వైపు: జగదీష్ మిట్టల్ (జ్యోతి  ప్రజ్వలనం చేస్తూ), M.V.రమణారెడ్డి ( Sculptor & Painter),  లక్ష్మణ్ ఏలే (చిత్రకారుడు, ఛాయాగ్రాహకుడు), దీపికా రెడ్డి (కుచిపూడి నర్తకి) మరియు శ్రీధర్ (Portrait Artist) 

 Colors of Hyderabad Photo courtesy: Srinivas

జగ్‌దీష్ మిట్టల్ మాట్లాడుతూ ఇంత చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు, రవీందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.   రవీందర్ రెడ్డి  బదులిస్తూ," పాత చిత్రాల నెగటివ్‌లు సంపాదించి, వాటిని భవిష్యత్లో ప్రదర్శనలో ఉంచుతాము. ఛాయాగ్రహకుడిగా నేను ఎంత పేరు తెచ్చుకున్నా , ఈ రోజు జరుగుతున్న గాలరీ ఆవిష్కరణ తో నా చిరకాల వాంఛ నెరవేరింది. ఛాయాగ్రాహకులు దృశ్య చారిత్రకారులు. ఈ ప్రదర్శన కు సహకరించిన  వారందరికీ ధన్యవాదాలు" అన్నారు.  

Puppets in cage  Photo courtesy: Aelay Laxman

ఈ " హైదరాబాదు రంగులు" ప్రదర్శనలో  సుమారు 35 మంది ఛాయాచిత్రకారులు పాల్గొంటున్నారు. ఈ చిత్రాలు కొన్ని రంగుల ప్రాధాన్యతను కలిగిఉంటే, మరికొన్ని ఆకార, చీకటి వెలుగుల   ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.  రవీందర్ రెడ్డి The Goddess చిత్రం  హైదరాబాదు దేవాలయాలలోని సంస్కృతిని చక్కగా  పొదివిపట్టింది. సంతోష్ తీసిన The Pottery Wheel  చక్రం, దాని కింద ఉన్న ఎన్నో చిన్న ప్రమిదలను ఆకర్షణీయమైన    ఆకృతిలో చూపించింది. జనార్ధన్ Paper Weight చిత్రం తనలో  ఇంద్రధనస్సు రంగులను  నింపుకొంది.శ్రీనివాస్  చిత్రం Crop Protection  ఒక పెయింటింగ్ లా  ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. Urban Landscape  అనే సుశీల్ కపాడియా చిత్రం  నగరం లో మనం చూడని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది.  Puppets in cage అనే చిత్రం ద్వారా  చిత్రకారుడు ఏలే  లక్ష్మణ్  లోని ఛాయాచిత్రకారుడిని చూస్తాము. ఈ ప్రదర్శన లోని చిత్రాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. ఆ చిత్రాలలోని రంగులు, చార్మినార్,  హైదరాబాదు ప్రజలు, పక్షులు, జింక చిత్రాలు  స్మృతిపధంలో ఉండిపోతాయి.
ఈ ప్రదర్శన  ఏప్రిల్ నెల 3 దాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. చూడతగ్గ ప్రదర్శన. 

Ravi Photo Gallery
Near YAMAHA SHOW ROOM
Rajbhavan road, Somajiguda,
Hyderabad.
Phone:
040-23411122
040-23404363
9866 332244

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి