ఆదివారం, ఫిబ్రవరి 18, 2007

అడవిలో అర్థరాత్రి -3

Click on photos to enlarge


అడవిలో అర్థరాత్రి ఎలావుంటుందో, అది విశదమవసాగింది కొద్ది నిముషాలలో. చిమ్మ చీకటి. ఎదురుగా ఏమీ కనిపించదు. మొదట పెద్ద రోడ్ పై వెళ్లే టప్పుడు ఎదుటవారిలో ఎవరైనా లేత రంగు దుస్తులు వేసుకుంటే వాటి ఆధారంగా దారిని గుర్తిస్తూ నడవాలి. అరణ్యఘోష అంటారే అదేంటో అప్పుడు బాగా తెలిసింది. కీచురాళ్లు పెద్దగా రొద చేస్తున్నై. అక్కడక్కడ మిణుగురు పురుగులు గాలిలో ఎగురుతూ మా ముందున్న చెట్లను చూపుతున్నాయి. ముందు ముగ్గురు, అ వెనక ముగ్గురు అలా నడుస్తున్నాము. ఆకాశం నిర్మలంగా ఉండటంతో నక్షత్రాలు స్పష్టంగా కనపడసాగాయి. షఫతుల్లా, BSAP ఉపాధ్యక్షుడు మాకు నక్షత్రాలగురించి తక్కువ స్వరంలో వివరించారు. మధ్య మధ్యలో search light వెలిగించి రోడ్ పక్కలకు focus చేసి వన్యప్రాణుల ఆచూకీ కనిపెట్టడానికి రాజీవ్ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంకొంచం ముందు కెళ్ళాక రోడ్ కి కుడివైపునగల సన్నని బాటలో అడవి అంతర్భాగానికి పయనించ సాగాము. ఇప్పుడు ఒకరి వెనక మరొకరము నడవ సాగాము. అప్పుడు నాకు నేను చదువుకున్న Kenneth Anderson, Jim Corbet ల Man eating tigers of Kumaon కథలు గుర్తు కొచ్చాయి. అవి చదివాక పులి మనస్తత్వం కొంతగా అవగతం అయ్యింది. గుంపుగా ఉన్నా, వాహనం పై ఉన్నా, పులి మనలను attack చెయ్యదు. ఒంటరిగా ఉన్నప్పుడు, వాహనం పై కాక నేలపై ఉన్నప్పుడు అది మనపై నిర్భయంగా దాడి చేస్తుంది. గుంపు లోని వ్యక్తులు single line formation లో వెళితే పులి చివర ఉన్న వ్యక్తిపై దాడి చేసే అవకాశాలు ఎక్కువ. ఆలోచనలో పడి నడవటంతో నేను వెనక పడ్డాను. ఆ single line గా నడుస్తున్న గుంపులో నేనే చివరి వాడిని. నా ముందున్న వ్యక్తి ముదురు రంగు చొక్క వేసుకోవటంతో అతను కూడా కనపడని పరిస్థితి. ఆ సమయంలో పులి ఆ పక్కల ఉంటే అది నిర్భయంగా నా పై దాడి చెయ్యటానికి అనుకూలమైన పరిస్థితులు మెండు కా సాగాయి. ఈ సత్యం అవగతమయ్యాక, నాలో, నాకు తెలియకుండానే భయం మొదలయ్యింది.

అంతలో ఏదొ అలికిడి అవటంతో గుంపు ముందుకు వెళ్లటం ఆగింది. ఎదైనా దుప్పో లేక కుందేలో ఆ చప్పుడుకు కారణం కావచ్చు. Search light వెలిగింది. ప్రకాశవంతమైన వెలుగులో కూడా ఏమి కనపడ లేదు. అడవిలో జంతువులను వాటి కాంతివంతమైన కళ్ళతో గుర్తించవచ్చు. Search light off చేసి మెరిసే కళ్ళకై చేసిన మా అన్వేషణ ఫలించ లేదు. నక్షత్రాలను చూస్తూ,మిణుగురుల నాట్య విలాసాన్ని గమనిస్తూ,నిశ్శబ్దంగా నడుస్తున్నాము. ఎంత నిశ్శబ్దంగా అనుకున్నా కాలి బూట్ల కింద నలుగుతున్న ఎండుటాకుల చప్పుడు తప్ప లేదు.ఏ జంతువునీ కనుగొనలేకపోయామనే నిరుత్సాహం కలిగినా, ఉత్కంఠభరితమైన అర్థరాత్రి అడవిలో అన్వేషణ మరుపురాని జ్ఞాపకాలు మిగిల్చిందని చెప్పవచ్చు. ముందు నడుస్తున్న forest guard ననుసరించి మా tent చేరుకున్నాము. చలి ఎక్కువగా వుండటంతో -(డిసెంబర్ మాసం,అడవి మధ్యన,అదీ సరస్సు ఒడ్డున చలి లేక పోతే ఆశ్చర్యం కానీ, ఉంటే ఆశ్చర్యం ఏముంది?) నేను వేసుకున్న జాకెట్, మేజొళ్ళ తో సహా పడుకున్నా చలి అనిపించింది. కారణం తెల్లారాక తెలిసింది.నేను పడుకున్న చోట గుడారానికి, నా తల వెనక, పెద్ద రంధ్రం కనిపించింది. రాత్రి చీకటిలో గమనించ లేక పోయాను. హతొస్మీ అనుకున్నాను.

మూడవ రోజు: రాత్రి ఆలస్యంగా నిద్రించటంవలన ఉదయం లేవటమూ ఆలస్యం అయ్యింది. కాలకృత్యాల కోసం ఒక నీళ్ళ సీసా తీసుకొని గుడారానికి దూరంగా అడవిలోకి వెళ్ళి ఒక పొద వెనక కూర్చున్నాను, ఎదురుగా వున్న సరస్సు కేసి చూస్తూ.నిన్న ఆనందాన్ని కలిగించిన సరస్సు నేడు భయాన్ని కలిగించింది. నిన్న సభ్యుల ప్రశ్నలకు వహీద్ గారు సమాధాన మిచ్చారు. మామడ అడవిలో పులులు లేవనీ, ప్రధాన రహదారికి అవతలివైపు ఉన్న అరణ్యంలో ఉన్నాయని చెప్పారు. ఈ అడవిలో పులులు లేవు కానీ కొండ చిలువులు అసాధరణం కాదు. వాటి ఆహారం కోసం అవి నిరంతరంగా అన్వేషిస్తూనే ఉంటాయి. నిన్న సరస్సు చుట్టూ తిరిగినప్పుడు అందులో మాకు ముసలి కనిపించలేదు కానీ అందులో అవి ఉన్నట్లుగా వహీద్ గారు చెప్పి, తను ఒక ముసలిని చాయ చిత్రం తీసినట్లుగా చెప్పి, తన cellphone లో ఆ ముసలి చిత్రాన్ని చూపారు. ఇప్పుడు నా ముందు , వెనక ముసలి, కొండ చిలువ కలిపి,రెండు సవాళ్ళు విసిరాయి నాపై - కాచుకో మరి అంటూ... నా చూపు ముందు ఉంచాల్నా, లేక వెనక ఉంచాల్నా అన్న సందిగ్ధం మనస్సును వెంటాడ సాగింది. పని ముగించుకుని tent వైపు వడి వడిగా అడుగులు వేశాను.


నేను tent చేరేసరికి అప్పటికే కొందరు ఉత్సాహవంతులు bird watching మొదలు పెట్టారు. మొహం కడిగాక, కాఫీ తాగుతూ ఆకాశం కేసి చూస్తే


ఒక గరుడ పక్షి ( Brahminy Kite) ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది. నేను నా కెమరా తీసుకుని సరస్సువైపు వేగంగా నడిచాను. నా కోసమే అన్నట్లుగా నే నున్న చోటికే వచ్చిన గరుడ పక్షిని కెమరాలో బంధించాను. Tent దగ్గర కొచ్చే సరికి అక్కడ ఈనాడు విలేఖరి వచ్చి ఉన్నారు. వహీద్ గారి ఆహ్వానంపై హైదరాబాదు నుంచి పక్షుల వీక్షణ కోసం వచ్చిన మా గురించి, మా hobby గురించి cover చేయటానికి వచ్చారాయన. మాతో కొన్ని ప్రశ్నలు , సమాధానాలు ప్రక్రియ అయ్యాక మేము పక్షి వీక్షణ చెస్తున్న కొన్ని చాయా చిత్రాలను వారు తీసుకొన్నారు. వారి report ఈనాడు తీసుకొన్న జిల్లా ఎడిషన్ పుణ్యమా అని అక్కడి అదిలాబాదు జిల్లాకే పరిమితం. ఇదో వింత పరిస్థితి. మన పక్క జిల్లా లో, కాదు కాదు మీరు హైదరాబాదులో అమీర్‌పేట లో ఉంటే మీకు దిల్షుక్‌నగర్ వార్తలు కనిపించవు. ఇదే technology తెచ్చిన మాయాజాలం. ఈ చమత్కారం వలన హైదరాబాదు మిత్రులు నిర్మల్ పర్యటన గురించి ఈనాడులో తెలుసుకోజాలరు.

Birders at telescope

రాజీవ్, దాక్టర్ల బృందం తమతో తెచ్చిన దుర్భిణీ యంత్రాన్ని (telescope) ను సరస్సు ఒడ్డున అమర్చి దూరంగా ఎత్తైన చెట్టుపై ఉన్న Grey Headed Fish Eagle పై focus పెట్టారు. ఈ దుర్భిణీలో ఎంతో దూరంగా ఉన్న ఆ పక్షి ఎదురుగా ఉన్నట్లే అనిపిస్తుంది. పక్షి, దాని habitat స్పష్టంగా తెలుస్తున్నై. Breakfast అయ్యాక అంతా వహీద్ గారికి వీడ్కోలు చెప్పి నిర్మల్ పట్టణం ముందున్న కచ్చార్ చెరువు వైపు మా వాహనాలను పరుగులు తీయించాము. నిర్మల్ కోటకు ఎదురుగా ఉందీ సరస్సు.


Habitat at Kassar Lake
సరస్సు కావల పలు నివాస భవనాలున్నై. ఒక water control point ఉన్న చోట జీపు దిగి , రోడ్ పైనుంచి చప్టా మీదుగా కిందకు దిగి మా bird watching మొదలెట్టాము. అనూహ్యంగా ఎన్నో రకాల పక్షులకు నిలయమైందీ సరస్సు.

Lotus flower in Kacchar Lake

అక్కడక్కడా తామర పూలతో శొభాయమానంగా ఉంది.

Common Coot

ఎదురుగా ఎన్నో బొల్లి కోళ్ళు (Common Coot), Red Crested Pochard, Cotton Teal పక్షులు అధిక సంఖ్యలో కనిపించాయి. ఇవికాక వెరే రకాల పక్షులు చిన్న సంఖ్య లో కనిపించాయి. Asian WaterFowl Census (Bombay Natural History Society) ప్రాజెక్ట్ కోసం కస్సార్ చెరువు లోని పక్షులను లెక్కించి మా పుస్తకాలలో రాసుకొన్నాము. ఆ report form ఇలా ఉంటుంది. అంతా అనుకున్నట్లే జరిగింది. ఇంక మా అతిధిగృహానికి బయలుదేరాము.

ఇంతకు క్రితమే చెప్పినట్లుగా మా అతిథిగృహం Divisional Forest Officer వారి కార్యాలయ ఆవరణలో ఉంది. ఈ campus చాలా పెద్దది. ఇందులో చాలా వృక్షాలు ఉన్నాయి. అవి ఎన్నో రకాల పక్షులకు ఆవాసమై ఉన్నాయి. అతిథిగృహం ముందున్న పెద్ద చెట్టు తొర్రలో గుడ్లగూబ ( Spotted Owlet)ను మా సభ్యులు కనుగొన్నారు. అంతే కాదు అదే చెట్టుపై రెండు ముక్కుల గువ్వ (Grey Hornbill) ను కూడా గమనించారు. ఇవే కాక మిగతా చెట్లపై అనేక పక్షులను ఆసక్తిగా గమనించారు. ఇంతలో office boy వచ్చి D.F.O., Waheed గారు పిలుస్తున్నరని వర్తమానం తెచ్చాడు. మేమంతా వహీద్ గారికి కృతజ్ఞతలు తెలుపుటకై వారి కార్యాలయ conference hall కి వెళ్ళాము. అప్పుడు వారు మాకు కొన్ని చాయా చిత్రాలు చూపారు. వాటిలో చిన్న పులి పిల్లనెత్తుకున్న వహీద్ గారి చిత్రం నన్నాకర్షించింది.వారినే అడిగితే చెప్పారు. మామడ కంటే ఇంకా ఎగువన ఉన్న అడవిలో ఈ పులిపిల్ల తల్లి నుంచి వేరు పడిందనీ దానిని వారే కొంత కాలం సాకి,బాగోగులు చూసి చివరకు హైదరాబాదు లోని zoo కి అప్పగించామని చెప్పారు. తల్లి నుంచి పిల్ల ఎలా విడివడిందని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ,' తల్లి ఆహారం కోసం పిల్లను విడిచి దూరంగా వెళ్ళినప్పుడు, పిల్ల కొన్ని పరిస్థితుతలో ఆత్మ రక్షణకై ఉన్నచోటు నుంచి దూరంగా వెళ్లడటమూ లేక అది ఉన్నచోటే ఉన్నప్పటికీ అక్కడ గొర్రెల కాపరులు,గొర్రెలూ,మేకలూ అధికంగా వచ్చి ఉండటంతో, తన ఉనికిని వెళ్ళడించటం, తనకు క్షేమం కాని పరిస్థితులలో, తల్లి పిల్లను విడిచి దూరంగా వెళ్ళవలిసి వచ్చినప్పుడు, పిల్ల ఆహారం కోసం తచ్చాడుతూ బలహీనం గా ఉండి forest guard ల చేతికి చిక్కుతుంది.' అని వారు చెప్పారు. Guards కు దొరకని పక్షంలో దానిని శత్రువులు దాడి చెయ్యటమో లేక ఆహారం కోసం అలమటించి, శుష్కించి ఆ పిల్ల చనిపోవటమో జరుగుతుందని వివరించారు. మా అందరకు చక్కటి తేనీరు అందించారు ఈ సమావేశ సమయంలో. వహీద్ గారికి మరోమారు ధన్యవాదాలు తెలిపాము.

నిర్మల్ పట్టణం నిర్మల్ చిత్రాలకు, కొయ్య బొమ్మలకూ ప్రసిద్ధి. నిర్మల్ 1) paintings, 2) toys గురించిన సమాచారానికై ఇక్కడ చూడండి. నిర్మల్ ప్రధాన రహదారిలో society వారి showroom ఉన్నప్పటికీ మాకు వ్యవధి లేనందువలన సందర్శించ లేక పోయాము. తృప్తి చెందిన హృదయాలతో, నిర్మల్ కు వీడ్కోలు చెప్పి, మధ్యాహ్నం 1.30 గంటల బస్ లో హైదరాబాదు కు బయలు దేరి మా మా నెలవులకు చేరుకున్నాము. ప్రియమైన పాఠకులారా, ఈ వ్యాసం మీకు కూడా తృప్తి కలిగించగలదని ఆశిస్తూ -సెలవు.

4 వ్యాఖ్యలు:

ప్రవీణ్ గార్లపాటి చెప్పారు...

wild life మీద ఎంతో ఆసక్తి ఉన్నా తీరిక కుదరక, బద్ధకం తోనూ ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వస్తుంది. ఇక లాభం లేదు. నడుం బిగించి నేను కూడా ప్లాన్స్ వెయ్యాల్సిందే. బాగున్నాయి మీ అనుభవాలు.

radhika చెప్పారు...

కధనం తో చాలా భయపెట్టారండి.నిజం గా పులి,కొండచిలువ గురించి చాలా భయపడ్డాను.

Dr.Ismail చెప్పారు...

నిజం చెప్పుద్దూ...ఎవరీ నక్సలైట్? కొంపదీసి రామకృష్ణ కాదు కదా:-) అని అనుకొన్నా ఆ ఫోటో చూడగానే! నేనూ అక్కడ ఉండి ఉంటే మీతో తప్పక వచ్చి ఉండేవాన్ని. మీ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రావు గారూ...ఇలాగే మాకు మంచి వ్యాసాలు అందిస్తూ ఉండండి.

Nagaraja చెప్పారు...

థాంక్స్ గురువు గారూ...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి