బుధవారం, సెప్టెంబర్ 19, 2007

సాహితీ వనం -2



సాహితీ వనం ప్రశ్నలకు సమాధానాలు పంపిన మీ అందరికీ ధన్యవాదాలు. యువతరాన్ని ఉద్దేసించిన ఈ ప్రశ్నలు కఠినమేమోనని తొలుత సందేహ పడినాను.అడగగానే టక టక చెప్పిన మీకు అభినందనలు.కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనే పాట సొషలిస్ట్ భావజాలంతో నిండి వుండటం వలన రచయిత పేరు చెప్పటం కష్టమే. ఈ పాట ఔచిత్యాన్ని, ఇందులోని భావ గంభీరతనూ వివరిస్తూ కొన్ని వ్యాసాలు ప్రకటితమయాయి గతంలో. ఈ పాట పై ఈ మాట లో వ్యాసం చదివిన గుర్తు. మీకు లింక్ తెలిస్తే పంపండి. ఈ పాట పై మీకు తెలిసిన ఇతర వ్యాసాల లింకులు కూడా పంపండి. మిగతా ప్రశ్నలకు సంబంధించి, మీకు తెలిసిన విషయాలను కూడా పంపండి. సినీవాలి పై గతంలో DTLCgroup లో చర్చ జరిగింది. ఈ పదానికి ఒకటి కంటే ఎక్కువే అర్థాలు ఉన్నాయి.

ఇంతకీ శ్రీ శ్రీ గారు "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" ఏ పుస్తకం లొ రాశారు? అన్న RSG ప్రశ్నకు ప్రస్తుతానికి అది ఏ పాటలో భాగమో చెపుతాను. పుస్తకం పేరు చెప్పేస్తె రచయిత పేరు మీరు ఇట్టే కనుక్కుంటారు.

చక్రవర్తి అశోకుదెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు

కాళిదాస మహాకవీంద్రుని
కవనవాహినిలో కరంగిన
ఉజ్జయినీ నేడెక్కడమ్మా?
ఉంది: చూపించు

షాజహాన్ అంతఃపురంలో
షట్పదీ శింజాన మెక్కడ
ఝాన్సీ లక్ష్మీదేవి యెక్కిన
సైంధవం నేడేది తల్లీ

సరైన సమాధానాలతో ఇంకో జాబు రాస్తాను.ఈ ప్రశ్నలు సాహిత్యంలోని గతవైభవాన్ని ఒక సారి గుర్తుకు తేగలవని ఆశ.

గత వ్యాసానికి ముఖ చిత్రంగా వేసిన పుస్తకం పేరు అడవిగాచిన వెన్నెల -ఈ పుస్తకానికి మాత్రుక జంగ్ చాంగ్ రాసిన Wild Swans. ఇది కోటి కాపీలు పైగానే అమ్ముడైన పుస్తకం. 30 భాషలలో అనువదించబడింది. చైనాలో నిషెదించబడినది. చైనా సాంస్కృతిక ఉద్యమంలో కష్టాలు పాలయిన మూడు తరాల స్త్రీల వెతలే ఈ పుస్తకం.జంగ్ చాంగ్ కుటుంబ స్వీయ చరిత్ర ఇది.రచయిత్రి, తన, అమ్మ, అమ్మమ్మ ల కథ చెప్తుందీ పుస్తకంలో. 1992 లో NCR Book Award ఇంకా 1994 లో British Book of the Year బహుమతులు వచ్చాయి. చిత్ర రూపంలో రావటానికి ప్రస్తుతం పని జరుగుతున్నది. రచయిత్రి ప్రస్తుత నివాసం బ్రిటన్ దేశం అని విన్నాను. ఈ మధ్యనే విడుదలయిన ఈ పుస్తకం హైదరాబాదు లోని ప్రముఖ పుస్తకాల షాపులలో లభ్యమవుతుంది. కొత్త, పాత పుస్తకాలను పరిచయం చేయటం సాహితీ వనం లక్ష్యాలలో ఒకటి. ఆ ఉద్దేశం తోనే సాహితీ వనం వ్యాసానికి ఈ పుస్తకాన్ని ముఖ చిత్రంగా వేయటం జరిగింది.

ఈ వ్యాసానికి ముఖచిత్రంగా వస్తున్నది సంజీవదేవ్ గురించిన పుస్తకం. పారుపల్లి కవికుమార్ సంకలనం ఇది. పలువురు మేధావులు సంజీవదేవ్ జీవితం, రచనల గురించి చేసిన విశ్లేషణ పుస్తకం ఇది.మరిన్ని వివరాలకు చూడండి

http://www.bitingsparrow.com/sanjivadev/sanjivatelu2.htm

ఈ పుస్తకం కూడా హైదరాబాదు లోని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుంది.

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

సంజీవదేవ్ అంటే విశ్వవిజ్ఞానదర్శిని అనే పుస్తకం వ్రాసింది ఈయనేనా?..చిన్నప్పుడు నేను తెగ నమిలిన పుస్తకాలలో అది ఒకటి.

cbrao చెప్పారు...

తెలుగు విజ్ఞాన సర్వస్వానికి పని చేసిన సంపాదకులలో సంజీవదేవ్ ఒకరు.

C. Narayana Rao చెప్పారు...

"విశ్వ విజ్ఞాన దర్శిని" రాసిన వారు 'జొన్న నరేంద్రదేవ్ '.
పై వ్యాసంలో చెప్పబడినవారు 'సూర్యదేవర సంజీవదేవ్ '.

Unknown చెప్పారు...

నారాయణరావు గారూ నెనర్లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి