శాన్ హోజేపురంలో రచయితలతో
ఎడమనుంచి కుడి వైపు శ్రీయుతులు cbrao, మాగంటి వంశి, అబ్రకదబ్ర మరియు గొర్తి సాయి బ్రహ్మానందం Photo: cbrao
డిసంబర్ 7, 2008 న శాన్ హొజేపురం (San Jose, CA) లో కొందరు తెలుగు బ్లాగరులు, రచయితలతో కలిసే అవకాశం కలిగింది. నేను ఇక్కడకు (San Jose) రాగానే మాగంటి వంశీ మోహన్, అబ్రకదబ్రా గార్లను సంప్రదించటం జరిగింది. వారిద్దరూ పని ఒత్తిడి వలన వెంటనే కలుసుకోనప్పటికీ, టెలిఫోన్, చాట్ ద్వారా ఎప్పుడూ సంపర్కం లో ఉన్నారు. ఎట్టకేలకు, ముందుగా అనుకున్న మేరకు ఈ రోజున మాగంటి వంశీ, అబ్రకదబ్రా నేను ఉంటున్న ఇంటికి రావటం జరిగింది. అనుకోకుండా మరో అతిధి సాయి బ్రహ్మానందం గొర్తి, వంశీ ఆహ్వానం పై వచ్చి సమావేశ శోభను పెంచారు.
తెలుగు బ్లాగర్లకు మాగంటి వంశీ మోహన్, అబ్రకదబ్రా పరిచితులే. బ్రహ్మానందం గారికి ఒక బ్లాగు ఉన్నప్పటికీ దాని వివరాలు మన బ్లాగర్లకు అంతగా తెలియదు. కాని ఈ మాట, నవతరంగం వగైరా అంతర్జాల పత్రికలు చదివే వారికి, వీరు సుపరిచితమే. తెలుగు బ్లాగ్లోకం లో కొత్తగా వచ్చినవారి సౌలభ్యం కోసం వీరందరి పరిచయం చేస్తాను.
ఆంధ్రుల సాహితీ రచనలు, కళా రూపాలు, శతకాలు, ముఖా-ముఖీ సమావేశాలు, ప్రముఖుల వ్యాసాలు, వీనుల విందు చేసే కర్ణాటక సంగీతం, భక్తి గీతాలు, లలిత సంగీతం, పాత తెలుగు సినిమాల పాటలు ఇలాంటి, ఎన్నొ ప్రక్రియలను మనము మాగంటి వంశీ గారు రూపొందించిన మాగంటి.ఆర్గ్ వెబ్ సైట్ లో చూడవచ్చు, వినవచ్చు. ఆంధ్రదేశానికి సంబంధించిన పలు ఉపయుక్త విషయాలున్నవిందులో. ఇంకా పిల్లలకోసం కూడా ఒక వర్గముందండోయ్. కొవ్వలి శ్రావ్య వరాళి కొరియా యాత్ర, కువాయిట్ సుధీష్ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు వగైరా వ్యాసాలు కూడా ఉన్నాయి. సమాచారాన్నంతా ఎంతో శ్రమకోర్చి ఏర్చి-కూర్చి మనకు అందిస్తున్న వంశీ అభినందనీయులు.
ఈ రోజు సమావేశానికొచ్చిన మరో తెలుగాభిమాని అబ్రకదబ్రా మన తెలుగు బ్లాగుల పాఠకులకు పరిచితులే. వీరి బ్లాగు పేరు తెలు-గోడు . వీరు రాసిన మద్య తరగతి మహిళ, పేరు గొప్ప విజయం, శ్రీ ఏసుక్రీస్తుడు, సిటిజెన్ కేన్, బెర్ముడా రహస్యం, కలాపోసన - 1 ,2, 3 వగైరా వ్యాసాలు బహు ప్రాచుర్యం పొందాయి.
ఈ రోజు సమావేశానికొచ్చిన మూడవ అతిధి సాయి బ్రహ్మానందం గొర్తి. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, సాహిత్యం, నాటక రంగాలలో లో కృషి చేస్తున్నారు. వీణ వాయిస్తారు, కథలు, కవితలు ఇంకా సినిమా సమీక్షలు చేస్తుంటారు. బొమ్మలు గీయటం, ఫొటోగ్రఫీలపై అభిరుచి ఉంది. సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాల పై అమెరికా లో అధ్యయనం చేశారు.కొన్ని అంతర్జాల పత్రికలతో అనుబంధం ఇంకా కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు నిర్వహణలో ముఖ్య పాత్ర. మిత్రుల సహకారంతో కాలిఫోర్నియా రచయితల తెలుగు కథల సమాహారం వెన్నెల్లో హరివిల్లు అనే కథా సంపుటి ప్రచురించారు.
వంశీ మాట్లాడుతూ తమ శాక్రిమెంటో ప్రాంతంలో గతంలో పిల్లలకు తెలుగు చెప్పే వారు ఉండేవారని, ప్రస్తుతం లేరని చెప్పారు. ఇది విచారకరమైన విషయం. తెలుగు భాషను నిలబెట్టే, బోధన సౌకర్యం, రాష్ట్ర రాజధాని నగరంలో లేకపోవటం విచారకరం. వెబ్సైట్ నిర్వహణలో సమయం ఎక్కువ కేటాయించ వలసిన అవసరం వుండటం వలన, తన తెలుగు బ్లాగు లో కొత్తవి రాయలేకపోతున్నానని తెలిపారు. ఈ సమావేశానికి బ్రహ్మానందం గారిని తనే ఆహ్వానించారు కాని వారిని మా ఇంటే ప్రధమంగా చూడటం అని తెలియటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అబ్రకదబ్రాకు కూడా ఇదే తొలిసారి ఈ ప్రాంతపు రచయితలను కలవటం.
బ్రహ్మానందం గారు తాము 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు సందర్భంగా ప్రచురించిన కథా సంపుటి " వెన్నెల్లో హరివిల్లు" కథా సంపుటాల్ని సమావేశానికి హాజరైనవారికి అందచేశారు. అబ్రకదబ్రా సమావేశానికొస్తూ "Speeches That Changed the World" అనే విషయ ప్రాధాన్యత గల అందమైన బౌండ్ పుస్తకాన్ని, నాకు కానుకగా ఇచ్చారు. ఎందరో మహనీయుల కథలు, సూక్తుల తో ఉందీ గ్రంధం. ఈ పుస్తకాన్ని మరోసారి విపులంగా పరిచయం చేస్తాను.
బ్రహ్మానందం గారిని మీరు తెలుగులో బ్లాగు ప్రారంభించకూడదా అన్న ప్రశ్నకు బదులిస్తూ, తమకు తెలుగుబ్లాగు (http://www.sahitinandam.com/blog/?page_id=4) ఉందన్నారు. ఇది కూడలి లోకి ఎక్కినట్లుగా లేదు. తెలుగు బ్లాగు పాఠకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదు. కూడలి వారిని తమ జాబితాలో ఈ బ్లాగును చేర్చవలసినదిగా కోరుతాను. బ్రహ్మానందం గారు ఈ మాటలో రాస్తున్న మనకు తెలియని మన త్యాగరాజు కొరకు తంజావూరు ఇంకా అక్కడి సమీప ప్రాంతాలకు వెళ్లి,త్యాగరాజు పై పెక్కు పరిశోధనలు గావించిన పిదప, ఈ వ్యాసాలు వెలువరిస్తున్నానని తెలిపారు. నాటక రంగంతో తమకున్న అనుబంధం గురించి చెప్పారు. వీరి రచనలు ఈ మాట, కౌముది, నవతరంగం ఇంకా ఆంధ్రభూమి పత్రికలలో చూడవచ్చు. బ్రహ్మానందం గారి రచనలు గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాయవలసిఉంటుంది.
చలం రచనల ఉధృతిలో సౌరిస్ రచనలు ఆంధ్రదేశం పెద్దగా పట్టించుకోలేదు. అదే పద్ధతిలో, బ్రహ్మానందంగారి కబుర్ల ప్రభావంలో అబ్రకదబ్రా కు పెద్దగా మాట్లాడే అవకాశం కలుగలేదు. మరోసారి వీరితో సమావేశమవ్వాలి. సమావేశం ముగిసాక కారు పార్కింగ్ లో బ్రహ్మానందంగారితో మాట్లాడే సమయంలో వచ్చారు ద్వాదశి అమర్. వీరు Media Communication ఇంకా అంతర్జాతీయ వ్యాపారం పై రెండు మాస్టర్స్ డిగ్రీల కోర్సులు చేశారు. జై చిరంజీవ, దేవదాసు చిత్రాల అమెరికా షూటింగ్ లో చక్కటి లొకేషన్స్ అన్వేషించటంలో, స్థానిక వ్యక్తులతో సంప్రదింపులు విషయంలో, ఆయా చిత్రాల దర్శక నిర్మాతలకు సహకరించి ఉన్నారు. సంభాషణ కొంతసేపు చిత్రాలపై మళ్లింది. అమర్ కు తెలుగు బ్లాగుల గురించి వివరించి ఉన్నాను, నా ఉత్తరాల ద్వారా. తను తెలుగు బ్లాగులు చదువుతానని, త్వరలో వ్యాఖ్యానాలతో తెలుగులో ప్రవేశం చేస్తానని, చెప్పారు. అమర్ కు చలన చిత్రాలపై అభిమానం మెండుగా ఉంది. తెలుగు, అంతర్జాతీయ చిత్రాల పై తనదైన ఫక్కీలో వ్యాసాలు రాస్తాడని ఆశిద్దాం.
ఇది శీతాకాలమవటంతో పగళ్లు పొట్టిగా రాత్రులు దీర్ఘంగా ఉంటున్నవిక్కడ. వేసవి లో రాత్రి 9 గంటలదాకా ఉండే సూర్యుడు సాయంకాలం 5 గంటల ప్రాంతానికే అస్తమిస్తున్నాడు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొందులకై, శీతాకాలం వస్తూనే గడియారం ఒక గంట వెనక్కు తిప్పుతారు. చలి ముదురుతూంది కావున కబుర్లు చాలించి, వీడ్కోలు తీసుకొన్నాము.
11 కామెంట్‌లు:
rAvu gAru
haidaraabAdulO veelukAkapOyinA, mimmalni ikkaDa kalusukOgaliginanduku aanandam. alAgE anil gArini kalusukOvaDam, brahmAnandam gAriki phOn ceyyagAnE aayanaku aa rOju veelukAvaTam kooDA santOshakaramyina vishayam. mee andaritO marinta samayam veccincalEkapOyinanduku kshamincAli.
janavarilO renDava aadivAram anukunTunna blAgarla samAvESa vEdika ekkaDO veelunnappuDu teliyaparcanDi. tappaka vastAnu.
dhanyavAdAlu
vamSI
మీ అందర్నీ కలవడం చాలా సంతోషం. వంశీ గారి వల్లే నే రాగలిగాను. కొత్త గాలీ, కొత్త పరిచయాలూ ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటాయి.
రావు గారూ, మీరు నా గురించి చెప్పినంత సీను నీకు లేదు. ఏవో కాలక్షేపం రాతలంతే!
సాయి బ్రహ్మానందం
బ్రహ్మానందం గారు "ఏదో కాలక్షేపం రాతలంతే" అన్న మాటలు పచ్చి కోతలు. ఏదో వినమ్రతతో అలా అంటున్నారు కానీ ఆయన - భాస్కరరావు గారు చెప్పినట్లు - బహుముఖ ప్రజ్ఞాశాలి. నేను ఇలా కితాబు ఇచ్చేసేనని ఆయన పేట్రేగి పోకుండా ఉంటే ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. భాస్కరరావు గారి పరిచయం అవటం మా అందరి అదృష్టం.
మీ కబుర్లు, కొన్ని విశేషాలు తెలిసాయి. సంతోషం.
ఏదో విషయంలో మాగంటి వారు, బ్రహ్మానందం గారు ఒకరి జుట్టు ఒకరు పట్టు కున్నారని విన్నాను. నిజమేనా?? (కాపీ కొట్టే ఆవకాశం కల్పించిన బాపు గారికి thanks)
రావుగారూ,
ఇలా అమెరికా వెళ్ళి అందరినీ కలిసి, వాళ్ళను కలిపి మంచి పని చేసారు. పైగా విలువైన ఫోటో కూడా పెట్టారు. మీరు అభినందనీయులు!
మా జుట్టెవరికీ అందకుండా జాగ్రత్త పడుతున్నామంతే!
"చెప్పు"డు మాటల్ని పాదాలకింద నలిపేయాలి. తలకంటించుకో కూడదు. :)-
"సిలికాన్ వ్యాలీలో కొందరు రచయితల సమావేశం"!!
ఫేద్ధ అప్పుతచ్చు. నేను రచైతను కాను :-)
పెద్దలందరినీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని ఆశిస్తూ...భవదీయుడు.
ఫొటోలో మీ ఇద్దరికీ జుత్తు కొంచెం తక్కువగా ఉందని కృష్ణారావు గారు వ్యాఖ్యానిస్తున్నారనుకుంటాను. ఉత్ప్రేక్షాలంకారమేమో? ఉన్న జుత్తుకే సంరక్షణ చెయ్యలేక తీయించేసిన వాళ్ళని చూసి ఆయన ఏమంటారో కనుక్కోవాలి!
@కృష్ణారావు: "ఏదో విషయంలో మాగంటి వారు, బ్రహ్మానందం గారు ఒకరి జుట్టు ఒకరు పట్టు కున్నారని విన్నాను. నిజమేనా?? "
-భలేవారండీ మీరు. ఛాయాచిత్రం మరో సారి చూడండి. మాగంటి, బ్రహ్మానందం గార్లది జుట్టుతల అంటారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి