శనివారం, డిసెంబర్ 13, 2008

బ్లాగులు సమస్యలను పరిష్కరిస్తాయా?



లాస్ ఏంజెల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే దారిలో రమణీయ ప్రాంతం Big Sur సమీపంలో Rainbow Bridge Photo: cbrao

తమ బ్లాగు Hindu Charities లో శ్రీనివాస్ అడుగుతున్నారు "Can Blogging solve real world problems and provide solutions to Millions of poor and illiterates?"

ఇది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే. ఈ రచనల ద్వారా రచయితలు ప్రపంచగతిని మార్చగలుగు తున్నారా? శ్రీనివాస్ అడిగిన ప్రశ్న, రచన ప్రయోజనం నెరవేరుతుందా అని? అచ్చు లో వచ్చే రచనలు బదులుగా, ఆధునిక శాస్త్ర విజ్ఞాన సహాయం తో, బ్లాగరులు తమ రచనలు బ్లాగులో ప్రచురించి, వాటిని తక్షణం పాఠకులకు అందచేస్తున్నారు. అచ్చు రచన పాఠకుడికి చేరాలంటే ప్రచురణ అయ్యేదాకా ఆగాల్సిందే. బ్లాగులో multimedia సహాయం తో, బ్లాగరు వీడియో లాంటి ప్రక్రియలను కూడా తన బ్లాగులో పెట్టి పాఠకులను రంజింప చేస్తున్నాడు. పాఠకుడికి ఇది కొత్త అనుభవాన్నిస్తుంది. ఉదాహరణకు Youtube ద్వారా ఎన్నో పాత, కొత్త తెలుగు పాటలు, వినోదాత్మక వ్యంగకార్యక్రమాలు మనకు అందచేస్తున్నారు బ్లాగరులు. ఆర్థిక,ఆరోగ్య, ఆధ్యాత్మిక,సంగీత, ఛాయా చిత్ర, చిత్ర లేఖనం, హాస్య, రాజకీయ, వార్తలు,ప్రజా సమస్యలు వగైరా విషయాలపై, ఎంతో విలువైన సమచారాన్ని పాఠకులు బ్లాగులు ద్వారా కంప్యూటర్ ఉన్న ప్రతి ఇంటిలో పొందగలుగుతున్నారు. ఇది సమాచార విప్లవమే. పత్రికలు ముద్రించటానికి వెనకడుగు వేసిన రచనలు బ్లాగు లేక పోతే, వెలుగులోకి వచ్చేవి కావు. అందులోని సమచారం కొన్నిసార్లు ఆసక్తికరంగా మారి, బ్లాగు నుంచి పత్రికకు వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. లక్షలాది ప్రజల ఈతి బాధలను బ్లాగింగ్ తక్షణం తీర్చలేదు కాని, సమస్యను అర్ధం చేసుకోవటానికి బ్లాగింగ్ నిస్సందేహంగా ఉపయోగ పడుతుంది.

ఒక ఊహ, ప్రతిపాదన జీవన గతినే మార్చివెయ్యగలదు. సిద్ధాంతంలోంచే కదా విప్లవం వచ్చేది. కార్ల్ మార్క్స్ మార్క్సిజం అనే సిద్ధాంత ప్రతిపాదన చెయ్యక పోతె, రష్యా లో ఇంత విప్లవ మొచ్చేదా? జూలియస్ వెర్న్ రాసిన నవలల ఆధారంగా శాస్త్రజ్ఞులు సరికొత్తగా ఆలోచించి, నూతన ప్రయోగాలకు ఆవిష్కారం చేయలేదా?

ముంబాయి సహాయం అనే బ్లాగు లో వచ్చిన వ్యాసాలు, అందులో స్పృశించిన విషయాలు, ప్రజాబాహుళ్యానికి, విపత్కర పరిస్థితులైన, ముంబాయి పై ఆటంకవాదుల ముట్టడి, వరదలు సమయాలలో, ఎంతగానో ఉపయోగపడిన విషయం మీకు తెలుసు.నేడు బ్లాగరులు పలు సమస్యలపై తమ దృష్టి సారించి, తమదైన పరిష్కారం చూపిస్తున్నారు. సమస్యలను, వాటి పరిష్కారాలను, కొత్తగా ప్రభుత్వం కూడా గమనిస్తుంది. అయితే ఇది ఇంకా ప్రాధమిక స్థాయిలోనే ఉంది. ప్రభుత్వం, పత్రికలను గమనించినట్లుగా,భవిష్యత్లో, బ్లాగులలో వస్తున్న విషయాలను గంభీరంగా పరిశీలించే అవకాశముంది. ప్రజల సమస్యలకు బ్లాగింగ్ ద్వారా పరిష్కారం లభించగలదని ఆశిద్దాం.సమాజం, శాస్త్రం ముందుకు పోవాలంటే నూతన సిద్ధాంతాలు రావాలి. మేధో మధనం తోనే ఇవి ఉద్భవిస్తాయి. బ్లాగింగ్ అందుకు తోడ్పడగలదు.

16 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

గ్రహస్థిత రాశిని ముప్ఫై భాగాలు చేసి , ఐదు చేత భాగించగా వచ్చిన ఆరారు భాగలకు ఒక్కొక్క అవస్థ ఏర్పడితే , అందులో దీప్తుడు, స్వస్థుడు, ముదితుడు, శంతుడు, శక్తుడు, పీడితుడు, భీతుడు, వికలుడు, చపలుడు, దుఃఖితుడు అని ఆ గ్రహం యొక్క అవస్థలు పదివిధాలుగా ఉంటాయట.

మరి ఈ సమస్యలకి, ఆ అవస్థలకి పరిష్కారం బ్లాగులేనా? .. :)..

ఏమో ఉచ్చక్షేత్రం అయితే దీప్తుడు, స్వక్షేత్రం అయితే స్వస్థుడు, మిత్రక్షేత్రం అయితే ముదితుడు, శుభవర్గం అయితే శాంతుడు, మిత్రక్షేత్రంలో మిత్రత్వం ఉంటే శక్తుడు. పాపక్షేత్రంలో పాపగ్రహంతో ఉంటే వికలుడు. ప్రబల గ్రహంతో యుద్ధంలో జయింపబడితే పీడితుడు. పాపసమబంధం ఉంటే చపలుడు. నీచ స్థానంలో ఉంటే భీతుడు. సతృక్షేత్రంలో ఉంటే దుఃఖితుడు - వీళ్లంతా మన బ్లాగ్లోకంలో రకాలు అని గోపాలరత్నాకరమతం చెపుతోంది....

మరి సమస్యలంటారా ? ...:)...ఇంతే సంగతులు చిత్తగించవలెను...

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

" బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే."

బ్లాగులు అందుకు మాత్రమే కాదండి... బ్లాగులని అందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు.. మీరు చెప్పిన అభిప్రాయం ఒకవేళ తెలుగు బ్లాగు ప్రపంచంలో ప్రాచుర్యం పొంది ఉంటే, లేకపోతే ప్రాచుర్యం పొందితే అది తెలుగులో బ్లాగు రాయాలి అనుకునే వాళ్ళని నిరుత్సాహపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే బ్లాగు రాసే ప్రతీ ఒక్కడు కథో,వ్యాసమో,నవలో,కవితో రాయకపోతే బ్లాగు చదవరనే అభిప్రాయం కొత్తవాళ్ళల్లో కలిగించినవారం అవుతాము. కాబట్టి బ్లాగు కూడలిలలో మనం ఇలాంటి అభిప్రాయాలకి ప్రాచుర్యం కలిగించడం ఎంతమాత్రం మంచిది కాదు. బ్లాగుల ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణ. అంతే!

మన తెలుగు బ్లాగులని గమనిస్తే తెలుగు బ్లాగు కేవలం కథలో,కవితలో,నవలల కోసమో అన్నట్టు వాతావరణం ఉంది. ఇదే కనుక కొనసాగితే మనం ఎక్కువమంది చేత తెలుగు బ్లాగులు రాయించలేము. ఆకర్షించలేము.

Rajendra Devarapalli చెప్పారు...

వంశీ :)
దిలీప్ గారు,నిజమే మీరన్నట్టు బ్లాగులు ప్రాచుర్యం పొందినంతగా బ్లాగులకు ఒక సిద్ధాంత,తాత్వికతను రూపొందించే ప్రయత్నాలు జరగలేదు

యోగి చెప్పారు...

"ఇది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే. "

Its not a million dollar question at all. It is nonsensical. If only bloggers could change India, India would have been a different place by now. There are zillions of blogs out there and millions of India related blogs, so what change we have seen so far?

Telugu bloggers and telugu blogging is in its infancy. Instead of forming groups and celebrating each others ignorance mindlessly, instead of counting the number of comments, instead of making claims of a change in society with a random silly writing, we must concentrate on what blogs are intended for. *Express a unique view*

Blog is this, more people has a platform to stage their views, the number of voices increase, and this will eventually raise the bar. People will have access to all kinds of opinions, and they will choose what they want.

I have been observing Telugu Bloggers closely, and it looks like they are in infancy(I m one of them)

Unknown చెప్పారు...

బ్లాగుల్లో ఊహలు, కవితలు, అనుభవాలు, కథలు మొదలైనవి ఎవరైనా వ్యక్తిగతంగా రాసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. వాటిల్లోని మంచినీ గ్రహించ వచ్చు. దీనిలో ఏ సమస్యా లేదు.

సామాజిక విషయాలమీద రాసే బ్లాగులలో ఏదో ఉన్న వ్యవస్థ మీద ఓ రెండు రాళ్ళు మనం కూడా వేసి తృప్తి పడే పరిస్థితే ఎక్కువగా కనపడుతుంది. కొద్ది మంది బ్లాగర్లు సామాజికంగా నిర్మాణాత్మకమైన రచనలు చేస్తున్నారు, చదివే వాళ్ళు చదువుతున్నారు. బ్లాగులనబడే ఈ కలగూరగంపలో వీటిని ప్రత్యేకించి వెతుక్కోవడం ఒక పని. ఒకే సమస్యమీద చాలామంది ఇంచుమించు ఒకే రకమైన అభిప్రాయాలు రాయడం ఇదంతా ఆ విషయాలను చదివే వారికి విసుగు జనించే అవకాశం ఉంది.

ఇకపోతే సామాజిక విషయాలను రాసే బ్లాగు ప్రదేశం వ్యక్తిగతం కావడం వలన రాసే విషయాల్లో కన్సిస్టెన్సీ, కంటిన్యుటీ లేకపోవడం జరుగుతుంది. దానితో నిర్మాణాత్మకమైన చర్చగా కాకుండా వ్యక్తిగత సిద్దాంతాలుగా బ్లాగులు పరిణమిస్తున్నాయి. దీని వలన నిజంగా సమాజానికి మేలు జరుగదు. తలా ఇంత కన్ఫ్యూజన్ని కల్పించడమే అవుతుంది.

కాబట్టి సామాజిక విషయాల మీద ఇలా వ్యక్తిగతంగా రాయడం కాకుండా ఒక నిర్దేశిత విషయం గురించి అందరూ దానికి నిర్దేశీంచబడిన సైటులో తమతమ వాదాల్ని రాస్తూ పోతే మంచిది. ఆ విషయం సంపూర్ణంగా కంక్లూడ్ అయ్యేదాకా చర్చ జరుగుతూనే ఉండాలి. చర్చ జరిపే వారి పేర్లు చర్చ క్రింద ప్రచురిస్తూనే ఉండవచ్చు. కామెంట్లు కూడా రాస్తూనే ఉండవచ్చు. అంటే అలాంటి వేదికలలాంటి పోర్టళ్ళు సైట్లు ఉండాలి. దానిలోని చర్చ అగ్రిగేటర్లలో కూడా కనపడుతుండాలి.

ఈ విధంగా అందరూ ఒకే నిర్దేశిత విషయం మీద కేద్రీకరించి ఒకేచోట రాస్తూ పోతే తప్పకుండా సమాజానికుపయోగ పడే భావజాలం, సిద్దాంత నిర్మాణం జరుగుతుంది. ఇదివరకటి కాగితపు, ప్రచురణ మాధ్యమం మీద ఐ.టి. వలన నిజమైన వాల్యూ అడిషన్ అప్పుడే లభిస్తుంది.

krishna rao jallipalli చెప్పారు...

ఎందుకు పరిష్కరించవు?? సలహాల ద్వారా, సహాయం ద్వారా ఇంకా అనేక రకాలుగా పరిష్కరించు కోవచ్చు. కాకపొతే బ్లాగులు ప్రాచుర్యం లోకి రావాలంటే ఇంకా కొంత సమయం పట్టుతుంది.

Anil Dasari చెప్పారు...

బ్లాగులు దేశాన్నుద్ధరించటానికి లేవు. ఎవరి భావాలు వారు వ్యక్తం చేసుకోటానికే ఉన్నాయి. పన్లో పనిగా దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్ధరిస్తే మంచిదే. అలనాడు చక్రపాణి సినిమాల్లో సందేశాలివ్వటం గురించి ఓ మాటన్నాడు, 'సందేశమివ్వటానికి సినిమా తియ్యటం ఎందుకూ, టెలిగ్రాం ఇస్తే సరిపోతుందిగా'. బ్లాగులూ అంతే.

అజ్ఞాత చెప్పారు...

యోగి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
ఎక్కువ శాతం తెలుగు బ్లాగర్లకు ఇంటర్నెట్ డైనమిక్స్ మీద, కేరెక్టర్ మీద అవగాహన ఉన్నట్లు కనిపించదు. ఏదో గుడిగుడిగుంచం అనుకుంటూ ఒక కురచైన వృత్తంలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
"బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే." అన్న అభిప్రాయంలో బ్లాగర్లు ఉండడం చాలా బాధాకరం.

పి.యెస్. నాకు బ్లాగ్ లేదు.

cbrao చెప్పారు...

@ వంశి: !!!

@ ఏకాంతపు దిలీప్ : "బ్లాగుల ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణ. అంతే!"
ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణే. సందేహం లేదు. బ్లాగుని ఇతర ప్రయోజనాలకూ వాడటం వాడుకలో ఉన్న విషయాన్ని విస్మరించలేము.

@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి : బ్లాగులను ఇలాగే రాయాలన్న చట్రం లో ఇరికించటం అభిలషణీయమా?

cbrao చెప్పారు...

@ యోగి - The outcast: "Blogs are intended for. *Express a unique view*"
అవును బ్లాగులు తొలిగా, వ్యక్తిగత అనుభూతులు వ్యక్తీకరించాయి. ఇప్పుడు అవి రూపాంతరం చెంది, పెక్కు విషయాలను వివరించటం జరుగుతుంది. దీనిని ఆపటం సాధ్యమా? అవసరమా?

cbrao చెప్పారు...

@ యోగి - The outcast: నేను నా వ్యాసం లో వెలిబుచ్చినట్లుగా ముంబాయి సహాయం లాంటి వెబ్సైట్ ల ద్వారా కొంత సామాజిక ప్రయోజనం కలిగిన విషయాన్ని గుర్తిచకుండా ఉండలేము.

@ యన్.సీతారాంరెడ్డి: మీరు కొరుకున్న విధంగా నడపబడుతున్న forums, groups చాలా ఉన్నాయి . Nature conservation, Photography, Wildlife, Ubuntu Forums వగైరా. మరిన్ని విషయాలకై MySpace FORUMS చూడవచ్చు. తెలుగు లో బ్లాగింగ్ ఇంకా పరిణామం చెందుతూ ఉంది. భవిష్యత్ లో తెలుగులో కూడా మరిన్ని ఫోరంస్ వచ్చే అవకాశముంది.

cbrao చెప్పారు...

@ కృష్ణారావు: అవును, మీ అభిప్రాయం సరైనదే. ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దానిని కనుగొనటానికే ఈ అన్వేషణ.

@ అబ్రకదబ్ర: బ్లాగులు సమస్యలకున్న ఇరు పార్శ్వాలను, నిస్పాక్షికంగా పరిశీలిస్తూ తమదైన పరిష్కారాన్ని చూపుతున్నాయి.

cbrao చెప్పారు...

@ అజ్ఞాత: ""బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే." అన్న అభిప్రాయంలో బ్లాగర్లు ఉండడం చాలా బాధాకరం. "

ఇది బ్లాగు గురించిన ఒక పార్శ్వాన్నే స్పృశిస్తుంది. బ్లాగు ఎంతో విస్తరించి,తన పరిధిని ఎప్పటి కప్పుడు పెంచుకూంటుంది. రకరకాల పరిణామాలకు అది లోనవుతుంది. భావ వ్యక్తీకరణ నుంచి, వినోదింపచేసిదిగా, సమాచార దర్శినిగా, సమస్యా పరిష్కార వేదికగా అది ఎన్నో రూపాలు సంతరించుకోంటుంది.

Bhãskar Rãmarãju చెప్పారు...

>>బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే."
ఇది చాలా దారుణం. నేను నలుగురికి ఉపయోగపడాలని ఒక బ్లాగు పెట్టా. http://projectsforfuture.blogspot.com. దానికి వచ్చిన హిట్స్ అతి స్వల్పం. ఎందుకనీ? మన ఆలోచించే విధానం అలా ఉంది. శ్రెయ చీర ఊడదీసింది అని రాస్తే చదవటానికి ఇష్టపడే జనాలు, కులం అంటూ రాసే జనాలు, భజన, ఈ చట్రాల్లో ఇరుక్కుపోయిన ఓ తెలుగుబ్లాగరుకి ఆలోచింపజేసే బ్లాగులు ఎలా కనబడతాయ్?
ఒక బ్లాగు ద్వారా మనం సమాజానికి ఉపయోగపడొచ్చు, తప్పకుండా. జనం చదివారా లేదా? I Dont have to even care. చదివినోడే చదువుతాడు.
"జ్ఞానం అనంతం"

Rajendra Devarapalli చెప్పారు...

రావు గారు,నేను చట్రాలు అన్న పదంవాడలేదు,అలాంటి ఉద్దేశానికి కూడా నేను వ్యతిరేకం,ప్రతి రంగానికి,సాంకేతికాఅవిష్కరణకూ ఒక తాత్వికత ఉన్నట్లే బ్లాగులకూ ఉండాలన్నది నాభావన.సాహిత్యంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి,అలాగే ప్రతి విభాగానికీ ఒక సిద్ధాంతపు చేర్పు ఉంది.తెలుగుబ్లాగులు కూడా క్రమంగా అలాంటి ఒక స్థాయికి చేరాలన్నది నేను ఇంకాస్త విపులంగా చెప్పి ఉండాలని ఇప్పుడు అర్ధమయ్యింది.
@భాస్కర్,చెప్పటానికి తప్ప చెయ్యటానికి నాలాంటి వాళ్ళం ఆసక్తి చూపం,అదీ సంగతి,అర్ధమయ్యిందనుకుంటాను :)

Kathi Mahesh Kumar చెప్పారు...

రావుగారూ,బ్లాగింగ్ ఒక వ్యక్తిగత అభిరుచి.ఆ వ్యక్తిలో సామాజికస్పృహ ఉంటే బ్లాగూ కాస్త ఆ రూపు సంతరించుకుంటుంది.అంతేతప్ప ఆశయాలూ,సామాజిక మార్పు బ్లాగులద్వారా సాధ్యమవుతుందని నేను అనుకోను.సామాజికంగా క్రియాశీలురుగా వున్న వ్యక్తులు తమ ఆశయసాధనలో భాగంగా బ్లాగులు రాస్తే రాయొచ్చు. ఇప్పటికే కొండవీటి సత్యవతి, కొణతం దిలీప్ వంటి వారు ఆ పనిచేస్తున్నారు. మిగతావారు కనీసం కొన్ని సామాజిక విషయాలపై తమ మనసులోని భావాలను బ్లాగుబద్ధం చేస్తున్నారు. ఈ పరిణామంలో కొందరిలో క్రియాశీలత రావచ్చు. అది ఒక అవకాశమేగానీ ఖచ్చితంగా జరగాలని ఆశించలేము, నిర్దేశించలేము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి