ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

విశ్వనాధ వారి పై నార్ల


Narla Venkateswara Rao


నేపధ్యం:
విశ్వనాధవారిపై ప్రచురించిన వ్యాసాలు చదివి పాఠకులు పెక్కు ఉత్తరాలు రాశారు. రాస్తున్నారు. ఇంతవరకూ వచ్చిన ఉత్తరాలు విశ్వనాధవారి పలు పార్శ్వాలను స్పృశిస్తే భైరవభట్ల కామేశ్వర రావు గారి ఉత్తరం అసలు విశ్వనాధవారి తత్వమేమిటని ప్రశ్నించింది. ఇప్పటివరకూ అందిన ఉత్తరాలలో ఇదే ఉత్తమ జాబుగా తలుస్తున్నాను. ఆ ప్రశ్న దానికి జవాబు చదవండి.

భైరవభట్ల కామేశ్వర రావు: "నేనర్థం చేసుకున్నంతలో, విశ్వనాథ భావజాలం మీద వ్యతిరేకత వల్లనే ఇంత తీవ్ర విమర్శ వస్తోంది. అయితే, విశ్వనాథ భావజాలం ఏమిటి? "

- "పూర్వజన్మ సుకృతము వలెనే ఒకడు బ్రాహ్మణుడిగా, పాపఫలమున మరియొకడు అంటరానివాడుగా జన్మించునని, విశ్వనాధ రచనల సారాంశం. తపస్సు చేసినాడనే కారణంగా జరిగిన శంబూక వధను సమర్ధించే రామాయణ కాలం నాటి విధానాలు విశ్వనాధ వారికి ప్రీతిపాత్రం. వేదకాలం నాటి వ్యవస్థను ఆదర్శ ప్రాయమైన సాంఘిక వ్యవస్థ గా తలుస్తారు. స్త్రీ పురుషుల, వివిధ వర్ణాల మధ్య సాంఘిక అసమానతలను ప్రోత్సహించే మనుధర్మ శాస్త్రం విశ్వనాధవారికి శిరోధార్యం. " అని విశ్వనాధ విమర్శకులు అభిప్రాయపడతారు.

ఈ రోజు విశ్వనాధ వారి పై నార్ల వెంకటేశ్వర రావు గారి అభిప్రాయం తెలుసుకుందాము. నార్ల వారు జగమెరిన పత్రికా సంపాదకులు. 1970 లలో హైదరాబాద్ లో మిత్రులు నరిశెట్టి ఇన్నయ్య, వెనిగళ్ళ వెంకటరత్నం కలసి నెలకు ఒక సమావేశం అనే ఒక పధకం అమలు జరిపారు. ఆ సమావేశాల లోనే నేను నార్లవారిని దగ్గరగా చూడటం జరిగింది. ఒక పర్యాయము ఇన్నయ్యగారి తో కలిసి, road no:7, బంజారా హిల్స్ లోని నార్ల వారింటికి వెళ్లి, నార్ల వారిని వారింట్లో (Lumbini) కలిశాను. వారి ఇంట ప్రతి గది ఒక గ్రంధాలయమే. కారు గారేజ్ లో కూడా ట్రంక్ పెట్టెలలో పుస్తకాలుండెడివి. పుస్తకాలంటే నార్లవారికి అంత ఇష్టం.నార్ల తదనంతరం, ఆ పుస్తకాలు అన్నీ హైదరాబాద్ లోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి నార్ల వారి శ్రీమతి కానుకగా ఇచ్చారు.నార్ల వారి జీవిత విశేషాలు ఈ కింది గొలుసులు లో లభ్యమవుతాయి.
http://naprapamcham.blogspot.com/2008/03/10.html

http://naprapamcham.blogspot.com/2008/03/11.html

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి "వీరవల్లడు" పై నార్ల వారి సమీక్ష చూడండి.

-cbrao


విశ్వనాథ కులతత్వం

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి "వీరవల్లడు" నవ్యరచనే. కథా వస్తువు కొత్తది; కథా చిత్రణ కొత్తది. పాత్ర కల్పనలో, పాత్ర పోషణలో కొత్తదనం కలదు కూడా. ఇక, ఆయన ఉపయోగించిన భాష ఎంత ఉచితమైనదో, అంత ఉత్తమమైనది. మాటమాటలో జాతీయత తొణికిసలాడుతున్నది; వాక్యం వాక్యంలో మన పల్లె – మన పల్లె ప్రజ – కళ్ళకు కట్టినట్టు కానవస్తున్నది. కాని, తాత్కాలికంగా ఎంత అలరించినా, ఈనాడు ప్రతివానికి దానిలో ఏదో కొరత గోచరిస్తున్నది. ఆ కొరత, దానిలో అభ్యుదయం కొరవడ్డమే.

కుల విభేదాలు హిందూ సంఘానికి వేరుపురుగా పరిణమించినవని ఈనాడు ప్రతి విజ్ఞుని నమ్మకం. చాతుర్వర్ణాలు అవసరమని నిన్న మొన్నటివరకు ఉద్ఘాటించినా, నేడు గాంధీజీ సైతం కుల విభేదాలు పూర్తిగా తొలగిపోవాలంటున్నాడు. అవి తొలగనంతవరకూ హిందూ సంఘానికి శక్తిగాని, ముక్తిగాని లేదంటున్నాడు. కుల విభేదాల వినిర్మూలనం హిందూ సంఘాభ్యుదయానికి అత్యవసరమని దీని తాత్పర్యం. కాని, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచన కులవిభేదాల పట్ల విరోధభావాన్ని, జుగుప్స ను కలిగించడానికి బదులుగా వాటిపట్ల ప్రేమాభిమానాల్ని పురికొల్పుతున్నది.

గుణగణాలను బట్టి కాకుండా కేవలం జన్మ వల్లనే ఒకడు భూసురోత్తముడు కావడం, మరొకడు అంటరానివాడు కావడం విపరీతమని ఆ రచన చెప్పడం లేదు సరి గదా, ఆ వైపరీత్యాన్ని సమర్థిస్తున్నది. శ్రీ సత్యనారాయణ విశాల భావాలు గలవారే కావచ్చు. వర్ణ వైషమ్యాలకు ఆయన అతీతుడే కావచ్చు. ఆయన తన కావ్యాలలో ఒకదాన్ని ఒక మిత్రునికి అంకితం చేస్తూ, వర్ణ వైషమ్యమ్ము వాడిపోయినదయ్య అర్ణవ వైశాల్యమైన నీ ఆత్మలో అని వ్రాసిన సంగతి కూడా మాకు తెలియకపోదు. కాని, ఆయన వీరవల్లడు బ్రాహ్మణ, ఛండాల సంబంధ బాంధవ్యాలపై ఒక మధుర గీతం. ఔరా! వీరవల్లడు ఎంత ప్రభుభక్తి పరాయణుడు అనే భావాన్నే అది రేకెత్తిస్తుంది గాని, నీవు ఎద్దుల తలతాళ్ళు పట్టుకో – పరవాలేదులే! ఇంటికి పోయి తలారా స్నానం చేస్తాను అని తను ఏ బ్రాహ్మణ గృహిణి సేవకై ఎన్ని కష్టాలకైనా పాల్పడ్డాడో ఆమె చేతనే అనిపించుకోవలసిన మహాపాపం అతడేమి చేశాడనే ఆగ్రహాన్ని పాఠకునికి కలిగించలేదు. అందువల్లనే అది నవ్య రచనే అయినా, అభ్యుదయ రచన కాదు, కానేరదు.

వీరవల్లడు విషయమై ఇక్కడ మేమింతగా ప్రస్తావించడానికి కారణం అది ఉత్తమమైన నవ్యరచనే అయినప్పటికీ, అభ్యున్నతి మార్గాలకు నిరోధంగా నిలవగల రచనలకు అది ఒక ఉదాహరణ కావడమే.


(- నార్ల రచనలు 5వ సంపుటి, పేజి -13 నుండి)

5 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

రావు గారూ - ఇప్పుడు నేను చేసే కామెంటుతో మీ అద్వితీయమయిన టపాకు సంబంధం లేదు అనే మనవితో మొదలుపెట్టి - మీ విశ్వనాథ టపాల పరంపరతో అసలు పాఠకులకు ఏమి చెపుదామనుకుంటున్నారో , అది ఎంతమందికి ఎక్కిందో తెలియదు కానీ నాకయితే "తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని" తీరులో ఉన్నది అనటంలో హాశ్చర్యమ్హేమీ లేదు. అయితే చలసాని వారు చల్ల తీయటానికి పూనుకున్నా, నార్ల వారు నార తీయటానికి పూనుకున్న విషయాలని మీరు అందరి ముందుకు తీసుకు వచ్చి మహిష బంధనం, తిలకాష్ఠ బంధనం, ఇంకా రెండూ కలిపి ఉన్న బంధనం ప్రయోగించి కొంత మంది బుఱ్ఱలకి, అచేతనా చేతనావస్థలోని భేతాళుడికి ఆహారం సంపాదించుకోవడానికి కలిగే శ్రమ తగ్గిస్తున్నారు. అందుకు మీరు అభినందనీయులు.

The seven seas swelled and the chandrakanta stones trickled.Like a pearl umbrella rose the moon. And flooded the world with his light. Gradually leaving the redness of the rise" అని ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి. ఇక ఆ చంద్రుడెవరో, రక్తవర్ణమేమిటో మీరే చెప్పాలె...

ఇంతే సంగతులు చిత్తగించవలెను..

అదే చేత్తో ముందు మన బే ఏరియా సమావేశపు వివరాలు, చిత్రాలు, పరిచయాలు ఆవాహయామి చేస్తే ప్రసన్నులమవుతాము అని మనవి

అజ్ఞాత చెప్పారు...

There are innocent people who worship the person according to his personal popularity. When I wrote an article in my blog criticising Gandhi as caste sick person, some of the other bloggers scolded me bold facedly. Even Viswanatha Satyanarayana was popular personality and criticisms on him can make some people angered.

అజ్ఞాత చెప్పారు...

రావు గారికి,
మీరు ఈ ఇతరులు రాసిన వ్యాసాలను కాకుండా మీరు రాసినవి ఎమైన విశ్వనథ గారి మీద రాసి ఉంటె ప్రచూరించ గలరు. అదేకాకుండా క్రితం బ్లొగ్ లో చాలమంది అడిగిన వాటికి సమాధానాలు మీరు ఇంకా ఇవ్వవలిసి ఉన్నాది. ఉదాహరణకు * తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు... 1/02/2008
కులంపేరు పెట్టి పిల్చినందుకు చెరసాల్లో వెయ్యడం కులహంకారాన్ని, కులగుర్తింపునీ్ బలపరచడమౌతుందా ? అంటే అగ్రకులాల్ల్ని నిమ్నకులాలవారు చట్టబద్ధంగా హింసిస్తే చాలా ? అది కులాల్ని నిర్మూలించడమౌతుందా ? లేక వాటిని వదిలించుకోవడమౌతుందా ? తెలుసుకోగోరుతున్నాను.
from this blog

*చాతుర్వర్ణాలు అవసరమని నిన్న మొన్నటివరకు ఉద్ఘాటించినా, నేడు గాంధీజీ సైతం కుల విభేదాలు పూర్తిగా తొలగిపోవాలంటున్నాడు. అవి తొలగనంతవరకూ హిందూ సంఘానికి శక్తిగాని, ముక్తిగాని లేదంటున్నాడు*

మహిళా బ్లొగ్గెర్స్ మీద దాడిని ఖండించిన మీరు అహింసావాది,శాంతిమూర్తి, జాతి పిత ఐన గాంధి గారి గురించి మార్తండా అనే పెద్ద మనిషి ఎవిధంగా రాసెరో మీకు తెలియంది కాదు . దానికి మీ బ్లొగ్ లో మీరు కనీసం ప్రతిస్పందించహ లేదు. మరి అదే గాంధి గారిని ఉటంకిస్తు నార్ల రాసిన ఈ వ్యాసాన్ని పునర్ముద్రించడం లో మీ అంతర్యం ఎమిటి? గాంధి గారి బదులుగా అక్కడ నార్లా గారు ఇంకొక పేరు రాసి ఉంటె అంత బలం చేకురేదా ఆ వ్యాసానికి?. మీకు అవసరం వచ్చినప్పుడు గాంధి గారిని ఉపయొగించు కోవడం అనె దానిని పాటకులు ఎలా అర్థం చేసుకోవాలి ?

cbrao చెప్పారు...

@ అజ్ఞాత: గాంధీజీ దళితులను అంటరానివారుగా చూడవద్దని, వారిని హరిజనులుగా గుర్తించాలనికోరారు. వారిని సాటి మనుషులుగా పరిగణించాలని 1933 లో మూడు వారాల పాటు నిరాహారదీక్ష చేశారు. 1946 లో మధుర మీనాక్షీ దేవలయాన్ని హరిజనులతో కలిసి దర్శించారు. హరిజనుల మీనాక్షి అమ్మవారి దర్శనం చరిత్రాత్మకం. హరిజనుల అసామనతలను తొలగించటంలో ఇది మరో మెట్టు. దళితులను అస్పృస్యులుగా పరిగణించాలని ఏ శాస్త్రాలలోను లేదని హరిజన్ పత్రికలో రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులలో మార్పు కనిపిస్తోంది. నేడు అంటరానితనం ఏవో కొన్ని పల్లెలలో తప్పించి పెద్దగా కానరాదు. హరిజనులు ప్రభుత్వ కార్యాలయాలలో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. వారి పిల్లలు విద్యావంతులవుతున్నారు.

Praveen Mandangi చెప్పారు...

గాంధీ కుల వ్యవస్థని వ్యతిరేకించలేదు. అయినా గాంధీ మీద ఎందుకంత భక్తి? అతనేమైనా మత ప్రవక్తా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి