ఆదివారం, డిసెంబర్ 26, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -10వ రోజు

ఈ సంవత్సరం అతి ప్రాచుర్యమైన పుస్తకం ఏదంటే అది "నా ఇష్టం" - దర్శకుడు రాం గోపాల్ వర్మ వ్రాసినది. ప్రచురణ అయిన నెల రోజులలో నాలుగో ముద్రణ జరుగుతున్నది. మొదటి వారంలోనే 10 వేల ప్రతులు అమ్ముడయి తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రలో కొత్త పుంతలు తొక్కి, రికార్డ్ స్థాపించింది. -cbrao Photos: cbrao Nikon D90

http://eenadu.net/district/districtshow1.asp?dis=hyderabad#16
పుస్తకం...మస్తిష్కభూషణం
బుక్‌ఫెయిర్‌కు పోటెత్తిన సందర్శకులు... నేడే ఆఖరు రోజు
రాంగోపాల్‌పేట: అక్షర కుసుమాల సువాసనలు ఆ ప్రాంతంలో గుబాళిస్తున్నాయి. ఈ పరిమళాలను నగరవ్యాప్తంగా ఆబాలగోపాలం ఆస్వాదిస్తున్నారు. ఒక మంచి పుస్తకం, మంచి స్నేహితుడితో సమానం.. అది ఆపదలో మనిషికి దిక్సూచిలాంటిది.. అంటూ సందర్శకులు నెక్లెస్‌రోడ్డులోని బుక్‌ఫెయిర్‌కు పోటెత్తారు. వారాంతం అందునా క్రిస్మస్‌ సెలవుదినం కావడంతో పుస్తక ప్రియులు అనూహ్యంగా తరలివచ్చారు. శనివారం సుమారు 70 వేల మంది ప్రదర్శనకు వచ్చినట్లు అంచనా. మొత్తం వేదికపై 64 పుస్తకాలు ఆవిష్కరించడం ద్వారా ఔత్సాహిక రచయితలకు ప్రోత్సాహం లభించనట్లయిందని నిర్వాహకులు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభివర్ణించారు. తన మనుమలతో బుక్‌ఫెయిర్‌ సందర్శనకు వచ్చిన ఆయనను 'న్యూస్‌టుడే' పలకరించింది పుస్తకం హస్తభూషణం అని గతంలో అనేవారు కానీ, అది మస్తికభూషణం అని ఆయన పేర్కొన్నారు. తెలుగు ఆపరేటింగ్‌ సిస్టం ఆవిష్కరణ... కంప్యూటర్‌ చరిత్రలో తొలి తెలుగు ఆపరేటింగ్‌ సిస్టం ఆవిష్కరణ ఈ బుక్‌ఫెయిర్‌లో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. తెలుగు భాషపై మక్కువతో పలువురు ఇంజనీర్లు, మేధావులు కలసి 'స్వేచ్ఛ' అనే సంస్థను స్థాపించారు. వీరి ఆధ్వర్యంలో సంప్రదాయ ఆంగ్ల ఆపరేటింగ్‌ సిస్టం సాఫ్ట్‌వేర్‌కు దీటుగా తెలుగులో రూపొందించారు. సంస్థ ప్రతినిధులు సిద్ధార్థ, భువనకృష్ణ శనివారం బుక్‌ఫెయిర్‌లో సందర్శకులకు ఈ వివరాలు వెల్లడించారు.
మీడియాకు స్వేచ్ఛపై సదస్సు... ఇటీవల నీరారాడియా టేపులు సంచలనం సృష్టించిన నేపథ్యంలో 'మీడియా స్వేచ్ఛ' అనే అంశంపై బుక్‌ఫెయిర్‌లో సదస్సు నిర్వహించారు. ప్రముఖ జర్నలిస్టులు-విశ్లేషకులు ఐ.వెంకట్రావు, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి, డాక్టర్‌ కె.నాగేశ్వర్‌, దినేష్‌కుమార్‌లు ప్రసంగించారు. మీడియా ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేయాలని వారు ఆకాంక్షించారు.
పీకాక్‌ క్లాసిక్స్‌ నుంచి అనువాద రచనలు: గాంధీ ... మాతృభాష పట్ల మనవారు అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖ రచయిత గాంధీ తప్పుబట్టారు. జర్మనీ, ఫ్రాన్స్‌, పొరుగున ఉన్న తమిళనాడు మాదిరిగా తెలుగువారు కూడా భాషాభిమానాన్ని చాటుకోవాలన్నారు. పుస్తక ప్రియులు అమితంగా ఇష్టపడే స్టీఫెన్‌ హ్యాకింగ్‌ రచనను కాలబిలాలూ, పిల్లవిశ్వాలూ పేరుతో ఆయన అనువదించారు. ఐదు సుప్రసిద్ధ ప్లేటో రచనలు, అమెరికా రాజ్యాంగ నిర్మాతల ఫెడరలిస్టు పత్రాలు, కాలంకథ తదితర అనువాద రచనలు సాహితీ ప్రియుల ను ఆకట్టుకుంటున్నాయి. బుక్‌ఫెయిర్‌ ఆదివారంతో ముగియనుంది.
Courtesy: Eenadu Daily
-----------------------------------------------------------------------------------------
డిశంబర్  25 2010

 ఈ తెలుగు స్టాల్ కు ఈ రోజు పలు బ్లాగర్లు విచ్చేశారు.



 చక్రవర్తి, కశ్యప్ కొత్త తరహాలో ఈ తెలుగు ప్రచారం చేశారు (ఛాయా చిత్రం చూడండి). వాలంటీర్లు కడదాకా ఉత్సాహంగా పనిచేశారు. ప్రణవ్, ప్రవీణ్ (లినక్స్), వీవెన్,  రహమనుద్దీన్ షేక్ మొదలగు వారు సందర్శకుల ప్రశ్నలకు ఆసక్తికరంగా జవాబిచ్చారు. 

Bhargava ram explaining to Sri Harshavardhan (Leader fame) about Telugu in computer
Photo courtesy:Yenamandra Satish Kumar

Visitors Gayatri, Deepthi, Sirisha (Virajaji) and Veeven



 ఈ పుస్తక ప్రదర్శన తిరునాళ్లలో పిల్లలకు ఉపయుక్తమైనవి రెండు స్టాళ్లు. 1) My Drona 2) e- బాలక్.  మై ద్రోణా లో పిల్లలకు పనికి వచ్చే పాఠ్యాంశాలు వారి అవసరాన్ని బట్టి ద్రోణా లో చేర్చబడతాయి. పూర్తి వివరాలు వెబ్ సైట్లో లభ్యం. ఇందులో దునియా ఫీచర్స్ ఉన్నాయి. వీడియోలు చూడవచ్చు. పాటలు వినవచ్చు. పాటలు ధ్వనిముద్రణ చెయ్యవచ్చు.హైదరాబాదులో లభ్యం. ఇక్కడివాళ్లే దీన్ని వృద్ధిచేశారు. ఇహ ఈ-బాలక్ అయితే నెల నెలా వచ్చే పత్రిక (సి.డి. రూపంలో). 3 నుంచి 13 సంవత్సరాల పిల్లల దాకా ఉపయుక్తకరమైన విషయాలు, వయస్సు వారీగా ఎంచుకునేట్లు ఉన్నాయి.



ఇక ఆధ్యాత్మిక పుస్తకాలు, సి.డి.లు, డి.వి.డి. లు చాలా స్టాళ్లలో లభ్యమవుతున్నాయి. ది వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ లో  నేను బ్లావెట్‌స్కీ యాత్రానుభవాలు, మాస్టర్ ఈ.కె. జీవిత చరిత్ర కొన్నాను. ఈషా ఫౌండేషన్  వారి స్టాల్ లో సద్గురు జగ్గీ వారి పుస్తకాలు, డి.వి.డి లు లభ్యమవుతున్నాయి. చాలా ఆసక్తికరమైన ప్రచురణలివి.

చేగెవేరా పై ప్రత్యేక స్టాల్ కూడా ఉంది ఈ సంవత్సరం




 మరొక విశేషం. ఒక తెలుగు వాడు వ్రాసిన, 1086 పదాలతో అతి పెద్ద పేరు గల పుస్తకం  హ్యాండీ క్రిస్టల్స్ ప్రదర్శించబడుతుంది. ఇది గిన్నీస్ లో ఎక్కింది.

ఈ రోజు పుస్తక ప్రదర్శనశాల స్టాళ్లలో కాలిడ చోటు లేనంతమంది వచ్చారు. పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.















3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అసలు సంగతి వదిలేస్తే ఎట్లా మాష్టారు? ఈ-తెలుగు ఆధ్వర్యంలో తెలుగు బాట నిర్వహించాము. పుస్తక ప్రదర్శన మొత్తం కలియతిరిగి తెలుగు నినాదాలు, పద్యాలతో విశేష ప్రచారం చేశాము. తెలుగు బ్లాగర్లు పది మంది, ఒకరిద్దరు మిత్రులతో ప్రారంభమై, చాలామంది తెలుగు అభిమానులు వచ్చి చేరటంతో పాదయాత్ర ఘనంగా జరిగింది.

విరజాజి చెప్పారు...

సి బి రావు గారూ,

మీ బ్లాగులో నా ఫోటో చూసి చాలా సంతోషం వేసింది. 25వ తేదీ న వచ్చిన అందరి బ్లాగర్లనూ నేను కలవలేకున్నా, కొందరినైనా కలవగలిగానని సంతృప్తి పడ్డాను. మన ఇ-తెలుగు స్టాల్ కి వెళ్ళేసరికీ అక్కడ భార్గవ, ప్రణవ్, రెహ్మాన్, కౌటిల్య, చక్రవర్తి, రాజు గారు, వీవెన్ గార్లు ఉన్నారు. తరువాత నేను బయలుదేరే ముందు సతీష్ కుమార్ యనమండ్ర కూడా వచ్చారు. బ్లాగరులందరినీ, ముఖ్యంగా మిమ్మల్ని ముఖాముఖీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ప్రతీ సంవత్సరం మన తెలుగు భాష పై అందరికీ మరింత మక్కువ పెరగాలని ఆశిస్తూ -

శిరీష.
విరజాజి బ్లాగు.

cbrao చెప్పారు...

ఈ వ్యాసం 25 దిశంబర్ వార్తా విశేషాలను మీ ముందుంచింది.తెలుగు బాట జరిగినది 26 వ తరీకు.ఆ తారీకు వ్యాసంలో తెలుగుకై నడక విశేషాలుంటాయ్.మీరు తెలుగు భాషపై మక్కువతో తెలుగు బాటలో పాల్గొన్నందుకు అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి