బుధవారం, డిసెంబర్ 29, 2010

మహాభారతంలో స్త్రీలు-అప్పటి వివాహ రీతులు-3

కుంతి యదువంశపు ఇంతి, పాండురాజు సతి
ప్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్

ద్రౌపది స్వయంవరం
కుంతి యాదవరాజు సురకుమార్తె, వసుదేవుని సోదరి, మహాభారతంలో, దైవాంశ సంభూతునిగా వర్ణింపబడిన కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఆమె అసలు పేరు ప్రిథ. సురకు మేనత్త కొడుకు  కుంతి భోజుడు ఆమెను పెంచుకున్నాడు. ఆమెకు కుంతి అనే పేరు స్థిరపడింది. ఆమె గొప్ప సౌందర్యవతిగా చిత్రించాడు వ్యాసుడు. ఆమె పిన్నవయసులోనే రుషులు, మునులకు సేవలందించింది. అతి కోపిష్ఠి దుర్వాసముని ఆమె సేవలకు మెచ్చి ఆమెకు ఒక వరం ప్రసాదిస్తాడు. ఆమె తనకిష్టమైన వ్యక్తి (మానవుడైనా, దేవతైనా) పొందుకోరి పిలిచి అతని వలన సంతానం పొందవచ్చు. పాండురాజుతో ఆమె వివాహం జరక్క ముందే ఆమె ఆ వరం పొంది ఉన్నది. ఆమె పాండురాజు భార్య అవుతుంది గానీ, అతనివల్ల సంతానం పొందలేదని దుర్వాసునికి ముందే తెలుసు, అందుకే ఆమెకు ఆవరం యిచ్చాడని కథ చెపుతున్నది. వ్యాసుడు ప్రధాన పాత్రల చిత్రణ అనేక విషయాల మేళవింపుతో చేస్తాడు. ముగ్గురు ప్రధాన పాత్రలకు తల్లిగా కుంతినే వ్యాసుడెందుకు ఎంపిక చేశాడనేది గూడా అర్థం కాని విషయమే. (పేజి. 235-236) కుంతి కృష్ణుని మేనత్త. అన్నదమ్ముల మధ్య యుద్ధంలో కృష్ణుడు కుంతి కుమారుల పక్షం వహిస్తాడు. అలా కథలో కథను చిక్కుముడిగా అల్లటం వ్యాసుని  ప్రత్యేకత.
కుంతి పొందిన వరం ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్నట్లుంటుంది. నేటి యువతులు అందగాడిని, సమర్ధవంతుడిని, శక్తి సామర్ధ్యాలుగల వాడిని పెండ్లాడాలని కలలు కంటారు. అలాంటి వివాహం ద్వారా మంచి సంతానాన్ని పొంద గోరతారు గూడా.  ఈ కోరిక అన్ని కాలాల వారికి వర్తిస్తుందన్నట్లు వ్యాసుడు రాసినట్లనిపిస్తుంది.
కుంతి తాను పొందిన వరాన్ని పరీక్షించాలని తెగ ఉబలాట పడిపోతుంది. వరం విషయంలో నమ్మకం లేక కాదు. వయసు, హార్మోన్లు ఆమెను తొందరపెడతాయి. కుంతి సూర్య భగవానుని తన పొందుకు రమ్మని ఆహ్వానిస్తుంది. తీరా సూర్యుడు ప్రత్యక్షమయితే సత్యవతి మాదిరిగా వెనకంజ వేస్తుంది. తాను అవివాహిత, సూర్యుని వలన గర్భం దాలిస్తే ఎలా అని భయపడుతుంది. సత్యవతిని పరాశరుడు మోహించి తన దారికి తెచ్చుకుంటాడు. కుంతి సూర్యుడిని తానుగా ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వెనకాడుతుంది. (పేజి 236) తన కన్యత్వం పోగొట్టుకోకుండా కొడుకు ఆమె తొడ భాగం నుండి జన్మించే వరం పొందుతుంది. ఇదొక సత్యదూరమైన సంగతి. ఆమె కొడుకుని వదిలి వెళ్ళిపోతే, క్షత్రియ కులానికి చెందని రాధ పసివాడు – కర్ణుడిని పెంచుతుంది. భారతంలో కర్ణుడు కుంతి కుమారులకు శతృవర్గమైన వారితో చేరి చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తాడు.
పాండురాజుని పెండ్లాడాక కుంతి మరి ముగ్గురు కొడుకులను తన వరం మహిమ ద్వారా కంటుంది. యమధర్మరాజు ద్వారా ఆమె సత్యసంధుడైన యుధిష్టిరుని కంటుంది. వాయుదేవుని వలన భీముడు పుడతాడు. భీముడు బహుబలశాలి. అతి ఆవేశపరుడు కూడా. వాయుదేవుడు తరవాత కాలంలో హిందువుల దేవుళ్ళ జాబితాలో నుండి మాయమవుతాడు. స్వర్గవాసి ఇంద్రుని ద్వారా కుంతికి అర్జునుడు పుడతాడు. అర్జునుడు శక్తి శాలి, విశ్వాసపాత్రుడు, అనేక విద్యలలో ఆరితేరినవాడు. భారతమంతా ఈ ముగ్గురి పాండవులు, వారి మారు సోదరులు, నకుల, సహదేవుల కథే. నకుల, సహదేవులు పాండురాజు రెండవ భార్య మాద్రి కొడుకులు. ఈ ఐదుగురు కుమారులు పాండు రాజుకి పుట్టిన వారు కాదు, ఆయన భార్యలకు పుట్టిన వాళ్ళు.
కుంతి తదుపరి చెప్పుకోదగ్గ పాత్ర పోషించలేదు. తన కొడుకుల విషయాలలో జోక్యం చేసుకోలేదు. తన సవతి మాద్రికి సంతానం లేకపోతే ఒక దేవతను రప్పించి ఆమెకు బిడ్డలు కలిగేలా సహాయపడుతుంది. ఈ విషయంగా ఆమెలో ఎలాంటి ఈర్ష్య లేకపోవటం ఆమె సుగుణం. పాండురాజు చనిపోయినప్పుడు కుంతి ఆయన చితి మీద ఆహుతి కావటానికి (సతీసహగమనం) సిద్ధపడుతుంది. మాద్రి కుంతితో ఆ ప్రయత్నం విరమింప చేస్తుంది. కుంతి పాండవులకు మార్గగామి అవుతుంది. అందువలన ఆమె బ్రతకాలి అని మాద్రి నచ్చచెపుతుంది. కుంతికి బదులు మాద్రి తానే సతీ సహగమనం చేస్తుంది. వీర హిందువులు సతీసహగమనం మొఘల్ పరిపాలన వలన రావలసి వచ్చిందని వాదిస్తారు. ఆ పద్ధతి మహాభారత కాలంలోనే ఉన్నట్లు వ్యాసుడు రాశాడు.
అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలిచి తాను బిక్ష తెచ్చానంటాడు. అన్నదమ్ములైదుగురూ సమానంగా పంచుకోండని తల్లి కుంతి అంటుంది. బహు భర్తలుండటం అనేది ఆ కాలంలోనే మొదలయినట్లు ఉండటమే కాకుండా ఆ పద్ధతి భారతంలో క్లిష్టమైన పాత్ర పోషిస్తుంది. కుంతి తన వివాహానికి ముందు పుట్టిన కర్ణుడిని కలుస్తుంది. కర్ణుడు ఆర్జునికి దీటైన యోధుడే. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని తప్ప మిగతా పాండవుల జోలికి పోవద్దని కుంతి కర్ణుడిని బతిమాలు కుంటుంది.
మాద్రి కన్యాశుల్కం చెల్లించి ఆమెను తెచ్చారు
మహాభారత కాలంలో బహు భార్యల పద్ధతి అమలులో ఉన్నది. భీష్ముడు పాండురాజుకి మరో వివాహం చేయ తలపెట్టాడు. వంశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ధృతరాష్ట్రునికి మరో భార్యను తేవాలనే ఆలోచన భీష్మునికి ఎందుకు రాలేదో తెలియదు. అంధునికి మరో భార్యను తేవటం కష్టమన్నా అయ్యుండాలి లేక అతనికి 100 మంది కొడుకులు పుడతారని జోస్యం ఉన్నది గనుకనో పాండురాజుకి మరో భార్యను తేవటంలో ఆంతర్యం బోధపడదు. కథకు మరో మలుపునివ్వటానికయి ఉండవచ్చు. భీష్ముడు మాద్రరాజు చెల్లెలిని పాండురాజుకివ్వమని అడుగుతాడు. మాద్రరాజు కన్యాశుల్కం పద్ధతి ఉన్నదని గుర్తు చేస్తాడు. విరివిగా బహుమానాలర్పించి భీష్ముడు మాద్రిని పాండురాజు భార్యగా తీసుకొస్తాడు (పే.239) కన్యాశుల్కం తప్ప మరేదీ మాద్రరాజు అడగడు. సత్యవతి తండ్రి శంతను రాజుని సత్వవతి సంతానాన్ని రాజ్యానికి వారసులుగా చేయాలని నిబంధన పెడతాడు. మాద్రరాజు చెల్లెలి వివాహం ద్వారా ధనం గడించాలనుకున్నట్లున్నాడు. కూతుళ్ళ పెళ్ళి విషయంలో అప్రధానమనుకున్నట్లు తోస్తున్నది. చెల్లెల్ని వదిలించుకోటమే గాకుండా  ఈ పెళ్లి వలన మాద్రిరాజు లాభం కూడా పొందాడు. ఈ కాలంలో పెళ్ళిళ్ళవరస కూడా అలానే ఉంటున్నది.
విదురుడు బహుశ పరిచారిక సంతానం
కనుక రాజులతో సంబంధం కలుపుకోనక్కరలేదు
విదురుడు పరిచారిక కొడుకు. అతని తండ్రి మహాభారతం రచయిత వ్యాసుడే అయినా తల్లి కుటుంబమే పరిగణనలోకి తీసుకున్నారు. కుంతి, మాద్రి కొడుకులకు కురువంశం మీద హక్కు లేకుండా పోయింది. వారు పాండురాజు కొడుకులు కారు, కుంతి, మాద్రి కొడుకులే (హేరీ పోటర్ లాంటి ఈ కథలో పొందిక ఉండాలని అనుకోలేముగదా). భీష్ముడు విదురునికి ఒక సామాన్య కుటుంబం నుండి భార్యను తెచ్చాడు. ఈ నాలుగు వేల పేజీల మహాభారతంలో ఆమె తల్లి-దండ్రుల పేర్లెక్కడా కనిపించవు. వ్యాసుడు విదురునికి ధృతరాష్ట్రుడు, పాండుకు సమాన హోదా కల్పించాలని చెప్పినా ఆనాటి పితృస్వామ్య సమాజ ఆచారాలలో అది సాగలేదు. అప్పటికీ యిప్పటికీ సమాజం పితృస్వామ్య ఆధిక్యత ధోరణిలోనే నడుస్తూండటం చూస్తే ఆనాటి పితృస్వామ్య విలువ అర్ధం అవుతుంది.

ద్రౌపది మహాభారతంలో ఆమెది కీలకమైన పాత్ర /
భారతం కథకు పట్టుకొమ్మ
మహాభారతంలో ద్రౌపది అతి ప్రముఖ పాత్ర వహించిందంటే అతిశయోక్తి కాదు. ద్రుపదరాజు కుమార్తె ఆమె. అతిలోక సుందరి. ఆమెను పాంచాలి అని కూడా అంటారు. పాంచాల దేశపు (పంజాబ్ అయ్యుండచ్చు) రాకుమారి, ఆమెకు కృష్ణ అని మరో పేరున్నది అంటే నల్లనిది అని అర్ధం. ఆమెది మామూలు పుట్టుక కాదు. యజ్ఞపు అగ్ని నుండి జన్మించిందట (పే.369). ఆమె పుట్టుకే ఒక అద్భుతం.
అంబ సోదరీమణుల మాదిరిగానే ద్రౌపది స్వయంవరం ద్వారా తనకు నచ్చిన వరుణ్ణి వివాహమాడుతుంది. అందుకు అతను ఆమె తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గాలి. ద్రుపదరాజు ఒక ప్రత్యేకమైన, అతి బరువైన విల్లు తయారు చేయించాడు. ఒక స్తంభం మీద ఒక వస్తువు పెట్టాడు. ఆ వస్తువు నీడను కింద మడుగులో చూస్తూ విల్లునెత్తి నారి సంధించి ఆ వస్తువును ఛేదించాలి. అర్జునుడి వంటి యోధునికే అది సాధ్యమని ద్రుపదరాజు భావించాడు. ఆ పందెంలో దుర్యోధనుడు, అతని సోదరులు, ఇతర రాకుమారులు ఆ విల్లును ఎత్తలేకపోయారు. నారిని సంధించే దాకా రానేలేదు. కర్ణుడు ఆ పందెంలో గెలవగలిగిన వాడే కాని ద్రౌపది సూద్రుని వివాహమాడనన్నది. అందువలన కర్ణుడు తన ప్రయత్నం విరమించాడు (పేజి 374) అర్జునుడు బ్రాహ్మణుని వేషంలో స్వయంవరానికి హాజరయ్యాడు. భారతదేశంలో కులవ్యవస్థ గట్టిగా పాతుకుపోయిన కాలమది. బ్రాహ్మణుడు క్షత్రియునికంటే అగ్రకులస్థుడు. కనక అతను ద్రౌపదిని గెలుచుకొనవచ్చు. అతను సునాయాసంగా విల్లును సంధించి స్తంభం మీదున్న వస్తువును ఛేదించాడు. ద్రౌపదిని పందెంలో గెలుచుకున్నాడు. అప్పుడు పాండవులు అజ్ఞాతవాసం గడుపుతున్నారు. ద్రౌపదిని వెంటబెట్టుకుని  అర్జునుడు తన తల్లి ,సోదరులున్న చోటుకు పోతుండగా పందెంలో ఓడినవారు చాలా ఈర్ష్య పడ్డారు. బ్రాహ్మణుడేమిటి, వీరుడేమిటి అని అతన్ని చిత్తుగా ఓడించి ద్రౌపదిని ఎత్తుకుపోవచ్చనుకున్నారు. అతని మీద విరుచుకు పడ్డారు. అతను భీముని సాయంతో వారందరిని ఓడించి ఇల్లు చేరుకున్నాడు.
ఇక నుండి కథ చిత్ర విచిత్రంగా మారుతుంది. బ్రాహ్మణులు భిక్షాటన ద్వారా దొరికిన ఆహారాన్ని తల్లి వడ్డనకు తేవటం ఆచారం. అర్జునుడు స్వయంవరం సంగతి ప్రస్తావించకుండా, ఆరోజు భిక్షాటనగా ద్రౌపదిని చూపుతాడు. అనవాయితీ ప్రకారం అన్నదమ్ములందరూ పంచుకోండి అంటుంది కుంతి. అప్పుడు తెచ్చినది వ్యక్తి అనే విషయం అందరికీ అవగతం అవుతుంది. యుధిష్ఠిరుడు అన్నదమ్ముల మధ్య తేడా రాకూడదని, తల్లిమాట తప్పు కాదనీ ద్రౌపది తమ ఐదుగురికీ భార్యగా ఉంటుందంటాడు (పేజి 381).
అప్పటికి బహుభార్యలుండటమే ఆచారంగా ఉన్నది; కాని బహుభర్త లుండటం ఆచారం కాదు. కుంతి తన మాట ఎప్పటికీ అసత్యం కాబోదంటూ ద్రౌపదిని 5మంది సోదరులు పెండ్లాడాలంటుంది. ద్రుపదునికి ఆ సూచన ఆమోదయోగ్యంగా లేదు. కుంతి, యుధిష్ఠిరుడు ద్రౌపదికి నచ్చచెప్పలేకపోతారు. చివరికి వ్యాసమహర్షి మరో అసందర్భపు కథద్వారా ద్రుపదునికి నచ్చచెపుతాడు. శివుడు (మహదేవుడు) ఐదుగురు స్వర్గవాసులను (అర్జునుడి తండ్రి ఇంద్రునితో సహా) భూలోకంలో అన్నదమ్ములుగా జన్మించి ఒకే స్త్రీని పెండ్లాడమని శపిస్తాడట. ఏదో అవమాన భావం వల్ల అతనలా శాపం యిస్తాడు. ఆ మహాదేవుడే ఒక స్త్రీకి ఐదుగురు భర్తలుంటారని వరమిచ్చాడట, కారణం, ఆమె ఐదు పర్యాయాలు తనకు భర్త నివ్వమని ఆయన్ని వేడుకున్నదట. అలా ద్రౌపది ఐదుగురు భర్తలకు భార్య అవుతుంది.
ఆకాలంలో బహుభర్తలుండటం ఆచారం కాదని చెప్పటంలో వ్యాసుడు ఫెమినిస్ట్ దృక్పథం చూపాడా లేక కొన్ని తెగలలో బహుభర్తలుండటం ఆచారంగా ఉన్నదా అనేది తెలియలేదు. భారత పురాణాలలో, ఇతిహాసాలలో ద్రౌపది వివాహం ఒక్కటే ప్రముఖంగా పేర్కొనబడింది.
ద్రౌపది విచిత్ర వివాహమైనా ఆమె తన నేర్పరితనంతో సమయస్ఫూర్తితో ఐదుగురు భర్తలను సంతోష పెట్టగలిగింది. భర్తను ఎలా సంతోష పరచాలన్న విషయంలో కృష్ణుని ఇష్టసతి సత్యభామ ద్రౌపది సలహా కోరింది. అందంగా అలంకరించుకోవటం, కన్నీరు కార్చటం, వశీకరణ మందులు వాడటం అనేవేవీ పనిచేయవని ద్రౌపది అంటూ, భర్తలను ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూ, సవతులంటే ఈర్ష్యపడకుండా సహకరిస్తే భర్తలు మిక్కిలి సంతోషంగా ఉంటారని సలహా యిస్తుంది. (రచయిత మగవాడు గనుక భార్య అంటే ఎలా ఉండాలో చెప్పాడు) వ్యాసుడు ద్రౌపదిని సౌందర్యవతిగా, ఎవరిపట్ల ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తిగా, సహృదయురాలిగా, కక్షసాధించే స్వభావిగా చిత్రిస్తాడు. ఆమె గొప్ప కృష్ణభక్తురాలు. కష్టకాలంలో కృష్ణుడే ఆమెకు అండగా నిలుస్తాడు. ఉదా : కౌరవులు నిండు సభలో ఆమెను వివస్త్రను చేస్తుంటే ఆమె కృష్ణుని వేడుకోగా ఆ అవమానం నుండి కాపాడతాడు. మరో సందర్భంలో దూర్వాసముని వెంట వచ్చినవారందరికీ వడ్డించటానికి తగినంత ఆహారం లేకపోతే, కృష్ణుణ్ణి వేడుకోగా సమస్య నుండి గట్టెక్కిస్తాడు.
ద్రౌపదిని  మేథావిగా చూపుతాడు వ్యాసుడు. జూదంలో యుధిష్ఠరుడు తనను ఓడటంలో ఔచిత్యం లేదంటుంది. అతను ముందే పందెంలో ఓడిపోయి కౌరవులకు బానిసవుతాడు. ఆ తరవాత భార్యను ఓడే హక్కు అతనికి లేదని ఆమె వాదిస్తుంది. తనను కాంక్షించి, బలాత్కారం చేయబోయిన కీచకుడిని తన భర్త భీముడు చంపే విధంగా ప్లాను వేసి సఫలత పొందుతుంది. దుర్యోధనుడు, అతని వాళ్ళు ఆమెను అవమానాలకు గురి చేయగా వారిని సమూలంగా నాశనం చేయాలని పట్టుబడుతుంది. వారితో యుద్ధం చేసి వారి అంతు చూడటమే ఆమె లక్ష్యం.
ఆమె పుట్టుక, ఐదుగురిని వివాహమాడటం, జీవితంలో ఎదురైన సంఘటనలను దీటుగా ఎదుర్కొనటం అన్నీ విలక్షణ విషయాలే, అద్భుతాలే. పతివ్రత స్త్రీకి అనేక శక్తులుంటాయని ద్రౌపది ద్వారా వ్యాసుడు చూడదలచి నట్లున్నది. ద్రౌపదిది విలక్షణమైన పాత్ర. 

(ఇంకా ఉంది)

2 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

happy new year

cbrao చెప్పారు...

@మాలా కుమార్: నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి