సత్యవతి వివాహం మారుటి కుమారుని వలన జరిగింది. అంతటితో కథ ముగింపు కాలేదు. ఆ కాలంలో గొప్ప వాళ్ళ కుటుంబాలలో వధూవరుల ఎంపిక స్వయంవరం ద్వారా జరిగే పద్ధతిలో కొనసాగింది. భీష్ముడు కురువంశ గార్డియన్ హోదాలో విచిత్రవీర్యునికి వధువును ఎంపిక చేసే బాధ్యతను తీసుకుంటాడు. కౌశల దేశపు రాజు (కాశీరాజు) తన ముగ్గురు కుమార్తెలు – అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. విచిత్రవీర్యునికి ఆహ్వానం అందలేదు. అందుకు కారణం పేర్కొనలేదు. అతను చిన్నవాడు, అంత ఆరోగ్యవంతుడు కూడా కాదు.
భీష్ముడు స్వయంవరానికి హాజరవుతాడు. అలా తమ్ముని బదులు అతను వెళ్ళటం ఆశ్చర్యంగానే ఉన్నది. ఎలా అయినా విచిత్రవీర్యునికి వధువును ఎంపిక చేయాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అలా ఎంపిక చేయటంలో ఎనిమిది రకాల పద్ధతులు పాటించవచ్చని భీష్ముడు నమ్మాడు. అవి ఇలా ఉన్నాయి. 1. వధువు తండ్రి వరుణ్ణి నిర్ణయించి బహుమానాలతో సత్కరిస్తాడు, 2. తండ్రి ఎంపిక చేసిన వరుడి నుండి పశువులుగానీ, ధనంగానీ రుసుముగా వసూలు చేస్తాడు, 3. అమ్మాయి, అబ్బాయి వివాహానికి ఇష్టపడతారు, 4. అమ్మాయికి మత్తు యిచ్చి బలవంతంగా పెండ్లికి ఒప్పిస్తారు, 5. అమ్మాయి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తల్లిదండ్రులే వరుణ్ణి నిర్ణయిస్తారు, 6. అమ్మాయిని యజ్ఞ బహుమతిగా తల్లిదండ్రులు సమర్పిస్తారు, 7. స్వయంవరం ద్వారా అమ్మాయి వరుణ్ణి ఎంపిక చేసుకుంటుంది, 8. అమ్మాయిని బలవంతాన ఎత్తుకు పోయి వివాహం జరిపించటం. రాజులు, పెద్దలు వధూవరులిష్టపడి వివాహం చేసుకోవటాన్ని మంచి పద్ధతిగా భావిస్తారు. స్వయంవరానికి వచ్చిన మిగతా ధీరులందర్ని ఓడించి అమ్మాయిని ఎత్తుకు పోవటం వీరోచితంగా భావిస్తారు (పే. 219). ఈ పద్ధతిలో భీష్ముడు ఎంతోమంది యువరాజుల్ని చంపి, సింధురాజ్యపు యువరాజు సెల్యని గాయపరిచి (సెల్య భారతంలో పెద్దపాత్ర పోషిస్తాడు) అంబ, అంబిక, అంబాలికలను ఎత్తుకు పోతాడు. ముగ్గురుని విచిత్ర వీర్యునితో వివాహం చేయతలపెట్టాడు.ఆ కాలంలో రాజులు బహుభార్యాత్వాన్ని పాటించారు. భారతంలో ఈ విషయం అనేకమార్లు ప్రస్తావనకు వచ్చింది. రామాయణం తరవాత మహాభారతం రాయబడింది. రామాయణంలో ఒక భర్తకు ఒకే భార్య అనే పద్ధతి గొప్పగా చూపబడింది. మహాభారతం నాటికి బహుభార్యల పద్ధతి అమలులోకి వచ్చినట్లయింది. ఏది ఏమైనా కురువంశానికి వారసుడిని తేవటమే భీష్ముని లక్ష్యం.భీష్ముడు ముగ్గురు రాజకుమారీలను కురువంశ పీఠం హస్తినాపురానికి తీసుకువచ్చాడు. అంబ తానిదివరకే ఒక యువరాజుకి మనసిచ్చానని, అతడినే పెండ్లి చేసుకుంటానని భీష్ముడిని వేడుకుంటుంది. భీష్ముడు నైతికంగా ఆమె కోరిక సబబైందని గ్రహించి ఆమెను కట్నకానుకలతో సహా కాశీకి పంపిస్తాడు. ఐతే, యుద్ధంలో తను ఓడాడు కనుక శాస్త్ర ప్రకారము అంబ భీష్ముడికే చెందుతుంది అని సాల్వ రాజు అంబను వివాహమాడటానికి నిరాకరిస్తాడు. ఇక్కడ వ్యాసుడు కథను కొత్త మలుపు తిప్పుతాడు. అంబ భీష్ముని వద్దకు తిరిగి వచ్చి అతని వల్లనే తన వివాహం చెడింది గనుక అతను తనను పెండ్లాడాలని పట్టుబడుతుంది. బ్రహ్మచారి భీష్ముడు అది సాధ్యం కాదన్నాడు. అంబ భీష్ముడిని ‘ఆడమగ కాని వ్యక్తి చేతిలో చస్తావు’ అని శపిస్తుంది. ఆ శాపం ఉత్తరోత్తర అన్నదమ్ముల మధ్య యుద్ధం తీర్పులో ప్రముఖ పాత్ర వహిస్తుంది. భీష్ముడు ఓడిపోయేవారి పక్షం వహిస్తాడు. నిరాదరణకు గురైన స్త్రీకి చాలా శక్తులున్నాయన్నమాట.అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహం చేసుకుంటాడు. అప్పటికే అతను క్షయ వ్యాధిగ్రస్తుడు. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకు నిస్సంతువుగానే మరణిస్తాడు.ఇక్కడ ఆడవారి విధులు, కుటుంబ ఆచారాలు మరో కోణంలో చూపుతాడు వ్యాసుడు. రాణి సత్యవతి శంతను వంశాభివృద్ధిని చూడదలచి, భీష్ముడిని విధవరాళ్ళయిన తన కోడళ్ళతో లైంగిక సంపర్కం పెట్టుకుని వారసుడిని కనమంటుంది. తన బ్రహ్మచర్య వ్రతానికి తిరుగు ఉండదని భీష్ముడు ఆమెకు చెపుతాడు. సత్యవతి తన వివాహానికి ముందు కన్నకొడుకు వ్యాసుడికి ఆ బాధ్యత అప్పచెపుతుంది. ఆధునిక కాలంలోని వీర్యకణదాత పాత్ర వ్యాసుడు ఆరోజుల్లోనే పోషించాడన్నమాట. వ్యాసుడు మునీశ్వరుడు, జుట్టు అట్టలు కట్టి పోయి చూడ శక్యంగాకుండా ఉండి తాను శుభ్రపడటానికి వ్యవధి కావాలంటాడు తల్లితో. కాని ఆమె తన ఆజ్ఞను వెంటనే పాటించమంటుంది.అంబిక వ్యాసుడి అవతారం చూసి భయపడి సంభోగ కాలంలో కళ్ళు మూసుకుంటుంది. ఆమె భయంవల్లనో, అసహ్యం వల్లనో అలా చేసి ఉండవచ్చు. ఆ కలయిక వల్ల పుట్టే కుమారుడు అంధుడవుతాడనీ, కాని మంచి తెలివితేటలు కలిగి బలాఢ్యుడయి ఉంటాడని తల్లికి వ్యాసుడు చెపుతాడు. ఆ అంధరాజు నూరుగురు సంతానాన్ని కంటాడని కూడా చెపుతాడు. ఆ అంధుడే ధృతరాష్ట్రుడు. ఒక అంధరాజు తన ప్రజలను కాపాడలేడని సత్యవతి తలుస్తుంది. తన రెండవ కోడలు అంబాలిక ద్వారా ఒక కొడుకుని కనాలని తల్లి వ్యాసుడిని ఆజ్ఞాపిస్తుంది.అంబాలిక కూడా వ్యాసుడిని చూసి భీతిల్లి పాలిపోయినట్లవుతుంది. సంభోగ కాలంలో భయంతో ఆమె శరీరం వణుకుతుంది. ఆ కలయిక వల్ల జనించే పుత్రుడు పాండురోగి (పాలిపోయే జబ్బు) అవుతాడని అందువల్ల అతనికి పాండు అని నామకరణం చేయాలంటాడు వ్యాసుడు. ఆ పరిణామాలతో వ్యాకులత చెందిన సత్యవతి అంబికకు మరో పుత్రుని ప్రసాదించమని వ్యాసుణ్ణి పురమాయిస్తుంది. అంబికకు ఆ కలయిక సుతారమూ యిష్టం ఉండదు. అటు అత్తగారి మాట జవదాట కూడదు. తన బదులు తన పరిచారికను వ్యాసుని దగ్గరకు పంపుతుంది. పరిచారిక యిష్టపూర్తిగా, సంతోషంగా వ్యాసుడిని కలుస్తుంది. మామూలు ఆడవారు తాము కలిసే వ్యక్తి అందచందాలకంటే తాము మాతృత్వం పొందటంలోనే ఎక్కువ ఆసక్తి చూపుతారన్నట్లు వ్యాసుడు చూపుతాడు. వ్యాసుడు అంబిక చేసిన మోసాన్ని సత్యవతితో చెపుతూ ఈసారి మంచి తెలివైన కొడుకు పుడతాడంటాడు. అతనికి విదురుడని పేరు పెట్టమని, అతన్ని బాగా చూసుకోవలసిందిగా చెపుతాడు. మహాభారతంలో విదురుడు మంచి రాజనీతి సలహాదారుగా నీతిమంతుడుగా తన పాత్ర గొప్పగా నిర్వహిస్తాడు. అతనిది విదుర న్యాయంగా ప్రతీతి చెందింది.పై సంఘటనలలో వ్యాసుడు వధువును ఎంపిక చేసే పద్ధతులు, వారి ఆచారాలు, వధువు విధులు గురించి చెపుతూ, తమ వంశాభివృద్ధికి వారెంతటి పనికైనా సిద్ధపడతారని చూపుతాడు. వైధవ్యం పొందిన స్త్రీకి ఎవరైనా బంధువు ద్వారా బిడ్డపుట్టినా, ఆ బిడ్డ ఆమె వంశానికి చెందినట్లే భావిస్తారు. జీవశాస్త్ర దృష్ట్యా అంబిక, అంబాలిక, వ్యాసుడు శంతను రాజుకుగాని, కురువంశానికి గాని సంబంధించిన వారు కాదు.పతివ్రత గాంధారిధృతరాష్ట్రునికి, పాండురాజుకి, విదురునికి, పెండ్లిండ్లు చేసే బాధ్యత భీష్ముడు తీసుకుంటాడు. అతడు శక్తివంతమైన యితర రాజుల కుమార్తెల మీదే దృష్టి పెడతాడు. గాంధార రాజు, సువల కుమార్తె గాంధారితో ధృతరాష్ట్రునికి వివాహం చేయ తలపెట్టాడు. ఆమె నూరుగురు కొడుకుల్ని కంటుందని శివుడు వరమిచ్చాడని (పేజి 235) భీష్ముడు వింటాడు. ముందే వ్యాసుడు ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకులికి తండ్రి అవుతాడని చెప్పే ఉన్నాడు కనుక అతనికి గాంధారి తగిన జోడీ అని తీర్మానిస్తాడు. గాంధార రాజుకి తన బిడ్డను అంధరాజుకివ్వాలని పించకపోయినా కురువంశపు గొప్పదనం విని పెండ్లికి సమ్మతిస్తాడు. తనకు కాబోయే భర్త అంధుడని విన్న గాంధారి తనూ కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాంతం గడిపింది (పేజి. 235)గాంధారి అసాధారణ తెలివితేటలు గలది అనీ, నీతిమంతురాలనీ, దైవచింతన గలదనీ, అద్భుతమైన శక్తి సామర్ధ్యాలు కలదనీ, వ్యాసుడు ఆమెను చిత్రిస్తాడు. ఆమె ఒక వ్యక్తిని ముట్టి అతనిని ఇనుమంత గట్టిగా చేయగలదట. తన మొదటి కుమారుడైన దుర్యోధనుని పట్ల ఆమె అసాధారణ ప్రేమ ముందు ఆమె శక్తులు, తెలివితేటలు, విలువలూ పేలవంగా మారతాయి. తన భర్త పెద్ద కొడుకైనా అంధుడవటం చేత రాజ్యాధిపతి కాలేకపోయాడు గనుక తన ప్రధమ సంతానమే ఆ హక్కు పొందాలని ఆమె ఆకాంక్ష అయి ఉండవచ్చు. భీముని చేతిలో ఆమె కొడుకు చనిపోవటంతో కక్ష సాధింపుకు దిగుతుంది. గాంధారిని పతివ్రతగానూ, పెద్ద కొడుకంటే అవ్యాజమైన ప్రేమ గలదిగానే వ్యాసుడు ఆమెను చిత్రించాడు. నిండు సభలో తన కొడుకులు ద్రౌపదిని వివస్త్రను చేస్తుంటే ఆమె చలిస్తుంది. ద్రౌపదిని స్వేచ్ఛగా వదిలి వేయమని, ఆమె భర్తలకు వారి రాజ్యాన్ని తిరిగి యిచ్చి వేయమని చెప్పి భర్తను ఒప్పిస్తుంది.
(ఇంకా ఉంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి